కరెంట్ అఫైర్స్


Wed,June 12, 2019 12:14 AM

Telangana
Telangana

దక్కన్ సొసైటీకి ఈక్వేటరీ అవార్డు

రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని డీడీఎస్ (దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ)కి జూన్ 4న ఈక్వేటరీ అవార్డు లభించింది. 2019కు గాను 20 సంస్థలను ఈ అవార్డుకు ఎంపికచేయగా వాటిలో డీడీఎస్ కూడా ఉంది. ఐరాస అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) ఏటా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు, పర్యావరణ పరిరక్షణకు కృషిచేసే సంస్థలను గుర్తించి ఈ అవార్డును ప్రకటిస్తుంది.

చంద్రమౌళికి నాజినామన్ పురస్కారం

వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత రామాచంద్రమౌళి నాజినామన్ జూన్ 7న ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి తెలుగు సాహిత్యవేత్తగా ఆయన రికార్డులకెక్కారు. లెబనాన్‌కు చెందిన నాజినామన్ ఫౌండేషన్ మూడు విభాగాల్లో అందించే ఈ పురస్కారానికి వివిధ దేశాల నుంచి మొత్తం 60 మంది ఎంపికయ్యారు. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు. మెరిట్ ప్రైజ్ విభాగంలో బెంగాల్ కవి దేబాశిష్ లహరి, క్రియేటివిటీ ప్రైజ్ విభాగంలో అశోక్ చక్రవర్తి టోలోనా, దేవశ్రీ తివారీ, హానర్ ప్రైజ్ విభాగంలో 61 రచనలు చేసిన కవి, రచయితగా రామా చంద్రమౌళిని జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు.

వెయ్యి రోజుల్లో వెయ్యి తెలుగు వ్యాసాలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన వంగరి ప్రణయ్‌రాజ్ వికీపీడియాలో వెయ్యి రోజుల్లో వెయ్యి తెలుగు వ్యాసాలు రాసి అరుదైన రికార్డు సాధించారు. ప్రణయ్ 2016, సెప్టెంబర్ 8న తొలి వ్యాసం ప్రారంభించి రోజుకో వ్యాసం చొప్పున జూన్ 4 నాటికి వెయ్యి వ్యాసాలు రాశారు.

International
International

రష్యా-చైనా సమావేశం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ జూన్ 5న సమావేశమయ్యారు. రష్యా రాజధాని మాస్కోలోని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్యాలెస్‌లో జరిగిన ఈ సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, సహకార సంబంధాలు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. వారి జాతీయ కరెన్సీలైన రూబుల్, యువాన్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిర్వహించేందుకు ఈ రెండు దేశాలు అంగీకరించాయి.

నౌక నుంచి ఉపగ్రహ ప్రయోగం

అంతరిక్ష పరిశోధన రంగంలో చైనా నౌక నుంచి ఉపగ్రహ ప్రయోగాన్ని జూన్ 5న విజయవంతంగా నిర్వహించింది. ఎల్లో సముద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగంలో లాంగ్ మార్చ్-11 రాకెట్ ద్వారా మొత్తం ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. వీటిలో సముద్ర ఉపరితల గాలులు, తుఫాన్ల అధ్యయనానికి సంబంధించిన శాటిలైట్ ఒకటి కాగా.. మరో రెండు కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయి. చైనా ఇటువంటి ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి.

డీ-డేకు 75 ఏండ్లు

డీ-డేకు జూన్ 6న 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్‌లో ఉన్న నార్మండీలోని అరొమాంచెస్ తీరంలో రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి వాహనాలను ప్రదర్శించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ నాజీల ఆక్రమణలో ఉన్న ఫ్రాన్స్ భూభాగంలోని నార్మండీకి స్వేచ్ఛ కల్పించేందుకు 1944 జూన్ 6న చరిత్రలోనే అతిపెద్ద సముద్ర దాడి జరిగింది. దీనికి ఆపరేషన్ నెప్ట్యూన్ అని పేరు పెట్టారు. దాన్నే డీ-డేగా పిలుస్తున్నారు.

ఫోర్బ్స్ మహిళా వ్యాపారవేత్తల జాబితా

అమెరికాలోని 80 మందితో కూడిన అత్యంత ధనిక మహిళల జాబితాను ఫోర్బ్స్ జూన్ 7న విడుదల చేసింది. ఈ జాబితాలో ఏబీసీ సప్లయ్ సంస్థ చైర్‌పర్సన్ డయానే హెండ్రిక్స్ సుమారు రూ.4 లక్షల కోట్ల సంపాదనతో మొదటి స్థానంలో నిలిచారు. దీనిలో భారత సంతతి వ్యాపారులు ముగ్గురు ఉన్నారు. వారిలో అరిస్టా నెట్‌వర్క్స్ సీఈవో జయశ్రీ ఉల్లాల్ రూ.97 వేల కోట్లతో 23వ స్థానం, సింటెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజా సేథీ రూ.35 వేల కోట్లతో 23వ స్థానం, కన్‌ఫ్లుయెంట్ టెక్నాలజీ కంపెనీ సహవ్యవస్థాపకురాలు నేహా నార్కడే రూ.24 వేల కోట్లతో 60వ స్థానంలో ఉన్నారు.

జీ-20 దేశాల సమావేశం

జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం జపాన్‌లోని ఫకువొకొ నగరంలో జూన్ 8, 9 తేదీల్లో జరిగింది. ఈ సమావేశంలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో బహుజాతి టెక్నాలజీ కంపెనీల డిజిటల్ పన్నులపై చర్చించారు.

National
National

భద్రతా వ్యవహారాల కమిటీ

దేశభద్రత, విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీని ఏర్పాటు చేస్తూ జూన్ 5న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాని అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో రక్షణ మంత్రి, హోంమంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి సభ్యులుగా ఉన్నారు. భద్రత, విదేశీ సంబంధాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

అత్యంత రద్దీ నగరంగా ముంబై

ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై నిలిచింది. ట్రాఫిక్ ఇండెక్స్-2018ని టామ్ టామ్ సంస్థ విడుదల చేసింది. వాహనదారులు అత్యధికంగా ట్రాఫిక్‌జామ్ బారినపడుతున్న నగరాల్లో ముంబై అగ్రస్థానంలో నిలిచిందని ఈ నివేదిక పేర్కొంది. ముంబై ప్రజానీకం సాధారణ సమయాల్లో కంటే పీక్ అవర్స్‌లో 65 శాతం కంటే అధికంగా తమ విలువైన సమయాన్ని రోడ్డు పాలుచేసుకుంటున్నట్టు టామ్ టామ్ సంస్థ వివరించింది. దీనిలో ముంబై తర్వాత కొలంబియా రాజధాని బొగొటా (63 శాతం), పెరు రాజధాని లిమా (58 శాతం) నగరాల్లో అధిక ట్రాఫిక్ సమస్య ఉంది. న్యూఢిల్లీ (58 శాతం) నాలుగో స్థానంలో, రష్యా రాజధాని మాస్కో (56 శాతం) ఐదో స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 400 నగరాల్లో ట్రాఫిక్ రద్దీని జీపీఎస్ ఆధారంగా టామ్ టామ్ అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. 8 లక్షల జనాభాకు పైన ఉన్న నగరాలనే ఈ అధ్యయనంలో భాగస్వామ్యం చేశారు.

బీసీసీఐ ఎలక్ట్రోరల్ అధికారిగా గోపాలస్వామి

బీసీసీఐ ఎలక్ట్రోరల్ అధికారిగా ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషన్ ఎన్ గోపాలస్వామి నియమితులయ్యారు. బీసీసీఐ ఎన్నికల విధివిధానాలపై జూన్ 7న చర్చించిన క్రికెట్ పరిపాలన కమిటీ (సీఓఏ) ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సంఘాలకు సెప్టెంబర్ 24న ఎన్నికలు జరుగనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 22న వార్షిక సర్వసభ్య సమావేశంలో జరుగనున్న బీసీసీఐ కార్యవర్గం ఎన్నికలకు గోపాలస్వామి ఎలక్టోరల్ అధికారిగా వ్యవహరించనున్నారు.

సీఐఐ సదస్సు

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సదస్సును జూన్ 6న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా పాల్గొన్నారు. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం (సార్క్)తో కొన్ని సమస్యల నేపథ్యంలో బిమ్స్‌టెక్ దేశాల సాయంతో ప్రాంతీయ సహకారాన్ని మెరుగుపర్చుకునే విషయంపై చర్చించారు. జైశంకర్ మంత్రి అయిన తర్వాత తన తొలి విదేశీ పర్యటనను భూటాన్‌తో ప్రారంభించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జూన్ 7న భూటాన్ వెళ్లిన ఆయన ఆ దేశ ప్రధాని లోటె షెరింగ్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

Sports
Sports

క్రికెట్‌కు యువరాజ్ గుడ్‌బై

భారత క్రికెట్‌లో కీలక ఆల్‌రౌండర్‌గా వెలుగొందిన యువరాజ్‌సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు జూన్ 10న వీడ్కోలు పలికారు. 2000 సంవత్సరంలో కెన్యాపై మ్యాచ్ ఆడటం ద్వారా అంతర్జాతీయ వన్డే కెరీర్‌ను ఆరంభించిన యువరాజ్ 304 మ్యాచ్‌లు ఆడి 8701 పరుగులు చేశాడు. 40 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు.
Sports1

ఫ్రెంచ్ ఓపెన్ నాదల్‌దే

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా రఫెల్ నాదల్ నిలిచాడు. పారిస్‌లో జూన్ 8న జరిగిన ఫైనల్లో రెండో సీడ్ నాదల్ నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. దీంతో ఒక గ్రాండ్ స్లామ్‌ను ఒకే కోర్టులో 12 సార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో 93 మ్యాచ్‌లను నాదల్ గెలిచాడు. ఓవరాల్‌గా నాదల్ 18 గ్రాండ్ స్లామ్‌ల (12 ఫ్రెంచ్, 3 యూఎస్, 2 వింబుల్డన్, 1 ఆస్ట్రేలియన్)ను సాధించాడు.

Persons
Persons

గిరీష్ కర్నాడ్ మృతి

ప్రముఖ కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు గిరీష్ కర్నాడ్ బెంగళూరులో జూన్ 10న మరణించారు. 1938, మే 19న మహరాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించిన ఆయనకు జ్ఞానపీఠ్, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు లభించాయి. 1970లో సంస్కారా అనే చిత్రం ద్వారా ఆయన సినిమాల్లోకి అరంగేట్రం చేశారు.

ఆస్ట్రియా తొలి మహిళా చాన్స్‌లర్‌గా బీర్లీన్

ఆస్ట్రియా తొలి మహిళా చాన్స్‌లర్‌గా బ్రిగిటి బీర్లీన్ జూన్ 4న బాధ్యతలు స్వీకరించారు. ఆస్ట్రియా అధ్యక్షుడు వాన్‌డర్ బెలెన్ ఆమెతో పదవీ ప్రమాణం చేయించారు. గత చాన్స్‌లర్ సెబాస్టియన్ కర్జ్ పార్లమెంట్ విశ్వాసం కోల్పోవడంతో ఆమె తాత్కాలిక చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టారు.

సుందర్ పిచాయ్‌కు అవార్డు

అమెరికా భారత వాణిజ్య మండలి (యూఎస్‌బీసీ) ప్రతి ఏటా ఇచ్చే గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు-2019ను జూన్ 4న ప్రకటించింది. ఈ అవార్డుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తోపాటు నాస్‌డాక్ అధ్యక్షుడు అడేనా ఫ్రైడ్ కూడా ఎంపికయ్యారు. జూన్ నెలలోనే జరుగనున్న ఇండియా ఐడియాస్ సదస్సులో వారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ప్రపంచ సాంకేతిక రంగ అభివృద్ధికి ఇరు కంపెనీలు అందిస్తున్న సేవలకుగాను వారిని ఈ అవార్డు వరించింది.

థాయ్‌లాండ్ ప్రధానిగా ప్రయూత్ చాన్

థాయ్‌లాండ్ ప్రధానిగా సైనిక జుంటా పార్టీ అధినేత ప్రయూత్ చాన్ ఓచా జూన్ 5న ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థి థనాత్రోవ్ జువాంగ్రోంగ్ రువాంకిట్‌పై ఆయన విజయం సాధించారు. 2014లో ఇంగ్లక్ షినవత్ర ప్రభుత్వాన్ని సైన్యం కూలదోశాక అప్పటి ఆర్మీ చీఫ్ ప్రయూత్ చాన్ ఓచా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికతో సైనిక సంక్షోభం తర్వాత ఎన్నికైన తొలి పౌర ప్రధానిగా ప్రయూత్ చాన్ ఓచా నిలిచారు. థాయ్‌లాండ్ ప్రధానిని ఎన్నుకోవడానికి ప్రతినిధుల సభ, సెనెట్ కలిపి 375 మంది సభ్యుల మద్దతు ఉండాలి.

బ్రిటన్ ఆర్థికవేత్తగా భారత సంతతి వ్యక్తి

బ్రిటన్ ప్రభుత్వ పరిధిలోని విదేశీ, కామన్వెల్త్ కార్యాలయంలో ప్రధాన ఆర్థికవేత్తగా భారత సంతతికి చెందిన కుమార్ అయ్యర్ జూన్ 7న నియమితులయ్యారు. ఈ పదవిలో నియమితులైన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇంతకుముందు ముంబైలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్‌గా ఆయన పనిచేశారు.

Vemula-Saidulu

1057
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles