ఆ మూడు రాష్ర్టాల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Sat,March 3, 2018 08:01 AM

షిల్లాంగ్/కోహిమా/అగర్తలా : ఈశాన్య రాష్ర్టాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర శాసనసభ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం నాటికి వెలువడనున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు.. విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను మోహరించారు.


మూడు రాష్ర్టాల్లోనూ 60 చొప్పున నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే వేర్వేరు కారణాలతో 3 రాష్ర్టాల్లో 59 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. అధికారం చేపట్టాలంటే 31 స్థానాలు అవసరం. త్రిపురలో ఐపీఎఫ్‌టీ కూటమితో కలిసి బీజేపీ బరిలో దిగింది. ఇక్కడ 57 స్థానాల్లో సీపీఎం పోటీ చేసింది. మరో రెండు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది సీపీఎం. 51 స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను పోటీ చేయించింది. మిగతా 9 స్థానాలను ఐపీఎఫ్‌టీకి బీజేపీ కేటాయించింది. కాంగ్రెస్ 59, తృణమూల్ కాంగ్రెస్ 24 స్థానాల్లో పోటీ చేసింది. అయితే త్రిపురలో ప్రధాన పోటీ సీపీఎం, బీజేపీ మధ్య ఉంది. నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీతో కలిసి బీజేపీ పోటీ చేసింది. ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో, కాంగ్రెస్ 18 స్థానాల్లో పోటీ చేసింది. మేఘాలయలో కాంగ్రెస్ 59 స్థానాల్లో, బీజేపీ 47 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీ చేయించింది.

గత పదేళ్ల నుంచి మేఘాలయలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, నాగాలాండ్‌లో 2003 నుంచి నాగపీపుల్స్ ఫ్రంట్ అధికారంలో ఉంది. త్రిపురలో 25 ఏండ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం ఈ సారి ఓటమి చవిచూసే అవకాశం ఉందని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. నాగాలాండ్, మేఘాలయ రాష్ర్టాల్లో కూడా బీజేపీ పాగా వేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన విషయం విదితమే.

1692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles