జేఎన్‌యూలో సెక్యూరిటీ గార్డు..ఇపుడు విద్యార్థి..స్టోరీ చదవాల్సిందే

Tue,July 16, 2019 09:43 PM

Security guard Ramjal Meena Now turns as JNU student


కోరిక బలమైనదైతే..అది నెరవేర్చుకోవాలన్న కసి ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు రాజస్థాన్‌కు చెందిన రామ్‌జల్‌ మీనా. కృషి, పట్టుదల, కష్టించే తత్వం ఉంటే విజయం మీ సొంతం అవుతుందనడానికి రామ్‌జల్‌ మీనా చక్కటి ఉదాహరణ. అవును యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన రామ్‌జల్‌మీనా ఇపుడు అదే యూనివర్సిటీలో తనకిష్టమైన భాషను చదివేందుకు అర్హత సాధించాడు. రష్యన్‌ భాష చదివేందుకు ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశపరీక్షలో రామ్‌జల్‌ మీనా ఉత్తీర్ణత సాధించాడు.

ఓ వైపు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూనే జేఎన్‌యూలో రష్యన్‌ లాంగ్వేజ్‌ కోర్సు చదివేందుకు అర్హత పొందాడు రామ్‌జల్‌ మీనా. మీడియా అతన్ని పలకరించగా..రష్యా దేశమంటే తనకెంతో ఇష్టమని, రష్యన్‌ భాష నేర్చుకుని తప్పనిసరి ఒక్క రోజైనా రష్యాను సందర్శిస్తానని అంటున్నాడు రామ్‌జల్‌ మీనా. బీఏ రష్యన్‌ లాంగ్వేజ్‌ చదవడం కోసం ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించా. ఇపుడు నేను జేఎన్‌యూలో వచ్చే ఐదేళ్లు రష్యన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకుంటా. ఒక్క రోజైనా రష్యాకు వెళ్లాలని ఉంది. రష్యన్‌ సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం. రష్యా మంచి దేశం. రష్యా నుంచి భారత్‌ ఎన్నో రక్షణ సామాగ్రిని కొనుగోలు చేస్తుంటుందన్నాడు.

‘నాది రాజస్థాన్‌లోని కరౌలీ అనే చిన్న గ్రామం. నేను మొదటి నుంచి చాలా తెలివైన విద్యార్థిని. క్లాస్‌లో ఎపుడూ ఫస్ల్‌ వచ్చేవాడిని. 2000 సంవత్సరంలో రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్‌ నుంచి 12వ తరగతిలో మంచి మార్కులతో పాసయ్యా. ఆ తర్వాత రాజస్థాన్‌ యూనవర్సిటీలో బీఎస్‌సీ లో సీటు వచ్చింది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో బీఎస్‌సీ తొలి ఏడాదే నా చదువుకు స్వస్తి చెప్పేశా. రోజువారీ కూలీగా పనిచేసే నా తండ్రికి సహాయ పడేందుకు పనిలో చేరా. 2014లో జేఎన్‌యూలో సెక్యూరిటీ గార్డుగా చేరా. వర్సిటీలో పనిచేస్తున్నపుడు నా కలలన్నీ కళ్లముందు కనిపిస్తుండేవి. నాకిష్టమైన మధ్యలోనే ఆపేసిన చదువును ఇక్కడే పూర్తిచేయాలని నిర్ణయించుకున్నా. నేను రోజూ ఇంటి దగ్గర, డ్యూటీ సమయంలో కలిపి మొత్తం 6 గంటలు చదివి ప్రవేశపరీక్షలో పాసయ్యానంటూ’ చెప్పుకొచ్చాడు రామ్‌జల్‌మీనా.

తనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్నారని, ప్రస్తుతం తనపై చాలా బాధ్యతలున్నాయని రామ్‌జల్‌ చెప్పాడు. తన సోదరి వివాహం కోసం తండ్రి చేసిన అప్పు తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందని రామ్‌జల్‌ పేర్కొన్నాడు. చదవాలన్న బలమైన ఆకాంక్ష ఉంటే ఎన్ని సమస్యలొచ్చినా అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చని నిరూపించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు రామ్ జల్ మీనా.

10548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles