9 మంది గర్భిణులను కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్‌

Sat,July 27, 2019 03:27 PM

హైదరాబాద్‌ : ముంబై నుంచి కొల్హాపూర్‌ వెళ్తున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌ను వరద నీరు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆ రైలును బద్లాపూర్‌ - వాగానీ మధ్య నిలిపివేశారు రైల్వే అధికారులు. ఉల్లాస్‌ నది ఉప్పొంగడంతో ఈ ఎక్స్‌ప్రెస్‌ మెట్లకు సమాంతరంగా వరద ప్రవహిస్తోంది.


దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. రైల్లో ప్రయాణిస్తున్న 9 మంది గర్భిణులను ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు సురక్షితంగా వరద నీటి నుంచి బయటకు తీసుకువచ్చాయి. రైల్లో గర్భిణులు ఉన్నారని తెలుసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. 37 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచింది. వీరిలో కొందరు గైనకాలజిస్టులు ఉన్నారు. తక్షణ సహాయం కింద అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది. ఎమర్జెన్సీ చర్యల కింద మూడు టెంపోలను, 14 బస్సులను అందుబాటులో ఉంచింది మహారాష్ట్ర ప్రభుత్వం.

ఈ తొమ్మిది మందిలో ఒకరు ప్రసవం కోసం కొల్హాపూర్‌ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న రాత్రి నుంచి రైలు వరద నీటిలో నిలిచిపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన గర్భిణులు వరద నీటిలో చిక్కుకుపోవడంతో పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తంగా రైల్లో ఉన్న 700 మంది ప్రయాణికులను ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, నేవీ, పోలీసులు, రైల్వే సిబ్బంది సురక్షితంగా వరద నీటి నుంచి కాపాడారు. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకపోవడంతో అధికారులందరూ ఊపిరి పీల్చుకున్నారు.




1300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles