కామర్స్‌తో ఉజ్వల భవిత


Wed,March 20, 2019 01:45 AM

commerce-students
- ఇంటర్ పూర్తయిన తర్వాత ఏ కోర్సు చేయాలి, ఏ గ్రూప్ తీసుకుంటే ఎలాంటి భవిష్యత్తు ఉంటుందని చాలామంది విద్యార్థులు ఆలోచిస్తూ ఉంటారు. సరైన అవగాహన, మార్గనిర్దేశం (గైడెన్స్) లేకపోవడంతో డిగ్రీలో ఏదో ఒక గ్రూప్ ఎంపికచేసుకుంటారు. తీరా కోర్సు పూర్తయ్యాక తమ ఎంపిక తప్పని తెలిసి బాధపడుతుంటారు.
- ఇటర్ తర్వాత మనం ఎంచుకునే రంగం భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఎలాంటి ఉపాధి అవకాశాలుంటాయి వంటి అంశాలను బేరీజు వేసుకుని ఆయా రంగాలను ఎంపిక చేసుకోవాలి.
కామర్స్‌తో అవకాశాలు

- ప్రస్తుత సమాజంలో యువ వ్యాపారవేత్తల అవసరం రోజురోజుకీ పెరిగిపోతున్నది. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంస్థలను నెలకొల్పే యువ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడమే. పెరుగుతున్న ఆర్థిక అవసరాల దృష్ట్యా కామర్స్ నిపుణులు, ఆర్థిక నిపుణులు, యువ పారిశ్రామికవేత్తల ప్రాధాన్యం పెరుగుతుంది.
- బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ వంటి ప్రాంతాల్లో, ఉత్తర భారతంలోని అనేక రాష్ర్టాల్లో కామర్స్ కోర్సులకున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. అక్కడ సైన్స్ గ్రూపులకంటే ముందు కామర్స్ కోర్సుల్లో సీట్లు భర్తీ అవుతున్నాయి.
- భారతదేశ ఆర్థికాభివృద్ధి రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. ఆ అభివృద్ధి ఫలాలను అందిపుచ్చుకునే ఉపాధి రంగాల్లో కామర్స్ రంగం ముందున్నది.
- పెద్దనోట్ల రద్దు, డిజిటల్ ట్రాన్‌జాక్షన్స్ వంటి నిర్ణయాల ప్రభావంవల్ల బ్యాంకింగ్ రంగం ప్రాముఖ్యం పెరిగింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా అధికమ య్యాయి. దీనివల్ల కామర్స్ విద్యార్థులకు ఈ రంగంలో డిమాండ్ ఉంది.
- దేశంలో జీఎస్టీ అమలవుతున్నది. దీనివల్ల చార్టర్డ్ అకౌంటెంట్‌లకు, ఇతర కామర్స్ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పవచ్చు.
- కామర్స్ కోర్సుల్లో సీఏ, సీఎంఏ, సీఎస్, బీకామ్, ఎంబీఏ కోర్సులను ప్రధానమైనవిగా చెప్పవచ్చు.

సీఏ

- గతంలో డిగ్రీ తర్వాత సీఏ కోర్సులోకి ప్రవేశించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్ తర్వాతే సీఏ కోర్సు చదవడం ప్రారంభించవచ్చు.
- ఇంటర్ ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఇలా ఏ గ్రూపువారైనా సీఏ చదవచ్చు. అయితే సీఏ చేయాలనుకునే చాలా మంది విద్యార్థులు ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తో పాటే సీఏ కూడా ఏకకాలంలో చదవడానికే సుముఖత చూపిస్తున్నారు.
సీఏలో దశలు
- ఇందులో మూడు దశలు ఉంటాయి. అవి సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్.

మొదటి దశ (సీఏ ఫౌండేషన్)

- ఇంటర్ (10+2) లేదా తత్సమాన పరీక్ష రాసినవారు ఎవరైనా సీఏ ఫౌండేషన్ కోర్సుకు నమోదు చేసుకోవచ్చు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న 4 నెలలకు సీఏ ఫౌండేషన్ పరీక్ష రాయవచ్చు.
- సాధారణంగా ప్రతి ప్రవేశపరీక్షను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. గతంలో నిర్వహించిన సీపీటీ పరీక్ష కూడా మల్టిపుల్ చాయిస్‌గా ఉండేది. అయితే దాని స్థానంలో తీసుకువచ్చిన సీఏ ఫౌండేషన్ పరీక్షలో 50 శాతం మార్కులను డిస్క్రిప్టివ్ పరీక్షగా, 50 శాతం మార్కులను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుగా నిర్వహిస్తున్నారు.
- ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పారిశ్రామిక అవసరాల దృష్ట్యా సీఏ విద్యార్థికి అన్ని రకాల నైపుణ్యాలు ఉండాలనే ఉద్దేశంతో సిలబస్‌ను రూపొందించారు.
- సీఏ ఫౌండేషన్ పరీక్ష 4 పేపర్లుగా ఉంటుంది. ఇందులో ఒక్కో పేపర్ 100 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- పేపర్-1, 2లు డిస్క్రిప్టివ్ పద్ధతిలో, పేపర్-3, 4లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
- సీఏ ఫౌండేషన్ పరీక్షలు ప్రతి ఏడాది మే, నవంబర్ నెలల్లో జరుగుతాయి.
- సీఏ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం, మొత్తంగా 400 మార్కుల్లో 50 శాతం అంటే 200 మార్కులు సాధించాలి.

సీఏ ఇంటర్మీడియట్

- ఇది సీఏలో రెండోదశ. దీన్ని గతంలో సీఏ ఐపీసీసీ అని పిలిచేవారు.
- సీఏ ఫౌండేషన్ పూర్తిచేసినవారు సీఏ ఇంటర్ చదవడానికి అర్హులు. ఇందులో గ్రూప్ 1, 2లో నాలుగు చొప్పున మొత్తం 8 పేపర్లుగా సిలబస్‌ను రూపొందించారు. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. నూతన విధానంలో కూడా విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూప్ 6 నెలల తేడాతో రాయవచ్చు.
- సీఏ ఇంటర్ పరీక్ష ఏడాదికి రెండుసార్లు అంటే మే, నవంబర్ నెలల్లో నిర్వహిస్తారు. ఈ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు, గ్రూప్ మొత్తంలో 50 శాతం మార్కులు సాధించాలి. సీఏ ఇంటర్ పూర్తిచేసినవారు మూడేండ్ల ఆర్టికల్‌షిప్ చేయాలి.

ప్రాక్టికల్ ట్రెయినింగ్

- సీఏ ఇంటర్ పూర్తిచేసివారు ఒక ప్రాక్టీసింగ్ సీఏ వద్దగాని, ఆడిట్ సంస్థలో గాని మూడేండ్ల పాటు ప్రాక్టికల్ ట్రెయినింగ్ చేయాలి.
- పాత విధానంలో సీఏ ఐపీసీసీ రెండు గ్రూపులు పూర్తిచేసినవారు లేదా సీఏ ఐపీసీసీలోని మొదటి గ్రూపు పూర్తిచేసినవారికి ఆర్టికల్‌షిప్ చేయడానికి అర్హత లభించేది. కాని నూతన విధానం ప్రకారం సీఏ ఇంటర్‌లో రెండు గ్రూపులు లేదా ఏదైనా ఒక గ్రూపు (గ్రూప్-1, 2) పూర్తిచేసిన వారికి ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందే అవకాశం లభించేది. ఇది విద్యార్థులకు లాభం చేకూర్చే అంశం.
- ప్రాక్టికల్ ట్రెయినింగ్ సమయంలో విద్యార్థి తాను శిక్షణ పొందుతున్న ప్రాంతాన్నిబట్టి రూ. 2000- రూ. 7000 వరకు స్టయిఫండ్ లభించే అవకాశముంది.
- రెండున్నరేండ్ల ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తిచేసినవారు సీఏ ఫైనల్ పరీక్ష రాయడానికి అర్హులు.

సీఏ ఫైనల్

- ఇది మూడోదశ. సీఏ ఇంటర్‌తోపాటు రెండున్నరేండ్ల ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తిచేసినవారు రిజిస్ట్రేషన్ చేసుకుని సీఏ ఫైనల్ పరీక్ష రాయవచ్చు.
- సీఏ ఫైనల్‌లో 8 పేపర్లు రెండు గ్రూపులుగా ఉంటాయి. ప్రతి గ్రూప్‌లో 4 పేపర్లు, ఒక్కో పేపర్‌కి 100 మార్కుల చొప్పున ఉంటాయి.
- ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు (మే, నవంబర్) నిర్వహిస్తారు. విద్యార్థి వీలునుబట్టి 8 పేపర్లు ఒకేసారి లేదా ఒక్కో గ్రూపు విడివిడిగా రాయవచ్చు.
- విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 40% మార్కులు, గ్రూప్ మొత్తంలో 50% మార్కులు సాధించాలి.
- గ్రూప్-2లో 6వ పేపర్‌ను ఎలక్టివ్ పేపర్‌గా నిర్ణయించారు. ఇందులో భాగంగా విద్యార్థి 6 సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని చదవచ్చు. ఇలాంటి ఎలక్టివ్ పేపర్ విధానంవల్ల విద్యార్థి తనకిష్టమైన పేపర్‌నే ఎంచుకుని, అందులో నైపుణ్యం సాధించడానికి అవకాశం ఉంటుంది.

సీఏలకు అవకాశాలు

- పన్ను గణన, అకౌంటింగ్, డేటా విశ్లేషణ విభాగాల్లో సీఏలకు లక్షకుపైగా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. జీఎస్టీ అమలువల్ల నగదు చెలామణి లాభదాయకత, పారదర్శకత మెరుగుపడి పన్ను ఎగవేతలు తగ్గిపోతాయని, ఫలితంగా సంభవించే ఆర్థిక అభివృద్ధివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
- జీఎస్టీ తీసుకురావడంవల్ల పరిశ్రమ లావాదేవీలు పెరిగి చార్టర్డ్ అకౌంటెంట్‌లకు డిమాండ్ అధికమవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

సీఎంఏ కోర్సు

- సీఏ తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సును ఎంచుకుంటున్నారు.
- ఇంటర్ ఎంఈసీతోపాటు సీఎంఏ చదివిన విద్యార్థులు ఇంటర్ తర్వాత రెండేండ్లలో, ఇంటర్ తర్వాత సీఎంఏ చదవడం ప్రారంభించిన విద్యార్థులు రెండున్నరేండ్లలో కోర్సు పూర్తిచేసి మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు.
- సీఎంఏ చదవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికోసం విద్యార్థి ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్ వారు ఐడీ కార్డు పంపిస్తారు. ఇది ఉన్నవారిని మాత్రమే పరీక్షకు అనుమతిస్తారు.
- సీఎంఏ కోర్సులో ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ అనే మూడు దశలు ఉంటాయి.

సీఎంఏ ఫౌండేషన్

- సీఎంఏలో మొదటి దశను ఫౌండేషన్ అంటారు. ఇంటర్‌లో ఏ గ్రూప్ చేసినవారైనా సీఎంఏ ఫౌండేషన్ కోర్సు చేయవచ్చు. ఇంటర్ ఎంఈసీ విద్యార్థులైతే ఎంఈసీతోపాటు సీఎంఏ ఫౌండేషన్ కోర్సుని ఏకకాలంలో పూర్తిచేయవచ్చు.
- ఈ కోర్సులో 8 సబ్జెక్టులను 4 పేపర్లుగా విభజించారు. అంటే రెండు సబ్జెక్టులు కలిపి ఒక పేపర్. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే మొత్తం 400 మార్కులకు 50% అంటే 200 మార్కు లు లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయాలి. అలా గే ప్రతిపేపర్‌లో 40%, అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించాలి.
- సీఎంఏ ఫౌండేషన్ పరీక్షను ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో నిర్వహిస్తారు.
- ఫౌండేషన్ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులు సీఎంఏ ఇంటర్ కోర్సు చదవడానికి అర్హత సాధిస్తారు.

సీఎంఏ ఇంటర్ (ఎగ్జిక్యూటివ్)

- సీఎంఏ ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసినవారు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏడాది తర్వాత సీఎంఏ ఇంటర్ పరీక్ష రాయవచ్చు.
- సీఎంఏ ఇంటర్ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. ఈ పరీక్షలు ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో నిర్వహిస్తారు.
- ఈ రెండు గ్రూపుల్లో మొదటిదాంట్లో గ్రూప్-1లో 4 పేపర్లు ఉంటాయి. ఒక్కోటి 100 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు ఉంటుంది. ఒక్కో సబ్జెక్టులో కనీసం 40 మార్కులు, మొత్తంగా 50 శాతంతో 200ల మార్కులు సాధించాలి.
- గ్రూప్-2లో 4 పేపర్లు ఉంటాయి. ఇందులో కూడా ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించాలి. మొత్తంగా అన్ని పేపర్లలో కలిపి 50 శాతం మార్కులు అంటే 200లు ఆపై మార్కులు సాధించాలి. విద్యార్థి వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు.

ప్రాక్టికల్ శిక్షణ

- సీఎంఏ ఫైనల్ పరీక్ష రాయాలంటే ఆరు నెలల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. సీఎంఏ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించినవారు గుర్తింపు పొందిన సంస్థల్లో నిర్దేశించిన విభాగాల్లో లేదా ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ దగ్గర 6 నెలలపాటు ప్రాక్టికల్ శిక్షణ పొందాలి. ఇలా శిక్షణ పొందుతున్న కాలంలోనే ప్రాంతాన్ని బట్టి నెలకు రూ. 2000 నుంచి రూ. 5000ల వరకు స్టయిఫండ్ పొందవచ్చు. ప్రాక్టికల్ ట్రెయినింగ్ ద్వారా విద్యార్థి సీఎంఏ వృత్తికి కావలసిన నైపుణ్యాన్ని పొందడమే కాకుండా తన కోర్సు పూర్తి చేయడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చు. సీఎంఏ ఫైనల్ ఉత్తీర్ణులైనవారు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మూడేండ్ల ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేయాలి.

సీఎంఏ ఫైనల్

- సీఎంఏ ఫైనల్‌లో కూడా రెండు గ్రూపులు (గ్రూప్-3, 4) ఉంటాయి. ఫైనల్ పరీక్షకి అర్హత సాధించాలంటే విద్యార్థి కనీసం 6 నెలల ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేయాలి. విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు. ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.
- ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు, గ్రూప్ మొత్తంలో 50 శాతం మార్కులు అంటే 400 మార్కులకు 200 మార్కులు సాధించాలి.

సీఎంఏలకు అవకాశాలు

- మేనేజ్‌మెంట్ కోర్సులను అందించే సంస్థల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్లుగా ఉద్యోగం లభిస్తుంది. అనేక ప్రభుత్వరంగ సంస్థల్లో, ప్రైవేటు కంపెనీల్లో చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్, కాస్ట్ కంట్రోలర్, చీఫ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ కంట్రోలర్ వంటి కీలకమైన పదవులు నిర్వహించవచ్చు.

prakash

579
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles