సాధనతోనే సాధ్యం


Wed,April 10, 2019 01:22 AM

సివిల్స్-2019 టాపర్ వరుణ్‌రెడ్డి

ఐఏఎస్.. లక్షలాదిమంది యువత కల. కానీ ఆ కలను నెరవేర్చుకునేందుకు అకుంఠిత దీక్షతో తపించి.. సాధించేది కొందరు మాత్రమే. వారు సమాజంలో ప్రత్యేక గుర్తింపును కోరుకోవడమేగాక, సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఆకాంక్షిస్తుంటారు. అలాంటి కోవలోని వాడే వరుణ్‌రెడ్డి. ఇటీవల ప్రకటించిన సివిల్స్ ర్యాంకుల్లో జాతీయస్థాయి ఏడో ర్యాంకు సాధించి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. పట్టువదలని విక్రమార్కుడిలా కృషిచేసి ఐఏఎస్‌గా నిలవడమే కాకుండా, రాష్ర్టానికి టాప్ టెన్‌లో స్థానం కల్పించడం హర్షించదగ్గ విషయం. నిపుణతో వరుణ్ చెప్పిన తన అనుభవాలు, ప్రిపరేషన్ విషయాలు...
Varun

నిపుణ: మీ కుటుంబ నేపథ్యం తెలియజేస్తారా?

-వరుణ్‌రెడ్డి: మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. నేను ఏడో తరగతి వరకు అక్కడే చదువుకున్నా. ఇంటర్ విజయవాడ దగ్గర గూడవల్లిలో తర్వాత ఇంజినీరింగ్ ఐఐటీ బాంబేలో చదివాను. మా నాన్న జనార్దన్‌రెడ్డి కంటివైద్యుడు. అమ్మ నాగమణి ఏడీఏ. తమ్ముడు పృథ్వీరెడ్డి హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్నాడు.

నిపుణ: సివిల్స్ వైపు మీ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమయ్యింది?

వరుణ్‌రెడ్డి: చిన్నప్పటి నుంచే ప్రజలకు సేవచేయాలి అనే తపన నాలో ఉండేది. ఐఐటీలో చేరినప్పుడే ఐఏఎస్ సాధించాలని నిర్ణయించుకున్నా. 2013 తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించాను. మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కానీ ఎంపిక కాలేదు. రెండో ప్రయత్నంలో మెయిన్స్‌లో వెనుతిరిగాను. మూడో ప్రయత్నంలో అంటే 2016లో 166వ ర్యాంకుతో ఐఆర్‌ఎస్ సాధించాను. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. 2017లో నాల్గో ప్రయత్నంలో 225 ర్యాంకు వచ్చింది. దీంతో కొంత నిరాశ నిస్పృహ ఆవహించింది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో తిరిగి ఐదోసారి సివిల్స్ రాశా.. ఈసారి ఏడోర్యాంకు సాధించి నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నాను.

నిపుణ: సివిల్స్‌లో ఆప్షనల్ ఏం తీసుకున్నారు, ఎలాంటి ఆప్షనల్ అయితే విజయానికి ఉపయోగపడుతుంది?

వరుణ్: సివిల్స్ ఎగ్జామ్‌లో ఆప్షనల్ పాత్ర కీలకం. మొదటిసారి నేను జాగ్రఫీతో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. తర్వాత మూడో ప్రయత్నం నుంచి మ్యాథ్స్ ఆప్షనల్‌గా తీసుకున్నాను. ముఖ్యంగా ఆప్షనల్ ఎంపిక అభ్యర్థిపై ఆధారపడి ఉంటుంది. సోషల్ సబ్జెక్టులు కాకుండా డిగ్రీ/ఇంజినీరింగ్‌లో చదివిన సబ్జెక్టులను ఆప్షనల్‌గా తీసుకోవాలనుకుంటే అభ్యర్థికి ఆ సబ్జెక్టుపై బాగా పట్టు ఉండాలి. సోషల్ సబ్జెక్టులు అయితే కొన్ని అడ్వాంటేజ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా జీఎస్‌లో సోషల్ సబ్జెక్టులు అంతర్భాగంగా వస్తాయి. దానివల్ల సమయం కలిసి వస్తుంది. సైన్స్ వారికి సోషల్ కొత్త కాబట్టి ఇంట్రెస్టింగా చదువుతారు. అయితే మ్యాథ్స్ విషయంలో కొన్ని లాభాలు ఉన్నాయి. బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్టు. కాకపోతే చాలా హార్డ్‌వర్క్ చేయాలి. దేశంలోని అత్యుత్తమ సంస్థల్లో మ్యాథ్స్ చదివిన వారు పోటీలో ఉంటారన్న విషయం మరిచిపోవద్దు. స్కోర్ మంచిగా వస్తుంది అదే సమయంలో జీఎస్ ప్రిపరేషన్‌కు మ్యాథ్స్ ఏ మాత్రం ఉపయోగపడదు. సమయం ఎక్కువ తీసుకున్నా ఎక్కువ స్కోర్ ఇస్తుంది మ్యాథ్స్. ఈ సబ్జెక్టులో నాకు ఢిల్లీలోని ఐఎంఎస్ వెంకన్నసార్ మెంటార్‌గా చక్కటి గైడెన్స్ అందించారు.

నిపుణ: ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఎలా ప్రిపేర్ కావాలి? ఏయే పుస్తకాలు చదివారు?

వరుణ్: సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించిన డే-1 నుంచే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అవసరం. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు అంశాలు ఒక్కటే. ప్రిలిమ్స్‌లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు, మెయిన్స్‌లో డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పాలిటీకి లక్ష్మీకాంత్, ఎకానమీకి రమేష్ సింగ్ (సెలక్టివ్ టాపిక్స్), హిస్టరీ, జాగ్రఫీలకు ఎన్‌సీఈఆర్‌టీఈ 11, 12వ తరగతి పుస్తకాలను, ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీకి శంకర్ ఐఏఎస్ మెటీరియల్ చదివాను. ఒక్కో అంశానికి ఒక్క ప్రామాణిక పుస్తకం సరిపోతుంది. అనవసరంగా పదిరకాల పుస్తకాలు చదవవద్దు. ఒక్క మంచి పుస్తకాన్ని తీసుకుని ఎక్కువసార్లు చదవాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కరెంట్ అఫైర్స్‌కు ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఏదైనా ఒకదాన్ని ఫాలో కావాలి. విజన్ ఐఏఎస్ లాంటి ఒక మంత్లీ మ్యాగజీన్‌ను తప్పక చదవాలి.

నిపుణ: ఎలా చదివితే విజయం సాధించవచ్చు?

వరుణ్: తక్కువ సోర్స్ అంటే టాపిక్‌కు ఒక్క ప్రామాణిక పుస్తకం మాత్రమే చదవాలి. ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ టెస్ట్‌లను రాయాలి. ఉదాహరణకు ఒక్క అంశాన్ని చదివిన తర్వాత ఆ అంశంపై కనీసం ఐదారువందల ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. ఇది ప్రిలిమ్స్‌కు ఉపయోగపడుతుంది. అదే టాపిక్‌ను మెయిన్స్ దృష్టితో కూడా చదవాలి. ఆ టాపిక్ పూర్తికాగానే టాపిక్‌పై గతంలో మెయిన్స్‌లో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారు. ఈసారి ఎలా ఇవ్వొచ్చు అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని కనీసం రెండు మెయిన్ టెస్ట్ సీరిస్‌లకు ఆన్సర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. టాపిక్‌ల వారీగా ప్రాక్టీస్ బాగా చేయాలి. తప్పులను చూసుకుని సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తప్పులను సరిచేసుకునే విధంగా మరోసారి ఆయా టాపిక్‌లను రివిజన్ చేసుకోవాలి.

నిపుణ: ఇంటర్వ్యూకు ఎలా ప్రిపేర్‌కావాలి?

వరుణ్: ఇంటర్వ్యూలో పూర్తిగా వ్యక్తిత్వాన్ని పరిశీలించడానికి ప్రయత్నిస్తారు. అభ్యర్థి స్ట్రెస్ ఎన్విరాన్‌మెంట్‌లో ఎలా ప్రవర్తిసాడు అనేది సూక్ష్మంగా బోర్డు సభ్యులు పరిశీలిస్తారు. ఆప్టిమిస్ట్, అభ్యర్థి దేనిపై దృష్టి పెడుతున్నాడు, బ్యాలెన్సింగ్‌గా ఉన్నాడా, లాజికల్ థికింగ్, ఆత్మవిశ్వాసం లాంటి ప్రధాన అంశాలను పరిశీలిస్తారు. దీనికోసం మానసికంగా స్థిరచిత్తంతో సన్నద్ధమయితే విజయం సాధించవచ్చు. ఇక నా ఇంటర్వ్యూ విషయానికి వస్తే చాలా ఫ్రెండ్లీగా జరిగింది. బయోడేటా, అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్, వర్తమాన అంశాలపై ప్రశ్నలు అడిగారు.

నిపుణ: సివిల్స్ కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు?.

-వరుణ్: సివిల్స్‌లో ప్రిపరేషన్ మొదలు పెట్టే ముందు అభ్యర్థి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అంకితభావంతో ప్రిపేర్‌కావాలి. ఓపికతో స్థిరమైన లక్ష్యసాధన దిశగా ప్రయత్నించాలి. ఒకటి.. రెండు... నాలుగు సార్లు విఫలమైనా విజయం సాధించాలనే తపన ఉంటే తప్పక సాధిస్తాం. ఇటీవల ఐటీ/సాఫ్ట్‌వేర్ నుంచి అభ్యర్థులు ఇటువైపు వస్తున్నారు. ఒకసారి, రెండుసార్లు రాయగానే డీలాపడి పోతున్నారు. అలాకాకుండా స్థిరచిత్తంతో, దృఢ సంకల్పంతో దీర్ఘకాలిక ప్రిపరేషన్ చేయాలి. ఏ రంగంలో రాణించాలన్నా డెడికేషన్ తప్పనిసరి.

-ఇక రోజువారీ ప్రిపరేషన్ చూస్తే... ప్రతిరోజు పదిగంటలు క్వాలిటీగా చదవాలి. సివిల్స్ ప్రిపరేషన్ సమయంలో స్టడీ, హాబీలు, సోషల్‌లైఫ్ అన్ని బ్యాలెన్సింగ్‌గా ఉంటే మంచిది. నేను ప్రతిరోజు ఒక గంట జిమ్, జాగింగ్ చేసేవాడిని. బాగా అలసిపోయిన రోజు చదివి రిలాక్స్ అయ్యేవాడిని. అప్పుడప్పుడు రెండుమూడు రోజులు ప్రయాణాలు చేసేవాడిని. స్టడీని బ్యాలెన్సింగ్‌గా చేయాలి. ముఖ్యంగా ఫస్ట్ అటెంప్ట్‌లో పెద్దగా ప్రాబ్లమ్స్ రావు. రెండో ప్రయత్నం నుంచి రకరకాల సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మంచి ఫ్రెండ్స్ ఉండాలి.

నిపుణ: మీరు విజయం సాధించడానికి ప్రోత్సహించిన వారెవరు?

వరుణ్: ముఖ్యంగా తల్లిదండ్రులు, తమ్ముడు, స్నేహితులు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. ఎక్కువ ప్రయత్నాలు విఫలమవడం, మిత్రులందరూ లైఫ్‌లో సెటిల్‌కావడం, వయస్సు మీరిపోవడం కొంత డిప్రెషన్‌కు గురిచేశాయి. ఈ సమయంలో కుటుంబసభ్యులు, మిత్రులు ైస్థెర్యాన్ని ఇచ్చారు. అపజయం పొందిన ప్రతిసారి నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. ఫ్రెండ్స్ చంద్రకాంత్‌రెడ్డి, సందీప్, శ్వేత అందరం గ్రూప్ డిస్కషన్, సబ్జెక్టు షేరింగ్ చేసుకునేవాళ్లం.

నిపుణ: కొత్తగా సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు మీరిచ్చే సందేశం?.

-వరుణ్: రీడింగ్ లెస్ సోర్స్ అంటే ప్రామాణికమైన పుస్తకాలను (టాపిక్‌కు ఒకటి) చదవండి, అనవసర పుస్తకాలను చదవకండి. ఎక్కువసార్లు రివిజన్, ఎంసీక్యూ, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓపిక, పాజిటివ్ ఆప్టిట్యూడ్, స్థిరచిత్తంతో ముందుకుపోండి. బ్యాలెన్సింగ్‌గా ఉండండి. ఐసోలేట్ కాకండి. సరైన గైడ్/మెంటార్ ఉంటే మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించవచ్చు.

నిపుణ: సివిల్స్‌లో విజయానికి కోచింగ్ అవసరమా?.

-వరుణ్: ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విస్తృతమైన సోర్స్ ఉంది. అన్‌అకాడమీ, స్టడీఐక్యూ, ఇన్‌సైట్స్‌ఆన్‌ఇండియా, ఐఏఎస్‌బాబాతోపాటు పలు వీడియో ట్యూటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సరైన ప్రణాళిక, మం చి మెంటార్ లేదా సీనియర్స్ సహాయంతో ఇంట్లోనైనా ప్రిపేర్ కావచ్చు. విజయం సాధించవచ్చు.
...?కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

516
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles