మే 23 తేదీ త‌ర్వాత‌ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయా..?

Wed,April 24, 2019 02:10 PM

petrol and diesel prices might increase after may 23rd

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా సార్వ‌త్రిక ఎన్నిక‌ల హ‌డావిడి క‌నిపిస్తున్న‌ది. నేత‌లు ప్ర‌సంగాల‌తో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా.. ఇప్ప‌టికే కొన్ని చోట్ల ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో మ‌రికొన్ని చోట్ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే దేశ వ్యాప్తంగా పార్ల‌మెంట్‌ ఎన్నిక‌లు పూర్త‌వ‌డానికి మ‌రికొన్ని రోజులు ప‌ట్ట‌నుండ‌గా ఫ‌లితాలు మాత్రం మే 23వ తేదీన రానున్నాయి. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏమో గానీ అవి వ‌చ్చాక పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌వ‌చ్చ‌ని కాంగ్రెస్ నేత‌లు జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు.

మే 23వ తేదీన ప‌లు రాష్ట్రాల‌కు చెందిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తోపాటు లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా వెలువ‌డ‌నున్న విష‌యం విదిత‌మే. అయితే అదే రోజున చ‌మురు కంపెనీలు పెద్ద ఎత్తున పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయ‌ని, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రూ.10 వ‌ర‌కు పెర‌గ‌వచ్చ‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధి ర‌ణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న దృష్ట్యా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌వ‌ద్ద‌ని, పెంచితే తాము ఓడిపోతామ‌నే కార‌ణంతోనే ప్ర‌ధాని మోడీ మే23వ తేదీ వ‌ర‌కు ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచ‌వ‌ద్ద‌ని చ‌మురు కంపెనీల‌ను ఆదేశించార‌ని తెలిసింద‌ని ర‌ణ్‌దీప్ అన్నారు. ఈ క్రమంలోనే మే23వ తేదీన సాయంత్రం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని, ఈ విషయం ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా ప్ర‌ధాని మోడీ మ‌భ్య‌పెడుతున్నార‌ని.. క‌నుక ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని ర‌ణ్‌దీప్ అన్నారు.
కాగా ఇరాన్ నుంచి భార‌త్‌తోపాటు ప‌లు ఇత‌ర దేశాలు కూడా ముడి చ‌మురును దిగుమ‌తి చేసుకోవ‌ద్ద‌ని అమెరికా ఆంక్ష‌లు విధించిన నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం భార‌త్ పై ప‌డుతుంద‌ని మార్కెట్ నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు. దీంతో క్రూడ్ ఆయిల్ ధ‌రలు పెర‌గ‌డంతోపాటు భార‌త్ లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు కూడా పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఇరాన్ నుంచి చ‌మురు కొనుగోలు చేసేందుకు గ‌తంలో భార‌త్‌కు మిన‌హాయింపులు ఇచ్చిన మాదిరిగానే ఈ సారి కూడా అవే మిన‌హాయింపులు ఇవ్వాల‌ని అమెరికాను కోరేందుకు సంబంధిత అధికారులు ఈ నెలాఖ‌రులో చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని తెలిసింది. అవి జ‌రిగితేనే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపు అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

2865
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles