సాధనమునే సర్వత్రా జయం


Mon,September 23, 2019 12:14 AM

జేఈఈ మెయిన్‌ (జనవరి)
జేఈఈ మెయిన్‌ జనవరి ఎగ్జామ్‌ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. చాలామంది ఇప్పటికే ఇంటర్‌ ప్రిపరేషన్‌ పూర్తిచేసి మెయిన్‌ ఎగ్జామ్‌ వైపు అడుగులు వేస్తున్నారు. మరికొంత మంది త్వరలో ప్రిపరేషన్‌ ప్రారంభించనున్నారు. జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్‌కు సుమారు 100 రోజుల సమయం మిగిలి ఉంది. ఈ సమయాన్ని ఎవరైతే ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. విజయానికి కేవలం రివిజన్‌, ప్రాక్టీస్‌లే ప్రధానం. నేటి నుంచి ఎగ్జామ్‌ వరకు మిగిలిన వందరోజులను ఎలా వినియోగించుకోవాలి? ఆయా సబ్జెక్టుల్లో ఏయే చాప్టర్లను మొదట చదవాలి? ఎటువంటి వ్యూహంతో ముందుకుపోవాలి అనే విషయాలపై ఐఐటీ కోచింగ్‌లో రెండుదశాబ్దాల అనుభం ఉన్న నానో ఐఐటీ అకాడమీ డైరెక్టర్‌ కాసుల కృష్ణచైతన్య నిపుణకు వివరించిన అంశాలు ఆయన మాటల్లో జేఈఈ మెయిన్‌ విద్యార్థుల కోసం..
college_students
-జేఈఈ మెయిన్‌ దేశంలో జరిగే ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో ఒకటి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఐఐటీలు, ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు సుమారు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు. లక్షల్లో విద్యార్థులు పోటీపడుతున్నా కేవలం వేలల్లో సీట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ కొనసాగిస్తే తప్పక అనుకున్న బ్రాంచీతోపాటు అనుకున్న కాలేజీలో సీటు సాధించవచ్చు.
-జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానంలో ఈసారి కొన్ని మార్పులు చేశారు. ప్రధానంగా గతంలో 90 ప్రశ్నలు-360 మార్కులు ఉండగా ఈసారి నుంచి 75 ప్రశ్నలు-300 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.
-ప్రశ్నల సంఖ్య, మార్కుల సంఖ్య తగ్గింది.
-అయితే కొత్తగా న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలను ఇవ్వడం ఇక్కడ గమనించాల్సిన అంశం. దీంతోపాటు వీటికి నెగెటివ్‌ మార్కులు లేకపోవడం కూడా ఒక అంశం.
-ముఖ్యంగా ఈసారి విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం సమయం మాత్రం మార్చలేదు. అంటే మూడుగంటల వ్యవధి అంతే ఉంది. సమయం ఎక్కువగా ఉంది. ప్రశ్నల సంఖ్య మాత్రం తగ్గించారు. అంటే తప్పక దీంట్లో ఏదో ఒక ట్విస్ట్‌ ఉంటుందనేది సత్యం.
-గతేడాది వరకు ప్రతి ప్రశ్నకు 2 నిమిషాల సమయం ఉండగా ఈసారి ప్రశ్నల సంఖ్య తగ్గడంతో ఒక్కో ప్రశ్నకు జవాబు గుర్తించే సమయం 2.4 నిమిషాలుగా ఉంది. అంటే 30 నిమిషాల అదనపు సమయం వచ్చింది.
-ఈసారి సమయం గతం కంటే ఎక్కువ కాబట్టి ప్రశ్నల కఠినత్వం పెరిగే అవకాశం ఉంది.
-గతేడాది ఎన్‌టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్‌ మార్కులు పరిశీలిస్తే 300 పైగా మార్కులను సుమారు 1800-1900 మంది సాధించారు.
-ఈసారి కాఠిన్యత స్థాయి పెంచే అవకాశాలు బాగా కన్పిస్తున్నాయి. అదే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం గుజరాత్‌ వంటి కొన్ని రాష్ర్టాలు ఆ రాష్ర్టాల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్ష అంటే ఎంసెట్‌ లాంటిదాన్ని నిర్వహించడం లేదు. కాబట్టి అక్కడి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పేపర్‌ను రూపొందించాల్సి ఉంటుంది.
-ఈసారి పరీక్షలో 60-70 శాతం మధ్యస్థం (మోడరేట్‌)గా, 40 శాతం కఠినంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
-గతేడాది సులభంగా 25-30 శాతం, మధ్యస్థంగా 40-45 శాతం, 25-30 శాతం (సుమారుగా) కఠినంగా ఉన్నాయి. ఈసారి వీటి శాతాల్లో కొంత పెరుగుదల కన్పించవచ్చు.
-విద్యార్థులు మొదట కాన్సెప్ట్‌పై తర్వాత ప్రీవియస్‌ పేపర్స్‌ సాల్వ్‌ చేసి తమ అభ్యసనాన్ని మెరుగుపర్చుకోవాలి.
-ఎన్‌సీఈఆర్‌టీ/ఇంటర్‌ బుక్స్‌లోని అంశాలపై పట్టు తెచ్చుకుని పాతప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను సాల్వ్‌చేస్తే జేఈఈ మెయిన్‌లో 60-65 శాతం మార్కులను సాధించవచ్చు.
-మిగిలిన 35 శాతం మార్కుల కోసం అంటే కఠినమైన ప్రశ్నల సాధన కోసం ప్రీవియస్‌ ఇయర్స్‌లోని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలోని సింగిల్‌ ఆప్షన్‌ కరెక్ట్‌ ప్రశ్నలను సాల్వ్‌ చేయడం, మిగిలిన ప్యాట్రన్‌ ప్రశ్నలపై అవగాహన పెంచుకోవడం, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్‌ సాధించే మెళకువలు తెలుసుకోవాలి.
-ముఖ్యంగా పరీక్ష రాసే అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరో అంశం పరీక్షలో ప్రశ్నలు కఠినత్వాన్ని చూసి భయపడవద్దు. ఎందుకంటే మీకు కఠినమైనవి సాధారణంగా చాలామందికి కఠినమైనవనే విషయం. కాబట్టి ఈ సమయంలో కచ్చితత్వంపై దృష్టిపెట్టి సాధ్యమైనన్ని ప్రశ్నలను తప్పులు లేకుండా జవాబులు గుర్తించగలిగితే తప్పక మంచి స్కోర్‌ వస్తుంది.
-పరీక్షలో విద్యార్థులు గమనించాల్సిన మరో విషయం చాలా ప్రశ్నలు చూడటానికి చాలా కష్టంగా కన్పిస్తాయి. కానీ వాటిని ఒకటికి రెండుసార్లు చదివితే తేలిగ్గా సమాధానాలు సాధించవచ్చు.
-పేపర్‌ కఠినంగా ఉన్నప్పుడు ఎవరైతే ధైర్యంగా తప్పులు తక్కువగా, నిలడగా ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తారో వారు విజయం సాధిస్తారు.
-పేపర్‌ ఈజీగా వచ్చిందని సంతోషపడవద్దు. ఈ సమయంలో ప్రశ్నలను ఏకాగ్రతతో, వేగంగా సాల్వ్‌ చేయాలి. కచ్చితత్వం, ఎన్ని ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించడంపైన దృష్టి సారించాలి.

100 రోజులు ఎలా చదవాలి?

-జనవరిలో జరిగే పరీక్షకు సుమారు 100 రోజుల కాలవ్యవధి ఉంది. ఈ సమయం చాలా కీలకం.
-చాప్టర్లవారీగా కాన్సెప్ట్‌ మ్యాప్‌లను వేసుకొని ప్రతి కాన్సెప్ట్‌ మీద పట్టు వచ్చే విధంగా రివిజన్‌ చేసుకుంటే సక్సెస్‌ సులభమవుతుంది.
-ప్రతి చాప్టర్‌ రివిజన్‌ చేసిన తర్వాత వెంటనే ప్రీవియస్‌ పేపర్స్‌లో ఆ చాప్టర్ల పై ఇచ్చిన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. ఎలాంటి కాన్సెప్ట్‌పై ప్రశ్నలు ఇచ్చారు అనేది అవగతమవుతుంది. దీంతోపాటు ఆ చాప్టర్‌పై మన ప్రిపరేషన్‌ స్థాయి ఏమిటనేది తెలిసిపోతుంది.
-మొదట ఫస్టియర్‌ రివిజన్‌ చేయడం చాలా కీలకం. ఎందుకంటే ఈ పాఠాలు చదివి చాలారోజులవుతుంది. కాబట్టి వీటిని మొదట చదవాలి. అన్ని చాప్టర్లను ఒకసారి రివిజన్‌ చేసుకుని సెకండియర్‌లో మెయిన్‌ టాపిక్స్‌ను మొదట రివిజన్‌ చేసుకోవాలి. ఉదాహరణకు మ్యాథ్స్‌లో ఇంటిగ్రల్‌ క్యాలిక్యులస్‌, ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ, కెమిస్ట్రీలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ మొదట రివిజన్‌ చేయాలి.
-తర్వాత ఇండిపెండెంట్‌గా ఉండే చాప్టర్లు ఏవైతే సులభంగా నేర్చుకోవచ్చో వాటిని తప్పక వేగంగా రివిజన్‌ చేసుకోవాలి. ఈ చాప్టర్లను పరిశీలిస్తే...
-మ్యాథ్స్‌లో వెక్టార్స్‌ 3డీ, మ్యాట్రిసెస్‌ డిటర్మినెంట్‌, స్టాటిస్టిక్స్‌, రీజినింగ్‌, ప్రోగ్రెషన్స్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌.
-ఫిజిక్స్‌లో సౌండ్‌ అండ్‌ వేవ్స్‌, హీట్‌, థర్మోడైనమిక్స్‌, రే ఆప్టిక్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌.
-కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్‌, థర్మో కెమిస్ట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్‌ కాంపౌండ్స్‌, సొల్యూషన్స్‌, సర్ఫేస్‌ కెమిస్ట్రీ, కోలిగేటివ్‌ ప్రాపర్టీస్‌, బయోమాలిక్యూల్స్‌, పాలీమర్స్‌.
-తదుపరి మిగతా చాప్టర్లపై దృష్టిసారించాలి. ప్రతి చాప్టర్‌పై కనీసం ఐపీఈ (ఇంటర్‌ బుక్స్‌) అవగాహన ఉండాలి.
-ఏ చాప్టర్‌ను కూడా చాయిస్‌ కింద విస్మరించవద్దు. ఏదైనా చాప్టర్‌ కష్టమనిపిస్తే దాన్ని ఇంటర్‌ టెక్ట్స్‌బుక్‌ తీసుకుని చదివి అవగాహన చేసుకుని ప్రాక్టీస్‌ చేయాలి. టెక్ట్స్‌బుక్‌లో ఇచ్చిన ప్రశ్నలపైన అవగాహన పెంచుకోవాలి.
-ఇప్పటికే ప్రిపరేషన్‌ పూర్తిచేసినవారు వెంటనే ప్రీవియస్‌ పేపర్స్‌ సాల్వ్‌ చేయాలి. దీంతోపాటు కనీసం పది మాక్‌టెస్ట్‌లను రాయాలి.
-కాన్సెప్ట్‌ పై కంప్లీట్‌ అవేర్‌నెస్‌ ఉంటే ప్రతి కాన్సెప్ట్‌పై కనీసం 5-10 ప్రశ్నలు సాల్వ్‌ చేయాలి.
-జేఈఈ మెయిన్‌ జనవరి ఎగ్జామ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తేలిగ్గా తీసుకోవద్దు. మ్యాగ్జిమమ్‌ ఎఫర్ట్‌ పెట్టాలి. తర్వాత ఏప్రిల్‌లో జరిగే ఎగ్జామ్‌కు పెద్ద సమయం ఉండదు. ఎందుకంటే ఫిబ్రవరి, మార్చి ఇంటర్‌ ఎగ్జామ్స్‌తో సరిపోతుంది. ఆ తర్వాత వెంటనే ఏప్రిల్‌ మొదటి వారంలో జేఈఈ మెయిన్‌ రెండోసారి ఎగ్జామ్‌ ఉంటుంది. కాబట్టి పెద్దగా ప్రిపరేషన్‌కు సమయం ఉండదు. కాబట్టి ఇప్పుడే గరిష్ఠ మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
-జేఈఈ మెయిన్‌ జనవరిలో మంచి మార్కులు సాధిస్తే ఆ ఉత్సాహంతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సమయం కేటాయించుకోవచ్చు.
-అంతేకాదు గతేడాది ఫలితాల విశ్లేషణలో కూడా తేలిన అంశం జనవరిలోనే ఎక్కువమంది విద్యార్థులు గరిష్ఠ స్కోర్‌ను చేసి లబ్ధిపొందారు.

ఫిజిక్స్‌ ప్రిపరేషన్‌ ఇలా చేయండి

-జేఈఈ మెయిన్‌లో ప్రతి సబ్జెక్టు కీలకమే. అన్నింటికీ సమాన వెయిటేజీ ఉంటుంది. కాబట్టి దేన్నీ నిర్లక్ష్యం చేయవద్దు. చాలామంది భయపడే సబ్జెక్టు ఫిజిక్స్‌. కానీ నిజానికి దీనిలో కాన్సెప్టులను సరిగ్గా అవగాహన చేసుకుంటే సులభంగా జవాబులను గుర్తించవచ్చు.
-ఇంటర్‌ ద్వితీయ సంవత్సరానికి వెయిటేజీ ఎక్కువగా ఇస్తున్నారు. ప్రీవియస్‌ ఇయర్స్‌లోని జేఈఈ మెయిన్స్‌ ప్రశ్నలను సాధన చేయాలి. దీంతోపాటు అడ్వాన్స్‌డ్‌లో సింగిల్‌ కరెక్ట్‌ ఆన్సర్‌ ప్రశ్నలను సాధన చేస్తే మంచిది.
-ఎక్కువగా ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను సాధన చేయడంవల్ల కాన్ఫిడెన్స్‌ బిల్డప్‌ అవుతుంది.
-జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కంటే మెయిన్‌లో కొన్ని టాపిక్స్‌ ఎక్కువగా ఉంటాయి. వాటిని ఒక్కసారి చదువుకుంటే మంచిది. ఆ టాపిక్స్‌ను పరిశీలిస్తే..
-సెమీకండక్టర్లు, క్లాసికల్‌ మ్యాగ్నటిజం, డైఫ్రాక్షన్‌, పోలరైజేషన్‌, సెకండ్‌ లా ఆఫ్‌ థర్మోడైనమిక్స్‌, డ్యాపండ్‌, ఫోర్స్‌డ్‌ ఆసులేషన్స్‌ ఒక్కసారి తప్పక చదవాలి.
-సెకండియర్‌లో ఎలక్ట్రిసిటీ, వేవ్స్‌ అండ్‌ సౌండ్‌, ఆప్టిక్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌ బాగా చదవాలి.
-ఫస్టియర్‌లో హీట్‌, మెకానిక్స్‌ మొదటి పార్ట్‌, రొటేటరీ మోషన్‌లో మూమెంట్‌ ఆఫ్‌ ఇనర్షియా అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
sheshagiri-rao

కొంచెం శ్రద్ధ పెడితే కెమిస్ట్రీలో ఫుల్‌ స్కోర్‌

-జేఈఈ మెయిన్‌లో అన్ని సబ్జెక్టులకు సమాన వెయిటేజీ. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో పోలిస్తే కెమిస్ట్రీ కొంత సులభమైన సబ్జెక్టు. కానీ చాలామంది విద్యార్థులు దీనిపై దృష్టిపెట్టక అనవసరంగా మార్కులను కోల్పోతున్నారు. ర్యాంకుల్లో వెనుకబడుతున్నారు. కెమిస్ట్రీపై కొంచెం శ్రద్ధ పెడితే సులభంగా ఫుల్‌స్కోర్‌ చేయవచ్చు.
-కెమిస్ట్రీలో ప్రధానం ఫిజికల్‌, ఆర్గానిక్‌, ఇనార్గానిక్‌ మూడు విభాగాలు ఉన్నాయి. వీటన్నింటికి దాదాపు సమాన వెయిటేజీ ఉంది.
-ఆర్గానిక్‌ కెమిస్ట్రీ సెకండియర్‌ సిలబస్‌ చదువుతుంటే ఆటోమెటిక్‌గా ఫస్టియర్‌ది కవర్‌ అవుతుంది.
-ఫిజికల్‌, ఆర్గానిక్‌పై ఎక్కువ దృష్టిపెడితే మంచిది. ఇనార్గానిక్‌ విషయానికి వస్తే దీనిలో ఎక్కువగా చదివి గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఉంటాయి.
-ఇనార్గానిక్‌లో కోఆర్డినేషన్‌ కాంపౌండ్స్‌, మెటలర్జి, డీ, ఎఫ్‌, పీ బ్లాక్‌ మూలకాలు అంశాలు చదివితే మంచిది.
-ఫిజికల్‌ కెమిస్ట్రీ ఫస్టియర్‌లో అయానిక్‌ ఈక్వేషన్స్‌, థర్మోడైనమిక్స్‌. సెకండియర్‌లో కైనటిక్స్‌, సొల్యూషన్స్‌, ఎలక్ట్రోకెమిస్ట్రీ.
-విద్యార్థులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం వారికి ఎక్కడ స్ట్రెంత్‌ ఉండో అక్కడ బాగా దృష్టిపెడితే మంచిది. అంటే ఫిజికల్‌/ఆర్గానిక్‌ ఇలా దేనిపై పట్టు ఉంటుందో దానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
-మంచి ర్యాంకు రావాలంటే కెమిస్ట్రీలో ఫుల్‌ స్కోర్‌ చాలా అవసరం.
-మరో ప్రధాన అంశం కెమిస్ట్రీ మిగిలిన సబ్జెక్టుల్లాగా ఎక్కువ సమయం తీసుకోదు. కాబట్టి దీన్ని బాగా చదివితే తక్కువ సమయంలో అన్ని జవాబులు గుర్తించవచ్చు. దీనివల్ల మిగిలిన సబ్జెక్టుల్లో ఎక్కువ ప్రశ్నలను గుర్తించవచ్చు.
-ఫిజికల్‌, ఇనార్గానిక్‌ కోసం ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ చదవండి. ఆర్గానిక్‌ కోసం మంచి ప్రామాణికమైన బుక్‌ ఏదైనా ఒక దాన్ని చదివితే సరిపోతుంది.
-కెమిస్ట్రీలో పెద్దగా ట్విస్ట్‌ ఇచ్చే ప్రశ్నలు ఉండవు. ప్రీవియస్‌ పేపర్స్‌, మాక్‌ టెస్ట్‌లను తప్పక చేయండి.
-కొత్తగా పెట్టిన న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నల కోసం ప్రీవియస్‌ అడ్వాన్స్‌డ్‌ ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేస్తే సరిపోతుంది.
s-divakar

ప్రాక్టీస్‌ చాలా కీలకం

-ఆబ్జెక్టివ్‌ పరీక్ష కాబట్టి కేవలం థియరీ చదివితే సరిపోదు. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను టైమ్స్‌ ప్రాక్టీస్‌ చేయడం చాలా అవసరం. అంటే గంట సమయంలో ఒక్కో సబ్జెక్టులో ఎన్ని ప్రశ్నలను సాల్వ్‌ చేయగలుగుతున్నారు అనేది ముఖ్యం.
-మ్యాథ్స్‌ సబ్జెక్టులో గంటలో కనీసం 12-15 ప్రశ్నలను సాధించాలి.
-ఫిజిక్స్‌లో అయితే గంటకు కనీసం 18-20 ప్రశ్నలను సాధించాలి.
-కెమిస్ట్రీలో అయితే గంటకు కనీసం 25 ప్రశ్నలు తగ్గకుండా సాల్వ్‌ చేసేలా ప్రాక్టీస్‌ చేయాలి.
-వేగం పెరగడానికి ప్రాక్టీస్‌ ఒక్కటే మార్గం. ఎటువంటి గెస్సింగ్‌లు, ఊహాజనితంగా సమాధానాలు గుర్తించడం ప్రమాదకరం. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉన్న విషయం మర్చిపోవద్దు.

k-k-chaitanya

440
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles