12 మంది మాజీ సీఎంలు ఘోర ప‌రాజ‌యం..వాళ్లు వీళ్లే..

Fri,May 24, 2019 03:50 PM

Saffron Wave Swept Away a Dozen Former CMs, 8 of Them From Congress

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభంజనం సృష్టించింది. గతంలో కంటే రికార్డు స్థాయిలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకొని తన రికార్డును తానే బద్ధలు కొట్టింది. దేశవ్యాప్తంగా మోదీ హవా బలంగా ఉండటంతో మహామహులు సైతం మట్టికరిచారు. దశాబ్ధాల పాటు దేశరాజకీయాల్లో చక్రం తిప్పన నేతలు కూడా ఇంటిబాట పట్టారు. 12 మంది మాజీ ముఖ్యమంత్రులకు సార్వత్రిక ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది.అందులో ఎనిమిది మంది కాంగ్రెస్‌వారే..

షీలా దీక్షిత్‌..
మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌కు ఓటమి తప్పలేదు. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఢిల్లీలోని అన్ని స్థానాల్లో బీజేపీ జోరు కొనసాగింది.

దేవెగౌడ..
జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(87) సైతం ఓటమిని మూటగట్టుకున్నారు. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన దేవెగౌడ మోదీ హవాను తట్టుకొని నిలవలేకపోయారు. తుముకూరులో బీజేపీ అభ్యర్థి జీఎస్‌ బసవరాజ్‌ చేతిలో 13వేల ఓట్ల తేడాతో దేవెగౌడ పరాజయం పాలయ్యారు. మాండ్యలో కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌.. స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో ఓడిపోయారు. హసన్‌ నుంచి మరో మనుమడు ప్రజ్వల్‌ రేవణ్ణ గెలుపొందారు.

ఢిగ్గీ రాజా
మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ చిత్తుగా ఓడారు. భోపాల్‌లో బలవంతంగా పోటీలో నిలిచిన ఆయన బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ చేతిలో 3.6లక్షల ఓట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భోపాల్‌ నియోజకవర్గంపై దేశవ్యాప్తంగా విస్తృత జరిగింది. గాడ్సేను దేశభక్తుడితో పోల్చి ప్రజ్ఞా సింగ్‌ వార్తల్లో నిలిచారు.

అశోక్‌ చవాన్‌
మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో ఎన్డీఏ కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆ ప్రాంతంలో ఉన్న నాందేడ్‌ సిటింగ్‌ ఎంపీ, మాజీ సీఎం అశోక్‌ చవాన్‌కు ఈ నియోజకవర్గంలో గట్టిపట్టుంది. అయినప్పటికీ బీజేపీ అభ్యర్థి ప్రతాప్‌రావ్‌ చేతిలో చవాన్‌ 40వేల ఓట్లతో ఓడిపోయారు. ఇదే స్థానం నుంచి చవాన్‌ 2014లో 81,455 మెజార్టీ సాధించారు.

సుశీల్‌ కుమార్‌ షిండే
వెటరన్‌ కాంగ్రెస్‌ లీడర్‌, మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ షిండేకు ఓటమి తప్పలేదు. షోలాపూర్‌ నియోజవర్గం నుంచి పోటీచేసిన ఆయన బీజేపీ అభ్యర్థి సిద్దేశ్వర్‌ శివాచార్య చేతిలో లక్షన్నర ఓట్ల తేడాతో దారుణ వైఫల్యం చెందారు.

హరీశ్‌ రావత్‌
ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ లీడర్‌ హరీశ్‌ రావత్‌ మూడు లక్షల ఓట్లతో పరాజయం పాలయ్యారు. నైనిటాల్‌-ఉద్దం సింగ్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌ భట్‌ ఓడించారు. రావత్‌పై 3,39,096 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం.

ముకుల్‌ సంగ్మా
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి ముకుల్‌ సంగ్మా తురా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థి అగాథ సంగ్మా సుమారు 3లక్షల ఓట్ల మెజార్టీ ఆయనపై నెగ్గారు.

భూపిందర్‌సింగ్‌ హుడా
హరియాణా మాజీ సీఎం, సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ భూపిందర్‌ సింగ్‌ హుడాకు నిరాశ తప్పలేదు. సోనీపట్‌ నుంచి బరిలో దిగిన హుడా..బీజేపీ అభ్యర్థి రమేశ్‌ చందర్‌ చేతిలో లక్షన్నరకు పైగా ఓట్లతో ఓడిపోయారు.

వీరప్ప మొయిలీ
1992-1994 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీని ఓటర్లు తిరస్కరించారు. చికబల్లాపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి 5,63,802 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి బచే గౌడ ఘన విజయం సాధించారు.

మెహబూబా ముఫ్తీ
పీడీపీ అధ్యక్షురాలు, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనంత్‌నాగ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభ్యర్థి హస్నైన్‌ మసూదీ 10వేల ఓట్ల తేడాతో అనూహ్యంగా గెలుపొందారు. తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన మసూదీ గెలుపొందడం విశేషం. 1996లో రాజకీయాల్లోకి రంగప్రవేశం తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలవడం ముఫ్తీకి ఇది రెండోసారి మాత్రమే.

బాబులాల్‌ మరాండీ
ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చ(ప్రజాతాంత్రిక్‌) అభ్యర్థి బాబులాల్‌ మరాండీపై బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణ దేవీ ఘన విజయం సాధించారు. అన్నపూర్ణ 4లక్షలకు పైగా మెజార్టీతో సత్తాచాటారు. ఝార్ఖండ్‌కు తొలి సీఎంగా పనిచేసిన బాబులాల్‌ 2006లో బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ ప్రారంభించారు.

శిబు సోరెన్‌
ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అధ్యక్షుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ దుమ్కాలో బీజేపీ అభ్యర్థి సునీల్‌ సోరెన్‌ చేతిలో 47వేల ఓట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి శిబు సోరెన్‌ రికార్డు స్థాయిలో ఎనిమిదిసార్లు గెలుపొందారు. మోదీ దెబ్బకు ఆయనకు ఓటర్లు ఝులక్‌ ఇచ్చారు.

5622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles