జాతీయ ఉద్యమంగా జలసంరక్షణ


Wed,September 25, 2019 01:58 AM

save-water
నీటి వినియోగంపై అవగాహన పెంచి, ఇప్పటివరకున్న అలవాట్లను మార్చడం జలసంరక్షణ ప్రధాన అంశం. నేటికీ దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో నీటిని అనంతంగా లభించే వనరుగా భావించి వృధా చేస్తున్నవారు చాలామంది ఉన్నారు..! నీటి వినియోగతీరుపై మన తత్వాలను మార్చే అంశాలకు ప్రోత్సాహమివ్వాలి. అట్టడుగు ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు అందరికీ సమీకృత అలవాట్లు రూపకల్పన చేయాలి. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ వనరులునూ సమగ్రంగా వినియోగించాలి. స్వచ్ఛభారత్ మిషన్ కోసం చేసినట్లు అట్టడుగుస్థాయి నుంచి ప్రజా చైతన్యం రావాలి.
-2019-20 బడ్జెట్ సందర్భంగా ప్రధాని మోదీ మన ప్రగతి జాబితాలో నీటికి అధిక ప్రాధాన్యమిచ్చామని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ తరహాలో నీటికోసం కూడా ఒక ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తూ ఆయన ప్రజల భాగస్వామ్యం లేకుండా నీటి పొదుపు సాధ్యంకాదన్నారు. నీటికి సంబంధించిన అన్ని విభాగాలనూ కలిపి జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయడం ఇందులో మొదటి అడుగు. ఇంతకుముందున్న జలవనరుల శాఖ, నదుల అనుసంధాన, గంగా పునరుజ్జీవన విభాగాలను తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వశాఖతో అనుసంధానం చేసి ఈ నూతన మంత్రిత్వ శాఖకు ప్రాణం పోశారు. దీనివల్ల నీటికి, పారిశుధ్యానికి సంబంధించిన అన్ని ప్రోత్సాహక చర్యలను, ప్రణాళికలను ఒక ఉమ్మడి లక్ష్యంతో ముందుకు నడిపే అవకాశం లభించింది.
-ఇప్పటివరకు మన దేశంలో నీటికి సంబంధించిన అన్ని సంస్థాగత చర్యలు కూడా ముక్కలుగా ఉండేవి. ఏడు మంత్రిత్వ శాఖలు, 10 విభాగాలు నీటి నిర్వహణ, వినియోగంపై వివిధ రకాల నిర్ణయాలు తీసుకునేవి. నీతి ఆయోగ్ ఒక సమీకృత జల నిర్వహణ సూచికను రూపొందించి రాష్ర్టాలకు నీటి నిర్వహణలో ర్యాంకులివ్వడం ప్రారంభించడంతో నూతన సమీకరణాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనదేశం నెమ్మదిగా నీటి సంక్షోభంలోకి అడుగుపెడుతున్నది. అందుబాటులో ఉన్న నీటిని మనం ఇప్పటిలానే వినియోగిస్తుంటే 2030 నాటికి మనదేశంలో నీటికి డిమాండ్ అందుబాటులో ఉన్న వనరుల కంటే అధికంగా ఉంటుందని ఒక అంచనా! దీనివల్ల 2050 నాటికి మన స్థూల దేశీయోత్పత్తికి 0.6 శాతం కోత పడుతుంది. దేశంలోని జనాభాలో అత్యధిక మందికి తాగునీరు లభించదు. ఇటీవల తీసిన ఉపగ్రహ చిత్రాలు కూడా దేశంలో పంపులు దీర్ఘకాలంలో ఒట్టిపోతాయని అంచనావేశాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతాయని పేర్కొన్నారు.


సవాలును అధిగమించడం ఎలా?

-వాన నీటి నిలువ, వృథా నీటిని మళ్లీ వినియోగించేలా చేయడం వంటి అంశాల్లో మన చర్యలు కనిపించడంలేదు. మనం దేశం ప్రపంచంలోనే అత్యల్పంగా వాన నీటిలో కేవలం 8 శాతం మాత్రమే నిలువ చేయగలుగుతున్నది. నాణ్యమైన మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో పైపుల ద్వారా అందించే నీటిలో కూడా 40 శాతం వరకు నష్టపోతున్నాం. వృథా నీటిని శుద్ధిచేసి తిరిగి వినియోగించడం దాదాపు శూన్యం. మనలాగే తీవ్ర జల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ వృథానీటిలో దాదాపు 94 శాతం శుద్ధిచేసి తిరిగి వాడుతున్నది. వ్యవసాయానికి వినియోగించే నీటిలో దాదాపు సగం ఇలా శుద్ధి చేసిన నీటినే వినియోగిస్తున్నారు. తాగునీటి విషయానికివస్తే 81 శాతం నివాస ప్రాంతాలు మనిషికి రోజుకు కనీసం 40 లీటర్ల నీటిని ఆ దేశం అదించగలుగుతున్నది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 18-20 శాతం మాత్రమే ఇండ్లకు తాగునీటి పైపుల సౌకర్యం ఉంది. అందుకే ఆర్థికమంత్రి 2024 నాటికి ప్రతి ఇంటికి పైపుల ద్వారా తాగునీరు సరఫరా చేయడం తమ లక్ష్యమన్నారు. దీనికోసం 2019-20కిగాను రూ. 10వేల కోట్లు కేటాయించారు.
-నీటి సంరక్షణ, వనరులను ఎండిపోకుండా కాపాడటం, నిల్వ వంటి కార్యకలాపాలు జలశక్తి మంత్రాలయం పరిధిలోకి వస్తాయి. ఇందులో వీలైన అంశాలన్నింటిలో ప్రజాప్రాతినిధ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఇందులో మహారాష్ట్రలోని హివారే బజార్, ఉత్తరాఖండ్‌లోని స్వజల్ పథకం వంటివాటిని నిశితంగా పరిశీలించాలి.

జల సంరక్షణ

-ఇండ్లలో మరుగుదొడ్డి నీటిని మినహాయించి, మిగిలిన అవసరాలకోసం వాడిన నీరు అంటే వృథా నీటిని శుద్ధి చేసే ఏర్పాట్లను పోత్సాహించడం లేదా అభివృద్ధి చేయడం అవసరం. ఇంట్లో నుంచి వచ్చే వృథా నీటిలో దాదాపు 80 శాతం ఇలాంటిదే. ఈ నీటిని రక్షించుకోవడానికే పెరటిలో చిన్న చిన్న చెలమలను తవ్వడం, ఇంకుడు గుంతల వంటివి ఏర్పాటు చేయాలి. ఇలా శుద్ధి చేసి పరిరక్షించిన నీటిని వ్యవసాయానికి వినియోగించుకోవచ్చు.
-ప్రకృతి సహజ పర్యావరణ వ్యవస్థల (అడవులు, గడ్డి మైదానాలు, నదులు సహా చిత్తడి నేలలు) పరిరక్షణ, పునరుద్ధరణపై దృష్టిసారించాల్సి ఉంటుంది. అలాగే మూలాల్లో సుస్థిరత దిశగా పచ్చదనం పెంపు, నదీతీర మధ్యస్థ అటవీ ప్రదేశాల నిర్వహణ, పొదుపుతో కూడిన జల వినియోగ ఆధారిత వైవిధ్యీకృత వ్యవసాయ పద్ధతుల అనుసరణ, వాననీటి సేకరణకు ప్రోత్సాహం, జలాశయాల్లో నీటినిల్వ, జలపద్ధతుల నిర్వహణ, శుద్ధి-పునర్వినియోగం వంటి చర్యలు కూడా చేపట్టాలి.
-నీటి నాణ్యత పెరుగుదల లక్ష్యం సాధించడానికి చట్టాలను సమర్ధంగా అమలుచేయాలి. దీనికోసం కఠిన నిబంధనలు, కాలుష్య నియంత్రణ, మురుగు పారుదల, పట్టణ వ్యర్ధాలు, పారిశ్రామిక వ్యర్ధాల విడుదలపై ఆంక్షలు విధించాలి. అంతేకాకుండా వ్యవసాయంలో విష రసాయనాల (కీటక నాశనులు, కలుపు మందులు) వాడకంపై నిషేధం కూడా తప్పనిసరి చేయాలి. దీంతోపాటు మురుగుశుద్ధి, జల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు సహజీవసంబంధ పరిష్కార ప్రక్రియలను కూడా అనుసరించవచ్చు.
-దేశంలో విస్తారమైన ప్రాంతం ఏటా కరువులు, వరదలు, సుదీర్ఘ వర్షాభావం వంటివాటి బారినపడటమే కాకుండా విభిన్న ఆరోగ్య పరమైన హానికి గురవుతున్నది. అందువల్ల సమగ్ర జల పరీవాహక నిర్వహణ కార్యక్రమం, వరద నియంత్రణ యంత్రాంగాల ఏర్పాటు, వాతావరణ ప్రతికూలతను తట్టుకోగల వ్యవసాయ పద్ధతులు, ప్రత్యామ్నాయ ఆదాయార్జన కార్యకలాపాలకు ప్రోత్సాహం, సుస్థిర జీవనోపాధి కల్పన వంటివాటికి ముప్పులను కనీస స్థాయికి తగ్గించడంతోపాటు విపత్తుల నిర్వహణకు తోడ్పడుతాయి.

save-water2

జలశక్తి అభియాన్

-నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా తీవ్ర సంక్షోభం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ గ్రామాలకు ఉపయోగపడే విధంగా నీటి నిల్వలను ప్రారంభించాలి. గ్రామస్తులకు భూగర్భ జలాలను రీచార్జి చేయడం నేర్పించాలి. ఇతర స్థానిక సంప్రదాయ నీటి నిలువ విధానాలను కూడా ప్రోత్సహించాలి. దీనికి మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాను మంచి ఉదాహరణగా చూపవచ్చు. ఇక్కడ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో భూగర్భ జల మట్టాలు 40 అడుగులు పెరిగాయి. ఇదే లక్ష్యంతో జలశక్తి మంత్రిత్వశాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 256 జిల్లాల్లో 159 బ్లాకుల్లో జలశక్తి అభియాన్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద దాదాపు 1000 మంది కేంద్రప్రభుత్వ సీనియర్ అధికారులు రాష్ర్టాల్లో నీటి పొదుపు, నిల్వ వంటి అంశాల్లో అవగాహన కల్పిస్తారు.

jal-shakti

సుస్థిర జల నిర్వహణకు మార్గాలు

-సంస్థలు-పరిపాలన: జల నిర్వహణకు ప్రత్యక్షంగా కృషి చేస్తున్న సంస్థల కోసం మానవ వనరులను బలోపేతం చేయడంతోపాటు ఆర్థిక వనరులను పెంచడం అవసరం. నీటి సముచిత వినియోగం, పరిష్కారం కోసం అన్ని స్థాయిల్లో సముచిత పరిపాలన తప్పనిసరి.
-భాగస్వామ్య విధానం: ప్రజల పాత్ర, సాధికారతల దిశగా జాతీయ ఉద్యమానికి భాగస్వామ్య విధానం కచ్చితంగా అవసరం. దీంతోనే నీటి సముచిత వినియోగం, అమూల్య జల వనరుల సమర్ధ నిర్వహణ యంత్రాంగం ఏర్పాటు సాధ్యం.
-జలవిజ్ఞాన నిర్వహణ: జల వనరుల నిర్వహణ చాలా సంక్లిష్టమైన అంశం. అందువల్ల వివిధ సంస్థల మధ్య సహసంబంధ వ్యవస్థీకృత శక్తుల సమన్వయం అవసరం. తద్వారా పర్యావరణ వ్యవస్థ కర్తవ్యాలపై సకారాత్మక విజ్ఞానాభివృద్ధి కొనసాగుతుంది. దీంతో వనరుల సుస్థిరతకు భరోసానివ్వగల జల వనరుల సుస్థిర నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానం రూపొందించడం వీలవుతుంది. జల నిర్వహణలోని వివిధ అంశాలకు ప్రకృతి సహజ పరిష్కారాలను అభివృద్ధి చేస్తే మెరుగైన అవకాశాల అందుబాటుతోపాటు సమస్యల పరిష్కారానికి తోడ్పడుతాయి.
-పర్యావరణ వ్యవస్థ ఆధారిత నిర్వహణ విధానం: ఒంటెద్దు పోకడల నుంచి సంపూర్ణ విధానాలవైపు ప్రాధాన్యక్రమంలో సాగడం అవసరం. దీంతోపాటు ప్రణాళికలు, అంచనాలు, చర్యల రూపకల్పన కోసం నదీ పరీవాహక ప్రాంతాలపై మరింత దృష్టిసారించాలి. పర్యావరణ వ్యవస్థ సమగ్రత నిర్వహణ ప్రాధాన్యాన్ని ప్రజా సమూహాలకు వివరించి అవగాహన పెంచడానికి భారీస్థాయిలో చైతన్యం, ఉత్తేజం కల్పించే ప్రచారం చేపట్టాలి.
-నిరంతర సంరక్షణ: ప్రస్తుత జలవనరుల సంరక్షణతోపాటు నదుల్లో క్షీణించిన జలవనరుల పునఃపూరణకు సంయుక్త కృషి అవసరాన్ని ఈ అంశం స్పష్టం చేస్తుంది. జలవనరుల పరిరక్షణ ద్వారా వాటిని సుస్థిరం చేస్తూ నీటి సముచిత వినియోగం దిశగా జాగ్రత్తలు పాటించాలి.
-సామర్థ్య వికాసం: నీటి వృథాను, సహజ పర్యావరణ వ్యవస్థల క్షీణతను విజయవంతంగా అరికట్టాలంటే సంబంధిత విభిన్న భాగస్వాముల్లో అవగాహన పెంపుతోపాటు వారిలో సామర్థ్య వికాసానికి కృషి చేయాలి. జలవనరుల కోసం జలపద్ధతుల ప్రణాళిక తయారీకి సంబంధించిన చట్టాల చట్రానికి లోబడి ప్రత్యేక నైపుణ్యంగల సంస్థల సేవలను వినియోగించుకుంటూ విజయవంతంగా అమలు చేయగల వ్యూహాలను రూపొందించుకోవాలి.
-గుజరాత్ వంటి రాష్ర్టాల్లో 6 లక్షల మంది రైతులకు, అందులో 50 శాతం చిన్న సన్నకారు రైతులకు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారు. ఇలాంటి చర్యలకు తోడు వృథా నీటిని శుద్ధిచేసే కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తే జలవనరులపై ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చు.

g-n-giridhar

600
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles