వారణాసి నుంచి మోదీ నామినేషన్ దాఖలు

Fri,April 26, 2019 11:48 AM

PM Narendra Modi files nomination from Varanasi parliamentary constituency

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న మోదీ.. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, శిరోమణి అకాలీదళ్ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్, తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

నామినేషన్ దాఖలు చేసే కంటే ముందు.. అక్కడి కాలభైరవ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మోదీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని మోదీ స్పష్టం చేశారు. మళ్లీ మోదీ సర్కార్‌ను గెలిపించాలన్న గట్టి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారని మోదీ తెలిపారు.

వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో మోదీపై కాంగ్రెస్ పార్టీ తరపున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఎస్పీ - బీఎస్పీ కూటమి నుంచి షాలినీ యాదవ్‌ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి మే 19న ఎన్నికలు జరగనున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో వారణాసి నుంచి గెలుపొందిన మోదీకి 5,81,022 ఓట్లు రాగా, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు 2,09,238 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ కు 75,614 ఓట్లు మాత్రమే వచ్చాయి.

2014 సాధారణ ఎన్నికల్లో వారణాసితో పాటు వడోదర(గుజరాత్‌) నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. అయితే వడోదర నుంచి తప్పుకున్న మోదీ.. వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. నాటి ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్ల తేడాతో నరేంద్ర మోదీ విజయం సాధించారు. వడోదర స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మధుసూద మిస్గ్రీ మీద భారీ మెజార్టీతో గెలుపొందారు మోదీ.879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles