కరెంట్ అఫైర్స్


Wed,May 15, 2019 01:58 AM

బెస్ట్ ఫిమేల్ హెల్త్‌కేర్ లీడర్ సంగీతారెడ్డి

ఐఎంఏ మెడికో అవార్డ్స్-2019లో బెస్ట్ ఫిమేల్ హెల్త్‌కేర్ లీడర్ అవార్డు అపోలో హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ సంగీతారెడ్డికి లభించింది. మే 8న హైదరాబాద్‌లోని హైచ్‌ఐసీసీలో ఐఎంఏ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఐఎంఏ మెడికో హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డు వేడుకల్లో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆమెకు ఈ అవార్డును అందజేశారు.

సెర్ప్ డైరెక్టర్‌గా సత్యనారాయణ

తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) డైరెక్టర్‌గా సీహెచ్ సత్యనారాయణను నియమిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ మే 10న ఉత్తర్వులు జారీచేశారు. సహకార శాఖలో డిప్యూటేషన్‌పై సెర్ప్ డైరెక్టర్‌గా నియమించారు.

గ్లోబల్ లీడర్ అవార్డు

క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు, ఆర్క్ గ్రూప్ ఫౌండర్ గుమ్మి రాంరెడ్డికి ఏషియా వన్ సంస్థ అందించే గ్లోబల్ లీడర్-2018 అవార్డు మే 10న లభించింది. ఆయన నిర్మాణాల్లో నాణ్యత, గడువుకంటే ముందే ప్రాజెక్టులను పూర్తిచేస్తున్న విధానం, పలు రాష్ర్టాధినేతల నుంచి అందుకున్న అవార్డులను పరిశీలించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇదే సంస్థ హైదరాబాద్‌కు చెందిన మ్యాక్ ప్రాజెక్ట్స్ ఎండీ నాసిర్ అలీఖాన్‌కు పర్సన్ ఆఫ్ ది ఇయర్-2018 అవార్డును అందజేసింది.
NASIR-ALI-KHAN

ఐఎన్‌ఎస్ వెళా ప్రారంభం

భారత నౌకాదళం కోసం నిర్మించిన ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్‌ఎస్) వెళాను ముంబైలో మే 6న ప్రారంభించారు. ముంబైలోని మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ దీన్ని నిర్మించింది. ప్రాజెక్టు 75లో భాగంగా ఆరు స్కార్పీన్ రకం జలాంతర్గాములను మజ్‌గావ్ డాక్ నిర్మించాలి. ఈ ఆరింటిలో మొదటిది ఐఎన్‌ఎస్ కల్వరిని ప్రధాని మోదీ 2017, డిసెంబర్ 14న ప్రారంభించారు. తాజాగా ప్రారంభమైన ఐఎన్‌ఎస్ వెళా స్కార్పీన్ రకంలో నాలుగో జలాంతర్గామి.
INS-Vela-Launch

భారత్-ఫ్రాన్స్ నౌకా విన్యాసాలు

గోవా సమీపంలోని సముద్రంలో మే 1న ప్రారంభమైన భారత్-ఫ్రాన్స్ సంయుక్త నౌకా విన్యాసాలు మే 10న ముగిశాయి. వరుణ-2019 పేరుతో ఈ విన్యాసాలు ఫ్రాన్స్‌కు చెందిన విమాన వాహకనౌక చార్లెస్ డీ గాలె కేంద్రంగా నిర్వహించాయి. ఈ విన్యాసాల్లో ఒక్కో దేశం నుంచి 6 చొప్పున యుద్ధనౌకలు, జలాంతర్గాములు కలిపి 12 పాల్గొన్నాయి.

ఐపీఎస్ అధికారిణికి అవార్డు

ఐసీఎస్ అధికారిణి ఛాయాశర్మకు మెకెయిన్ అవార్డు మే 11న లభించింది. దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసును విచారించినందుకు ఈ అవార్డు దక్కింది.

అత్యుత్తమ విమానాశ్రయాల జాబితా

2019 ఏడాదికి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల ర్యాంకింగ్‌లను ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ మే 10న విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా ఖతార్‌లోని హమద్ ఇంటర్నేషనల్ నిలువగా, 8వ స్థానంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిలిచింది. 2వ స్థానంలో టోక్యో ఎయిర్‌పోర్టు (జపాన్), 3వ స్థానంలో ఏథెన్స్ ఎయిర్‌పోర్టు (గ్రీస్), 4వ స్థానంలో అఫోన్సో పెనా (బ్రెజిల్), 5వ స్థానంలో గాన్స్‌లెచ్ వలేసా (పోలెండ్), 6వ స్థానంలో షెరెమెటేవో ఎయిర్‌పోర్టు (రష్యా), 7వ స్థానంలో షాంఘి ఎయిర్‌పోర్టు (సింగపూర్), 9వ స్థానంలో టెనెరిఫె నార్త్ (స్పెయిన్), 10వ స్థానంలో విరాకోపస్/కాంపినస్ ఎయిర్‌పోర్టు (బ్రెజిల్) నిలిచాయి.
Rajiv-Ghandi-Airport

వియత్నాం పర్యటనలో ఉపరాష్ట్రపతి

వియత్నాం రాజధాని హనోయ్‌లో ఆ దేశ ఉపాధ్యక్షురాలు డాంగ్ థి గాక్ థిన్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మే 10న సమావేశమయ్యారు. భారత్-వియత్నాం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, వివిధ రంగాల్లో సహకారాన్ని అందించుకోవాలని, పునరుత్పాదక ఇంధనం, మౌలిక వసతులు, చమురు, సహజ వాయువు రంగంలో పెట్టుబడులపై చర్చించారు.

ఐఎన్‌సీబీకి జగ్‌జిత్ మరోసారి ఎన్నిక

అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ బోర్డు (ఐఎన్‌సీబీ) సభ్యురాలిగా భారత్‌కు చెందిన జగ్‌జిత్ పవాడియా మరోసారి ఎన్నికయ్యారు. 2025 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని ఐరాసలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ మే 8న తెలిపారు. 54 మంది సభ్యులుండే ఐరాస విభాగం ఆర్థిక, సామాజిక కౌన్సిల్‌కు రహస్య బ్యాలెట్ పద్ధతిలో మే 6న ఎన్నికలు జరిగాయి. మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి ఐరాస నిర్ణయాల అమలును ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది.

పనామా నూతన అధ్యక్షుడిగా కార్టిజో

పనామా నూతన అధ్యక్షుడిగా వ్యాపారవేత్త, డెమొక్రటిక్ రివల్యూషనరీ చేంజ్ పార్టీ అభ్యర్థి లారెంటినో కార్టిజో ఎన్నికయ్యారు. మే 5న జరిగిన సాధారణ ఎన్నికల్లో కార్టిజో విజయం సాధించారని ఆ దేశ ఎన్నికల సంఘం మే 6న ప్రకటించింది. కార్టిజో జూలై 1న పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు.

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేగా మీనన్

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీఆర్ రామచంద్ర మీనన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మే 6న మీనన్‌తో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణం చేయించారు.

సోషల్ మీడియాలో మోదీ

ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో (సోషల్ మీడియా) అత్యధికులు అనుసరిస్తున్న జాబితాను సెమ్ష్ అనే సంస్థ మే 7న విడుదల చేసింది. ఈ జాబితాలో భారత ప్రధాని రెండోస్థానంలో ఉన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో 11.09 కోట్ల మంది మోదీని అనుసరిస్తున్నారు. 18.27 కోట్ల మంది ఫాలోవర్లతో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 9.6 కోట్ల మంది ఫాలోవర్లతో మూడోస్థానంలో ఉన్నారు.

జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్‌గా సునీల్

షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్‌గా డాక్టర్ జీ సునీల్ కుమార్ బాబు మే 9న హైదరాబాద్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీలో అంతర్జాతీయ కార్యక్రమాల డైరెక్టర్‌గా, పాలిటెక్నిక్‌ల సమన్వయకర్తగా ఆయన పనిచేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌ను భారత రాజ్యాంగంలోని 338వ అధికరణం పరిధిలో ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగం పరిధిలో షెడ్యూల్డ్ కులాలకు నిర్దేశించిన రక్షణ చర్యలను పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్‌లో ఉన్న కార్యాలయం పరిధిలోకి తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు వస్తాయి.

ఇఫ్కో డైరెక్టర్‌గా దేవేందర్‌రెడ్డి

ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇఫ్కో) డైరెక్టర్‌గా తెలంగాణలోని కోనాపూర్ పీఏసీఎస్ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. మే 10న జరిగిన తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ, గోవాలతో కూడిన నియోజకవర్గం ఎన్నికల్లో ఆయన్ను డైరెక్టర్‌గా ఎన్నుకున్నారు. ఆయన ఈ పదవిలో ఐదేండ్లపాటు ఉంటారు.

ఐరాస ఎస్‌డీజీ ప్రచారకర్తగా దియామీర్జా

ప్రపంచవ్యాప్తంగా ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) ప్రచారకర్తగా బాలీవుడ్ నటి దియామీర్జా మే 10న ఎంపికయ్యారు. ఆమెతోపాటు నైజీరియా, చాద్, దక్షిణాఫ్రికా, ఇరాక్, బ్రెజిల్‌ల నుంచి మరో ఐదుగురు ఎస్‌డీజీకి ఎన్నికయ్యారు. కొత్త ప్రచారకర్తలతో కలిసి మొత్తం 17 మంది ఉండే ఎస్‌డీజీ బృందం ఆకలి, పేదరికాన్ని రూపుమాపడం, అందరికీ ఆరోగ్య సంరక్షణ లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది.
dia-mirza

బ్రిటన్ కుబేరుల్లో హిందూజా సోదరులు

బ్రిటన్ కుబేరుల్లో భారతీయ మూలాలు కలిగిన హిందూజా సోదరులకు అగ్రస్థానం దక్కింది. సండేటైమ్స్ మే 12న రిచ్‌లిస్ట్ వార్షిక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 22 బిలియన్ పౌండ్ల (సుమారు రూ.1.98 లక్షల కోట్లు) సంపదతో హిందూజా సోదరులు (శ్రీచంద్-గోపీచంద్) అగ్రస్థానంలో నిలిచారు. రూబెన్ సోదరులు (డేవిడ్, సైమన్) రూ.1.68 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇంకా ఈ జాబితాలో 45 మంది భారతీయ కుబేరులకు చోటు లభించింది. 11వ స్థానంలో లక్ష్మీనివాస్ మిట్టల్, 12వ స్థానంలో అనిల్ అగర్వాల్, 26వ స్థానంలో శ్రీప్రకాశ్ లోహియా, 69వ స్థానంలో లార్డ్ స్వరాజ్ పాల్, 75వ స్థానంలో సునీల్ వశ్వానీ నిలిచారు.

ఐపీఎల్-12 విజేత ముంబై

ఐపీఎల్-12 సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ జట్టు నిలిచింది. మే 12న హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు 149 పరుగులకు 8 ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చెన్నై జట్టు 148 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. ముంబై జట్టు 2013, 2015, 2017లో విజేతగా నిలిచింది. ప్రైజ్‌మనీ విజేత జట్టుకు రూ.20 కోట్లు, రన్నరప్‌కు రూ.12.5 కోట్లు. డేవిడ్ వార్నర్‌కు ఆరెంజ్ క్యాప్ (రూ.10 లక్షలు), ఇమ్రాన్ తాహిర్‌కు పర్పుల్ క్యాప్ (రూ.10 లక్షలు) దక్కింది. ఎమర్జింగ్ ప్లేయర్‌గా శుభ్‌మన్ గిల్ (రూ.10 లక్షలు) నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ (రూ.5 లక్షలు) దక్కింది. ైస్టెలిష్ ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ (రూ.10 లక్షలు), ఉత్తమ క్యాచ్ పట్టిన ఆటగాడిగా శార్దూల్ ఠాకూర్ (రూ.10 లక్షలు), గేమ్ చేంజర్‌గా రాహుల్ చాహర్ (రూ.10 లక్షలు) నిలిచారు.
IPL

ఫెలిక్స్ టోర్నీలో భారత్‌కు ఆరు పతకాలు

ఫెలిక్స్ స్టామ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు లభించాయి. పోలెండ్ రాజధాని వార్సాలో మే 5న జరిగిన ఈ టోర్నీలో గౌరవ్ సోలంకి (52 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) స్వర్ణాలు సాధించారు. తెలంగాణకు చెందిన బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు) రజతం గెలవగా మన్‌దీప్ జాంగ్రా (69 కేజీలు), అంకిత్ ఖటానా (64 కేజీలు), సంజీత్ (91 కేజీలు) కాంస్యాలు నెగ్గారు.

ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా ఐగర్ స్టిమాక్

భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్‌గా క్రొయేషియాకు చెందిన ఐగర్ స్టిమాక్‌ను నియమించినట్లు మే 9న అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలిపింది. మూడేండ్లపాటు భారత ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా ఆయన ఉండనున్నారు. థాయ్‌లాండ్‌లో జూన్ 5 నుంచి జరుగనున్న కింగ్స్ కప్‌తో అతడి పదవీకాలం ప్రారంభంకానుంది. 1996 యూరో కప్‌లో క్రొయేషియా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 1998 ప్రపంచకప్‌లో మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

324
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles