జీఎస్టీతో త‌గ్గ‌నున్న కార్ల ధ‌ర‌లు!

Fri,November 4, 2016 02:21 PM

న్యూఢిల్లీ: కారు కోసం క‌ల‌లు కంటున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి గుడ్‌న్యూస్‌. గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమ‌లైతే చిన్న కార్లు ధ‌ర‌లు కాస్త త‌గ్గ‌నున్నాయి. జీఎస్టీలో నాలుగు ర‌కాల ప‌న్నుల విధించనున్న‌ట్లు కౌన్సిల్ స్ప‌ష్టంచేసింది. 5, 12, 18, 28 శాతాలుగా నిర్ణ‌యించారు. ఇందులో కార్ల‌న్నీ 28 శాతం కేట‌గిరీ ట్యాక్స్ కింద‌కు వ‌స్తాయ‌ని కూడా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ప్ర‌స్తుతం చిన్న కార్ల (4 మీట‌ర్ల క‌న్నా త‌క్కువ పొడ‌వు)పై ప‌న్ను 30 శాతంగా ఉంది. ఈ లెక్క‌న జీఎస్టీతో మ‌రో రెండు శాతం త‌క్కువ ప‌న్ను చెల్లించాల్సి రావ‌డంతో వాటి ధ‌ర‌లు కాస్త త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయి. అవే ల‌గ్జ‌రీ కార్ల‌యితే మాత్రం జీఎస్టీ 28 శాత‌మే అయినా.. వాటికి అద‌న‌పు సెస్‌, గ్రీన్ ట్యాక్స్‌లాంటివి ఉంటాయి. ప్ర‌స్తుతం ఈ కార్ల‌పై 50 శాతం ట్యాక్స్ ఉంది. జీఎస్టీ అమ‌లైనా సెస్‌, గ్రీన్ ట్యాక్స్ క‌లుపుకొని వాటి ధ‌ర‌లో పెద్ద‌గా మార్పులు వ‌చ్చే అవ‌కాశం క‌నిపించడం లేదు.


అయితే ఈ అద‌న‌పు సెస్ ఎంత ఉంటుంది.. ల‌గ్జ‌రీ కార్ల కేట‌గిరీలోకి ఏవి వ‌స్తాయ‌న్న‌దానిపై ప్ర‌భుత్వం ఇంకా స్ప‌ష్టత ఇవ్వ‌లేదు. ఆటోమొబైల్స్ ట్యాక్స్ గురించి జైట్లీని ప్ర‌శ్నించ‌గా.. కార్లు, ల‌గ్జ‌రీ కార్ల‌కు తేడా స్ప‌ష్టంగా ఉంటుంద‌ని అన్నారు. కార్ల‌న్నీ 28 శాతం ట్యాక్స్ కేట‌గిరీలోకి వ‌చ్చినా.. ల‌గ్జ‌రీ కార్ల ఓన‌ర్లు కాస్త అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం చిన్నకారు అంటే నాలుగు మీట‌ర్ల లోపు పొడ‌వు, పెట్రోల్ వ‌ర్ష‌న్ అయితే గ‌రిష్ఠంగా 1200 సీసీ ఇంజిన్‌, డీజిల్ అయితే గ‌రిష్ఠంగా 1500 సీసీ ఇంజిన్ ఉన్న కార్లుగా గుర్తిస్తున్నారు. ఆ లెక్క‌న చిన్న కార్ల కేట‌గిరీలో మంచి పేరున్న మారుతి ఆల్టో, హ్యుండాయ్ ఐ10, ఫోక్స్ వాగ‌న్ పోలో, రెనాల్ట్ క్విడ్‌, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లాంటి కార్ల‌న్నీ 28 శాతం ట్యాక్స్ కేట‌గిరీలోకే రానున్నాయి.

2907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles