కరెంట్ అఫైర్స్


Wed,November 20, 2019 01:18 AM


ప్లాంట్ ప్రొటెక్షన్ కాంగ్రెస్

హైదరాబాద్‌లో 19వ ఇంటర్నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ (ఐపీపీసీ)-2019 నవంబర్ 10 నుంచి 14 వరకు జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐపీపీసీ 70 ఏండ్ల చరిత్రలో తొలిసారి భారత్‌లో ఈ సమావేశాలను నిర్వహించారు. 55 దేశాల నుంచి 750 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2023లో ఈ సమావేశం గ్రీస్‌లోని ఏథెన్స్‌లో నిర్వహించనున్నారు.
FMC

మింట్ లివబిలిటీ సూచీలో హైదరాబాద్

నవంబర్ 11న వెలువడిన మింట్ లివబిలిటీ ఇండెక్స్‌లో దేశంలో ఆరు మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. ఈ ఇండెక్స్‌లో బెంగళూరు ద్వితీయ స్థానంలో ఉంది. ఎక్కడి నుంచైనా నగరానికి సులభంగా చేరుకునే అవకాశం ఉండటం, ప్రజా రవాణా, వలసల తాకిడి, అందుబాటు ధరల్లో గృహ వసతి, సామాజిక మౌలిక సదుపాయాలు, పచ్చదనం, స్వచ్ఛమైన గాలి తదితర అంశాలపై జనాభిప్రాయాన్ని సేకరించి, ఈ ర్యాంక్ ఇచ్చారు.

జల్‌జీవన్ మిషన్ సమావేశం

జల్‌జీవన్ మిషన్ అంశంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దక్షిణాది రాష్ర్టాలతో హైదరాబాద్‌లో నవంబర్ 11న సమావేశం నిర్వహించారు. దేశంలోని 14.60 కోట్ల గ్రామీణ ప్రాంత గృహాలకు సురక్షిత నీటి సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందని, దీనికోసం 2024 నాటికి ఏడాదికి రూ.40 వేల కోట్ల చొప్పున రూ.2 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుందని జలశక్తి కార్యదర్శి పరమేశ్వరన్ తెలిపారు.

తొలి బాలమిత్ర పోలీస్ స్టేషన్

తెలంగాణ రాష్ట్రంలో తొలి బాలమిత్ర పోలీస్ స్టేషన్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న మేడిపల్లిలో ప్రారంభించారు.

విద్యుత్ విమానం

పూర్తిగా విద్యుత్‌తో నడిచే తొలి ప్రయోగాత్మక విమానం ఎక్స్ 57 మాక్స్‌వెల్‌ను నాసా నవంబర్ 11న ఆవిష్కరించింది. విద్యుత్‌తో నడిచే విమానాల తయారీ కోసం నాసా ఐదేండ్లుగా ప్రయోగాలు చేస్తున్నది. 2015 నుంచి అభివృద్ధి దశలో ఉన్న మాక్స్‌వెల్ 2020 చివరి నాటికల్లా గగనవిహారం చేస్తుందని నాసా తెలిపింది. ఇటలీకి చెందిన టెక్నాం పీ2006 అనే విమానానికి మార్పులు చేసి మాక్స్‌వెల్‌ను తయారుచేశారు.
X57-Maxwell

కాస్ట్ ఆఫ్ లివింగ్ నగరాల జాబితా

ప్రపంచంలోని 352 నగరాల్లో ప్రజల జీవన వ్యయంపై నంబియో సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలను నవంబర్ 12న విడుదల చేసింది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, బేసల్, లాసన్నె, జెనీవా, బెర్న్ నగరాలు అత్యధిక జీవన వ్యయంతో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.ఈ జాబితాలో భారత్‌లోని నగరాలు ముంబై 316, ఢిల్లీ 323, బెంగళూరు 327, పుణె 328, హైదరాబాద్ 333, చెన్నై 334, కోల్‌కతా 336, విజయవాడ 350, విశాఖపట్నం 351 ర్యాంకుల్లో నిలిచాయి.

న్యుమోనియా మరణాల జాబితా

2018లో న్యమోనియాతో ఎంతమంది చిన్నారులు బలయ్యారో యునిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా సేకరించిన గణాంకాలను ప్రపంచ న్యుమోనియా దినం నవంబర్ 12న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 39 సెకండ్లకు ఒక చిన్నారి న్యుమోనియాకు బలవుతున్నారని అధ్యయనంలో వెల్లడయ్యింది. ఐదేండ్లలోపు చిన్నారులు అత్యధికంగా న్యుమోనియాతో మరణిస్తున్నారు. ఈ జాబితాలో నైజీరియా (1,62,000) మొదటిస్థానంలో ఉండగా రెండో స్థానంలో భారత్ (1,27,000) ఉంది. పాకిస్థాన్ (58,000) 3, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (40,000) 4, ఇథియోపియా (32,000) 5వ స్థానాల్లో ఉన్నాయి.

బ్రిక్స్ సదస్సు

బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో 13, 14 తేదీల్లో 11వ బ్రిక్స్ సమావేశాలు జరిగాయి. ఈ సదస్సును సృజనాత్మక భవిష్యత్తు కోసం ఆర్థిక అభివృద్ధి అనే థీమ్‌తో నిర్వహించారు. బ్రిక్స్ సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొనడం ఇది ఆరో సారి. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో వేర్వేరుగా మోదీ సమావేశమయ్యారు.

డయాబెటిస్ దేశాల జాబితా

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) నవంబర్ 15న డయాబెటిక్ పేషెంట్లకు సంబంధించి ఒక జాబితాను విడుదల చేసింది. ప్రతి ఆరుగురు డయాబెటిక్ పేషెంట్లలో ఒకరు భారతీయుడు ఉన్నారని ఈ నివేదిక తెలిపింది. ఈ జాబితా ప్రకారం భారత్‌లో 7.7 కోట్ల మంది డయాబెటిక్ బాధితులు ఉన్నారని తేలింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో చైనా (11.6 కోట్లు), ద్వితీయ స్థానంలో భారత్, అమెరికా మూడో స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 46.3 కోట్ల డయాబెటిక్ రోగులు ఉన్నారు. వీరంతా 20 నుంచి 79 ఏండ్లలోపువారే ఉన్నారు.

ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్ పుస్తకావిష్కరణ

ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్: కన్‌సీక్వెన్సెస్, క్యూర్ అనే పుస్తకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 10న ఢిల్లీలో ఆవిష్కరించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై వీ అనంత నాగేశ్వరన్, గుల్జార్ నటరాజన్ సంయుక్తంగా ఈ పుస్తకాన్ని రచించారు.
RISE

షార్ట్ ఫిల్మ్‌లకు పురస్కారాలు

మానవ హక్కుల రక్షణ, ప్రచారానికి సంబంధించిన అవగాహనను సృజనాత్మకంగా తెలియజెప్పే షార్ట్‌ఫిల్మ్‌లకు జాతీయ మానవహక్కుల సంఘం నవంబర్ 14న పురస్కారాలు ప్రకటించింది. 2019కుగాను మొత్తం 88 షార్ట్‌ఫిల్మ్‌లు పోటీపడగా కుంభిల్ శివ మొదటి, ట్రాన్స్‌జెండర్ ద్వితీయ, గల్ఫ్ తృతీయ ఉత్తమ అవార్డులు దక్కించుకున్నాయి. డిసెంబర్ 10న పురస్కారాలను ప్రదానం చేస్తారు.

రాజ్యసభ 250వ సమావేశం

పార్లమెంటులోని రాజ్యసభ నవంబర్ 18న 250వ సమావేశాన్ని ప్రారంభించింది. రాజ్యసభ ఏర్పడి మే 13 నాటికి 67 ఏండ్లు అయ్యింది. ఇప్పటివరకు జరిగిన సమావేశాల సంఖ్య 249. పనిదినాలు 5466. రాజ్యసభకు అత్యధికసార్లు ప్రాతినిథ్యం వహించిన సభ్యురాలు నజ్మా హెప్తుల్లా (6 సార్లు). నేతృత్వం వహించిన చైర్మన్లు 13 మంది. ఏడుసార్లు ప్రాతినిథ్యం వహించిన వ్యక్తి డా. మహేంద్ర ప్రసాద్. రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన మొత్తం సభ్యులు 2,282 మంది. వీరిలో మహిళలు 208 మంది.

న్యూయార్క్ ఆర్ట్స్ బోర్డులో నీతా అంబానీ

ప్రముఖ మహిళా వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ న్యూయార్క్‌లోని అతిపెద్ద మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ బోర్డుకు నవంబర్ 12న ఎంపికయ్యారు. దేశ కళలు, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. న్యూయార్క్‌లో జరిగిన బోర్డు సమావేశంలో నీతాను గౌరవ ధర్మకర్తగా ఎన్నుకున్నట్లు మ్యూజియం చైర్మన్ డేనియల్ బ్రాడ్‌స్కీ ప్రకటించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వ్యక్తి నీతా అంబానీ. రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా 2016 నుంచి మెట్రో పాలిటన్ ఆర్ట్ మ్యూజియానికి మద్దతినిస్తున్నారు.

సుదర్శన్ పట్నాయక్‌కు అవార్డు

ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు ప్రఖ్యాత ఇటాలియన్ గోల్డెన్ శాండ్ ఆర్ట్ అవార్డు-2019 లభించింది. రోమ్‌లో నవంబర్ 15న జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఇటలీలోని లీసీలో జరిగిన పోటీల్లో పట్నాయక్ రష్యాకు చెందిన పావెల్ మినికోవ్‌తో కలిసి ఇసుకతో ఎనిమిది అడుగుల పొడవు ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని రూపొందించినందుకు ఈ అవార్డు దక్కింది.
Sudarsan-Patnaik

వశిష్ఠ నారాయణ సింగ్ మృతి

ప్రముఖ గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ సింగ్ నవంబర్ 14న మరణించారు. బీహార్‌కు చెందిన ఆయన 1969లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సైకిల్ వెక్టార్ స్పేస్ థియరీలో పీహెచ్‌డీ చేశారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు ఆయన సేవలందించారు.

జ్యోతిగౌడ్‌కు బెస్ట్ బ్రెయిలీ అవార్డు

హైదరాబాద్‌లోని దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది ైబ్లెండ్ కరస్పాండెంట్ ఏ జ్యోతిగౌడ్‌కు బెస్ట్ బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ది కంట్రీ-2019 అవార్డు ఇస్తున్నట్లు అవార్డు కమిటీ నవంబర్ 15న ప్రకటించింది. అంధ విద్యార్థుల కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును అందించనుంది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3న ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డును ఆమెకు అందజేయనున్నారు.

గులాబీ కొఠారీకి అవార్డు

రాజస్థాన్ పత్రిక యజమాని గులాబ్ కొఠారీకి 2019కి గాను రాజా రామ్ మోహన్ రాయ్ అవార్డు లభించింది. ఈ అవార్డును జాతీయ పత్రిక రోజు సందర్భంగా నవంబర్ 16న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు.

కెంటో మొమోటాకు చైనా ఓపెన్ టైటిల్

జపాన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కెంటో మొమోటా చైనా వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ టైటిల్‌ను గెలుచుకున్నాడు. చైనాలోని పుజౌలో నవంబర్ 10న జరిగిన ఫైనల్లో కెంటో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. దీంతో ఒకే ఏడాది అత్యధిక సింగిల్స్ టైటిల్స్ గెలిచిన షట్లర్‌గా అతడు రికార్డు నెలకొల్పాడు. 2010లో 9 టైటిల్స్ గెలిచిన లీ చోంగ్ వీ (మలేషియా) పేరిట ఉన్న రికార్డును కెంటో తిరగ రాశాడు. 2011లో 10 టైటిల్స్ గెలిచిన జియోలి వాంగ్-యు యాంగ్ (చైనా) ఉమెన్స్ డబుల్స్ పేరిట ఉన్న రికార్డును కెంటో సమం చేశాడు.

టైమ్-100 నెక్ట్స్ జాబితాలో ద్యుతీ

భారత మహిళా అథ్లెట్ ద్యుతీచంద్‌కు నవంబర్ 13న ప్రకటించిన టైమ్స్-100 నెక్ట్స్ జాబితాలో చోటు దక్కింది. ప్రపంవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ప్రభావం చూపగల వ్యక్తుల జాబితాలో ఆమెకు క్రీడల కేటగిరీలో చోటు లభించింది. వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్ రంగాల్లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురును గుర్తించి టైమ్ మేగజైన్ ప్రతి ఏటా ఈ జాబితాను తయారుచేస్తుంది.

477
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles