జేఈఈ అడ్వాన్స్‌డ్


Wed,May 22, 2019 02:11 AM

దేశంలో అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ ఒకటి. ఈ పరీక్షలో మంచి స్కోర్ సాధించినవారికి దేశంలోని ఇంజినీరింగ్ విద్యకు ప్రామాణికమైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కసారి ఐఐటీలో ప్రవేశించడమంటే వారి జీవిత గమనంలో ప్రత్యేక మార్పు వచ్చినట్లే. మే 27న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఆ పరీక్ష కోసం చివరి ఐదురోజులు ఎలా ఉండాలి? పరీక్ష రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరీక్షలో అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి అనే విషయాలపై ఐఐటీ బోధనలో సుమారు రెండు దశాబ్దాల అనుభవం ఉన్న నానో ఐఐటీ అకాడమీ డైరెక్టర్ కాసుల కృష్ణచైతన్య సూచనలు, సలహాలు.
JEE
జేఈఈ అడ్వాన్స్‌డ్: దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి ముందు జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించి దానిలో టాప్ 2.24 లక్షల మందిని అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌కు ఎంపికచేశారు. వీరిలో ప్రతిభ కనపర్చిన వారిని సీట్ల సంఖ్యకు అనుగుణంగా ఆయా కోర్సులకు ఎంపిక చేస్తారు.

పరీక్ష ఎలా ఉంటుంది?

-జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌ను ఏటా ఒక ఐఐటీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఐఐటీ రూర్కీ దీని బాధ్యతలు చేపట్టింది. ప్రశ్నప్రతం ప్రతి ఏటా ఒక రకంగా ఉంటుంది. కచ్చితంగా ఇదేవిధానంలో ఇస్తారని చెప్పలేం. జేఈఈ మెయిన్ ఏటా 360 మార్కులకు నిర్వహిస్తారు. కానీ ఈ పరీక్ష ఒక్కోసారి ఒక్కో విధానంలో నిర్వహిస్తుంటారు.

చివరి రోజుల్లో ఏం చేయాలి?

-పరీక్షకు ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలింది. ఈ సమయంలో కొత్త అంశాల జోలికి ఎట్టిపరిస్థితుల్లో వెళ్లవద్దు. రోజువిడిచి రోజు పరీక్ష సమయానికి అనుగుణంగా శరీరాన్ని మల్చుకోవాలి. పరీక్ష ఉదయం 9 నుంచి 12 వరకు తర్వాత 2 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. అంటే సుమారు 8 గంటలపాటు శరీరాన్ని పూర్తి ఏకాగ్రతతో శక్తిని కోల్పోకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం.
-పరీక్షగదిలో సుమారు 6 గంటలపాటు కూర్చోవడానికి అలవాటు పడటం కోసం ఈ కొద్దిరోజులు తప్పనిసరి సాధన అవసరం.

సబ్జెక్టు ఏం చదవాలి?

-కొత్త అంశాల జోలికి పోవద్దు. ఇప్పటివరకు చేసిన మాక్‌టెస్ట్‌లు, ప్రీవియస్ పేపర్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.
-వేగంగా ప్రాథమిక అంశాలను, సూత్రాలను రివిజన్ చేసుకోవాలి. రెండేండ్లు చదివిన అంశాలకు సంబంధించిన వాటిని గరిష్ఠంగా 18 గంటల్లో రివిజన్ చేసుకోవాలి. అంటే సబ్జెక్టుకు ఆరు గంటల చొప్పున కేటాయించి రివిజన్ చేసుకోవాలి.
-కొత్త ప్రాక్టీస్ పేపర్లను చేయడం కంటే ఇప్పటివరకు చేసిన పేపర్లనే ప్రాక్టీస్ చేయడం మంచిది.

అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఏం ఆశిస్తారు?

-జేఈఈ అడ్వాన్స్‌డ్ అనేది నిజానికి అన్ని పరీక్షల్లా కాదు. లోతైన పరీక్ష అనడం సరైనది. విద్యార్థి సమస్యలను ఏ విధంగా సాధించగలడో పరీక్షించడం దీని ఉద్దేశం.
-నేరుగా ఇతర పరీక్షల్లోలాగా ప్రశ్నలు ఇవ్వరు. కొన్ని కాన్సెప్ట్స్‌ను మిళితం చేసి అభ్యర్థుల గ్రాహకశక్తిని, మేధోశక్తిని, ఆయా అంశాలను సరైన సమయంలో సరైన రీతిలో అప్లయ్ చేయగలడా లేదా అనే అంశాలను పరీక్షిస్తారు.

పరీక్ష రోజు ఎలా ఉండాలి?

-పరీక్ష రోజు విద్యార్థుల మేధో సహనం (Intellectual stamina), ఓర్పు (Endurance) కీలకం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థి ఎట్టి పరిస్థితుల్లో నిగ్రహాన్ని కోల్పోకుండా పాజిటివ్ ఆటిట్యూడ్‌తో ఉండాలి.
-పరీక్ష రోజు శక్తిని కూడగట్టుకోవాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్ననికి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.
-శారీరక శక్తిని పెంచుకోవడం కోసం కొబ్బరిబోండాలు, గ్లూకోజ్, నిమ్మరసం తాగండి. డీహైడ్రేట్ కాకుండా ఉండాలి. శక్తిని ఇచ్చే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.
-ప్రశ్నపత్రం ఎంత కఠినంగా ఉన్నా భయపడవద్దు. ప్రతి పేపర్‌లో 30-40 శాతం ప్రశ్నలు సులభంగా సాల్వ్ చేసేవి ఉంటాయి. ముందుగా వాటిని సాల్వ్ చేయాలి. తర్వాత కొంచెం సాధిస్తే వచ్చేవాటిపై దృష్టి పెట్టాలి. పేపర్-1 కష్టంగా ఉందని నిరుత్సాహ పడవద్దు. పేపర్-1 సులభంగా ఉన్నా, కష్టంగా ఉన్నా పరీక్ష రాసిన మరుసటి క్షణమే దాన్ని మర్చిపోవాలి. 12 నుంచి 2 గంటల వరకు ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. ఏ అంశాలను డిస్కస్ చేయకపోవడం మంచిది. పేపర్-2 కోసం

చదవడం, చర్చించడం చేయవద్దు.


-పేపర్-1కు పేపర్-2కు పొంతన ఉండదు. ఇది కష్టంగా వస్తే అదీ కష్టంగా రావచ్చనేది తప్పు.
-ప్రశ్నపత్రంలో ఇచ్చే సూచనలు తప్పక చదవాలి. వాటి ప్రకారమే సాల్వ్ చేయాలి.
-అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ కోసం ప్రతిసారి ఒక వినూత్నమైన విధానంలో ప్రశ్నపత్రాన్ని తయారుచేస్తారు. అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాయాలి.
Krishna-Chaitanya
-కాసుల కృష్ణచైతన్య

962
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles