కరెంట్ అఫైర్స్


Tue,August 27, 2019 11:50 PM

Telangana
Telangana

ఎల్‌బ్రస్‌ను అధిరోహించిన శేఖర్‌

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పీపల్‌ పహాడ్‌ గ్రామానికి చెందిన శేఖర్‌ గౌడ్‌ అనే దివ్యాంగుడు యూరప్‌లోనే ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ (5,642 మీ.) పర్వత శిఖరాన్ని ఆగస్టు 22న అధిరోహించారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ దివ్యాంగుడిగా చరిత్ర సృష్టించారు.

హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు

రాష్ట్ర హైకోర్టుకు తడకమళ్ల వినోద్‌కుమార్‌ (నల్లగొండ జిల్లా దాచారం), అన్నిరెడ్డి అభిషేక్‌ రెడ్డి (రంగారెడ్డి జిల్లా), కూనూరు లక్ష్మణ్‌ (యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం)లను జడ్జీలుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. కొలీజియం సిఫారసు చేసిన వీరి పేర్లను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదిస్తూ ఆగస్టు 23న ఉత్తర్వులు జారీచేశారు.

అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ నెలకొల్పిన అతిపెద్ద క్యాంపస్‌ను ఆగస్టు 21 హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు రూ.1,500 కోట్లకుపైగా వ్యయంతో ఈ క్యాంపస్‌ను నిర్మించారు. దీనిలో 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. అమెజాన్‌కు అమెరికా వెలుపల ఇది ఏకైక సొంత భవనం. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో అమెజాన్‌కు 300 క్యాంపస్‌లు ఉన్నాయి.

స్మార్ట్‌ పోలీసింగ్‌ అవార్డు

స్మార్ట్‌ పోలీసింగ్‌లో రాష్ట్ర పోలీసు విభాగానికి ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) స్పెషల్‌ జ్యూరీ అవార్డు లభించింది. ఆగస్టు 23న ఢిల్లీలో కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ, పీఎంఓ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ ద్వారా ఈ అవార్డును టెక్నికల్‌ సర్వీసెస్‌ అడిషనల్‌ డీజీ రవి అందుకున్నారు. డయల్‌ 100 ఫోన్‌కాల్స్‌ విభాగంలో వేగంగా స్పందించినందుకు ఈ అవార్డు దక్కింది.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రాష్ట్రం నుంచి బీ ఆశారాణిని కేంద్రప్రభుత్వం ఆగస్టు 24న ఎంపికచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురి పేర్లను కేంద్రానికి సిఫారసు చేయగా ఆశారాణి ఒక్కరే ఎంపికయ్యారు. మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్‌ టీచర్‌గా పనిచేస్తున్న ఆమె సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు.

ఐఐటీ డైరెక్టర్‌గా మూర్తి

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ డైరెక్టర్‌గా బూదరాజు శ్రీనివాస మూర్తి ఆగస్టు 24న నియమితులయ్యారు. ఆయన ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

వడ్డెపల్లికి సరస్వతీ సమ్మాన్‌ పురస్కారం

రాష్ట్రంలోని సిరిసిల్లకు చెందిన సినీ పాటల రచయిత, దర్శకుడు వడ్డెపల్లి కృష్ణకు సరస్వతీ సమ్మాన్‌ పురస్కారం లభించింది. సాహిత్య రంగంలో అందిస్తున్న సేవలకుగాను ఆయనకు ఈ అవార్డు లభించిందని భారత భాషా సాహిత్య సమ్మేళన్‌ జాతీయ అధ్యక్షుడు సతీష్‌ చతుర్వేదిక్‌ తెలిపారు. ఆగస్టు 25న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఢిల్లీలో సరస్వతీ సమ్మాన్‌ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

National
National

సరళ్‌ ర్యాంకులు

కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్‌ స్టేట్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ అట్రాక్టివ్‌నెస్‌ ఇండెక్స్‌ (సరళ్‌)ను ఆగస్టు 21న విడుదల చేశారు. ఇందులో కర్ణాటక 78.8 స్కోరుతో మొదటిస్థానంలో నిలువగా 72.2 స్కోరుతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్‌ మూడోస్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ నాలుగోస్థానంలో ఉన్నాయి.

టైమ్‌ జాబితాలో స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ

టైమ్‌ మేగజీన్‌ రూపొందించిన ప్రపంచంలోనే గొప్పవైన, తక్షణమే వెళ్లి ఆస్వాదించదగిన 100 ప్రాంతాల జాబితాను ఆగస్టు 22న విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌లోని స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ (ఐక్యతా విగ్రహం-597 అడుగులు), సోహో హౌస్‌లకు చోటు లభించింది. గుజరాత్‌లోని కేవడియాలో నర్మదా నది నడిబొడ్డున స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ ఉంది. ఆసియాలోనే మొదటిసారిగా ముంబైలో సముద్రతీరంలో ఏర్పాటైన సోహో హౌస్‌ ప్రైవేట్‌ క్లబ్‌.

అమల్లోకి కనీస వేతనాల చట్టం

దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి కనీస వేతనాలు అందేలా తీసుకువచ్చిన ‘వేతనాల చట్టం-2019’ అమల్లోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 23న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ చట్టం ప్రకారం వర్తక సంఘాలు, ఉద్యోగులు, రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో వేతనాలు నిర్ణమవుతాయి. కనీస వేతనాలు చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్‌ చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో వేతనాల కోడ్‌-2019 అమల్లోకి వచ్చింది.

International
International

లాత్వియాలో ఉపరాష్ట్రపతి

లాత్వియా అధ్యక్షుడు ఎగిల్స్‌ లెవిట్స్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆగస్టు 20న భేటీ అయ్యారు. ఆ దేశ రాజధాని రిగాలో ఈ సమావేశం జరిగింది. మరోవైపు ఆ దేశ ప్రధానమంత్రి క్రిజ్‌జానిస్‌ కారిన్స్‌తోనూ వెంకయ్యనాయుడు చర్చలు జరిపారు.

ఎస్తోనియా అధ్యక్షురాలు కెర్‌స్టి కాల్‌జులైడ్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆగస్టు 21న భేటీ అయ్యారు. ఆ దేశ రాజధాని టాలిన్‌లో జరిగిన ఈ భేటీలో ఈ-గవర్నెన్స్‌, సైబర్‌ భద్రత వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

ఎవరెస్ట్‌పై ప్లాస్టిక్‌ నిషేధం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరంపై ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు నేపాల్‌ ప్రభుత్వం ఆగస్టు 22న ప్రకటించింది. హిమాలయాల్లో స్వచ్ఛమైన సరస్సులు, ప్రకృతి అందాలకు నెలవైన ఎవరెస్టును అధిరోహించడానికి ఏటా వేలాది ఔత్సాహికులు వస్తుంటారు. దీంతో వారు తీసుకెళ్లే ప్లాస్టిక్‌ కవర్లు, వాటర్‌ బాటిళ్లు ఇతర వస్తువులతో ఈ ప్రాంతం ప్లాస్టిక్‌ దిబ్బగా మారుతుంది. దీన్ని నివారించేందుకు నేపాల్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన 2020, జనవరి నుంచి అమల్లోకి వస్తుందని నేపాల్‌ వెల్లడించింది.

మానవరహిత యుద్ధనౌక

జరీ అనే మానవరహిత యుద్ధనౌకను ఒక రహస్య ప్రదేశంలో ప్రారంభించినట్లు చైనా అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌' ఆగస్టు 22న తెలిపింది. చైనా ప్రభుత్వ రంగ సంస్థ అయిన చైనా నౌకా నిర్మాణ కార్పొరేషన్‌ ఈ యుద్ధనౌకను తయారుచేసింది. 15 మీటర్ల పొడవుతో 20 టన్నుల బరువు కలిగిన ఈ నౌక జలాంతర్గాములను విధ్వంసం చేయగలదు. కృత్రిమ మేధస్సుతో స్వతంత్రంగా తన మార్గాన్ని గుర్తించగలదు.

యునెస్కోలో ప్రధాని మోదీ

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 23న నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సంతతి ప్రజలనుద్దేశించి ‘ఇన్‌ఫ్రా.. ఇన్‌ అంటే ఇండియా, ఫ్రా అంటే ఫ్రాన్స్‌. ఇలా ఇన్‌ఫ్రా మాదిరిగా ఇరువురి సంబంధాలు దృఢంగా ఉండాలని అన్నారు. అంతకుముందు ఫ్రాన్స్‌లో 1950, 60లలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల స్మారక చిహ్నాన్ని మోదీ ప్రారంభించారు.

ఎఫ్‌ఏటీఎఫ్‌ బ్లాక్‌లిస్టులో పాకిస్థాన్‌

ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్‌ (ఫైనాన్స్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌-ఎఫ్‌ఏటీఎఫ్‌) ఆసియా పసిఫిక్‌ గ్రూప్‌ ఇప్పటివరకు గ్రే లిస్టులో ఉన్న పాకిస్థాన్‌ను ఎన్‌హాన్స్‌డ్‌ ఎక్స్‌పీడైటెడ్‌ ఫాలో అప్‌ లిస్ట్‌ (బ్లాక్‌లిస్టు)లో పెట్టింది. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో భాగంగా ఆగస్టు 23న ఈ నిర్ణయం తీసుకుంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేయడంలో పాకిస్థాన్‌ విఫలమైందని ఎఫ్‌ఏటీఎఫ్‌ తెలిపింది.

Sports
Sports

సింధుకు స్వర్ణం

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు స్వర్ణ పతకం సాధించింది. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ఆగస్టు 25న జరిగిన వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఒకుహర (జపాన్‌)ను ఓడించి బంగారు పతకం గెలుచుకుంది. దీంతో ఈ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో ఒలింపిక్‌ మాజీ చాంపియన్‌ జాంగ్‌ నింగ్‌ (చైనా) రికార్డును సమం చేసింది.

సిన్సినాటి ఓపెన్‌ విజేతగా మెద్వెదేవ్‌

ప్రతిష్ఠాత్మక సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌-1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)విజేతగా నిలిచాడు. అమెరికాలోని సిన్సినాటిలో ఆగస్టు 19న జరిగిన పురుషుల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో 9వ సీడ్‌ మెద్వెదేవ్‌ 16వ సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం)పై విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకున్నాడు.

మహిళలల్లో మాడిసన్‌ కీస్‌ (అమెరికా) స్వెత్లానా కుజునెత్సోవా (రష్యా) ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.

బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌

భారత క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా మాజీ ఓపెనర్‌ విక్రమ్‌ రాథోడ్‌ను ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఆగస్టు 22న ఎంపికచేసింది. బౌలింగ్‌ కోచ్‌ గా భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌ శ్రీధర్‌లను కమిటీ కొనసాగించింది.

ఐసీసీ జనరల్‌ కౌన్సెల్‌

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) జనరల్‌ కౌన్సెల్‌, ప్రధాన కార్యదర్శిగా జొనాథన్‌ హాల్‌ను నియమిస్తున్నట్లు ఐసీసీ ఆగస్టు 22న ప్రకటించింది.

Persons
Persons

మోదీకి యూఏఈ పురస్కారం

భారత ప్రధాని మోదీకి యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌'ను ఆగస్టు 24న ఆ దేశ రాజు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ప్రదానం చేశారు. భారత్‌, యూఏఈల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్నడూలేనంత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేసినందుకు మోదీని ఈ పురస్కారానికి ఎంపికచేసినట్లు యూఏఈ రాజు ఏప్రిల్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.

బీహార్‌ మాజీ సీఎం జగన్నాథ్‌ మృతి

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్రా ఆగస్టు 19న మరణించారు. బీహార్‌కు ఆయన మూడుసార్లు సీఎంగా, పీవీ నర్సింహారావు కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

సంగీత దర్శకుడు ఖయ్యూం మృతి

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు, పద్మభూషణ్‌ గ్రహీత మొహమ్మద్‌ జహుర్‌ ఖయ్యూం ఆగస్టు 19న మరణించారు. 17 ఏండ్లకే సంగీత సాధన ఆరంభించిన ఆయన ఉమ్రావ్‌ జాన్‌, కభీకభీ వంటి సినిమాలకు సంగీతం అందించారు. ఉమ్రావ్‌ జాన్‌ కు అందించిన సంగీతానికి జాతీ య అవార్డు లభించింది. 2007లో సంగీత నాటక అకాడమీ అవార్డును, 2011లో పద్మభూషణ్‌ను అందుకున్నారు.

యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌

హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ నూతన కాన్సులేట్‌ జనరల్‌గా జోయల్‌ రీఫ్‌మన్‌ ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. కేథరిన్‌ హడ్డా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శిగా గౌబా

కేంద్ర క్యాబినెట్‌ తదుపరి కార్యదర్శిగా హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నియామకానికి క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఆగస్టు 21న ఆమోదం తెలిపింది. ఆయన ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగనున్నారు.

కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా భల్లా

కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి అజయ్‌కుమార్‌ భల్లా ఆగస్టు 23న బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఆయన రెండేండ్లపాటు ఉంటారు.

అరుణ్‌ జైట్లీ మృతి

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆగస్టు 24న మరణించారు. 1952, డిసెంబర్‌ 28న ఢిల్లీలో పేరున్న న్యాయవాది మహరాజ్‌ కిషన్‌ జైట్లీ, సామాజిక కార్యకర్త రతన్‌ ప్రభలకు జన్మించారు అరుణ్‌ జైట్లీ. 1977లో ఏబీవీపీ అఖిల భారత కార్యదర్శిగా పనిచేశారు. 1980లో బీజేపీలో చేరి కేంద్ర మంత్రి వరకు ఎదిగారు.

Vemula-Saidulu

498
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles