ఎస్‌బీఐ కొలువు ఇలా సులువు


Mon,January 13, 2020 02:36 AM

-టార్గెట్‌ ఎస్‌బీఐ క్లర్క్‌-2020
ఎస్‌బీఐ భారతదేశంలో అగ్రశేణి బ్యాంకు. ఇందులో జాబ్‌ అంటే గౌరవంగా, ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తుంటారు. కాబట్టి ఎస్‌బీఐ కొలువు (క్లర్క్‌/పీఓ) కోసం లక్షల మంది అభ్యర్థులు వేచిచూస్తుంటారు. వారికోసమే 8,301 క్లరికల్‌ కొలువులతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఎస్‌బీఐ. క్లరికల్‌ పోస్టులు లేదా జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)గా పిలిచే ఈ పోస్టులు హైదరాబాద్‌ సర్కిల్‌ (తెలంగాణ)లో 375, అమరావతి సర్కిల్‌ (ఏపీ)లో 150 ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షకు ఎలా ప్రిపేర్‌ కావాలి, పరీక్ష పద్ధతి, ప్రిపరేషన్‌ ప్లాన్‌ చూద్దాం..
students2
-తాజాగా విడుదలైన ఎస్‌బీఐ క్లర్క్‌ నోటిఫికేషన్‌ ప్రకారం అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. అవి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌. ఈ పరీక్షలను విడిగా నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ ఫిబ్రవరి/మార్చిలో ఉంటే మెయిన్‌ పరీక్ష ఏప్రిల్‌ 19న నిర్వహించనున్నారు. ఇలా పరీక్షలకు సంబంధించిన తేదీలను ముందుగానే ప్రకటించడంవల్ల అభ్యర్థులు విభాగాలవారీగా ప్రిపరేషన్‌ కు అనుకూలంగా ఉంటుంది. ఈ పరీక్షల్లో సెక్షన్ల వారీగా సమయాన్ని కేటాయించారు. దీంతో అభ్యర్థులు ప్రతి విభాగాన్ని నిర్ణీత సమయంలోనే పూర్తిచేయాలి. కాబట్టి ప్రిపరేషన్‌ ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా చేయాలి. దీన్నే స్మార్ట్‌స్టడీ అంటారు. పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు కాబట్టి అభ్యర్థులు వీలైనన్ని ఆన్‌లైన్‌ టెస్టులు రాయడం మంచిది.

పరీక్ష స్వరూపం

1. ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్‌): ఇది మొదటి దశ. ప్రిలిమ్స్‌లో ఆబ్జెక్టివ్‌ తరహాలో 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి.
2. ప్రధాన పరీక్ష (మెయిన్స్‌): ఇది రెండో దశ, చివరిది. ఇందులో మొత్తం 200 మార్కులకు 190 ప్రశ్నలుంటాయి.
-ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణత పరీక్ష మాత్రమే. ఇందులో ప్రతి విభాగంలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ప్రధాన పరీక్షకు అర్హత సాధిస్తారు. ఈ మార్కులను తుది జాబితా ఎంపికలో పరిగణించరు. అయితేరెండు దశల్లో సిలబస్‌, అంశాలు ఒకటే. కానీ ప్రశ్నల కాఠిన్యత మారుతుంది. కాబట్టి ముందుగా ఆయా సబ్జెక్టులపై పట్టుసాధించి ప్రిలిమ్స్‌లో కూడా అధిక స్కోర్‌ తెచ్చుకునేలా సాధన చేయాలి. ప్రిలిమ్స్‌/మెయిన్స్‌ రెండింటికి కలిపి సమగ్రంగా సిద్ధం కావాలి.
-ప్రిలిమినరీ పరీక్ష కీలకమైనది. ఇది ఏరివేత దశ అని కూడా భావించవచ్చు. 90 శాతం అభ్యర్థులను ఇక్కడే ఏరివేస్తారు. కాబట్టి చక్కటి ప్రణాళికతో, అనువైన చాప్టర్‌పై ఎక్కువ దృష్టిసారించాలి. ఇందులో మొత్తం మూడు సబ్జెక్టులు ఉంటాయి.
computer
-ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఇందులో ఉత్తీర్ణులవ్వాలంటే ప్రతి విభాగంలో వెయిటేజీ ఉన్న చాప్టర్‌పై పట్టు సాధించాలి.
-మెయిన్స్‌ పరీక్షలో సాధించిన మార్కులను బట్టి ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విభాగాన్ని కూడా ప్రిలిమినరీతో కలిపి సాధన చేయాలి. ఇందులో మొత్తం 5

సబ్జెక్టులు ఉంటాయి.

-ఇందులో కూడా ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
-ఈ విభాగంలో ప్రశ్నల అనువుగా సమయం కూడా ఉంటుం ది. ప్రతి సెక్షన్‌ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయవచ్చు. ఇందులో కూడా వెయిటేజీ ఉన్న చాప్టర్‌పై ఎక్కువ ఫోకస్‌ చేయాలి. మెయిన్‌లో ప్రశ్నలు హెచ్చుస్థాయిలో ఉంటా యి. ప్రిలిమ్స్‌లో ఎక్కువగా బేసిక్స్‌, న్యూమరికల్‌ ఎబిలిటీస్‌పై ప్రశ్నలు అడిగితే మెయిన్‌లో మాత్రం అడ్వాన్స్‌డ్‌ ప్రశ్నలు అడుగుతారు. ఒకే చాప్టర్‌ నుంచి బేసిక్‌ అడ్వాన్స్‌స్‌డ్‌ మోడల్స్‌ గుర్తించి సాధన చేయాలి. సెక్షన్లవారీగా చాప్టర్‌ వైస్‌ కంటెంట్‌పై దృష్టిసారించాలి. ముందుగా మీరు, మీ ఎబిలిటిస్‌ను గ్రహించి మీకు సులభతర ప్రశ్నలను గుర్తించి ముందుగా వాటిని పూర్తి చేస్తే మేనేజ్‌మెంట్‌ ప్రకారం అనుకున్న ప్రశ్నలు పూర్తి చేయడం వీలవుతుంది.
-చివరిది డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ దశ. ఇందులో భాషా ప్రావీణ్యాన్ని పరీక్షిస్తా రు. అయితే అభ్యర్థి తాను అప్లయ్‌ చేసుకున్న రాష్ట్రభాష టెన్త్‌, ఇంటర్‌లో చదివిన వారికి ఈ విభాగం ఉండదు. సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ మాత్రమే ఉంటుంది.
english

సబ్జెక్టులవారీగా ప్రిపరేషన్‌

-అభ్యర్థి సిలబస్‌పై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి.
-ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ రెండు విభాగాల్లో కామన్‌ సబ్జెక్ట్‌. ప్రిలిమ్స్‌, మెయిన్‌ కలిపి కామన్‌ చాప్టర్లను ఎంచుకొని చదవాలి. ఇందులోనుంచి రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (10-15), పేరాజంబుల్స్‌ (5), క్లోస్డ్‌ టెస్ట్‌ (8-10), ఎర్రర్‌ స్పాటింగ్‌ ( 5), ఫిల్‌ ఇన్‌ది బ్లాంక్స్‌ (5) వంటి అంశాల నుంచి 30-40 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి.
-ఈ సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే అభ్యర్థులు ఆంగ్ల దిన పత్రికలు చదివి జ్ఞానంతో పాటు వొకాబులరీ, స్పీడ్‌ రీడింగ్‌పై దృష్టిసారించాలి. ప్రతిరోజు 20-25 కొత్త ఇంగ్లిష్‌ పదాలు నేర్చుకోవాలి. ఆంగ్లంలో వార్తలు వినడం, పుస్తకాలు చదవడంవల్ల ఉపయోగకరంగా ఉంటుంది. ఇంగ్లిష్‌లో మంచి మార్కులు సాధించాలంటే సెలెక్టివ్‌ చాప్టర్లపై ఎక్కువ ఫోకస్‌ చేయాలి. ఇందుకు గత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లు చదవాలి.
- క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: అభ్యర్థుల గణిత జ్ఞానాన్ని, సమయపాలనను పరీక్షించే విభాగం ఇది. ప్రిలిమ్స్‌లో 35, మెయిన్‌లో 50 ప్రశ్నలు వస్తాయి. పూర్వ ప్రశ్నపత్రాల ఆధారంగా గత 3, 4 ఏండ్లుగా కాఠిన్యత, క్లిష్టమైన ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటప్పుడు అభ్యర్థులు బేసిక్స్‌పై ఎంత పటు ఉంటే పరీక్షలో కష్టమైన ప్రశ్నలను కూడా అంతే సులభంగా చేయవచ్చు.
-ఈ సెక్షన్‌లో న్యూమరికల్‌ ఎబిలిటీస్‌ (5-10), నంబర్‌ సిరీస్‌ (5) అల్‌జీబ్రా (5), డాటా ఇంటర్‌ప్రిటేషన్స్‌ (10-15) వంటి చాప్టర్ల నుంచి 60 శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కామన్‌ చాప్టర్ల నుంచి 1-2 ప్రశ్నలు అడుగుతారు. అవి శాతాలు-నిష్పత్తులు, సరాసరి-లాభ నష్టాలు, కాలం-పని, చక్ర-బారు వడ్డీ, మెన్సురేషన్‌, ప్రాబబిలిటీ వంటివి బాగా అధ్యయనం చేయాలి. మామూలుగా ఎస్‌బీఐ క్లర్క్‌, పీవో పరీక్షల్లో డేటా ఇంటర్‌ప్రిటేషన్స్‌పై ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి. ప్రిలిమ్స్‌, మెయిన్‌లలో మంచి మార్కులు పొందాలంటే ఈ చాప్టర్‌ నుంచి అన్ని రకాలు బాగా ప్రాక్టీస్‌ చేయాలి. మెయిన్‌లో 50 ప్రశ్నలకు 45 నిమిషాల కాలవ్యవధి అన్నది ఒక మంచి అవకాశం. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందే టాపిక్స్‌ను ఎంచుకుని ప్రిపేరైతే మంచి మార్కులు పొందే అవకాశం ఉంది.
-రీజనింగ్‌ ఎబిలిటీస్‌: బ్యాంకు పరీక్షల్లో రీజనింగ్‌ విభాగానికి ప్రత్యేకత ఉంది. ఇందులో కంటెంట్‌ ఆధారిత ప్రశ్నలు హెచ్చు స్థాయిలో అడుగుతారు. ఇంగ్లిష్‌ భాషపై పట్టు ఉన్నవారికి ఈ సెక్షన్‌లో మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. అంటే సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌, అనాలజీ, క్లాసిఫికేషన్స్‌, డైరెక్షన్‌, బ్లడ్‌ రిలేషన్స్‌ వంటి చాప్టర్ల నుంచి కంటెంట్‌ ఉన్న ప్రశ్నలు అధికంగా వస్తుంటాయి. అయితే బేసిక్స్‌పై పట్టు ఉంటే ఈ విభాగం నుంచి గరిష్ట మార్కులు పొందే అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్‌ చేయాలంటే ఈజీ అనిపించే చాప్టర్లను ఎంచుకొని సాల్వ్‌ చేయాలి. ఆ తర్వాతే సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌ వంటివి సాల్వ్‌ చేయాలి.
-ఇందులో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ (10), పజిల్స్‌ (5) కోడింగ్‌-డీకోడింగ్‌ (5), అనాలజీ (2), సిరీస్‌ (2), బ్లడ్‌ రిలేషన్స్‌ (2-3), కోడెడ్‌ ఇన్‌ఈక్వాలిటీస్‌ (5), సిలాజిసమ్‌ (4-5), ర్యాంకింగ్‌ (2-3) ప్రశ్నల వరకు ప్రిలిమ్స్‌లో, స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలు స్టేట్‌మెంట్స్‌ అండ్‌ కన్‌క్లూజన్స్‌, ఆర్గ్యుమెంట్స్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్‌ మొదలైన ప్రశ్నలు కూడా మెయిన్‌లో వస్తాయి. రీజనింగ్‌ సబ్జెక్టు అనేది మంచి స్కోరింగ్‌కు ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ సెక్షన్‌ను ప్రతిరోజూ 3-4 గంటల పాటు ప్రాక్టీస్‌ చేయాలి.
-కంప్యూటర్‌ నాలెడ్జ్‌: ఇది మెయిన్‌లో మాత్రమే వచ్చే సెక్షన్‌. రీజనింగ్‌ విభాగంలోనే ఈ సెక్షన్‌ నుంచి 10-15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉది.
-ఇందులో ఫండమెంటల్స్‌ ఆఫ్‌ కంప్యూటర్‌తో పాటు, వివిధ రకాల ప్రాసెసర్లు, సాఫ్ట్‌వేర్‌లు, మొబైల్‌ యాప్స్‌, డిజిటల్‌ పోర్టల్‌, కొత్తగా పుట్టుకొచ్చే వైరస్‌, యూజర్‌ సాఫ్ట్‌వేర్‌లు, సాంకేతిక ప్రభావం-బిట్‌ కాయిన్‌ వ్యవస్థ, డిజిటల్‌ కరెన్సీ, డిజిటల్‌-మార్కెటింగ్‌, ఏటీఎం నెట్‌వర్క్‌ వినియోగంపై దృష్టి సారించాలి. ఈ సెక్షన్‌పై పట్టు సాధించాలంటే గత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లు బాగా ప్రాక్టీస్‌ చేయాలి.
-జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌: ఇది కేవలం మెయిన్‌లో మాత్రమే అడిగే సెక్షన్‌. 50 మార్కులకు 50 ప్రశ్నలు అడుగుతారు. బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవస్థ, కరెంట్‌ అఫైర్స్‌పై మీకు ఉన్న జ్ఞానాన్ని ఇక్కడ పరీక్షిస్తుంటారు. 35 నిమిషాల్లో 45-50 ప్రశ్నలు సాల్వ్‌ చేసే వీలున్న సబ్జెక్టు కాబట్టి మెయిన్‌లో స్కోరింగ్‌ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
-ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌ టాపిక్స్‌ను ఎకానమీ, బ్యాంకింగ్‌ రంగాలతో కలిపి చదవాలి. గత 6 నెలల కరెంట్‌ అఫైర్స్‌ చదివితే సరిపోతుంది. ఇందుకు ఇంగ్లిష్‌ దినపత్రికలు, జీకే మాస పత్రికలు చదవాలి. బ్యాంకింగ్‌ విధి విధానాలు, ఆర్‌బీఐ కీ పాలసీ రేట్లు, కొత్త బ్యాంకుల స్థాపన, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలు, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు, బ్యాంకుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు వంటితో పాటు ఎకానమీ సంబంధింత అంశాలైన బడ్జెట్‌ (2020), ఎకనామిక్‌ సర్వే (2019-20), నీతి ఆయోగ్‌, 14వ, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌, జీఎస్టీ రేట్లు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం, కేంద్ర పథకాలు వ్యవసాయ, పారిశ్రామికరంగ అభివృద్ధి వంటి అంశాలు బాగా అవపోసన పట్టాలి.
-కరెంట్‌ అఫైర్స్‌ కోసం వ్యక్తులు, సంస్థలు, అవార్డులు ముఖ్యమైన రోజులు, తాజా కమిటీలు, క్రీడలు, జాతీయ-అంతర్జాతీయ అంశాలు, జమ్ముకశ్మీర్‌-లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రకటన, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌, అయోధ్య తీర్పు, సీడీఎస్‌ ఏర్పాటు, చంద్రయాన్‌-2, 3, భారత అటవీ నివేదిక-2019, మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్ర ఎన్నికలు వంటి అంశాలు చదవాలి.

నోటిఫికేషన్‌ వివరాలు

-ఎస్‌బీఐ క్లర్క్‌: 8301 పోస్టులు
-తెలంగాణలో 375 (జనరల్‌ 151, ఈడబ్ల్యూఎస్‌ 37, ఎస్సీ 60, ఎస్టీ 26 ఓబీసీ 101), ఏపీలో 150 (జనరల్‌ 61, ఈడబ్ల్యూఎస్‌ 15, ఎస్సీ 24, ఎస్టీ 10 ఓబీసీ 40) ఖాళీలు ఉన్నాయి
-జీతం: రూ.26,000
-వయస్సు: 20-28 ఏండ్లు
-ఫీజు: జనరల్‌, ఓబీసీలకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు.
-ప్రిలిమ్స్‌: ఫిబ్రవరి/మార్చి
-మెయిన్‌: ఏప్రిల్‌ 19
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌. ఏపీలో అన్ని జిల్లా కేంద్రాల్లో.
-వెబ్‌సైట్‌: www.sbi.co.in/careers

చదవాల్సిన పుస్తకాలు

క్యాంట్స్‌, అర్థమెటిక్‌
-ఆర్‌ఎస్‌ అగర్వాల్‌, ఎస్‌ చాంద్‌ పబ్లిషర్స్‌
-స్పీడ్‌ మ్యాథ్స్‌- ఎం టైరా
-ఆబ్జెక్టివ్‌ అర్థమెటిక్‌- రాజేశ్‌ వర్మ
రీజనింగ్‌
-ఆర్‌ఎస్‌ అగర్వాల్‌- వెర్బల్‌ నాన్‌ వెర్బల్‌
-లాజికల్‌ రీజనింగ్‌- అరుణ్‌ శర్మ)
-అనలిటికల్‌ రీజనింగ్‌- ఎంకే పాండే
-పర్సన్స్‌ రీజనింగ్‌

ఇంగ్లిష్‌

-ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌- ఎస్‌పీ బక్షి
-జనరల్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ ఆల్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌- ఎస్‌సీ గుప్తా
-వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ- నార్మన్‌ లెవిస్‌
కంప్యూటర్‌ నాలెడ్జ్‌
-ఆబ్జెక్టివ్‌ కంప్యూటర్‌ అవేర్‌నెస్‌- ఆర్‌ పిైళ్లె
-కంప్యూటర్‌ నాలెడ్జ్‌- శిఖా అగర్వాల్‌
-కంప్యూటర్‌- రాణి అహల్య

జనరల్‌ అవేర్‌నెస్‌

-పీఐబీ వెబ్‌సైట్‌
-ది హిందూ దినపత్రి (గత 6 నెలలవి)
-ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ (గత 3 నెలలవి)

ఇలా సిద్ధం కావాలి


students1
-సిలబస్‌ను, పరీక్ష స్వరూపాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
-ప్రిలిమ్స్‌, మెయిన్‌లలో కామన్‌ టాపిక్స్‌ తెలుసుకోవడంవల్ల ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధమవడానికి అవకాశం ఉంటుంది.
-పరీక్షల్లో అడిగే ప్రశ్నల సంఖ్య, కేటాయించే మార్కులు, సమయం వంటి వివరాలు విభాగాలవారీగా గ్రహించాలి.
-బ్యాంకు పరీక్షలకు సమయ పాలన, స్పీడ్‌, కచ్చితత్వం చాలా కీలకం. ఇందుకోసం ఆన్‌లైన్‌ పరీక్షలు, టెస్ట్‌ సిరీస్‌లు ఉపయోగపడుతాయి.
-ఏదైనా అంశంపై డౌట్స్‌ ఉంటే కోచింగ్‌ నోట్స్‌ కానీ ఫ్యాకల్టీని సంప్రదించి కానీ వాటిని నివృత్తి చేసుకోవాలి. ఆయా అంశాలపై సొంత నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి.
-హార్డ్‌వర్క్‌తో పాటు స్మార్ట్‌ స్టడీ ప్లాన్‌ కూడా చేయాలి.
-క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ విభాగాల్లో వీలైనన్ని ప్రశ్నలు ప్రతి రోజు ప్రాక్టీస్‌ చేయాలి.
-పరీక్ష సమయంలో పూర్తి ఏకాగ్రతతో సులభమైన అంశాలను గుర్తించి ముందుగా వాటిని సాల్వ్‌ చేయాలి. ఆ తర్వాత ఇతర కఠిన అంశాలు సాల్వ్‌ చేయడంవల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
-చక్కటి స్టడీ ప్లాన్‌, క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌, రివిజన్‌ చేయాలి.
-మధ్యాహ్నం అన్నంలో పప్పుతో కూరగాయల సలాడ్‌ తీసుకుంటే మంచిది.
-సాయంత్రం ఎండు ఖర్జూరం, రాగి మాల్ట్‌ తీసుకుంటే శరీరానికి ఐరన్‌ లభించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. చిరాకు తగ్గించి ఒత్తిడిని దూరం చేస్తుంది.
-తాజా పండ్లు, జామకాయలు, మొక్కజొన్న, వేయించిన శనగపప్పు తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌ జోలికి వెళ్లవద్దు.
-రాత్రి అన్నంకు బదులుగా చపాతి, జొన్నరొట్టె, మసాలా లేని, నూనె తక్కువగా ఉండే కూరను తినాలి.
-ఈ సూచనలను పాటిస్తూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోవాలి. అనవసరంగా ఆందోళన చెందవద్దు. వచ్చిన జవాబులను బాగా రాయాలి. రాయలేకపోయిన వాటి గురించి ఆలోచించకండి. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే తప్పక విజయం దాసోహమవుతుంది.
madhukiran

1450
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles