మాయావతికి భారీ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ ఎమ్మెల్యేలు

Tue,September 17, 2019 12:14 PM

జైపూర్‌ : రాజస్థాన్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతికి భారీ షాక్‌ తగిలింది. బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరామని ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో రాజేంద్ర గుద్‌, జోగేంద్ర సింగ్‌ అవనా, వజీబ్‌ అలీ, లఖాన్‌ సింగ్‌ మీనా, సందీప్‌ యాదవ్‌, దీప్‌చంద్‌ ఖేరియా ఉన్నారు. మరో రెండు నెలల్లో రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేస్తోంది. దీంట్లో భాగంగానే బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించింది.


రాష్ర్టాభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరామని ఎమ్మెల్యే రాజేంద్ర స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ పని విధానం నచ్చే పార్టీలోకి వచ్చామని తెలిపారు. ఆయన సారథ్యంలోనే రాజస్థాన్‌ అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్ముతున్నామని చెప్పారు.

గతేడాది రాజస్థాన్‌ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ 100 స్థానాల్లో, బీఎస్పీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్‌కు 12 మంది ఎమ్మెల్యేలు మద్దతివ్వడమే కాకుండా పార్టీలో చేరారు. మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ బలం 118కి చేరింది. రాజస్థాన్‌ అసెంబ్లీలో మొత్తం 200 స్థానాలు ఉన్నాయి.

1156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles