కరెంట్ అఫైర్స్


Wed,October 30, 2019 12:52 AM

కొత్తగూడ్ గార్డెన్‌కు ఐఎస్‌వో సర్టిఫికెట్

-హైదరాబాద్‌లోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌కు ఐఎస్‌వో 9001-2015 సర్టిఫికెట్ లభించింది. దీంతో దేశంలోనే మొదటిసారి ఐఎస్‌వో సర్టిఫికెట్ పొందిన పార్కుగా కొత్తగూడ బొటానికల్ గార్డెన్ గుర్తింపు పొందింది. ఈ గార్డెన్‌లో అక్టోబర్ 19న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ద్వారా తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ రఘువీర్ ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఎకో టూరిజం పేరుతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ఐఎస్‌వో లభించింది.

పోలీస్ శాఖకు ఐటీ ఎక్సలెన్స్ అవార్డు

ఆధునిక టెక్నాలజీ వినియోగంలో దేశంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు ఐటీ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. అక్టోబర్ 21న పోలీస్ వెల్ఫేర్ ఏడీజీ సౌమ్యామిశ్రాకు ఐటీ ఎక్సలెన్స్ అవార్డును ఎక్స్‌ప్రెస్ కంప్యూటర్ సంస్థ అందజేసింది. పోలీస్ శాఖ సంక్షేమ విభాగానికి చెందిన దాదాపు 3 లక్షల ప్రొఫైల్స్‌ను డిజిటలైజేషన్ చేయడంతోపాటు ఆరోగ్య భద్రత, గృహరుణాలు, రుణాల దరఖాస్తులు తదితరాలకు ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టినందుకు ఈ అవార్డు దక్కింది.

ఉత్తమ జిల్లా పరిషత్‌గా ఆదిలాబాద్

సామాజిక అభివృద్ధి, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు 2017-18కిగాను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తీకరణ్ పురస్కార్(డీడీయూపీఎస్‌పీ)కు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఎంపికైంది. డీడీయూపీఎస్‌పీ మండల పరిషత్తు విభాగంలో మంథని (పెద్దపల్లి), వెల్గటూరు (జగిత్యాలు), పంచాయతీలకు సంబంధించి స్వచ్ఛత విభాగంలో మల్కాపూర్ (మెదక్), మల్లారం (పెద్దపల్లి), సామిజిక క్షేత్రాల అభివృద్ధిలో ఇర్కోడ్ (సిద్దిపేట), సాధారణ పురస్కారానికి నాగాపూర్ (నిజామాబాద్)లకు పురస్కాలు లభించాయి. బాలమిత్ర పంచాయతీ పురస్కారానికి పైడిమడుగు (జగిత్యాల) నానాజీ దేశ్‌ముఖ్ గౌరవ గ్రామసభ పురస్కారానికి రాఘవాపూర్ (పెద్దపల్లి) ఎంపికయ్యాయి. ఈ అవార్డులను అక్టోబర్ 23న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అందజేశారు.

నాస్కామ్ అధ్యక్షురాలితో కేటీఆర్ భేటీ

నాస్కామ్ అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అక్టోబర్ 25న ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. 2020ను కృత్రిమ మేథస్సు సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు.
Garden

హెచ్‌సీయూకు 8వ ర్యాంకు


అక్టోబర్ 22న విడుదలైన క్యూఎస్ ఇండియా యూనివర్సిటీస్ ర్యాంకింగ్-2020లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి 8వ స్థానం దక్కింది. అలాగే ఐఐటీ హైదరాబాద్ 15, ఉస్మానియా యూనివర్సిటీ 33, ఇక్ఫాయ్ వర్సిటీ 76-80 మధ్య స్థానాల్లో ఉన్నాయి. 100 ర్యాంకులతో ప్రకటించిన ఈ జాబితాలో ఐఐటీ బొంబాయి మొదటిస్థానంలో ఉండగా.. ఐఐఎస్ బెంగళూరు 2, ఐఐటీ ఢిల్లీ 3, ఐఐటీ మద్రాస్ 4, ఐఐటీ ఖరగ్‌పూర్ 5, ఐఐటీ కాన్పూర్ 6, ఢిల్లీ యూనివర్సిటీ 7, ఐఐటీ రూర్కీ 9, ఐఐటీ గువాహటి 10వ స్థానాల్లో నిలిచాయి. విద్యాపరమైన గుర్తింపు, ప్రొఫెసర్ల ప్రతిభ, అధ్యాపక-విద్యార్థి నిష్పత్తి, పీహెచ్‌డీలు లాంటి ఎనిమిది అంశాలను కొలమానంగా తీసకుని ఈ ర్యాంకులను ప్రకటించారు.

బ్రిడ్‌జిటల్ నేషన్ పుస్తకావిష్కరణ


టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ ముఖ్య ఆర్థికవేత్త రూప పురుషోత్తం రచించిన బ్రిడ్‌జిటల్ నేషన్ పుస్తకాన్ని ప్రధాని మోదీ అక్టోబర్ 20న ఆవిష్కరించారు.
National

కల్నల్ చెవాంగ్ రించెన్ బ్రిడ్జి ప్రారంభం


జమ్ముకశ్మీర్‌లో ష్యోక్ నది సమీపంలోని తూర్పు లడఖ్‌లో నిర్మించిన 1400 అడుగుల కల్నల్ చెవాంగ్ రించెన్ బ్రిడ్జిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 21న ప్రారంభించారు. ఈ సదర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమిగా పేరుగాంచిన జమ్ముకశ్మీర్‌లోని సియాచిన్‌పైకి పర్యాటకులను అనుమతిస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. సియాచిన్ సముద్రమట్టానికి దాదాపు 20 వేల అడుగుల ఎత్తులో ఉంది.

ఐ సన్‌క్యాప్ సదస్సు


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) ఆధ్వర్యంలో ఐ సన్‌క్యాప్ 24వ సమావేశం న్యూఢిల్లీలో అక్టోబర్ 21న నిర్వహించారు. 2030 నాటికి సౌర విద్యుదుత్పత్తి రంగంలో రూ.70 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ సమక్షంలో రిపబ్లిక్ ఆఫ్ బోట్సువానా ప్రతినిధులు అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్‌ఏ)లో చేరేందుకు సంతకాలు చేశారు.

ఇమ్నెక్స్ నౌకా విన్యాసాలు


ఇమ్నెక్స్-19 పేరుతో విశాఖపట్నంలో భారత్-మయన్మార్ నౌకా విన్యాసాలు అక్టోబర్ 19న ప్రారంభమయ్యాయి. ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్‌పై నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మిరియం కాలేజీలో గాంధీ విగ్రహం

ఫిలిప్పీన్స్‌లోని మిరియం కాలేజీలో సెంటర్ ఫర్ పీస్ ఎడ్యుకేషన్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహాన్ని అక్టోబర్ 20న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు.
International

గిన్నిస్ బుక్‌లోకి ట్రినిటీ చాక్లెట్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌గా ట్రినిటీ-ట్రపుల్స్ ఎక్స్‌ట్రార్డినేర్ అక్టోబర్ 22న గిన్నిస్ బుక్‌లోకెక్కింది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఐటీసీకి చెందిన ఫాబెల్లె బ్రాండ్ తయారుచేసిన ఈ చాక్లెట్ ఖరీదు కేజీ రూ.4.3 లక్షలుగా నిర్ణయించారు. ఫ్రాన్స్‌కు చెందిన చాక్లె ట్ తయారీ నిపుణుడు ఫిలిప్ కొంటిచినీ, ఫాబెల్లోలోని భారత నిపుణులు సంయుక్తంగా దీన్ని తయారుచేశారు.

ఇండోనేషియా అధ్యక్షుడిగా విడోడో

ఇండోనేషియా అధ్యక్షుడిగా జోకో విడోడో రెండోసారి అక్టోబర్ 21న బాధ్యతలు స్వీకరించారు. విడోడో పార్టీకి 55.5 శాతం ఓట్లు రాగా ప్రత్యర్థి గెరిండా పార్టీ నేత ప్రబోవో సుచియంటోకు 44.5 శాతం ఓట్లు లభించాయి.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచీ

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి రూపొందించిన నివేదికను ప్రపంచ బ్యాంక్ అక్టోబర్ 24న విడుదల చేసింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో నిలువగా సింగపూర్ 2, హాంకాంగ్ 3, డెన్మార్క్ 4, కొరియా 5, అమెరికా 6వ స్థానాల్లో నిలిచాయి. భారత్ 63వ స్థానంలో నిలిచింది. ఎరిత్రియా 189, సోమాలియా 190వ స్థానాల్లో నిలిచాయి.


నాగరాజన్‌కు మగుదం అవార్డు

రామ్‌రాజ్ కాటన్స్ చైర్మన్ కేఆర్ నాగరాజన్‌కు 2019కు గాను మగుదం అవార్డు లభించింది. ఈ అవార్డును అక్టోబర్ 21న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రదానం చేశారు. క్రీడలు, వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ, కళలు, సాహిత్యం లాంటి రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు ఈ అవార్డును ఇస్తారు.

రాయబారులుగా సింధు, దీపిక

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటి దీపికా పదుకొనేలను భారత్ కీ లక్ష్మి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రధాని మోదీ అక్టోబర్ 22న ప్రకటించారు. వేర్వేరు రంగాల్లో మహిళా సాధికారతకు తోడ్పడిన స్త్రీ మూర్తులను 2019 దీపావళి సందర్భంగా భారత్ కీ లక్ష్మి పేరుతో గౌరవించుకుందామంటూ ఇటీవలి మన్ కీ బాత్‌లో ప్రధాని పిలుపునిచ్చారు. దీనికి సింధు, దీపిక మద్దతు ప్రకటించారు.
Persons

కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో

కెనడా ప్రధాన మంత్రిగా జస్టిన్ ట్రూడో రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ 22న జరిగిన ఎన్నికల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ 157 స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 338 స్థానాలకు (ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్స్) ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం 170. దీంతో 24 స్థానాలు గెలుచుకున్న భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) పాత్ర నిర్ణయాత్మకంగా మారింది.


ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ విజేత హారిక

ఫిడే గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక విజేతగా నిలిచింది. అక్టోబర్ 22న డగ్లస్ (ఐసిల్ ఆఫ్ మ్యాన్)లో జరిగిన ఈ టోర్నీలో హారిక 5.5 పాయింట్లతో దినారా (కజకిస్థాన్)తో కలిసి సమంగా నిలిచింది. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హారికకు తొలి స్థానం, దినారాకు రెండో స్థానం లభించాయి.

జెరెమీకి స్వర్ణం

ఆసియా జూనియర్, యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రినుంగాకు స్వర్ణం లభించింది. అక్టోబర్ 22న ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో జరిగిన 67 కేజీల విభాగంలో జెరెమీ (16 ఏండ్లు) మొత్తం 299 కేజీల బరువెత్తి విజేతగా నిలిచాడు. అలాగే తాను 2019, ఏప్రిల్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌లో సృష్టించిన ప్రపంచ రికార్డును సవరించాడు.

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ

బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా (బీసీసీఐ)కు 39వ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికయ్యారు. అక్టోబర్ 23న జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో గంగూలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మాహిమ్ వర్మ, కార్యదర్శిగా జై షా, కోశాధికారిగా అరుణ్‌సింగ్ ధమాల్, సంయుక్త కార్యదర్శిగా జయేష్ జార్జ్ ఎన్నికయ్యారు.
Sports

65వ గ్రాండ్ మాస్టర్‌గా రౌనక్

నాగ్‌పూర్‌కు చెందిన రౌనక్ సిధ్వాని భారత 65వ గ్రాండ్ మాస్టర్ (జీఎం)గా గుర్తింపు పొందాడు. అక్టోబర్ 20న ఐసిల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీ చెస్ టోర్నీలో విజయంతో అతడికి గ్రాండ్ మాస్టర్ హోదా లభించింది. పిన్న వయస్సులో (13 ఏండ్ల 9 నెలల 28 రోజులు) జీఎం హోదా పొందిన ఏడో ఆటగాడిగా, భారత్ నుంచి మూడో వ్యక్తిగా రౌనక్ నిలిచాడు. ప్రపంచ చెస్‌లో చిన్న వయస్సులో జీఎం హోదా పొందిన ఆటగాడి రికార్డు సెర్గీ కర్జాకిన్ (12 ఏండ్ల 7 నెలలు, రష్యా) పేరిట ఉంది.

బుమ్రా, స్మృతికి విజ్డెన్ పురస్కారాలు

అక్టోబర్ 25న ప్రకటించిన ప్రతిష్ఠాత్మక విజ్డెన్ ఇండియా అల్మానక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2019 అవార్డులు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహిళ బ్యాట్స్ ఉమన్ స్మృతి మంధానలకు లభించాయి. మొత్త ఐదుగురికి ఈ అవార్డులను ప్రకటించగా.. అందులో భారత్ నుంచి వీరిద్దరికి చోటో దక్కింది. మిగిలినవారిలో ఫకర్ జమాన్ (పాకిస్థాన్), దిముత్ కరుణరత్నె (శ్రీలంక), రషీద్ ఖాన్ (ఆఫ్ఘాన్) ఉన్నారు.

విజయ్ హజారే విజేత కర్ణాటక

దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2019-20 సీజన్ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అక్టోబర్ 25న జరిగిన ఫైనల్లో కర్ణాటక తమిళనాడు జట్టుపై విజయం సాధించి నాలుగోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. అభిమన్యు మిథున్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

576
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles