వినూత్న సాగు విధానం


Wed,June 12, 2019 12:10 AM

agriculture
- కొత్త సర్కార్ దేశాభివృద్ధికి తన అజెండా ప్రకటించింది. అందులో వ్యవసాయానికి పెద్దపీట వేసింది. నేడు దేశ వ్యవసాయరంగం అన్ని వైపుల నుంచి పెనుసవాళ్లు ఎదుర్కొంటుంది.
- పెట్టుబడులు, సేద్య విస్తీర్ణం పెరగడం లేదు. సాగు భూమిని విస్తరించడానికి పెద్దగా అవకాశం లేదు. దేశమంతటా భూసారం క్షీణిస్తున్నది. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నా.. అందుకు తగినట్లుగా రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మరోవైపు అతివృష్టి, అనావృష్టికితోడు మార్కెట్ మాయజాలం వల్ల రైతులు నష్టపోతూనే ఉన్నారు.
- పై సమస్యలను అధిగమించడానికి విధాన సంస్కరణలు, వ్యవస్థాగత మార్పులు, చేర్పులు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరిట రైతులకు నేరుగా నగదు బదిలి చేసే పథకాన్ని చేపట్టింది. దీనికింద చిన్న, సన్నకారు, మధ్యతరహా రైతులకు దఫాకు రూ.2 వేలు చొప్పున, ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నారు. రెండు హెక్టార్లు, అంతకులోపు భూమి ఉన్న కుటుంబాలు PM కిసాన్ పథకం కింద నగదు బదిలీకి అర్హులు. దీని వల్ల 12.5 కోట్ల రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయి.దేశంలో మొత్తం రూ.14 కోట్ల భూకమతాలు ఉండగా వాటిలో 86 శాతం (12 కోట్లు) రెండు హెక్టార్ల లోపువే ఉన్నాయి.

కనీస మద్దతు ధర

- అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని 2014-19 మధ్య ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇప్పటికి అమలు చేయలేదు. కనీస మద్దతు ధర చెల్లించడానికి సమగ్ర యంత్రాంగం లేకపోవడం వల్ల 2015-17 మధ్య కాలంలో రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకన్నా 30-50శాతం తక్కువ ధరకు అమ్ముకోవలసి వచ్చింది.

సాముదాయిక సేద్యం

- దేశంలోని చిన్న కమతాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించాలంటే సముదాయాల ప్రాతిపదికన వ్యవసాయం చేయడం ఉత్తమ మార్గం. ఒక ప్రాంతంలోని చిన్న కమతాలను పెద్ద సముదాయంగా సంఘటితపరిచి రైతులంతా సమిష్టిగా కొన్నిరకాల ఆహారధాన్యాలు, కూరగాయాలు, పండ్లు, ఇతర ఉద్యానపంటలను సాగు చేయడమే సాముదాయ వ్యవసాయం.
- మార్కెట్లలో మంచిధరకు పంటలు అమ్ముకోవడానికి ఎరువులు, విత్తనాలు విక్రేతల నుంచి సరసమైన ధరలకు ఉత్పత్తి సాధనాలు కొనడానికి, ఆహారశుద్ధి వంటి విలువ జోడింపు ప్రక్రియలో భాగస్వాములు కావడానికి ఈ సముదాయాలు రైతులకు వేదికగా ఉపయోగపడతాయి.

పంటల బీమా

- పంట నష్టాన్ని అంచనా వేయడంలో తేడాలు, ఆలస్యంగా అదీ అరకొరగా బీమా చెల్లింపు రైతులందరికి బీమా లభించకపోవడం వంటి సమస్యలు పంటల బీమా పథకాన్ని పీడిస్తున్నాయి.
- కౌలు రైతులకు పంటల బీమా వర్తించకపోవడం అన్నిటికన్నా పెద్దలోపం. వ్యవసాయ రుణాలు ప్రధానంగా వ్యవసాయ కంపెనీలకు దక్కుతున్నాయి. చిన్న రైతులు, వారి సంఘాలకు పంట రుణాలు, బీమా లభించేలా చర్యలు తీసుకోవాలి.

సేంద్రియ సేద్యం

- పెరుగుతున్న జనాభాకు తగ్గ ఆహరోత్పత్తిని సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెట్టింపు ఉత్పత్తి జరగాలి. క్రమేపి క్షీణిస్తున్న భూసారంతో నేల మున్ముందు పంటలకు పనికిరాకుండా పోతాయన్న భయాలు ఉన్నాయి. రసాయనాలకు స్వస్తి చెప్పి సేంద్రీయ వ్యవసాయ విధానాలను అనుసరించడమే దీనికి పరిష్కారం.
- ప్రపంచంలోని మొత్తం సేంద్రీయ ఉత్పత్తిదారుల్లో 30శాతం భారత్‌లోనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 57.8 మిలియన్ హెక్టార్లలో సేంద్రీయ వ్యవసాయం సాగుతుండగా భారత్‌లో అది 15లక్షల హెక్టార్లుగా ఉంది.
- దేశంలో 100శాతం సేంద్రీయ సేద్యం చేస్తున్న తొలి రాష్ట్రంగా సిక్కిం నిలిచిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ తెలిపింది.
- హరిత విప్లవానికి ముందు రైతులు సేంద్రీయ వ్యవసాయం చేశారు. అధిక దిగుబడులు వస్తాయని, ఆకర్షణీయమైన రంగు వస్తుందని, త్వరితంగా పక్వానికి వస్తుందని, చీడపీడల్ని నివారించవచ్చని ఇష్టానుసారంగా రసాయన ఎరువులు, పురుగుమందుల్ని వాడేస్తున్నారు. అదే సమయంలో సేంద్రీయ సేద్యాన్ని పూర్తిగా విస్మరించారు. ఫలితంగా నేల, నీరు, గాలి కలుషితమై నేలలోని సేంద్రీయ పధార్ధం హరించుకుపోతుంది.
- మన నేలల్లో సేంద్రీయ కర్బన కాలం 0.5 శాతానికి పడిపోయిందని ఇక్రిశాట్ పరిశోధనల్లో తేలింది. నేలలో 1.5 నుంచి 2శాతం వరకు సేంద్రీయ కర్బనం ఉంటేనే భూమిలో సూక్ష్మజీవులు వృద్ది చెందుతాయి. ఎకరం భూమిలో ఉండే కర్బనాన్ని ఒక శాతం పెంచగలిగితే అదే నేలలో 20వేల గ్యాలన్ల నీటిని ఇంకించే శక్తిని సంతరించుకుంటుందని అమెరికా వ్యవసాయ శాఖ అధ్యయనం పేర్కొంది.
- ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రసాయన అవశేషాలుండే అహారోత్పత్తుల్ని పలు దేశాలు అనుమతించడం లేదు. రసాయన అవశేషాల కారణంగా ఐరోపా సమాఖ్య, అమెరికా తదితర దేశాలకు వెళ్లే మన ఉత్పత్తులు తిరస్కరించబడుతున్నాయి.
- సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తే కొంత ఉత్పాదకత తగ్గే అవకాశముందని భారత వ్యవసాయ పరిశోధనామండలి (ICAR) వ్యక్తపరిచింది. ఈ తగ్గుదల 30శాతంగా ఉంటుందని రైతులు భయపడుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం రైతులకు అండగా ఉండి సేంద్రియ ఉత్పత్తులకు మంచి ధరలను అందించగలిగితే ప్రోత్సాహకరంగా ఉంటుంది.

- సేంద్రియ ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించడం వల్ల నేలలో జీవపదార్థం పెరుగుతుంది. మొక్కలు పెరగడానికి అవసరమైన పోషకాలన్ని నేలలోనే ఉన్నాయి కాబట్టి నేలలో అందుబాటులో లేని పోషకాలను పైరుకు లభ్యమయ్యేలా చేయవచ్చు. అటు దిగుబడులు, ఇటు మానవారోగ్యం పెంపొందించుకోవచ్చు.
- సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వారికి మార్కెటింగ్ పెద్ద సమస్యగా మారింది. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కొందరు రైతులు చొరవ చూపి తమ ఉత్పత్తులను మంచి ధర సాధించేందుకు గో ఆధారిత వ్యవసాయదారుల సహాకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘం వారు సేంద్రియ వ్యవసాయ రైతులకు మార్కెటింగ్‌లో సహాయపడుతున్నారు. మరికొందరు రైతులు ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తూ లాభపడుతున్నారు. ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక ధరలను ప్రకటించడంతో పాటు వినియోగదారులు లాభపడేలా ధరలపై నియంత్రణ ఉండాలి.
- సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలో చర్యలు వేగవంతమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2016 ఖరీఫ్ నుంచి దీన్ని ప్రోత్సహిస్తున్నారు. 2021 నాటికి 5లక్షల మంది రైతులు దాదాపు 5లక్షల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేయాలన్న లక్ష్యంతో వ్యవసాయశాఖ కృషి చేస్తోంది. ఈ మేరకు ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
- 2017-18లో భారత్ నుంచి 4.58లక్షల టన్నుల సేంద్రియ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. వీటి విలువ 51.5 కోట్ల డాలర్లు. 2016-17లో ఇది 3.7 కోట్ల డాలర్లు మాత్రమే.
- 2019 ఖరీఫ్ సీజన్‌లో ఆహార ధాన్యాలు, నూనెగింజలు, పప్పుధాన్యాలే కాకుండా పత్తి వంటి వాణిజ్యపంటల దిగుబడులను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది.
- 2018-19 లో 29.02 కోట్ల టన్నుల ఆహారధాన్యాల దిగుబడులు సాధించడానికి కేంద్రం తొలుత లక్ష్యాన్ని నిర్ధేశించింది. కాని 28.13 కోట్లు టన్నులే పండినట్లు తాజాగా తేల్చారు. పప్పు ధాన్యాలు సైతం 2.59కోట్ల టన్నుల లక్ష్యం కన్నా 19లక్షల టన్నులు తగ్గాయి.

- దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతా నూనెగింజల దిగుబడులు తగ్గిపోయింది. 2010-11లో 3.20కోట్ల టన్నుల దిగుబడులు రాగా 2018-19లో 3.15 కోట్ల టన్నులే రావడం వ్యవసాయ రంగ తిరొగమనానికి నిదర్శనం.
- ప్రపంచంలోనే అత్యధికంగా వంట నూనేలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అగ్రస్థానానికి భారత్ చేరుకొంది. 2017 నవంబర్ నుంచి 2018 అక్టోబర్ వరకు 1.45 కోట్ల టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకున్నారు.
- జాతీయ ఆహార భద్రతా మిషన్ (NFSM) పథకం కింద పదేళ్ల కింద విడుదల చేసిన పాత వంగడాన్ని రైతులు సాగుచేస్తే క్వింటా విత్తనాల ధర ఎంత ఉన్నా అందులో రూ.500 మాత్రమే రాయితీగా ఇవ్వాలని రాష్ర్టాలను కేంద్రం ఆదేశించింది. పదేళ్లలోపు విడుదలైన కొత్త వంగడాలైతే ఈ రాయితీ కింద రూ.1000 ఇవ్వాలని చెప్పింది. రైతులు 25 ఏండ్ల క్రితం నాటి సాంబమసూరి (BPT-5204) రకం వంగడాన్ని ఇంకా ఎక్కువగా సాగు చేయడానికి కారణం మేలైన కొత్త వంగడాలు అందుబాటులో లేకపోవడమే.
- కొత్త వంగడాల్లో మేలురకం లక్షణాలుంటే వ్యవసాయశాఖ, సేద్యం పరిశోధన కేంద్రాల ఆధ్వర్యంలో కొన్ని గ్రామాల్లోలనైనా కొత్త వంగడాలతో పంట సాగు చూపాలి. అదీ జరగడం లేదు.
- ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చాక కూలీల కొరత, కూలీ-ధరలు పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు వ్యవసాయ యంత్రాలపై పెద్దఎత్తున రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం చేప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పేద రైతులకు ఇవేవీ అందడం లేదు.
- రసాయన ఎరువుల వాడకం నియంత్రణకు, ప్రతి రైతు కమతంలో మట్టి నమునాలను ఖరీప్ ప్రారంభానికి ముందే తీసుకుని ప్రయోగశాలల్లో పరీక్షించాలి. పోషకాల గూర్చి జూన్‌కల్లా సమాచారం ఇవ్వాలి. కాని ఇది సక్రమంగా జరగడం లేదు.

వ్యవసాయ సంస్కరణలు

- దేశంలో 85శాతం భూకమతాలను చిన్న, మధ్యతరహా రైతులై సాగు చేస్తున్నారు. విపణికి వచ్చే మిగులు పంటలో 40శాతం వాటా వారిదే. కానీ భారత ఆహారసంస్థ (FCI)తో బియ్యం, గోధుమలు కొనుగోలు చేయించే కార్యక్రమం కాని, ఇతర విపణి జోక్య విధానా లు కాని పెద్ద రైతులకే ప్రయోజనం కలిగించాయి తప్ప చిన్న, మధ్యతరహా రైతులకు పెద్దగా ఒరిగిందేమీలేదు.
- వ్యవసాయం ఉత్పత్తులు మార్కెట్ సంఘాల్లో (APMC) చిన్న, సన్నకారు, మధ్యతరహా రైతులకు చురుకైన భాగస్వామ్యం లేకపోవడంతో వారికి సరైన ధర లభించడం లేదు. ధరలను తగ్గించి రైతులను నష్టాల పాలు చేస్తున్న దళారీ వ్యవస్థను నిర్మాలించాలంటే మార్కెట్‌లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి.
- రైతులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రాసెసింగ్ కంపెనీలకు తీసుకెళ్లడానికి అమూల్ తరహా రైతుల ఉత్పత్తి సంస్థ(FPO)లను ఏర్పరచాలి. ప్రధానమంత్రి కిసాన్, రైతుబంధు వంటి పథకాల గురించి రైతులలో అవగాహన పెంచాలి. అవి సక్రమంగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఇప్పటికి ఆరేండ్ల నుంచి పండ్లు, కూరగాయల వంటి ఉద్యాన పంటల ఉత్పత్తి ఆహరధాన్యాల దిగుబడిని మించిపోతున్నది. ఉద్యానపంటల ను నిల్వచేసే సౌకర్యాలు సరిగా లేకపోవడంతో దిగుబడిలో 20-30శాతం నష్టమవుతోంది.
- రైతు ఉత్పత్రి కంపెనీ (FPI)ల ద్వారా ఆహార శుద్ది, విలువ జోడింపు ప్రక్రియలను చేపట్టాలి. వ్యవసాయం రాష్ట్రజాబితాలోని అంశమే కాని, అది వర్ధిల్లడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడం, విధానాలు చేపట్టడం కేంద్రం కర్తవ్యం.

agriculture1

393
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles