కరీర్ కు ఫైన్ ఆర్ట్స్


Mon,May 20, 2019 12:36 AM

ఇంటర్ పూర్తయ్యింది. ఎక్కువమంది ఇంజినీరింగ్, మెడిసిన్, సంప్రదాయ డిగ్రీ కోర్సులవైపు వెళ్తుంటారు. అయితే వీటిపై అంతగా ఆసక్తి చూపించనివారూ ఉంటారు. వినూత్నమైన కోర్సులు చేసి, ఆయా రంగాల్లో తమదైన ప్రతిభ చూపించాలని భావిస్తుంటారు. నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలు కలిగి, వాటిని విస్తృత పరచడం ద్వారా గుర్తింపు పొందాలనే ఆలోచనతో ఉంటారు. ఇలాంటివారికి సరైన ఎంపిక ఫైన్‌ఆర్ట్స్ కోర్సులు. సౌందర్య విలువలను నిండా నింపుకున్న లలిత కళలు (ఫైన్‌ఆర్ట్స్) నేటి ఆధునిక యువతకు కొత్త కొలువులను అందించే వేదికలుగా అవతరిస్తున్నాయి. ప్రతి విషయంలో హైటెక్ హంగులను కోరుకుంటున్న ఈ ఆధునిక కాలంలో ఎందుకులే అని ఎప్పుడో వదిలేసిన శిల్పకళ, చిత్రలేఖనం, ఛాయాగ్రహనం ఇప్పుడు కాసులు కురిపించే ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. దీనిని గుర్తించిన యూనివర్సిటీలు ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ కోర్సులను అందిస్తున్నాయి. వాటికి సంబంధించిన
విషయాలను తెలుసుకుందాం...

studio_paintings
-బ్యాచిలర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ) అనేది విజువల్ (కనిపించే) లేదా పెర్ఫార్మింగ్ (ప్రదర్శించే) కళల గురించి అధ్యయనం చేస్తుంది. దీన్ని బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో పెయింటింగ్, స్కల్‌ప్చర్, ఫొటోగ్రఫీ, యానిమేషన్, మొదలైన అంశాలు ఉంటాయి. ప్రదర్శించే కళల్లో డ్యాన్స్, థియేట ర్, మ్యూజిక్ అంశాలు ఉం టాయి. వీటిలో విద్యార్థి ఆసక్తి ని బట్టి కోర్సులను ఎంచుకోవ చ్చు. దీనిద్వారా వారు ఎంపికచేసుకున్న రంగంలో నైపుణ్యా న్ని పెంచుకోవచ్చు.
-ఫైన్‌ఆర్ట్స్ అనేది అందమైన వస్తువులను సృష్టించే కళ. అందువల్ల ఈ కోర్సులు చేయాలనుకునేవారు కళాత్మకత, సృజనాత్మకత, బొమ్మలు గీసే నైపుణ్యం, తార్కికంగా ఆలోచించడం, కష్టించే తత్వం కలిగినవారై ఉండాలి.
-రాష్ట్రంలో జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వాటి పరిధిలో ఉన్న కాలేజీలు ఫైన్ ఆర్ట్స్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని నాలుగు, ఐదేండ్ల బ్యాచిలర్ కోర్సులు ఉండగా, మరికొన్ని మూడేండ్ల కోర్సులు. అలాగే దేశంలోని వివిధ విద్యాసంస్థలు ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించి ఏడాది నుంచి ఐదేండ్ల కాలవ్యవధి కలిగిన సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైన కోర్సులు, అందిస్తున్న యూనివర్సిటీలు..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో..

-కేంద్రీయ విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించిన ప్రింట్ మేకింగ్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్‌లో మాస్టర్ కోర్సులను సరోజిని నాయుడు స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్టుమెంటు అందిస్తున్నది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
-ఈ కోర్సులకు సంబంధించి మొత్తం నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఎంట్రెన్స్ ద్వారా వీటిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సులకు సంబంధించిన ప్రవేశపరీక్ష మే 30న జరగనుంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో

-బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ) ఫొటోగ్రఫి, అప్లయిడ్ ఆర్ట్స్, పెయింటింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫొటోగ్రఫి మూడేండ్ల కోర్సు కాగా, మిగిలినవి ఐదేండ్ల కాలవ్యవధి కలిగిన కోర్సులు. ప్రతి ఏడాది రెండు సెమిస్టర్లు ఉంటాయి.
-ఫొటోగ్రఫీ కోర్సుల చేయాలంటే ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అప్లయిడ్ ఆర్ట్స్, పెయింటింగ్ కోర్సులు అభ్యసించాలంటే పదోతరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి.
-యూనివర్సిటీ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
-ఓయూ పరిధిలోని వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్, పీజీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

దేశంలో ప్రముఖ కాలేజీలు-బీఎఫ్‌ఏ కోర్సులు

ఫ్యాకల్టీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం
-దేశంలో ప్రముఖ, పురాతన విశ్వవిద్యాలయమైన బీహెచ్ యూ బీఎఫ్‌ఏలో పెయింటింగ్, అప్లయిడ్ ఆర్ట్స్, టెక్స్‌టైల్ డిజైన్‌లలో నాలుగేండ్ల డిగ్రీ కోర్సులను అందిస్తున్నది.

కాలేజ్ ఆఫ్ ఆర్ట్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ- న్యూఢిల్లీ

-ఫైన్స్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నది.

ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, జామియా మిలియా ఇస్లామియా- న్యూఢిల్లీ

-కేంద్రీయ విశ్వవిద్యాలయం అయిన ఇందులో అప్లయిడ్ ఆర్ట్, స్కల్‌ప్చర్, ఆర్ట్ ఎడ్యుకేషన్, గ్రాఫిక్ ఆర్ట్, పెయింటింగ్ కోర్సులను అందిస్తున్నది.

సర్ జేజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ ఆర్ట్, ముంబై

-యూనివర్సిటీ ఆఫ్ ముంబై పరిధిలో ఉన్న కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ (అప్లయిడ్ ఆర్ట్)లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎఫ్‌ఏ, ఫొట్రోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్‌లో ఏడాది కాలవ్యవధి గల అప్రెంటిస్ ట్రెయినింగ్ కోర్సులను అందిస్తున్నది.

కళా భవన్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్), విశ్వభారతి- బిర్భుమ్

-సర్టిఫికెట్, డిప్లొమా, బీఎఫ్‌ఏ (ఆనర్స్), ఎఫ్‌ఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు అందిస్తున్నది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, కురుక్షేత్ర యూనివర్సిటీ-కురుక్షేత్ర

-నాలుగేండ్ల బీఎఫ్‌ఏ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఎఫ్‌ఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

స్టెల్లా మేరీస్ కాలేజీ- చెన్నై

-యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ పరిధిలోని ఈ కాలేజీ 13 డిగ్రీ, 12 పీజీ కోర్సులను అందిస్తున్నది.

భారతి కళా మహావిద్యాలయ (కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్)- పుణె

-అప్లయిడ్ ఆర్ట్‌లో నాలుగేండ్ల బ్యాచిలర్ కోర్సు అందిస్తున్నది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్

(మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్)- వారణాసి
-ఇండియన్ పెయింటింగ్, ఇండియన్ స్కల్‌ప్చర్, ట్రైబల్, ఫోక్ ఆర్ట్స్ కోర్సులను అందిస్తున్నది.

ఎల్‌ఎస్ రహేజా స్కూల్ ఆఫ్ ఆర్ట్ (బాంద్రా స్కూల్)

-ముంబైలో ఉన్న సంస్థ అప్లయిడ్ ఆర్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ డిప్లొమా కోర్సులను అందిస్తున్నది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ- ముంబై

-ఇందులో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, ఫొటోగ్రఫీ-హాబీ, ఫొటోగ్రఫీ ఫ్రొఫెషనల్లీ, డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డిజిటల్ ఫొటో-ఎడిటింగ్ టెక్నిక్స్‌లో కోర్సును ఆఫర్ చేస్తున్నది.

అవకాశాలు

-ఫైన్‌ఆర్ట్స్ కోర్సులు చేసినవారికి దేశంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. అప్లయిడ్ ఆర్ట్స్, యానిమేషన్, శిల్పకళ, పెయింటింగ్ వంటి ఆర్ట్స్ పరిశ్రమల్లో కొత్తగా వేలాది ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి సినిమా, టెలివిజన్, అడ్వర్‌టైజింగ్, యానిమేషన్, పబ్లిషింగ్, టెక్స్‌టైల్ రంగాల్లో డిమాండ్ అధికంగా ఉంది. దీంతోపాటు బ్యాచిలర్ కోర్సులు చేసినవారు సొంతంగా స్టూడియోలు నెలకొల్పి ప్రాక్టీస్ చేసుకుంటూ, ఉన్నత విద్య అభ్యసించవచ్చు.
-ఈ కోర్సులు పూర్తిచేసినవారికి డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్‌టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ), ఐసీఎంఆర్, హోంమంత్రిత్వశాఖ, డిఫెన్స్, నేషనల్ మ్యూజియమ్స్, సాంస్కృతిక శాఖ, సెన్సస్, డీఆర్‌డీఎల్, ఇస్రో, సర్వే ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థల్లో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. వీటితోపాటు ప్రైవేటు అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు, ఫీల్మ్, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా, ఆర్ట్ స్టూడియోలు, యాడ్ ఏజెన్సీలు, ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థలు, నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి మీడియా హౌసుల్లో, డ్యాన్స్ స్టూడియోలు, ఇండస్ట్రియల్ హౌస్‌లు, సైంటిఫిక్ జర్నళ్లు, ఆర్కిటెక్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్, ఫోరెన్సిక్ సైన్స్, గేమింగ్ సంబంధిత విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వీరు ఆయా విభాగాల్లో ఆర్ట్ డైరెక్టర్లుగా, విజువలైజర్, గ్రాఫిక్ డిజైనర్, వెబ్‌డిజైనర్, వీడియోగేమ్ డిజైన్, యూఎక్స్/యూఐ డిజైనర్, లేఅవుట్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ డిజైనర్, క్యారెక్టర్ డిజైనర్, ఫ్లాష్ యానిమేటర్, త్రీడీ యానిమేటర్, ఆర్ట్ డైరెక్టర్, సెట్ డిజైనర్, ఆర్ట్ క్రిటిక్, ఆర్ట్ హిస్టోరియస్, ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ ఆర్టిస్ట్, డిజిటల్ ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, సెరామిక్స్ ఆర్టిస్ట్, పెయింటర్, క్రాఫ్ట్ మేకర్, క్రియేటివ్ డైరెక్టర్, ఫర్నీచర్ డిజైనర్, యానిమేటర్, ఆర్ట్ టీచర్లుగా, క్లే మోడలర్, ఆర్ట్ కన్జర్వేటర్, టెక్స్‌టైల్ డిజైనర్, ఎగ్జిబిషన్ డిజైనర్, ఇల్లస్ట్రేటర్‌గా వివిధ హోదాల్లో పనిచేయవచ్చు.
-బీఎఫ్‌ఏ కోర్సులు చేసినవారికి ఏఏపీసీ, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, రోబోసాఫ్ట్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, Lowe lintas వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

photographer-quotes

జేఎన్‌ఏఎఫ్‌ఏ అందిస్తున్న కోర్సులు...

-హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్చిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కళలకు సంబంధించి డిప్లొమా, బ్యాచిలర్, పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను అందిస్తున్నది. అవి..
-బ్యాచిలర్ కోర్సులు.. ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్, స్కల్‌ప్చర్, అప్లయిడ్ ఆర్ట్స్, ఫొటోగ్రఫీ, యానిమేషన్
-ఇవన్నీ నాలుగేండ్ల డిగ్రీ కోర్సులు. పెయింటింగ్, స్కల్‌ప్చర్, అప్లయిడ్ ఆర్ట్స్ కోర్సుల్లో మొదటి ఏడాది బేసిక్స్ ఆఫ్ ఆర్ట్‌లో కామన్ ఫౌండేషన్ కోర్సు, తర్వాతి ఆరు సెమిస్టర్లు ఆయా కోర్సుల్లో ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ఉంటుంది.
-ఫొటోగ్రఫీ కోర్సులో భాగంగా ఎనిమిది సెమిస్టర్లలో ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, ఫొటో జర్నలిజం, ఆడియో విజువల్ కమ్యూనికేషన్, డిజిటల్ ఫొటోగ్రఫీ, కంప్యూటర్ గ్రాఫిక్స్, మల్టీమీడియా, ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ అంశాల్లో శిక్షణ ఇస్తారు. యానిమేషన్ కోర్సులో భాగంగా యానిమేషన్ పరిశ్రమకు, సినిమాలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఫీచర్ ఫిలిమ్స్‌కు అవసరమైన అంశాలను నేర్పిస్తారు.
-ఒక్కో కోర్సులో ఒక్కోవిధంగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. యానిమేషన్ కోర్సులో 60 సీట్లు, ఫొటోగ్రఫీలో 45, అప్లయిడ్ ఆర్ట్‌లో 45, స్కల్‌ప్చర్‌లో 20, పెయింటింగ్‌లో 30 మందికి ప్రవేశాలు కల్పిస్తారు.
-జాతీయ స్థాయిలో జరిగే ఉమ్మడి ప్రవేశపరీక్ష ఫైన్‌ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఏడీఈఈ-2019) ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
-బీఎఫ్‌ఏ అప్లయిడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, యానిమేషన్ కోర్సుల కోసం ప్రవేశపరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ (మెమరీ డ్రాయింగ్, కలరింగ్) 100 మార్కులకు, రెండో పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ 50 మార్కులు, మూడో పేపర్ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ 100 మార్కులకు ఉంటుంది. ఫొటోగ్రఫీ కోర్సుకు రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ (కంపోసైజేషన్, విజువల్ కమ్యూనికేషన్) 100 మార్కులకు, రెండో పేపర్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి.
-ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ జూన్ 15, ప్రవేశపరీక్ష జూన్ 29, 30 తేదీల్లో ఉంటుంది.
- వెబ్‌సైట్ www.jnafauadmissions.com, www.jnafau.ac.in

stephen_walter

తెలుగు యూనివర్సిటీలో

-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని లలితకళా పీఠం వివిధ ఫైన్ ఆర్ట్స్ కోర్సులను అందిస్తున్నది. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ)లో భాగంగా శిల్పం, ప్రింట్ మేకింగ్, చిత్రలేఖనం కోర్సులు ఉన్నాయి.
-ఇవి నాలుగేండ్లు, ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ఇంటర్ పాసై ఉండాలి లేదా దేవాదాయ శిల్పకళలో నాలుగేండ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసి ఉండాలి. మొత్తం 26 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో 50 మార్కులు బహుళైచ్చిక ప్రశ్నలు, 50 మార్కులకు ప్రాయోగిక పరీక్ష ఉంటుంది.
-వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మే చివరి వారంలోగానీ, జూన్‌లోగానీ విడుదలవుతుంది.
-వెబ్‌సైట్: www.teluguuniversity.ac.in, www.pstucet.org

కోర్సులు

-బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ) బీఎఫ్‌ఏ అప్లయిడ్ ఆర్ట్స్, డిజిటల్ గ్రాఫిక్స్ టెక్నాలజీ, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, గ్రాఫిక్స్, హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్, ఇంటీరియర్ డిజైనింగ్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, ప్రింట్‌మేకింగ్

ప్రముఖ ఎంట్రెన్సులు

-బీహెచ్‌యూ బీఎఫ్‌ఏ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్
-ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్
-జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఎంట్రెన్స్ ఎగ్జామ్

-గణేష్ సుంకరి

465
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles