పట్టుదలతో కొట్టేయొచ్చు..!


Wed,September 4, 2019 02:09 AM

JEE-Main
జేఈఈ మెయిన్‌ (జనవరి) -2020

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ (జనవరి)-2020 నోటిఫికేషన్‌ విడుదలైంది. గతేడాది నుంచి ఏటా రెండుసార్లు ఈ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహిస్తుంది. జనవరిలో మొదటి మెయిన్‌, ఏప్రిల్‌లో రెండో మెయిన్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. రెండింటిలో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. జనవరిలో జరిగే ఈ పరీక్షకు సంబంధించి ఐఐటీ కోచింగ్‌లో విశేష అనుభవం ఉన్న నానో ఐఐటీ అకాడమీ డైరెక్టర్‌, సీనియర్‌ ఫ్యాకల్టీ కె.కృష్ణచైతన్య ‘నిపుణ’తో పంచుకున్న విషయాలు జేఈఈ మెయిన్‌ పరీక్ష రాస్తున్న విద్యార్థుల కోసం..

- గతేడాది మొదటిసారి రెండుసార్లు జేఈఈ మెయిన్‌ను నిర్వహించారు. 2018 వరకు జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌లో నిర్వహించేవారు. దీనికి ముందు మార్చిలో ఇంటర్‌ ఎగ్జామ్స్‌ వచ్చేవి. చాలామంది ఐపీఈ ఎగ్జామ్స్‌ కోసం జనవరి నుంచి ప్రిపరేషన్‌ కొనసాగించేవారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్‌, మార్చిలో ఇంటర్‌ ఎగ్జామ్స్‌తో దాదాపు మూడునెలల సమయం ఐపీఈకి కేటాయించేవారు. అంటే జేఈఈ మెయిన్‌కు జనవరి నుంచే చదవడం నిలిపివేసేవారు. జనవరి వరకు పూర్తిచేసిన సిలబస్‌నే ఐపీఈ పరీక్షల తర్వాత రివిజన్‌ చేసుకుని ఏప్రిల్‌ జేఈఈ మెయిన్‌కు సిద్ధమయ్యేవారు. ప్రస్తుత మార్పు అంటే జనవరిలో మెయిన్‌ ఎగ్జామ్‌ వల్ల పెద్దగా నష్టం ఏమీలేదు.

- గతేడాది నుంచి జనవరి, ఏప్రిల్‌లో రెండుసార్లు నిర్వహించారు. 2019 జేఈఈ మెయిన్‌ ఫలితాల విశ్లేషణ పరిశీలిస్తే ఎక్కువమంది జనవరిలో గరిష్ఠ మార్కులు సాధించి, ఇంటర్‌ పరీక్షల తర్వాత కాలాన్ని అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రిపరేషన్‌కు కేటాయించి విజయం సాధించారు. కాబట్టి విద్యార్థులు మ్యాక్సిమమ్‌ ఎఫర్ట్స్‌ను జనవరి ఎగ్జామ్‌ పై పెడితే మంచిది. ఒకవేళ జనవరిలో ఏదైనా సమస్య వచ్చి మంచి మార్కులు రాకుంటే జనవరి 2020లో దానిలో వచ్చిన ఫలితాలను విశ్లేషించుకున్న తర్వాత రెండునెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏప్రిల్‌ జేఈఈ మెయిన్‌లో మంచిస్కోర్‌ సాధించవచ్చు.

- జనవరిలో పరీక్ష కోసం అందోళన పడాల్సిన పనిలేదు. జనవరి వరకు శక్తివంచన లేకుండా ప్రిపరేషన్‌ను పూర్తిచేయాలి. జనవరిలో మెయిన్‌ రాయాలి. దీన్ని ఫైనల్‌ మాక్‌టెస్ట్‌గా భావిస్తే ఆందోళన తగ్గుతుంది. అనుభవం వస్తుంది.
- జనవరి మెయిన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అంశాలను విశ్లేషించుకుని మార్పులను సరిచేసుకుని ఏప్రిల్‌ మెయిన్‌కు ప్రిపేర్‌ అయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు సాధించవచ్చు.
- ఇప్పటికే సెకండియర్‌, ఫస్ట్‌ ఇయర్‌ సిలబస్‌లను పూర్తిచేసిన వారు తమ శక్తి సామర్థ్యాలను వినియోగించుకుని జనవరిలోనే మంచి స్కోర్‌కు ప్రయత్నించవచ్చు. మిగిలినవారు జనవరిని ఒక ప్రీ ఫైనల్‌గా భావించాలి. ఏప్రిల్‌ను ఫైనల్‌గా టార్గెట్‌ చేసుకోవాలి. అభ్యర్థులు మంచిగా పర్‌ఫాం చేస్తే ఈ విజయం భవిష్యత్‌ పరీక్షలకు మరింత దోహదపడుతుంది.

ముఖ్యతేదీలు

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: సెప్టెంబర్‌ 30
- అడ్మిట్‌కార్డు డౌన్‌లోడింగ్‌: డిసెంబర్‌ 17 నుంచి
- పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)
- పరీక్ష తేదీలు: 2020, జనవరి 6 నుంచి 11 వరకు
- ఫలితాల వెల్లడి: 2020, జనవరి 31
- వెబ్‌సైట్‌: www.nta.ac.in


- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1244
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles