న్యూఢిల్లీ : భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా తన చివరి పనిదినాన్ని జస్టిస్ రంజన్ గోగోయ్ శుక్రవారం ప్రత్యేకంగా ముగించుకున్నారు. తన ధర్మాసనంలో విచారణకు లిస్ట్ అయిన పిటిషన్లకు ఒకేసారి నోటీసులు జారీ చేశారు రంజన్ గోగోయ్. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజన్ గోగోయ్‌కు సాయంత్రం 4 గంటలకు వీడ్కోలు పలకనున్నారు. ఈ నెల 17వ తేదీన రంజన్ గోగోయ్ పదవీ విరమణ పొందనున్నారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే (63) ఈ నెల 17న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్థానంలో భారత సర్వోన్నత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
అసోం రాష్ర్టానికి చెందిన జస్టిస్ రంజన్ గొగోయ్ 1978లో బార్ కౌన్సిల్లో చేరారు. న్యాయవాదిగా గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఆయన 2001 ఫిబ్రవరి 28న శాశ్వత న్యాయమూర్తిగా నియితులయ్యారు. ఆ తర్వాత పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ అయి కొద్దికాలానికి ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గొగోయ్.. 2012 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ గొగోయ్.. ఆ పదవిని చేపట్టిన తొలి ఈశాన్య భారతీయుడిగా రికార్డులకెక్కారు. ప్రస్తుతం భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ గొగోయ్ ఈ నెల 17 పదవీ విరమణ చేయనున్నారు. జాతీయ పౌర రిజిస్టర్ (నేషనల్ సిటిజన్ రిజిస్టర్) కేసు సహా తన కెరీర్లో అనేక విశిష్ట కేసులను విచారించారు. గతేడాది జనవరిలో ఆయన సుప్రీంకోర్టులోని మరో ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించి కేసుల కేటాయింపులో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్‌మిశ్రా వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం పెను సంచలనం సృష్టించింది.
జస్టిస్ ఎస్ఏ బోబ్డే
మహారాష్ట్రకు చెందిన జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే (63) ఈ నెల 17న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్థానంలో భారత సర్వోన్నత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 19 ఏండ్ల క్రితం అదనపు న్యాయమూర్తిగా బాంబే హైకోర్టులో చేరిన జస్టిస్ బోబ్డే.. ఆ తర్వాత రెండేండ్లకు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. దేశంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ బోబ్డే పదవీకాలం 18 నెలల్లో ముగియనున్నది. జస్టిస్ బోబ్డే తన కెరీర్లో విచారణ జరిపిన కీలక కేసుల్లో అయోధ్య కేసుతోపాటు ఆధార్ ఆర్డినెన్స్ కేసు, పౌరుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కేసు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూస్) రిజర్వేషన్ కేసు,ఆర్టికల్ 370 కేసు ముఖ్యమైనవి.