కరెంట్ అఫైర్స్


Wed,May 22, 2019 01:59 AM

National
AB

అభ్యాస్ పరీక్ష విజయవంతం

ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో అభ్యాస్-హైస్పీడ్ ఎక్స్‌పాండబుల్ ఏరియల్ టార్గెట్ (హీట్) అనే డ్రోన్‌ను మే 13న విజయవంతంగా పరీక్షించారు. భారత రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఈ పరీక్ష నిర్వహించింది. అభ్యాస్ ఆటోపైలట్ వ్యవస్థ సాయంతో పనిచేస్తుంది. దీనిలో చిన్న గ్యాస్ టర్బైన్ ఇంజిన్లతోపాటు దేశీయంగా అభివృద్ధి చేసిన ఎంఈఎంఎస్ నావిగేషన్ వ్యవస్థను డీఆర్‌డీవో సైంటిస్టులు ఉపయోగించారు.

భారత్‌ను సందర్శించిన ఇరాన్ మంత్రి

ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరిఘ్ మే 16న భారత్‌ను సందర్శించారు. మధ్యప్రాచ్యం, దక్షిణాసియా ప్రాంతాల్లో అనుమానాస్పద విద్రోహ చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు.

నేవీ క్షిపణి ప్రయోగం విజయవంతం

భూ ఉపరితలం నుంచి నింగిలో లక్ష్యాలను ఛేదింగచల మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్‌ఎస్‌ఏఎం) ప్రయోగం విజయవంతమైంది. తమిళనాడు రాజధాని చెన్నై, కేరళలోని కొచ్చిలో మే 17న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత నేవీ, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ ప్రయోగ పరీక్షను నిర్వహించాయి.

International
Sri-lanka

ఇస్లాం తీవ్రవాద సంస్థలపై నిషేధం

శ్రీలంకలో ఇస్లాం ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు మూడు ఇస్లాం తీవ్రవాద సంస్థలను నిషేధిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మే 14న ఆదేశాలు జారీచేశారు. ఏప్రిల్ 21న వరుస ఆత్మాహుతి దాడులతో 250 మంది మృతికి కారణమైన నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్‌టీజే)తో పాటు జమాతె మిలాతే ఇబ్రహీం (జేఎంఐ), విలాయత్ ఆస్ సైలానీ (డబ్ల్యూఏఎస్) అనే మూడు సంస్థలపై నిషేధం విధించింది.

గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ

దేశం వదిలి వెళ్తున్న మిలియనీర్ల జాబితా గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ (జీడబ్ల్యూఎంఆర్)-2019 నివేదికను ఆఫ్రాసియా బ్యాంక్, పరిశోధక సంస్థ న్యూ వరల్డ్ వెల్త్‌లు మే 15న విడుదల చేశాయి. ఈ జాబితాలో చైనా, రష్యా, భారతదేశం తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాదికాలంలో భారత్ నుంచి 5000 మంది మిలియనీర్లు దేశం వదిలి వెళ్లారు.

అలబామాలో అబార్షన్ నిషేధం

అమెరికాలోని అలబామా రాష్ట్ర చట్టసభ అబార్షన్ల నిషేధానికి సంబంధించిన బిల్లును మే 15న ఆమోదించింది. ఈ బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టగా 25 మంది సభ్యులు ఆమోదం తెలిపారు. దోషిగా తేలినవారికి 10 నుంచి 99 ఏండ్ల జైలుశిక్ష విధించేలా దీన్ని రూపొందించారు.

నూతన వలస విధానం ఆవిష్కరణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 16న నూతన వలస విధానాన్ని ఆవిష్కరించారు. అమెరికాకు వలస రావాలనుకునేవారు ఇకపై ఇంగ్లిష్ నేర్చుకోవడంతోపాటు అమెరికా చరిత్ర, సమాజం గురించిన ప్రాథమిక వాస్తవాలను తెలుసుకోవాలని, అడ్మిషన్‌కు ముందు దరఖాస్తుదారులు సివిక్స్ (పౌరశాస్త్ర) పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.

తైవాన్‌లో గే వివాహాలకు చట్టబద్ధం

స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను చట్టబద్ధం చేస్తూ రూపొందించిన బిల్లును తైవాన్ పార్లమెంట్ మే 17న ఆమోదించింది. దీంతో గే వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా తైవాన్ నిలిచింది. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం మే 24 నుంచి అమల్లోకి రానుంది.

persons
Kami-rita

ఫిజి సుప్రీంకోర్టు జస్టిస్‌గా మదన్

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్ ఫిజి దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు అధ్యక్షుడు మే 14న నిర్ణయం తీసుకున్నారు. నాన్ రెసిడెంట్ ప్యానెల్‌లో భాగంగా ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు ఉంటారు. గతేడాది తాను పదవీవిరమణ పొందే సమయానికే అప్పటి ఫిజి సీజే జస్టిస్ ఆంటోనీ గేట్స్ నుంచి తనకు ఈ మేరకు ఆహ్వానం అందిందని జస్టిస్ మదన్ తెలిపారు. ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇక్బాల్‌సింగ్‌కు అవార్డు

సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఇక్బాల్‌సింగ్‌కు పారామిలిటరీ దళాల అత్యున్నత అవార్డు డైరెక్టర్ జనరల్ కమెండేషన్ డిస్క్‌ను సీఆర్‌పీఎఫ్ మే 14న ప్రకటించింది. శ్రీనగర్‌లో పక్షవాతంతో చేతులు సరిగ్గా పనిచేయని, ఆకలితో అలమటిస్తున్న ఓ బాలుడికి తాను తెచ్చుకున్న భోజనాన్ని తినిపించడం సోషల్ మీడిలో సంచలనం సృష్టించడంతో ఈ అవార్డు దక్కింది.

23వ సారి ఎవరెస్ట్ ఎక్కిన కామి రీటా

నేపాలీ షెర్పా పర్వతారోహకుడు కామి రీటా మే 15న 23వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఎవరెస్ట్ సమీపంలోని థామే గ్రామానికి చెందిన రీటా ఎవరెస్టును ఈశాన్య రిట్జ్ మార్గంలో అధిరోహించాడు. ఆయన మొదటిసారిగా 1994లో తొలిసారిగా ఎవరెస్ట్‌ను అధిరోహించాడు. రీటా ఏటా మిత్రులైన షెర్పా గైడ్‌లతో కలిసి ఎవరెస్టును అధిరోహిస్తున్నాడు.

చైనా వాస్తుశిల్పి ఐఎం మృతి

చైనాకు చెందిన ప్రముఖ వాస్తుశిల్పి, 102 ఏండ్లు ఉన్న ఐఎం పై అమెరికాలోని న్యూయార్క్‌లో మే 16న మరణించారు. 1917లో చైనాలోని గ్వాంగ్జౌలో జన్మించిన ఆయన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్కిటెక్ట్ రంగంలో విద్యనభ్యసించారు. తక్కువ ఖర్చుతో భారీ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియం, హోటళ్ల నిర్మాణంలో సిద్ధహస్తులుగా పేరొందారు. బోస్టన్‌లోని అమెరికా మాజీ అధ్యక్షుడు జన్ ఎఫ్ కెన్నడీ మెమోరియల్ లైబ్రరీ రూపకల్పనతో ఆయన ప్రపంచ ఖ్యాతి గడించారు. పారిస్‌లోని లౌవ్రే పిరమిడ్, హాంకాంగ్‌లోని 72 అంతస్తుల బ్యాంక్ ఆఫ్ చైనా, దోహాలోని మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ ఆయన అద్భుత కళా నైపుణ్యానికి ప్రతీకలుగా నిలిచాయి.

ఆస్ట్రేలియా మాజీ ప్రధాని బాబ్ మృతి

ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, సెంట్రల్ లెఫ్ట్ లేబర్ పార్టీ నేత బాబ్ హాక్ సిడ్నీలో మే 16న మరణించారు. వామపక్ష భావజాలం ఉన్న బాబ్ 18 ఏండ్ల వయస్సులో లేబర్ పార్టీలో చేరారు. 1969లో ఆస్ట్రేలియన్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియా ప్రధానిగా 1983, మార్చి 11 నుంచి 1991, డిసెంబర్ 20 వరకు సేవలందించారు. \

Telangana
Phanigiri

వాయిస్ ఆఫ్ తెలంగాణ అవార్డులు

వాయిస్ ఆఫ్ తెలంగాణ సంస్థ అందించే అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ అవార్డులకు ఎంపికైన ఏడుగురికి మే 13న అవార్డులను అందజేశారు. వీరిలో ప్రముఖ శిల్పి ఎక్కా యాదగిరి, విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్ ఎడిటర్ పొత్తూరి వెంకటేశ్వరరావు, విప్లవ సినిమాల నిర్మాత, నటుడు ఆర్ నారాయణమూర్తి, మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ దవాఖాన ఆర్థోపెడిక్ డాక్టర్ రాంకిషన్, నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉత్తమ రైతుగా గుర్తింపు పొందిన కోసిరెడ్డి లావణ్య ఉన్నారు.

హైకోర్టు సీజేగా చౌహాన్

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ నియమకానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మే 13న చేసింది. రాజస్థాన్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ చౌహాన్ ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది.రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గండికోట శ్రీదేవి మే 15న పదవీ బాధ్యతలు చేపట్టారు.

అంతర్జాతీయ ప్రదర్శనకు ఫణిగిరి శిల్పం

అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించనున్న ది మెట్రోపాలిటన్ మ్యూజియమ్స్ ఆఫ్ ఆర్ట్ (ది మెట్) 150వ వార్షికోత్సవంలో ఫణిగిరి శిల్పాన్ని ప్రదర్శించనున్నట్లు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం మే 17న తెలిపింది. 2020లో నిర్వహించనున్న ఈ వేడుకలో ట్రీ అండ్ సర్పెంట్ పేరుతో బుద్ధుడి ఇతివృత్తంగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వివిధ మ్యూజియాల్లో ఉన్న బుద్ధుడికి సంబంధించిన అరుదైన కళాఖండాలను ప్రదర్శించనున్నారు. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించిన ఈ శిల్పాన్ని ఇక్ష్వాకుల కాలంలో రూపొందించారు. నాలుగు అడుగుల ఎత్తున్న ఈ సున్నపురాయి శిల్పాన్ని ఫణిగిరి బౌద్ధ స్థూపం పరిసరాల్లో 2001లో కనుగొన్నారు.

Sports
Lakshmi

ఐసీసీ రిఫరీగా లక్ష్మి

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మ్యాచ్ రిఫరీ ప్యానెల్‌లో మే 14న చోటు లభించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గండికోట సర్వలక్ష్మి (జీఎస్ లక్ష్మి) తొలి మహిళ రిఫరీగా రికార్డులకెక్కింది. ఆమె ఇప్పటివరకు కేవలం మహిళల క్రికెట్ మ్యాచ్‌లకే రిఫరీగా పనిచేసింది. 2008-09లో దేశీయ మహిళా క్రికెట్‌లో రిఫరీగా వ్యవహరించింది.

స్విమ్మర్ ఎంబీ బాలకృష్ణన్ మృతి

దక్షిణాసియా క్రీడల్లో పతకం సాధించిన స్విమ్మర్ ఎంబీ బాలకృష్ణన్ మే 15న మరణించారు. ద్విచక్రవాహనంపై తన ఇంటికి వెళ్తున్న అతడు అదుపుతప్పి లారీ టైర్ల కిందపడి దుర్మరణం చెందాడు. 2007లో గువాహటిలో జరిగిన జాతీయ స్విమ్మింగ్‌లో స్వర్ణం సాధించాడు. 2010 సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ ఢిల్లీలో 50 మీ. బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో జాతీయ రికార్డును నెలకొల్పాడు. అదే ఏడాది దక్షిణాసియా క్రీడల్లో 100 మీ., 200 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లలో పసిడి పతకాలను సాధించాడు.

ఆండీ ముర్రేకు సర్ బిరుదు

మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు, రెండు ఒలింపిక్ స్వర్ణాల విజేత అయిన టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు బ్రిటన్ ప్రభుత్వం ప్రదానం చేసింది. మే 16న జరిగిన కార్యక్రమంలో ముర్రేకు ప్రిన్స్ చార్లెస్ పురస్కారాన్ని అందజేశారు.

వరల్డ్‌కప్ అధికారిక గీతం విడుదల

వన్డే ప్రపంచకప్ అధికారిక గీతాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి మే 17న విడుదల చేసింది. స్టాండ్ బై పేరుతో సాగే ఈ గీతాన్ని ఇంగ్లండ్‌లో ప్రఖ్యాతిగాంచిన మ్యూజిక్ బ్యాండ్ రుడిమెంటల్ సహకారంతో నూతన గాయకుడు లోరిన్ ఆలపించారు. మే 30 నుంచి ప్రపంచకప్ జరిగే ప్రతి మైదానంలో ఈ పాట సందడి చేయనుంది. ఈ కప్ విజేత జట్టుకు 40 లక్షల డాలర్లు (రూ.28 కోట్లు), రన్నరప్ జట్టుకు 20 లక్షల డాలర్లు (రూ.14 కోట్లు) లభిస్తాయి.
Vemula-Saidulu

1516
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles