పైనల్ టిప్స్


Mon,May 27, 2019 01:55 AM

దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేసేందుకు ఏటా క్రమం తప్పకుండా నిర్వహించే పరీక్ష సివిల్ సర్వీసెస్. లక్షలమంది పోటీ పడే ఈ పరీక్షలో తుదివరకు విజేతగా నిలవడం అంత తేలికైన పనికాదు. కఠోర శ్రమతోపాటు మానసికంగా, శారీరకంగా చురుకుదనం, ఎంతో ఓపిక కావాలి. 2019 సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 2న జరుగనున్నది. ఈ నేపథ్యంలో తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల అభ్యర్థులకు సౌకర్యంగా ఉండేలా ఇద్దరు ప్రముఖ సివిల్స్ ఫ్యాకల్టీలు రెండు భాషల్లో ఫైనల్
ప్రిపరేషన్ టిప్స్ అందిస్తున్నారు.

civils

సివిల్స్ ప్రిలిమ్స్

-సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జూన్ 2న జరగనుంది. వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఇది చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో ఏం చదవాలి, ఏం చదవకూడదు, పరీక్షకు వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
-ఈ సంవత్సరం 896 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. గతేడాది కంటే 114 పోస్టులు అధికంగా ఉన్నాయి. ఇది అభ్యర్థులకు శుభపరిణామమే. అలాగని కటాఫ్ తగ్గుతుందని కానీ, పెరుగుతుందని కానీ చెప్పలేం. ప్రశ్నల కాఠిన్యత స్థాయి, హాజరయ్యే అభ్యర్థులు, వారి ప్రిపరేషన్ స్థాయి వంటి అంశాలు మాత్రమే కటాఫ్ మార్కుల్ని నిర్ణయిస్తాయనే అంశాన్ని గుర్తించాలి. అందుకే కటాఫ్ గురించి అతిగా ఆలోచించకుండా ఈ వారం రోజుల వ్యవధిని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు.
-మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు కాబట్టి ప్రిలిమ్స్ సులభంగా గట్టెక్కవచ్చు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. సివిల్స్‌లో అత్యంత ముఖ్యమైంది ప్రిలిమ్స్ పరీక్షే. చాలామందిని ఈ స్థాయిలోనే వడపోస్తారు. కాబట్టి సరైన సన్నద్ధత కచ్చితంగా అవసరం. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి కాబట్టి సబ్జెక్టుపై పూర్తి పట్టున్నవారు మాత్రమే విజేతలుగా నిలుస్తారనే విషయాన్ని మరవకూడదు.
-చాలామంది అభ్యర్థులు చివరి సంవత్సరం కటాఫ్‌తో పోల్చుకుని పరీక్షలో తప్పులు చేస్తుంటారు. తాము కటాఫ్ స్థాయిని అందుకుని మెయిన్స్‌కి అర్హత సాధిస్తామో లేదోననే కంగారులో వీలైనన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేస్తారు. బబుల్స్ చేయడమే కదా అని చివరి నిమిషంలో తమకు తోచిన సమాధానాన్ని బబుల్ చేసి వస్తుంటారు. ఇలా చేయడం వల్ల విజయావకాశాలు దూరం చేసుకుంటారు. అసలే తెలియని ప్రశ్నల్ని పూర్తిగా వదిలేయడం మేలు. చీకట్లో రాయి విసిరితే ఒక్కో ప్రశ్నకు 1/3 మార్కు కోల్పోవాల్సి ఉంటుంది.
-ప్రిలిమ్స్‌లో రెండో పేపర్ సీశాట్‌ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. మొదటి పేపర్‌లో ఎంత మంచి మార్కులు సాధించినా రెండో పేపర్‌లో క్వాలిఫై కాకుంటే మెయిన్స్‌కి అర్హత సాధించలేరు. కాబట్టి ప్రస్తుతం ఉన్న వారం రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ వారం రోజులు రోజూ కనీసం ఒక్క మోడల్ పేపర్ అయినా ప్రాక్టీస్ చేస్తే... సీశాట్ పేపర్‌లో సులభంగా క్వాలిఫై కావచ్చు.
-పరీక్ష సమయం దగ్గరపడింది కాబట్టి చాలామందిలో ఆందోళన మొదలవుతుంది. ఇంకా చదవాల్సిన అంశాలు మిగిలిపోవడమో, చదివినవి ఎంతవరకు గుర్తుంటాయోననే సందేహమో వారిని వెంటాడుతూ ఉంటుంది. ఈ సమయంలో చదవడంతో పాటు మానసిక సన్నద్ధత కూడా చాలా ముఖ్యం.
-ఈ సమయంలో కొత్త పుస్తకాలు తీసుకుని కుస్తీ పట్టడం మానేయాలి. ఇంతవరకూ చదివిన పుస్తకాలు, రాసుకున్న షార్ట్ నోట్స్‌ని రివిజన్ చేస్తే సరిపోతుంది. అనవసరంగా కొత్తవాటి జోలికి వెళ్తే కంగారులో చదివిన అంశాల్ని కూడా మరచిపోయే ప్రమాదం ఉంది.
-ప్రిలిమ్స్ మొదటి పేపర్‌కు సంబంధించి రోజుకు కనీసం ఒకటి, రెండు ప్రీవియస్ పేపర్లు లేదా మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తే మేలు.
-కరెంట్ అఫైర్స్ విషయంలోనూ అత్యుత్సాహం పనికిరాదు. కనీసం సంవత్సరం క్రితం నుంచి వార్తల్లో ఉన్న విషయాల్ని చూసుకోవాలి.
-పరీక్ష రాసేటపుడు టైమ్ మేనేజ్‌మెంట్ చాలా అవసరం. ప్రశ్నలు లెంగ్తీగా ఇచ్చినా కంగారుపడకుండా ఏకాగ్రతతో పరీక్షను పూర్తి చేయాలి. వందకు వంద ప్రశ్నలకు సమాధానం గుర్తించాల్సిన అవసరం లేదనే విషయాన్ని మరచిపోకూడదు. సులభంగా సమాధానం గుర్తించిగలిగిన ప్రశ్నల్ని మాత్రం వదలకుండా జాగ్రత్తపడాలి.
-ప్రిలిమ్స్ రెండో పేపర్ సీశాట్‌లో మ్యాథ్స్‌పై పెద్దగా పట్టులేని అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కఠినంగా ఉన్న ప్రశ్నలకు సమధానాలు వెతుకుతూ సమయం వృథా చేసుకోవద్దు. కఠినమైన ప్రశ్నల్ని వదిలేస్తూ మొదట సులభంగా సమాధానాలు గుర్తించేవాటిని పూర్తి చేయాలి. సమయం మిగిలితే కఠినమైన ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నించాలి.
-బబ్లింగ్ విషయంలోనూ కొందరు అభ్యర్థులు పొరబడుతుంటారు. ప్రాథమిక సమాచారం అయినా, సమాధానాలు అయినా ఒకసారి బబుల్ చేస్తే మళ్లీ మార్చే వీలుండదు కాబట్టి జాగ్రత్తగా బబుల్ చేయాలి. సమాధానం తెలియని ప్రశ్నలు వదిలేసి ఇతర ప్రశ్నలకు వెళ్తుంటారు కాబట్టి... కంగారుపడితే ఖాళీగా ఉన్న బబుల్స్ నింపేసి అనవసరంగా నెగెటివ్ మార్కులు తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ ప్రశ్నకు సమాధానం గుర్తిస్తున్నామో సరిగా చూసుకోవాలి.
-ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నలు చూడగానే నేరుగా సమాధానం గుర్తించే విధంగా ఉండవు. విశ్లేషించి అర్థం చేసుకుంటేగానీ సరైన సమాధానాలు గుర్తించలేరు. కాబట్టి పరీక్షకు వెళ్లే ముందురోజు సరైన విశ్రాంతి అవసరం. రాత్రివేళ త్వరగా పడుకుని ప్రశాంతమైన ఆలోచనలతో పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్ వంటివి అలవాటు ఉన్నవారు వాటిని ప్రాక్టీస్ చేస్తే మేలు.
-సమయం దగ్గరపడుతున్న కొద్దీ టెన్షన్ తో ఆహారాన్ని అశ్రద్ధ చేసేవారు ఉంటారు. సమయానికి సరైన ఆహారం తీసుకోకుంటే నీరసించడమో, లేదంటో ఏదో ఒకటి అందుబాటులో ఉంది కదా అని ఏదిపడితే అది తినేయడం వల్ల అనారోగ్యం పాలవడమో జరుగుతుంది. కాబట్టి ఆహారం విషయంలోనూ జాగ్రత్త వహించండి.

-పరీక్ష కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నపత్రం వచ్చేవరకు నెగెటివ్ ఆలోచనలు మీ దరి చేరనివ్వకండి. నేను సాధించగలననే విశ్వాసంతో పరీక్షను ప్రారంభించండి. మొదట్లోనే కఠినమైన ప్రశ్నలు ఎదురైనా కంగారుపడకుండా సులభంగా సమాధానం గుర్తించగలిగిన వాటిని రాస్తూ ముందుకు వెళ్లండి. ఆ తర్వాత కఠినమైన ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేయండి. కొన్ని కఠినమైన ప్రశ్నల్ని రెండోసారి చదివినప్పుడు మరింత స్పష్టంగా అర్థమై సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది.
-ప్రిలిమ్స్ మొదటి పేపర్ పరీక్ష ఉదయం జరిగితే రెండోపేపర్ మధ్యాహ్నం జరుగుతుంది. మొదటి పేపర్ పూర్తవగానే సమధానాల గురించి ఇతరులతో చర్చలు పెట్టి ఆందోళనకు గురికావొద్దు. భోజనం చేసి, వీలైతే విశ్రాంతి తీసుకుని రెండో పేపర్‌కి సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
-పరీక్ష పూర్తవగానే రకరకాల కీలు మార్కెట్‌లోకి వస్తుంటాయి వాటిని చూసి కంగారు పడకూడదు. వాటిలో తప్పులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న స్టాండర్డ్ పుస్తకాలు, మెటీరియల్‌ని తీసుకుని సమాధానాలు వెతుక్కుంటే మంచిది.
-ప్రిలిమ్స్‌లో మంచిమార్కులు వచ్చే అవకాశం ఉన్నవారు సమయం వృథా చేయకుండా వెంటనే మెయిన్స్‌కి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి.
balalatha

522
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles