కరెంట్ అఫైర్స్


Wed,April 10, 2019 12:59 AM

Telangana
Praveen-Gorakavi

అండర్-30 ఫోర్బ్స్‌లో ప్రవీణ్

ప్రఖ్యాత ఫోర్బ్స్ ఆసియా అండర్-30 పురస్కారానికి రాష్ర్టానికి చెందిన యువ శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్ ఎంపికయ్యారు. ఫోర్బ్స్ మ్యాగజీన్ ఈ జాబితాను ఏప్రిల్ 2న విడుదల చేసింది. ఆసియా, పసిఫిక్‌లకు చెందిన 23 దేశాల్లో 30 ఏండ్లలోపువారికి ఫోర్బ్స్ మ్యాగజీన్ అవార్డులను ఇస్తుంది. ఈ ఏడాది భారత్‌లో వివిధ రంగాలకు చెందిన 59 మంది ఎంపిక కాగా హైదరాబాద్ నుంచి ఆరోగ్య, విజ్ఞాన విభాగంలో ప్రవీణ్‌కు స్థానం లభించింది. తక్కువ ఖర్చుతో, తేలికపాటి బరువుండే కృత్రిమ కాలి మడమలను ప్రవీణ్ తయారుచేశారు.

బ్యాక్టీరియను అంతంచేసే ఎంజైమ్

బ్యాక్టీరియాను అంతంచేసే ఎండోపెప్టిడెస్ అనే ఎంజైమ్‌ను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) సైంటిస్ట్ మంజులారెడ్డి, పరిశోధక విద్యార్థి పవన్‌కుమార్ కలిసి కనుగొన్నారు. ఇది కొత్త తరహా యాంటీబయాటిక్స్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ఏప్రిల్ 2న తెలిపారు. ఈ ఎంజైమ్ ప్రధానంగా బ్యాక్టీరియా సెల్‌వాల్ (కణత్వచం)ను విచ్ఛిన్నం చేసేందుకు దోహదపడుతుంది.

National
airport

బీవోబీలో బ్యాంకుల విలీనం అమలు

ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకు విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దీంతో దేశీయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రభుత్వరంగం), ఐసీఐసీఐ బ్యాంకు (ప్రైవేట్ రంగం) తర్వాత మూడో అతిపెద్ద బ్యాంకుగా బీవోబీ ఆవిర్భవించింది. ఈ విలీనంతో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 18కి తగ్గింది.

ముంబై ఎయిర్‌పోర్టుకు అవార్డు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ఏషియా పసిఫిక్ గోల్డ్ లభించింది. పర్యావరణహిత విమానాశ్రయాలకు ఏసీఐ ఏప్రిల్ 3న అవార్డులను ప్రకటించింది.

రెపో రేటు పావు శాతం తగ్గింపు కీలక పాలసీ వడ్డీ రేట్లయిన రెపోరేటు, రివర్స్ రెపోరేటును ఆర్‌బీఐ పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపోరేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి, రివర్స్ రెపోరేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గాయి. ఈ నిర్ణయంతో గృహ, రుణ, వాహన రుణాలపై కస్టమర్ల నెలవారీ చెల్లింపులు (ఈఎంఐ) తగ్గుతాయి.

మైత్రీ వంతెనజమ్ముకశ్మీర్‌లో ఏప్రిల్ 4న పూర్తయిన మైత్రీ వంతెనను భారత సైన్యం 40 రోజుల్లో నిర్మించింది. ఈ తీగల వంతెన లేహ్‌లో సింధూ నదిపై 260 అడుగుల పొడవుతో ఉంది. దీని నిర్మాణానికి 500 టన్నుల కాంక్రీటు, ఇనుమును ఉపయోగించారు. లేహ్, లద్దాఖ్‌లలోని మారుమూల గ్రామాల అనుసంధానానికి ఈ వంతెన ఉపయోగపడుతుంది.

persons
MALPASS

మోదీకి యూఏఈ పురస్కారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యున్నత పురస్కారం జాయెద్ మెడల్ ఇస్తున్నట్లు యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా జాయెద్ అల్ నహ్యాన్ ఏప్రిల్ 4న ప్రకటించారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి విశేషంగా కృషిచేసినందుకు గుర్తింపుగా మోదీని ఈ పురస్కారంతో గౌరవిస్తున్నామని తెలిపారు. వివిధ దేశాల అధినేతలు, అధ్యక్షులు, రాజులకు యూఏఈ జాయెద్ మెడల్‌ను అందజేస్తుంది.

ప్రపంచబ్యాంకు అధ్యక్షుడిగా మాల్‌పాస్

ప్రపంచబ్యాంకు నూతన అధ్యక్షుడిగా 63 ఏండ్ల డేవిడ్ ఆర్ మాల్‌పాస్ ఏప్రిల్ 5న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాల్‌పాస్ ప్రపంచ బ్యాంకు 13వ అధ్యక్షుడిగా ఐదేండ్లపాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆయన ప్రస్తుతం అమెరికా ఆర్థికశాఖలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

సీఐఐ ప్రెసిడెంట్‌గా విక్రమ్

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నూతన ప్రెసిడెంట్‌గా కిర్లోస్కర్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ విక్రమ్ కిర్లోస్కర్ నియమితులైనట్లు సీఐఐ ఏప్రిల్ 5న ప్రకటించింది. భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్‌చైర్మన్ రాకేశ్ మిట్టల్ స్థానంలో విక్రమ్ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదికి వైస్ ప్రెసిడెంట్‌గా టాటా స్టీల్ సీఎండీ టీవీ నరేంద్రన్ ఎన్నికయ్యారు.

నాస్కామ్ చైర్మన్‌గా కేశవ్

సాఫ్ట్‌వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ చైర్మన్‌గా డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేశవ్ మురుగేష్ నియమితులైనట్లు నాస్కామ్ ఏప్రిల్ 5న ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదికిగాను నాస్కామ్ చైర్మన్‌గా మురుగేష్.. విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రిషద్ ప్రేమ్‌జీ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. నాస్కామ్ వైస్ చైర్మన్‌గా ఇన్ఫోసిస్ సీఈవో యూబీ ప్రవీణ్ రావు నియమితులయ్యారు.

ఈఎస్‌పీఎన్ క్రీడా అవార్డులు-2018


PV_Sindhu
2018కుగాను క్రీడా ప్రసార సంస్థ ఈఎస్‌పీఎన్ భారత్ క్రీడా అవార్డులు-2018ను ఏప్రిల్ 5న ప్రకటించింది.
ఈ అవార్డుల్లో ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నిలిచింది. 2018లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా గుర్తింపు పొందినందుకుగాను సింధుకు ఈ అవార్డు దక్కింది.
మేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఎంపికయ్యాడు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు దక్కించుకున్నందుకు ఈ అవార్డు లభించింది.
ఆసియా క్రీడల్లో, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న సైనా నెహ్వాల్‌కు కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది.
కోచ్ ఆఫ్ ది ఇయర్ జస్పాల్ రాణా (షూటింగ్), టీమ్ ఆఫ్ ది ఇయర్ మహిళలు టేబుల్ టెన్నిస్ జట్టు, ఎమర్జింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ సౌరభ్ చౌధరి (షూటర్), లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదీప్ కుమార్ బెనర్జీ (ఫుట్‌బాల్)లకు లభించాయి.
మూమెంట్ ఆఫ్ ది ఇయర్‌గా ఆసియా క్రీడల్లో 4X400 మీ. రిలేలో భారత మహిళల అథ్లెటిక్ స్వర్ణం సాధించిన క్షణం. అత్యుత్తమ మ్యాచ్‌గా బాక్సింగ్‌లో హసన్‌బోయ్ దుమతోవ్ (రష్యా)తో అమిత్ పంగల్ జరిపిన పోరు ఎంపికైంది. దివ్యాంగ కేటగిరీలో అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా ఏక్తా భ్యాన్‌కు అవార్డు దక్కింది.
2018లో మొత్తం 11 క్రీడాంశాల్లో ప్రతిభ చూపిన 10 మంది క్రీడాకారులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

International
helicopter

ప్రపంచ వాణిజ్య వృద్ధిరేటు తగ్గింపు

2019కు గాను ప్రపంచ వాణిజ్య వృద్ధిరేటును 3.7 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఏప్రిల్ 2న వార్షిక అంచనాలను విడుదల చేసింది. 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ధి 3 శాతంగా ఉన్న విషయం తెలిసిందే.

భారత్‌కు ఎంహెచ్60ఆర్ హెలికాప్టర్లు

భారత్‌కు 24 ఎంహెచ్60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఏప్రిల్ 3న ఆమోదం తెలిపింది. శత్రుదేశాల సబ్‌మెరైన్లు, నౌకలను ధ్వంసం చేసేందుకు, సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్నవారిని గుర్తించి రక్షించేందుకు వీలుగా ఈ హెలికాప్టర్లను రూపొందించారు. యుద్ధనౌకలు, విధ్వంసక నౌకలు, క్రూజర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి వీటిని ఉపయోగించవచ్చు.

భారత్ రెండో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ

వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ దేశాల్లో ఇండోనేషియా మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో నిలిచాయని మెక్‌కిన్సే సంస్థ ఏప్రిల్ 4న నివేదిక సమర్పించింది. ఈ సంస్థ మొత్తం 17 అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలపై సర్వే నిర్వహించింది. 2018 గణాంకాల ప్రకారం భారత్‌లో 560 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. 12.3 బిలియన్ మొబైల్ అప్లికేషన్లను సెల్‌ఫోన్ వినియోగదారులు డౌన్‌లోడ్ చేశారు. భారత్‌లో సగటున సోషల్ మీడియా వినియోగదారుడు వారంలో 17 గంటలపాటు ఇంటర్నెట్‌తో గడుపుతున్నాడు. ఈ సంఖ్య చైనా, అమెరికాలో ఉన్న వినియోగదారుల కంటే అధికంగా ఉందని మెక్‌కిన్సే వెల్లడించింది.

Sports
Hamilto

బహ్రెయిన్ గ్రాండ్ ప్రి విజేతగా హామిల్టన్

బహ్రెయిన్ గ్రాండ్ ప్రి విజేతగా డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ లూయీస్ హామిల్టన్ (మెర్సిడెస్) నిలిచాడు. బహ్రెయిన్‌లో మార్చి 31న జరిగిన రేసులో హామిల్టన్ 1 గంట 34 నిమిషాల 21.29 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని విజేతగా నిలిచాడు. ఈ రేసులో మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానంలో నిలిచాడు.

ఐసీసీ టెస్ట్ క్రికెట్‌లో ఉత్తమ జట్టుగా భారత్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టెస్టు క్రికెట్‌లో ఉత్తమ జట్టుగా వరుసగా మూడోసారి భారత క్రికెట్ జట్టు నిలిచింది. ఐసీసీ కటాఫ్ తేదీ ఏప్రిల్ 1 నాటికి భారత జట్టు 116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో న్యూజిలాండ్ (108), మూడో స్థానంలో దక్షిణాఫ్రికా (105) నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా (104) నిలిచాయి.

మియామి ఓపెన్ విజేతగా ఫెదరర్

మియామి ఓపెన్ మాస్టర్స్-1000 టోర్నీ విజేతగా రోజర్ ఫెదరర్ నిలిచాడు. అమెరికాలోని మియామిలో ఏప్రిల్ 1న జరిగిన ఫైనల్లో ఫెదరర్ (స్విట్జర్లాండ్) డిఫెండింగ్ చాంపియన్ జాన్ ఇస్నర్ (అమెరికా)ను ఓడించాడు. ఫెదరర్ కెరీర్‌లో ఇది 28వ మాస్టర్స్ టైటిల్ కాగా, ఓవరాల్‌గా 101వ ఏటీపీ టైటిల్ కావడం విశేషం. మార్చి 31న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ (ఆస్ట్రేలియా) ఐదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్‌రిపబ్లిక్)ను ఓడించింది.

ఐసీసీ సీఈగా మను సాహ్ని

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా భారత్‌కు చెందిన మను సాహ్ని ఏప్రిల్ 1న బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి ఈ పదవిలో ఉన్న డేవ్ రిచర్డ్‌సన్ వచ్చే వన్డే వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. అప్పటివరకు ఆయనతో కలిసి సాహ్ని పనిచేస్తారు.

ఐపీఎల్ తరహాలో ఖో ఖో లీగ్

ఐపీఎల్ తరహాలో ఖో ఖో లీగ్‌ను నిర్వహించనున్నట్లు భారత ఖో-ఖో సమాఖ్య ఏప్రిల్ 2న ప్రకటించింది. 2019, సెప్టెంబర్-అక్టోబర్‌లో అల్టిమేట్ ఖో ఖో పేరుతో ఈ లీగ్‌ను నిర్వహించనున్నారు. భారత ఒలింపిక్ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, ఖో ఖో సమాఖ్య మాజీ అధ్యక్షుడు రాజీవ్ మెహతా ఈ లీగ్‌కు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఎనిమిది ఫ్రాంచైజీలు రెండేసి సార్లు తలపడే ఫార్మాట్‌లో మొత్తం 60 మ్యాచ్‌లతో 21 రోజులపాటు ఈ లీగ్‌ను నిర్వహించనున్నారు.
Vemula-Saidulu

517
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles