భీమ్ ఆర్మీ చీఫ్‌తో ప్రియాంక ఎందుకు భేటీ అయినట్టు?

Thu,March 14, 2019 06:09 PM

Priyanka wooing dalit leader as Mayavati refuses to align with congress

దళితనేత, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను కలిసేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ పార్టీ ఇంచార్జి అయిన ప్రియాంక గాంధీ-వాద్రా మీరట్‌లోని దవాఖానకు వెళ్లడంలో ఆంతర్యం ఏమిటి? పైగా ఆమె 15 నిమిషాల సేపు లోపలకు వెళ్లేందుకు వేచిఉండాల్సి వచ్చింది. నిజానికి ఆమె ఒక్కతే వెళ్లలేదు. ఆమె వెంట పశ్చిమయూపీ కాంగ్రెస్ ఇంచార్జి జ్యోతిరాదిత్య సింధియా, యూపీసీసీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ కూడా ఉన్నారు. ఆజాద్ దళిత రాజకీయాల్లోకి రాకెట్ వేగంతో దూసుకువస్తున్న సరికొత్తతార. పైగా ఆయన నడిపేది ఏదో మామూలు రాజకీయపార్టీ కాదు.. ఉద్యమ సంస్థ. మంగళవారం షహారన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌లో బహుజన్ హుంకార్ ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్‌తో దోస్తీకి మాయావతి ససేమిరా అంటున్న నేపథ్యంలో దళితుల్లో పట్టున్న ఆజాద్ వంటి చురుకైన నేతల అండదండలు కావాలని కాంగ్రెస్ ఎంతగానో ఆరాటపడుతున్నది. యూపీలోనే కాదు మరే ఇతర రాష్ట్రంలోనూ హస్తంతో కరచాలనం ఉండబోదని బీఎస్పీ నేత తెగేసి చెప్పారు. ఇటు బీజేపీ, అటు మాయా-అఖిలేశ్ కూటమి. మధ్యలో మనుగడ సాగించాలంటే కాంగ్రెస్‌కు దళితబహుజనుల అండదండలు ఎంతైనా అవసరం అనేది బహిరంగ రహస్యమే. దవాఖానలో భేటీ అనంతరం ప్రియాంక గాంధీ-వాద్రా ఆజాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దళితుల విముక్తి కోసం ఆజాద్ పోరాడుతున్నారని మెచ్చుకున్నారు. ఆయన దళితుల వాణిని వినిపించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం ఆయన గొంతు నొక్కాలని చూస్తున్నదని అన్నారు. తన భేటీకి రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయ దృష్టితో చూడరాదని ఆమె నొక్కిచెప్పారు. ఇలా ఎంత కాదన్నా ఈ భేటీ రాజకీయపరమైనదేనని రుజువుచేసే పరిణామాలు తర్వాత జరిగాయి. ప్రధాని మోదీపై వారణాసిలో పోటీచేస్తానని ఆజాద్ కాంగ్రెస్ నేతలు తనను కలిసి వెళ్లిన తర్వాత ప్రకటించడం గమనార్హం. యూపీనుంచి మోదీని ఎట్టి పరిస్థితుల్లో గెలువనివ్వను అని భీమ్ ఆర్మీ చీఫ్ ఢంకా బజాయించడం చర్చాంశమైంది. అంటే కాంగ్రెస్ మద్దతుతో వారణాసిలో ఆజాద్ పోటీచేస్తారా? ఇది జరిగే పని కాదని రాజకీయ పండితులు అంటున్నారు. కాంగ్రెస్ ఆయనను పశ్చిమ యూపీలోని నగీనా రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి పోటీకి పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

1263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles