గ్రూప్-2 విజేతలు- అనుభవాలు


Wed,October 30, 2019 01:31 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహించిన గ్రూప్-2 సర్వీస్ ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నిశితంగా గమనిస్తే దీర్ఘకాలంపాటు పట్టువదలకుండా ఒక క్రమపద్దతిలో కష్టపడి చదివిన వారే సర్వీసులకు ఎంపికైనట్టు అర్థమవుతున్నది. విజయానికి షార్ట్‌కట్ లేదని వీరిని చూస్తే అర్థమవుతుంది. సర్వీసులు సాధించిన అభ్యర్థులకు నిపుణ శుభాకాంక్షలు తెలుపుతున్నది. గ్రూప్ -2 సర్వీసులు సాధించిన అభ్యర్థుల అనుభవాలు, ప్రస్తుతం పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు వీరి సూచనలు, సలహాలు నిపుణ పాఠకులకు అందిస్తున్నాం.


ఏ దీప్తి
ఎన్‌జీ కొత్తపల్లి, శాలిగౌరారం
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎండోమెంట్స్
deepthi

కుటుంబ నేపథ్యం

-తండ్రి సత్యనారాయణరెడ్డి వ్యాపారస్తులు, తల్లి సునంద గృహిణి. భర్త శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు.

ఎడ్యుకేషన్ వివరాలు

-పాఠశాల విద్య నల్లగొండ పట్టణంలోని ఆల్ఫా పబ్లిక్ స్కూల్‌లో పూర్తిచేశాను. నల్లగొండ NG కాలేజ్‌లో B.Sc. చదివాను. హైదరాబాద్‌లో M.Sc. కెమిస్ట్రీ చదివి, ఉస్మానియా యూనివర్సిటీలో MA తెలుగు పూర్తిచేశాను. అనంతరం మహాత్మాగాంధీ లా కాలేజ్‌లో LLB చదివాను.

చదివిన పుస్తకాలు

-తెలుగు అకాడమీ పుస్తకాలు చదివాను. నమస్తే తెలంగాణతోపాటు పలు దినపత్రికల్లో వచ్చే ఎడ్యుకేషనల్ ఆర్టికల్స్ చదివేవాడిని. వీటితోపాటు సొంతంగా తయారు చేసుకున్న నోట్స్ ప్రిపేర్ అయ్యాను.

గ్రూప్-2 కోసం, కోచింగ్ తీసుకున్నారా?

-గ్రూప్-2 కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదివాను.

ఇంటర్వ్యూకు ఎలా ప్రిపేర్ అయ్యారు?

-ఇంటర్వ్యూ కోసం బీసీ స్టడీ సర్కిల్, ఎస్టీ స్టడీ సర్కిల్‌లలో నిర్వహించే మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను.

ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు?

-మహిళల సమస్యలు, వివాహిత మహిళలు ఉద్యోగంలో సమర్థంగా ఎలా రాణించగలరు? హాబీస్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, పోస్టు ప్రిఫరెన్స్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూ 10-15 నిమిషాలపాటు స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

పోటీ పరీక్షల్లో ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఏం చేశారు?

-ఒత్తిడిని ఎదుర్కోవడానికి ద్యానం చాలా ఉపయోగపడింది.

ప్రిపరేషన్ కోసం టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకున్నారు?

-ఉదయం 3 గంటలకు లేచి చదివేదాన్ని. నోటిఫికేషన్ తర్వాత రోజుకు 10-12 గంటలు నిర్దిష్ట ప్రణాళికతో చదివాను. ఎక్కువసార్లు రివిజన్ చేయడం చాలా ఉపయోగపడింది.

పోటీపరీక్షలకు హాజరయ్యే వారికి మీరిచ్చే సలహా?

-నోటిఫికేషన్ కోసం ఎదురుచూడకుండా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకుని నిరంతరం పట్టుదల, ఏకాగ్రతతో చదవడం పోటీపరీక్షల్లో విజయానికి అత్యంత కీలకం. పరీక్షకు ముందు ఎక్కువసార్లు రివిజన్ చేయడం కూడా పోటీపరీక్షల్లో విజయానికి ఉపయోగపడుతుంది.

బోజపల్లి శ్రవణ్ కుమార్
గోదావరిఖని, డిప్యూటీ తహసీల్దార్

-1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గోదావరిఖనిలో చదివాను. తర్వాత కరీంనగర్ DIETలో D.Ed పూర్తిచేసి, కాకాతీయ యూనివర్సిటీలో B.Sc చేశాను. 2006 డిఎస్సీలో SGTగా ఎంపికయ్యాను. తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో B.Ed పూర్తిచేసి, 2012 డిఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా (మ్యాథ్స్) ఎంపికయ్యాను. ఆ తర్వాత దూరవిద్య ద్వారా ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తిచేశాను.
-హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత సొంతంగా సమాచారం సేకరించుకుని ప్రిపేర్ అయ్యాను.
-తెలుగు అకాడమీ పుస్తకాలతోపాటు, సుంకర రమాదేవిగారి భారత రాజ్యాంగం, వి. ప్రకాష్‌గారు రాసిన తెలంగాణ ఉద్యమచరిత్ర, ఇతర పుస్తకాలు చదివాను. కోచింగ్ సెంటర్లకు సంబంధించిన క్లాస్‌రూం నోట్స్, దినపత్రికల్లో వచ్చే ఎడ్యుకేషనల్ ఆర్టికల్స్‌ను సేకరించి, సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదివాను.
-నోటిఫికేషన్ రిలీజ్ కాకముందు నుంచే ప్రతిరోజు కొంత సమయం కేటాయించుకుని ప్రిపేర్ అయ్యాను. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ప్రతిరోజు 10-12 గంటల చొప్పున చదివాను. పరీక్ష తేదీ వరకు కనీసం రెండుసార్లు రివిజన్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకున్నాను.
-ప్రతిరోజు 10 గంటల చొప్పున ప్రిపేర్ అయినప్పటికీ, మధ్యమధ్యలో తగినంత విరామం తీసుకునే వాడిని. రోజూ కొంతసేపు కుటుంబసభ్యులతో గడపటంతోపాటు, ప్రతిరోజు 6-8 గంటల చొప్పున నిద్ర ఉండేలా చూసుకోవడంతో ఒత్తిడికి గురికాకుండా చూసుకున్నాను.
-వృత్తిపరమైన అంశాలు, వర్తమాన సామాజిక అంశాలను షార్ట్స్ నోట్స్ రాసుకున్నాను. ముందస్తుగా ఇంటర్వ్యూకి సంబంధించి మాదిరి ప్రశ్నావళిని రూపొందించుకుని, స్నేహితులతో గ్రూప్ డిస్కషన్, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించుకునేవాడిని.
-1. స్వాతంత్య్రానంతరం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏమిటి?, 2. విద్యార్థులు గణితం అంటే ఎందుకు భయపడుతారు?, 3. జిల్లాల పునర్విభజనవల్ల జరిగే లాభం ఏమిటి?, 4. అధికారుల్లో అవినీతికి సంబంధించి నీ అభిప్రాయం ఏమిటి? తదితర ప్రశ్నలు ఎదుర్కొన్నాను.

సుజాత అనంతు
కోదాడ, మున్సిపల్ కమిషనర్

-నాపేరు సుజాత అనంతు. నాన్న సైదయ్య రైతు, అమ్మ గృహిణి. భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రూప్-2 ఫలితాల్లో స్టేట్ 5వ ర్యాంక్ రావడం.. మున్సిపల్ కమిషనర్‌గా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. 2014 గ్రూప్స్‌లో పంచాయతీరాజ్ సెక్రటరీగా సెలక్ట్ అయ్యాను. ముందుగా కొద్దికాలం కోచింగ్ తీసుకున్న తర్వాత సొంతంగా ప్రిపేర్ అయ్యాను. ప్రామాణిక పుస్తకాల అధ్యయనంతో పాటు నమస్తే తెలంగాణ నిపుణ, హిందూ ఆర్టికల్స్ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రతి రోజు ఎన్ని గంటలు, ఎన్ని సబ్జెక్ట్స్ చదివినా వాటిని ట్రాక్ చేసుకొని దానికి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ప్రతి అంశాన్ని స్నేహితులతో చర్చిస్తూ సొంతగా నోట్స్ ప్రిపేర్ చేసేవాళ్లం.
-క్రమం తప్పకుండా చదవడం, ప్రామాణిక పుస్తకాలు, ఒకే పుస్తకాన్ని ఎక్కువసార్లు చదవడం, హార్డ్ వర్క్‌తో కూడిన స్మార్ట్‌వర్క్ జాబ్ సాధించడానికి ఉపయోగపడ్డాయి. ప్రతి సబ్జెక్టుకు వివిధ స్ట్రాటజీలు అంటే మ్యాప్ పాయింట్స్, పాలిటీలో ఆర్టికల్స్, ఆక్రోనిమ్స్, సొంతంగా చాప్టర్‌వైజ్ రాసుకొని ప్రతిరోజు నిద్రలేవగానే, పడుకునేముందు చదివేదానిని. ఇంటర్వూ కోసం కరెంట్ అఫైర్స్, రాజ్యసభ చానల్, విశ్లేషణలు ఎక్కువగా చూశాను. గ్రామీణ, పట్టణ ఎన్నికల సరళి, తేడాలు, ఓటింగ్ శాతం ఎందుకు తక్కువ, విడాకుల తర్వాత భార్యకు మనోవర్తి ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై మా అభిప్రాయం వంటి అంశాలపై ప్రశ్నలు ఇంటర్వ్యూలో అడిగారు. ధ్యానం, విజయం సాధిస్తే కలిగే ఆనందాన్ని ఊహిస్తూ ఒత్తిడిని అధిగమించేదాన్ని. రిక్రూట్‌మెంట్ కోర్టు తీర్పులతో ఆలస్యమైనా ఎలాగైనా చివరకు మేమే విజయం సాధిస్తామనే నమ్మకంతో మిత్రులందరం ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్లాం.
-కష్టపడటంతో పాటు ఇష్టపడి చదివితే ఏదైనా సాధ్యమవుతుంది. కొంచెం ఆలస్యమైనా విజయం తప్పకుండా వరిస్తుంది. చదివే విధానంలో మార్పు చేసుకుంటూ ఎలా ప్రశ్నలు వస్తాయనే దానిపై అవగాహన పెంచుకుంటే మంచి స్కోర్ చేయడం సులువే.
-చేసేపనిలో నిజాయితీ ఉంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి, వాతావరణం మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది.

రాము
కరీంనగర్, సబ్‌రిజిస్ట్రార్
ఫిజియోథెరపీ చదవి సబ్ రిజిస్ట్రార్‌గా ఎంపిక!

-మా నాన్న రఘురాం రిటైర్డ్ ఎంప్లాయ్. అమ్మ శాంత గృహిణి. డిగ్రీలో ఫిజియోథెరపీ చేసిన నేను ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే గ్రూప్ -2లో విజయం సాధించాను. దీనికోసం ప్రతిరోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు క్వాలిటీగా ప్రిపేర్ అయ్యాను. ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే ప్రత్యేకంగా ప్రిపేర్ కానప్పటికీ రెగ్యులర్‌గా కరంట్ అఫైర్స్, దినపత్రికలను చదివాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉండే ఆందోళన కూడా మంచి చేస్తుంది. దీనివల్ల ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటాం. అదేవిధంగా వేసుకున్న టైంటేబుల్‌ను క్రమశిక్షణతో ఫాలో కావడం విజయానికి దోహదం చేసింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. సరిపోయినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి నేనిచ్చే సలహా నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. ప్రిపరేషన్‌ను ఎంజాయ్ చేయాలి. ఓపిక చాలా అవసరం. ఇవి ఉంటే తప్పక విజయం మీ సొంతం అవుతుంది.

సిహెచ్ రాఘవేందర్
వికారాబాద్, ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్

-వికారాబాద్ జిల్లా, నవాబ్‌పేట మండలం, నరెగూడ గ్రామం. నాన్న పాలవ్యాపారి. ఇంటింటికి తిరిగి పాలు పోస్తాడు. అమ్మ గృహిణి. మానాన్న కష్టం చూసి...ఎలాగైనా ఉన్నత కొలువు సాధించాలనే లక్ష్యంతో శ్రమించి ఇవ్వాల ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సాధించాను. మొదట్లో కోచింగ్ తీసుకున్నాక...తర్వాత ప్రతిరోజు నిర్ధిష్ట ప్రణాళికతో ప్రతిరోజు 12గంటలు చదువుతూ...గ్రూప్స్ నోటిఫికేషన్‌తో పాటు మిగతా నోటిఫికేషన్లకు కూడా ప్రిపేర్ అయ్యాను. ఇంటర్వూను ఎదుర్కొనేందుకు స్నేహితులందరం కలిసి చర్చించుకునేవాళ్లం. ఇలా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఇంటర్వూను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. ఉద్యోగ సాధనలో మా తల్లిదండ్రులకు, నా మిత్రురాలు నాకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు లక్ష్యాన్ని నిర్ధేశించుకోని..దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోని ముందుకు సాగితే విజయం మన సొంతమవుతుంది.

శ్రీనివాస్ రెడ్డి
ఉదమల్‌గిద్ద, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్

ఎంఎస్‌డబ్ల్యూ ఎందుకు చేశావ్..

-మాది నారాయణపేట జిల్లాలోని ఉద్‌మల్‌గిద్ద. డిగ్రీ వరకు జిల్లాలోనే చదువుకున్నాను. డిగ్రీలో బీజెడ్‌సీ తర్వాత బీఈడీ, ఎంఈడీ చేశాను. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఎంఎస్‌డబ్ల్యూ పూర్తి చేశాను. పీజీ చేస్తుండగానే పోటీ పరీక్షలకు సన్నద్ధమవడం ప్రారంభించాను. దీనికోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాను. ప్రిపరేషన్‌లో భాగంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు, వివిధ వార, దిన పత్రికలు తప్పనిసరిగా చదివాను. అదేవిధంగా సిలబస్‌లోని అంశాలను కఠినమైన, సులభమైన వాటిగా విభజించుకున్నాను. అందులో కఠినమైన వాటికి ఎక్కువ సమయం కేటాయించాను. ఇలా రోజుకు ఎనిమిది నుంచి 10 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాను. ఏకాగ్రతతో చదివడానికి ప్రయత్నించాను. తెలియని అంశాలను గురించి మిత్రులతో చర్చించేవాన్ని. ఇలా సందేహాలను నివృతి చేసుకున్నాను. ఇంటర్వ్యూలో నా బయోడేటాలో పొందుపర్చిన అలవాట్లు (వ్యవసాయం), మా ప్రాంతంలో పండించే పంటలు, రైతుల పెట్టుబడి, పంట దిగుబడి, లాభ నష్టాల గురించి అడిగారు. అదేవిధంగా టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియా వల్ల జరుగుతున్న పరిణామాలపై అభిప్రాయం, వాటిని కొనసాగించాలా లేదా నిషేధించాలా, ఎండీ పూర్తి చేసి టీచింగ్ వైపు వెళ్లకుండా గ్రూప్స్‌కి ఎందుకు వచ్చారు, ఎంఎస్‌డబ్ల్యూ ఎందుకు చేశారు అనే ప్రశ్నలు అడిగారు. అందువల్ల అన్ని విషయాలపై విస్తృతమైన అవగాహన ఉండటం చాలా అవసరం. అదేవిధంగా సిలబస్‌పై పట్టు, దానికి అనుగుణంగా సరైన పుస్తకాలను ఎంచుకోవడం, బట్టీ పట్టకుండా ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని చదివితే విజయం సాధించవచ్చు.

బిరాదార్
మనోహర్‌రావు, సిర్గాపూర్ , డిప్యూటీ తహసీల్దార్

ఉజలంపాడ్ ఆణిముత్యం
పట్టుదల, కృషి ఉంటే విజయానికి ఎదురేలేదు అని నిరూపించాడు ఉజలంపాడ్‌కు చెందిన బిరాదార్ మనోహర్ రావు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో స్టేట్ 3వ ర్యాంకు సాధించి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. రాష్ట్ర అవతరణ అనంతరం టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షల్లో నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. గ్రూప్స్ ఫలితాలు ఆలస్యమవడంతో స్కూల్ అస్టిటెంట్‌గా పనిచేస్తున్నారు. అయితే మండలాధికారిగా పనిచేయాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
-సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్‌కు చెందిన మనోహర్‌రావుది వ్యవసాయ కుటుంబం. నాన్న బిరాదార్ పండరీనాథ్‌రావు రైతు. అమ్మ కమలాబాయి అంగన్‌వాడీ టీచర్. తన విజయానికి సంబంధించిన విషయాలను మనోహర్ రావు నమస్తే తెలంగాణ-నిపుణతో పంచుకున్నారు..
-ప్రాథమిక విద్య ఉజలంపాడ్‌లోనే పూర్తిచేశాను. ఆరు నుంచి పది వరకు నారాయణఖేడ్‌లోని ప్రతిభ హైస్కూల్‌లో, ఇంటర్, డిగ్రీ అనురాధ కాలేజీలో, హైదరాబాద్‌లోని వీవీ కళాశాలలో పీజీ ఎకనామిక్స్ పూర్తిచేసి, గోల్డ్ మెడల్ సాధించాను. అనంతరం పోటీ పరీక్షలకు ప్రిపేరవ్వడం ప్రారంభించాను.
-హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నాను. దీంతోపాటు ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యాను. వారు అందించిన స్టడీ మెటీరియల్, కరెంట్ అఫైర్స్ నా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
-తెలుగు అకాడమీకి చెందిన పుస్తకాలు, కోచింగ్ సెంటర్ అందించిన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, ఎకనామిక్స్ మెటీరియల్, భారత రాజ్యాంగానికి సంబంధించి రమాదేవి పుస్తకం, జనరల్ స్టడీస్ కోసం చాలా పుస్తకాలు చదివాను.
-ప్రిపరేషన్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి టైంటేబుల్ రూపొందించుకోలేదు. సమయం దొరికనప్పుడు చదివేవాన్ని. ఎక్కువగా రాత్రిపూట ప్రశాంత వాతావరణంలోనే చదివాను. రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించేవాన్ని.
-ప్రధానంగా వివిధ వార్తా ప్రతికలు, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటర్వ్యూలు తప్పకుండా చూశాను. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సామాజిక, ఆర్థిక సాంస్కృతిక, అంశాలపై పూర్తి అవగాహనతో ప్రిపేర్ అయ్యాను.
-ఇంటర్వ్యూ బోర్డులో ఘంటా చక్రపాణి బోర్డు నాకు అలాట్ అయింది. ఇంటర్వ్యూ 20 నిమిషాల పాటు జరిగింది. ప్రధానంగా రాజకీయ విశేషాలు, సామాజిక సమస్యలు, అవినీతి నిర్మూలన, విద్యావ్యవస్థపై ప్రశ్నలు అడిగారు.
-నీవు రాజకీయాల్లోకి ఎందుకు రాలేక పోయావు అని అడిగారు. దానికి ప్రస్తుత రాజకీయాలకు తాను సరిపోనని చెప్పాను. మణిపూర్‌లో ప్రజల సంక్షేమం కోసం ఇరోమ్ షర్మిల 16 ఏండ్లపాటు నిర్విరామంగా నిరాహార దీక్ష చేశారు. ఆమె దీక్ష విరమించిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తే 90 ఓట్లు మాత్రమే వచ్చాయని ఉదాహణతో వివరించాను.
-స్నేహితులతో మాట్లాడటం, మా గురువు విఠల్ గారితో మాట్లాడి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేవాడ్ని. మరీ వత్తిడి అనిపిస్తే సినిమా చూడటం, క్రికెట్ ఆడటం వంటివి చేశాను.
-గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ జాప్యమైనందుకు నేను కూడా కొంత వత్తిడికి లోనయ్యాను. కానీ పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు ఎంపికయ్యాను. పీజీటీ ఉద్యోగంలో చేరి నారాయణఖేడ్‌లోని బీసీ వెల్ఫేర్ గురుకులంలో వైస్ ప్రిన్సిపాల్‌గా చేరి రెండేళ్ల పాటు పని చేశాను. ఆ తర్వాత నిర్వహించిన టీఆర్‌టీలో స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. పీజీటీ వదిలేసి చాప్టా ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరాను. మూడు నెల్లలోనే గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు వచ్చింది.
-పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారికి సిలబస్‌పై పూర్తిగా అవగాహన ఉండాలి. ప్రామాణికమైన పుస్తకాలు చదవాలి. సమయాన్ని వృథా చేయకూడదు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి. విశ్లేషనాత్మకంగా పూర్తి అవగాహనతో చదవడం వల్ల మంచి మార్కులు సంపాదించవచ్చు.

కంతి శ్రీనివాస్,
సిర్గాపూర్ మండలం, సంగారెడ్డి జిల్లా

మండల అధికారి అవ్వాలనేదే నా లక్ష్యం
-గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన నేను.. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాలని మండల అధికారి కావాలనుకున్నాను. ఇప్పుడు నా ఆశయం నెరవేరింది. డిప్యూటీ తహసీల్దార్‌గా నాకు జాబ్ వచ్చింది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మంచి అధికారిగా పేరు తెచ్చుకుంటాను. టీఎస్‌పీఎస్సీ పారదర్శకతతో, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం ద్వారానే నేను ఇప్పటి వరకు నాలుగు సర్కారు కొలువులకు ఎంపికయ్యాను.

వారణాసి సనత్‌కుమార్
మల్లారం, డిప్యూటీ తహసీల్దార్

-మాది భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావ్ మండలం, మల్లారం గ్రామం. టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఎంపికవడం చాలా గర్వంగా ఉంది. మా నాన్న హరిప్రసాద్ వ్యాపారం చేసేవారు. అమ్మ గృహిణి. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగా చదివాను. తెలుగు అకాడమీ బుక్స్, నమస్తే తెలంగాణ నిపుణ, విజన్ కరెంట్ అఫైర్స్, మ్యాగజైన్స్, వి ప్రకాశ్ సార్ తెలంగాణ హిస్టరీ పలు ఆర్టికల్స్ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. రోజూ 10గంటలు చదువుతూ.. ప్రతి అంశాన్ని షార్ట్‌నోట్స్ రాసుకుని చదవడంవల్ల టైమ్ సేవ్ అయ్యేది. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ధ్యానం, వ్యాయామం చేసేవాడిని దీంతో పాటు రామకృష్ణ మఠంలో వివిధ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సులకు హాజరయ్యేవాడిని. దీనివల్ల ప్రిపేరయ్యే సమయంలో ఒత్తిడి దరిచేరేదికాదు. ఇలాంటి పరీక్షలకు ప్రిపేరవాలంటే చాలా వరకు ఓపిక అవసరం. కొన్నేండ్లపాటు ఎదురుచూడాల్సి వస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేసుకొని నోటిఫికేషన్ లేనప్పుడు సబ్జెక్ట్స్ చదువుతూ.. నోటిఫికేషన్ వచ్చాక పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఎలాంటి కోచింగ్ లేకున్నా ప్రణాళికబద్ధంగా చదివితే విజయం సొంతమవుతుంది. ఇంటర్వ్యూ ఎదుర్కోవడానికి మా మిత్రులందరం కలిసి ఒకరికొకరు మాక్ ఇంటర్వ్యూలు చేసుకునేవాళ్లం. అలా ఇంటర్య్యూను అలవోకగా ఎదుర్కొన్నాం. అమ్మనాన్నల ప్రోత్సాహం, సాధించాలన్న పట్టుదల నన్ను విజయతీరాలకు చేర్చింది. పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లే విజయం మన సొంతమవుతుంది.

మల్లెల శ్రావ్యారెడ్డి
మద్దూర్, చిన్నచింతలకుంట , అసిస్టెంట్ రిజిస్ట్రార్, కో ఆపరేటివ్ సొసైటీ

-మాది మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతలకుంట మండలం మద్దూర్ గ్రామం. 2015లో బీటెక్ ఐటీ కంప్లీట్ చేశాను. నాన్న రిటైర్డ్ వీఆర్వో, అమ్మ గృహిణి. గ్రూప్స్ ఫలితాల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్‌కు ఎన్నిక కావడం చాలా సంతోషాన్ని కలిగించింది. కోచింగ్ తీసుకోవడంతోపాటు సరైన ప్రణాళికతో ముందుకెళ్లాను. మా తల్లిదండ్రులు, మా మామయ్య, ప్రిపరేషన్ సమయంలో అన్ని రకాలుగా ప్రోత్సహించారు. వారి సహకారంతో విజయం సాధించాను. చదువుతున్న సమయంలో ఒత్తిడి ఎదుర్కొనేందుకు సంగీతం, పాటలు వినేదాన్ని. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేసేదాన్ని వీటితో చాలా వరకు ఒత్తిడిని జయించాను. ఏ సబ్జెక్టులో బాగా అవగాహన కలిగి ఉన్నదో అనాలసిస్ చేసుకుని దానిని బట్టి టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుని పాటించాను. ఇంటర్వూ కోసం ఎక్కువ అనాలసిస్ చేసుకున్నాను. గ్రూప్ డిస్కషన్స్ ద్వారా ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. నాలో ఉన్న నెగెటివ్, పాజిటివ్ అనాలసిస్ చేసుకుని సిద్ధం అయ్యాను. ఇంటర్వూలో ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్, తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆసరా, కళ్యాణలక్ష్మి, ఉమెన్ ఎంపవర్‌మెంట్ వీటితోపాటుగా ఇంజినీరింగ్ చదివి గ్రూప్స్ ప్రిపేర్ అవడానికి గల కారణాలు వీటిపై ఇంటర్వూలో ప్రశ్నలు అడిగారు. నా ప్రిపరేషన్‌లో తెలుగు అకాడమీ బుక్స్, తెలంగాణ ఉద్యమం వి ప్రకాశ్ సర్ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సమయాన్ని కచ్చితంగా ప్లాన్ చేసుకుని సబ్జెక్టుపై అవగాహన ఏర్పరచుకున్నాను. ఇదే పోటీ పరీక్షలకు ప్రిపరయ్యేవారు అనుసరిస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు.

విద్య యాదవ్
హైదరాబాద్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్

-బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తిచేశా. గ్రూప్-2 ఫలితాల్లో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఎన్నికయ్యాను. మాది హైదరాబాద్ నాన్న బిజినెస్ మ్యాన్. అమ్మ గృహిణి. గ్రూప్స్ కోసం కోచింగ్ తీసుకోవడంతో పాటు ప్రణాళికబద్ధంగా చదివాను. అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. వాస్తవానికి ఇంగ్లిష్ మీడియంలో నా విద్యాభ్యాసం జరిగింది. దీంతో నాకు గ్రూప్స్‌కు సంబంధించి మెటీరియల్ సోర్స్ తక్కువగా ఉండేది. NCERT బుక్స్ చదువుతూ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. కరెంట్ అఫైర్స్ కోసం ప్రతిరోజూ న్యూస్‌పేపర్స్ చదివేదాన్ని. పేపర్ 4 కోసం వి ప్రకాశ్ సార్ తెలంగాణ ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటు పుస్తకాలు చదివాను. షెడ్యూల్డ్ పక్కాగా తయారుచేసుకుని ముందుకువెళ్లేదాన్ని. పరీక్షలకు రెండు నెలల ముందు నుంచి ప్రతిరోజు 10 గంటలపాటు ప్రిపేర్ అయ్యాను. ప్రతిరోజూ న్యూస్‌పేపర్స్ చదువుతూ వాటిని అర్థం చేసుకుంటూ బిట్స్ తయారు చేసుకుని, వాటిని టైమ్‌టేబుల్ వేసుకుని దానికి అనుగుణంగా చదివాను. చదివినవాటిని రివిజన్ చేసుకుంటూ ప్రిపేరయ్యాను. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు చిన్నచిన్న విరామాలు తీసుకునేదాన్ని. విరామ సమయంలో పాటలు వింటూ ముఖ్యంగా తెలంగాణ సింగర్స్, పోయెట్స్, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై ఎక్కువ మక్కువతో ఇష్టంగా వినేదాన్ని. దీంతో రిలీఫ్ దొరికేది.
-ఇంటర్వూ ప్రిపరేషన్ కోసం ప్రతిరోజూ వార్తా పత్రికలు అందులో ఎడిటోరియల్స్, ముఖ్యమైన టాపిక్స్ బాగా చదివాను. తర్వాత నా మెయిన్ సిలబస్ బాగా చదివాను. వచ్చే ప్రశ్నల మీద ఎక్కువ దృష్టి సారించి.. బాగా చదివాను. ఏదైనా ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికి వందశాతం కట్టుబడి చదవాలి. ఒక రోజు చదివి మరో రోజు చదవకుంటే మనం వేసుకున్న ప్రణాళికకు విలువఉండదు. కష్టపడి చదవడంతో పాటు, ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. అప్పుడే విజయం మన సొంతమవుతుంది.

<>bమంగళగిరి
విక్రమ్ కుమార్, కరీంనగర్ పట్టణం
ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్

-నాకు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం రావడం చాలా గర్వంగా ఉంది. నాది కరీంనగర్. కాగజ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు, ఇంటర్, డిగ్రీ కరీంనగర్, పెద్దపల్లిలో జరిగింది. మాది వ్యవసాయ కుటుంబం. నా చిన్నతనంలోనే నాన్న మరణించడంతో అమ్మ ఎంతో కష్టపడి చదివించింది. గ్రూప్-1 లక్ష్యంగా ప్రయత్నం సాగించాను. ఉమ్మడి ఏపీలో ఏపీపీఎస్సీ పోస్టుల కోచింగ్ తీసుకున్నాను. కానీ తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక మన సిలబస్‌తో సొంతంగానే ఇంట్లో ఉంటూ ప్రిపేరయ్యాను. తెలంగాణ ఉద్యమ చరిత్ర కోసం వీ ప్రకాశ్ సర్ బుక్స్, అకాడమీ బుక్స్ ఫాలో అయ్యేవాడిని. అలాగే నమస్తే తెలంగాణ నిపుణ కూడా ఎంతగానో ఉపయోగపడింది. ముందుగానే సరైన ప్రణాళిక వేసుకోవడంతో టైం మేనేజ్‌మెంట్ పెద్దగా కష్టం కాలేదు. ప్రతిసబ్జెక్ట్ ఒక కంటిన్యూ ప్రాసెస్‌గా చేసుకోవడం ఎక్కువ రివిజన్స్ చేయడంవల్ల సులభమయ్యింది. అలా చాలా సమయం ఆదా అయ్యింది. మిగతా సమయంలో ప్రాక్టీస్ పేపర్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇంటర్వూ అనగానే అందరికీ భయం ఉంటుం ది. కాని మేము దానిని ఎదుర్కొనేందుకు స్నేహితుల తో రూంలోనే.. ఇంటర్వూ ప్రిపరేషన్ చేసుకునేవాళ్లం. మాకు మేమే ప్రస్తుత సమస్యలపై గ్రూప్ డిస్కషన్స్ చేసుకుని మెయిన్ పాయింట్స్ రాసుకుని ప్రిపేరయ్యేవాళ్లం. మమ్మల్ని మేమే మాక్ ఇంటర్వూ చేసుకు న్నాం. ఇలా రోజూ చేయడంతో ఇంటర్వూ భయాన్ని పోగొట్టుకున్నాం. మేం ఎవరైతే ఇంటర్వూ చేసుకున్నామో అందరం సెలెక్ట్ అయ్యాం. మాకు ఇంటర్వూలో చక్రపాణి సార్, టీఎస్‌పీఎస్సీ బోర్డు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంటర్వ్యూలో మొదట అలవాట్లు, తర్వాత ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్, ప్రస్తుత సమస్యల మీద ప్రశ్నలు అడిగారు. ఏదైనా ఒక సర్వీస్ వస్తుందనే నమ్మకంతో చదివా. దీంతో పరీక్షకు ముందు ఎక్కువగా ఒత్తిడి ఎదుర్కోలేదు. సమయం దొరికినప్పుడు చదువుతూ ఉండేవాన్ని. అలా చదివిన ప్రతి అంశాన్ని బాగా ప్రాక్టీస్ చేశాను. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు సిలబస్ రివిజన్స్ ఎక్కువ చేయాలి. అన్ని రకాల బుక్స్ కాకుండా ఒక సబ్జెక్ట్ ఒక స్టాండర్డ్ బుక్ మాత్రమే చదవాలి. అదికూడా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం చేసే తప్పులు తెలుస్తాయి.

జువ్వగాని చంద్రశేఖర్
రాయగిరి , డిప్యూటీ తహసీల్దార్

డీటీగా ఎంపికైన జర్నలిస్ట్!


గీతకార్మిక కుటుంబ నేపథ్యం నుంచి పట్టుదలతో శ్రమించి ప్రస్తుతం జేపీవోగా పనిచేస్తూనే గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు యాదాద్రికి చెందిన చంద్రశేఖర్. ఆయన గ్రూప్-2 కోసం ప్రిపేర్ అయిన విధానం, ఎదుర్కున్న సాధకబాధలు, పోటీపరీక్షలు రాసేవారికి ఆయన ఇచ్చిన సలహాలు ఆయన మాటల్లో....
-నా పేరు జువ్వగాని చంద్రశేఖర్, మా స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా, రాయగిరి. గ్రూప్-2లో నేను ఎంపికైన ఉద్యోగం డిప్యూటి తహసీల్ధార్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి గ్రూప్-2 నోటిఫికేషన్‌లో డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఐతే ఈ విజయం నాకు మొదటి ప్రయత్నంలోనే దక్కలేదు. అంతకు ముందు 2011 గ్రూప్-2 కోసం ప్రయత్నించి విజయాన్ని అందుకోలేకపోయాను. ఈ అపజయం నాకు మంచి గుణపాఠాన్ని నేర్పింది. ఓటమికి క్రుంగిపోకుండా మరింత పట్టుదలతో నా ప్రిపరేషన్‌లోని తప్పిదాలను సరిచేసుకుంటా 2015 నుంచి గ్రూప్-2కు సన్నద్ధమయ్యాను. నోటిఫికేషన్ కోసం ఎదురుచూడకుండా.. ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రణాళికబద్దంగా,స్ధిరంగా శ్రమించడంతో విజయం సాధించగలిగాను.
మా నాన్న గీత కార్మికుడు. అమ్మ కూరగాయల దుకాణం నడుపుతున్నారు. కుటుంబ సభ్యులు, నా మిత్రుల సహకారంతో ఈ విజయం సాధించగలిగాను. ముఖ్యంగా నా మిత్రులు నాకు అండగా నిలిచారు. ఆర్థికంగా, మానసికంగా, నైతికంగా వారిచ్చిన మద్దుతు వెలకట్టలేనిది.
-నా పాఠశాల విద్య అంతా మా స్వగ్రామం రాయగిరిలోని సర్కారు బడిలో సాగింది. ఇంటర్ మొదటి సంవత్సరం భువనగిరిలోని శ్రీ భువన జూనియర్ కళాశాలలో, రెండో సంవత్సరం ఏవీఎం జూనియర్ కళాశాల నకిరేకల్‌లో చదివాను. భువనగిరిలో డిగ్రీ పూర్తి చేశాను. ఉస్మానియా యూనివర్సిటిలో జర్నలిజం విభాగంలో పీజీ చేశాను. గ్రూప్-2 ప్రిపరేషన్ కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. సొంతంగానే ప్రిపేర్ అయ్యాను. గత గ్రూప్-2 నోటిఫికేషన్‌లో సక్సెస్ సాధించిన మా మిత్రుల సలహాలు, సూచనలతో ప్రిపరేషన్ సాగించాను. వారి గైడెన్స్ నాకు చాలా ఉపయోగపడింది. ఈసారి గ్రూప్-2 మొత్తం కొత్త సిలబస్ కావడంతో మార్కెట్‌లోకి చాలా రకాల పుస్తకాలు వచ్చాయి. అయితే నేను మాత్రం ప్రిపరేషన్ కోసం తెలుగు అకాడమీ పుస్తకాలతో స్టాండర్డ్ బుక్స్ ను మాత్రమే ఫాలో అయ్యాను.
-ప్రిపరేషన్ విధానం: పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారందరికి టైం మేనేజ్‌మెంట్ అనేది చాలా ముఖ్యం. ప్రణాళికబద్దంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. నేను ఏయే సబ్జెక్టు ఎప్పుడెప్పుడు పూర్తి చేయాలనేది ముందుగానే నిర్ధేశించుకుని దాని ప్రకారం పక్కాగా ఫాలో అయ్యాను. రివిజన్, ప్రాక్టీస్‌కు సమయం కేటాయించి ఆచరించాను. దాంతో అనుకున్న సమయానికి ప్రిపరేషన్ పూర్తి చేయగలిగాను.
-ఇంటర్వ్యూ ప్రిపరేషన్: నేను ప్రతిరోజు నమస్తే తెలంగాణ దినపత్రికను చదువుతాను. ఈ పత్రికలో వచ్చిన సంపాదకీయాలు,ఆర్టికల్స్ నా ప్రిపరేషన్‌కు బాగా ఉపయోగపడ్డాయి. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 ఇంటర్య్యూలు నిర్వహించిన తీరు అభినందనీయం. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించారు. ముఖ్యంగా ప్రతిరోజు ఇంటర్య్వూలు నిర్వహించడానికి కొన్ని నిమిషాల ముందు.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సార్ ఇంటర్య్వూ గురించిన అపోహలన్నింటిని తొలగించేవారు. ఇది అభ్యర్థులు ధైర్యంగా ఇంటర్య్వూను ఎదుర్కొనేలా చేసింది.
-నన్ను టీఎస్‌పీఎస్సీ సభ్యులు చంద్రావతి మేడం బోర్డు ఇంటర్య్వూ చేసింది. నా విద్యర్హతలు, ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ను లింక్ చేస్తూ ప్రశ్నలు వేశారు. ప్రస్తుతం నేను జూనియర్ పంచాయితి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అంతకు ముందు జర్నలిజంలో పీజీ పూర్తి చేసి న్యూస్ ఛానల్స్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేశాను. నేను చదువుకున్న జర్నలిజం..ప్రస్తుతం చేస్తున్న జేపిఎస్ జాబ్‌కు ఎలా ఉపయోగపడిందని అడిగారు. అలాగే గ్రూప్-2 నియామక ప్రక్రియను ఓ వార్త రూపంలో న్యూస్ రీడర్ ప్రజెంట్ తరహాలో చెప్పమన్నారు. సబ్ ఎడిటర్ నుంచి నుంచి జేపీఎస్ జాబ్‌లో ఎందుకు చేరారు?. అలాగే గ్రూప్-2 జాబ్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? లాంటి ప్రశ్నలు వేశారు. మొత్తంగా ఇంటర్య్వూ చాలా ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా సాగింది.
-ఒత్తిడి తగ్గించుకునేందుకు: యోగ, ధ్యానం.. ఒత్తిడిని తట్టుకునేందుకు నేను ఎంచుకున్న మార్గాలు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేవారు యోగ,ధ్యాన సాధనచేస్తే మంచి ఫలితముంటుందనే నా అభిప్రాయం. నేను నిత్యం విపశ్యన ధ్యాన సాధన చేస్తాను. ఒత్తిడిని ఎదుర్కొవడంలో నాకు అది ఎంతగానో తోడ్పడింది. ముఖ్యంగా గ్రూప్-2 నియామక ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ఆందోళన ఎదుర్కొన్నాను. 2016 నవంబర్‌లో పరీక్ష పూర్తయితే..తుది ఫలితాల కోసం దాదాపు మూడేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఆలస్యమైనా..విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు.. ఒక లక్ష్యం నిర్ధేశించుకున్నాక ఆ లక్ష్య సాధన కోసం నిబద్ధతతో, ప్రణాళికబద్దంగా, స్థిరంగా శ్రమించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టువదలకుండా ప్రయత్నించాలి. అప్పుడు తప్పక విజయం సొంతమవుతుంది.

శ్రీనివాస్
బక్రి చెప్యాల , డిప్యూటీ తహసీల్దార్

srinivas

విద్యాభ్యాసం ఎలా సాగింది?

-1 నుంచి 10వ తరగతి వరకు బక్రి చెప్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాను. ఇంటర్మీడియట్ సిద్దిపేటలోని ప్రైవేట్ కాలజీలో పూర్తిచేశాను. 2007లో ECE విభాగంలో B.Tech పూర్తిచేశాను.

గతంలో సాధించిన ప్రభుత్వం ఉద్యోగం?

-2012లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో ఉమ్మడి మెదక్ జిల్లా టాపర్‌గా, రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించాను. 2013లో రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందాను. ఒక ఉద్యోగం ఉన్నప్పటికీ ఉన్నత ఉద్యోగం కోసం పట్టుదలతో చదివాను. గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాను.

గ్రూప్-2 కోసం కోచింగ్ తీసుకున్నారా?

-గ్రూప్-2 రాతపరీక్ష కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. అయితే ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయిన తర్వాత మాత్రం వివిధ మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను.

ఎలాంటి పుస్తకాలు చదివారు?

-ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాలతోపాటు వివిధ పత్రికల్లో వచ్చే ఆర్టికల్స్ చదివాను. పాలిటీ కోసం రమాదేవి, తెలంగాణ ఉద్యమం కోసం వివేక్‌సార్, ఇండియన్ హిస్టరీ కోసం జీవీఎస్ పబ్లికేషన్స్ పుస్తకాలు ప్రిపేర్ అయ్యాను. వీటితోపాటు ఎప్పటికప్పుడు మాక్ టెస్టులు రాస్తూ, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేసేవాడిని.

ప్రిపరేషన్ ఎలా సాగింది?

-రెవెన్యూ విభాగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో చదవానికి టైమ్ సరిపోయేది కాదు. దాంతో అప్పుడప్పుడు సెలవులు పెట్టి సిలబస్ కవర్ చేశాను.

ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు?

-ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్-2 సర్వీస్ మిస్‌కావద్దని వివిధ మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం చాలా వరకు ఉపయోగపడింది. ఇంటర్వ్యూలో ప్రధానంగా నేను చేస్తున్న జాబ్ గురించి, నా అలవాట్ల గురించి ఎక్కువ ప్రశ్నలు అడిగారు.

ఒత్తిడిని ఎలా అధిగమించారు?

-చాలాకాలం నుంచి పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అనుభవం ఉండటంతో ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు. మాక్ టెస్టులు రాయడంతో రాతపరీక్షలో మెరుగైన ఫలితం సాధించాను.

టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకున్నారు?

-రోజుకు 10 నుంచి 12 గంటలు చదివేవాడిని. ఈ రోజు చదివిన టాపిక్స్ మరుసటి రోజు రివిజన్ చేసుకుని ఆ తర్వాతే కొత్త టాపిక్స్ చదివేవాడిని. వారాంతంలో ఆ వారంలో చదివిన అన్ని టాపిక్స్‌పై ప్రశ్నలు ప్రాక్టీస్ చేసేవాడిని. మిత్రులతో కలిసి మాకు మేమే మాక్ టెస్టులు నిర్వహించుకునేవాళ్లం.

పోటీపరీక్షలు రాసేవారికి మీరిచ్చే సలహా?

-వేరే విషయాలను దరిచేరనివ్వకుండా, లక్ష్యాన్ని ఎప్పుడూ కళ్లముందు ఉంచుకోవాలి. కష్టం అనిపించిన అంశాలను మళ్లీమళ్లీ రివిజన్ చేయాలి. మోడల్ ప్రశ్నలు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏ టాపిక్‌లో వీక్‌గా ఉన్నామో చెక్ చేసుకుని ఆ టాపిక్స్‌ను మళ్లీ రివిజన్ చేయాలి.
మీ కుటుంబం గురించి చెప్పండి.ఉద్యోగ సాధనలో నా కుటుంబ సహకారం ఎంతగానో ఉపయోగపడింది. అమ్మా, నాన్న, సోదరుడితోపాటు నా మిత్రుల సహకారం ఎప్పటికీ మరువలేనిది.

రిక్రూట్‌మెంట్ ఆలస్యం కావడంతో ఆందోళనకు గురయ్యారా?

-నేను ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఎలాంటి ఆందోళనకు గురికాలేదు. అయితే కోర్టు కేసులు కొంతవరకు ఇబ్బంది పెట్టాయి.


ఉబ్బు రమేష్
తంగెడుపల్లి , డిప్యూటీ తహసీల్దార్
Ramesh

-నేను ఉబ్బు రమేష్. యాదాద్రిభువనగరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగెడుపల్లి గ్రామం. డిప్యూటీ తహసీల్దార్‌గా జాబ్ రావడం ఎంతో గర్వంగా ఉంది. సర్వేల్‌లోని గురుకుల విద్యాలయంలో పదోతరగతివరకు చదివాను. బీటెక్ పూర్తిచేశాక పలు సాప్ట్‌వేర్ కంపెనీలలో ఉద్యోగం చేశాను. మరింత సాధించాలనే తపనతో 2015 తర్వాత జాబ్‌కు రిజైన్ చేసి సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. ఎలాంటి కోచింగ్ లేకుండానే..సిలబస్‌ను బాగా అధ్యయనం చేసి ఉన్న సమయంలో పక్కా ప్రణాళికతో చదివాను. ముఖ్యంగా అకాడమీ బుక్స్, ప్రభుత్వం విడుదల చేసిన పుస్తకాలను బాగా అధ్యయనం చేసి సొంతంగా నోట్స్ తయారుచేసుకున్నాను. దీనిపైన ప్రభుత్వ ఆర్థికసర్వే, బడ్జెట్, సమకాలీన అంశాలను టాపిక్ వైజ్‌గా అదే నోట్స్‌లో అప్‌డేట్ చేసేవాడిని. సివిల్స్ ప్రిపరేషన్‌లో భాగంగా చదివిన NCRT పుస్తకాలు బెసిక్స్‌ను అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డాయి. వాస్తవం చెప్పాలంటే 6నెలల్లోనే గ్రూప్-2 ప్రిపరేషన్ పూర్తిచేశాను. సివిల్స్ ప్రిపరేషన్‌లో ఉండటం వల్ల చాలా సులభం అయింది. దీని కోసం వారం వారీగా షెడ్యూల్ వేసుకొని చదివాను. రోజుకి 12గంటలకు పైగానే ప్రిపేర్ అయ్యాను. స్థానిక లైబ్రెరీకి కూడా వెళ్లి అక్కడ పుస్తకాలు చదివేవాడిని. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు నడక బాగా ఉపయోగపడింది. దీంతోపాటుగా కుటుంబసభ్యులు, స్నేహితులతో కాస్త సమయం గడిపేవాడిని. ఇంటర్వూను ఎదుర్కొనేందుకు మాక్ ఇంటర్వూలకు హాజరయ్యాను. దీంతో పాటుగా మా మిత్రులతో ప్రస్తుత అంశాలపై చర్చకూడ చాలా ఉపయోగపడింది. చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో ఇంటర్వూ జరిగింది. జాతీయ, రాష్ట్రస్థాయిలో జరుగుతున్న సమకాలీన సమస్యలు శబరిమల వివాదం, నేను ఇంతకుముందు చేసిన పనిస్వభావం, నా అనుభవం గ్రూప్-2లో సర్వీస్‌లో ఏరకంగా ఉపయోగిస్తారో వంటి అంశాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగారు.కొత్త రాష్ట్రంలో 1000కిపైగా పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ అంటే చాలా పెద్దది అని నేను భావిస్తున్నాను. ఇందుకు రాష్ట్రప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. కొన్ని కేసుల వల్ల ఆలస్యమైనా...చాలా స్పష్టమైన ఫలితం వచ్చింది.గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యేవారు సిలబస్‌ను బాగా అర్థంచేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే విజయం మన సొంతమవుతుంది.

కొండగూడూరు రాజు
పెంచికల్‌దిన్నె, ఏఎస్‌వో , కోర్టు జాబ్ నుంచి ఏఎస్‌వోగా

kondagudur-raju
-నాపేరు కొండగూడూరు రాజు, నేను గ్రూప్-2 లో ఆర్ధిక శాఖలో ఏఎస్‌వోగా ఎంపికయ్యాను. ప్రస్తుతం నేను హైద్రాబాద్ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.
-మాది సూర్యాపేట జిల్లా నెరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నె అనే పల్లెటూరు. మా అమ్మనాన్నలు జయమ్మ, రామబ్రహ్మం వ్యవసాయదారులు. ఎంతో కష్టపడి మమ్ముల్ని చదివించి ఈ స్థాయిలో నిలవడానికి కారణం అయ్యారు. నేను బీఎస్సీ తర్వాత ఎంసీఏ పూర్తి చేశాను. స్కూలింగ్ అంతా ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. గ్రూప్-2 కోసం నేను సొంతంగానే ప్రిపేర్ అయ్యాను, అంతకు ముందు విజయం సాధించిన వారి దగ్గరి నుంచి సమాచారం సేకరించి దాని సహాయంతో ఇంకొంత నోట్స్ తయారు చేసుకొని ప్రిపేర్ అయ్యాను. ఎకనామిక్స్‌లో కొన్ని అంశాలకు కోచింగ్ సెంటర్స్ మెటీరియల్ చదివాను.
-ప్రిపరేషన్ కోసం నేను ఎక్కువగా అన్ని పేపర్స్ కోసం తెలుగు అకాడమీ పుస్తకాలపై ఆధారపడ్డాను, జనరల్ స్టడీస్ కోసం స్కూల్ బుక్స్, దినపత్రికలు చదివాను. హిస్టరీ కోసం ఎక్కువగా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అకాడమీ పుస్తకాలు చదివాను, పార్ట్ టైం జాబ్ చేస్తూ... నోటిఫికేషన్ పడ్డ నాటి నుంచి కనీసం పది గంటలకు తగ్గకుండా ప్రిపేర్ అయ్యాను. ఇంటర్వ్యూ కోసం మా మిత్రులందరం కలిసి ఒక గ్రూప్‌లాగా ఏర్పడి ప్రిపేర్ అయ్యాం. వారి వారి ఎడ్యుకేషన్, జాబ్ బ్యాగ్రౌండ్ ఆధారంగా ఎటువంటి ప్రశ్నలు ఎదురవుతాయో అందరం కలిసి తయారుచేసి మిగిలిన వారిని మాక్ ఇంటర్వ్యూ చేయడం వారి తప్పులను చెప్పడం అలా ప్రిపేర్ అయ్యాం. దినపత్రికల్లో వర్తమాన అంశాలపై బృందచర్చలు జరిపే వాళ్ళం. ప్రిపరేషన్‌లో ఒత్తడికి గురైనప్పుడు సినిమాలకి వెళ్లే వాణ్ణి. ఇంకా తెలుగు సాహిత్యం చదివి కొంత ఒత్తిడిని తగ్గించుకునే వాణ్ణి. నా అభిరుచి అయిన కవితా రచన ద్వారా ఒత్తిడిని తగ్గించుకొని మళ్ళీ రిచార్జ్ అయ్యి ప్రిపేర్ అయ్యే వాణ్ణి.
-నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో అందరిలాగే నేను కూడా ఆందోళనకి గురయ్యాను. కానీ నాకు గ్రూప్-2 రాసిన తర్వాత తెలంగాణ జ్యుడీషియల్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం రావడం వల్ల కొంత ఆందోళన తగ్గింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి నేనిచ్చే సలహా..
-ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం మరింత కాలాన్ని వెచ్చించి చదివే ప్రక్రియ కానీ మనం నిజాయితీగా కష్టపడితే కచ్చితంగా విజయం సాధించవచ్చు. కానీ ముందే లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి, తర్వాత దాని నుండి పక్కకు మరలకూడదు.

-సత్యం గౌడ్ సూదగాని

1510
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles