ఈ మిద్దెతోట ఓ ప్రయోగశాల

Thu,March 7, 2019 12:49 AM

నగరంలో నివాసమే గగనంగా ఉన్న సందర్భంలో సేద్యం ఓ కల.. ఇరుకు ఇండ్లలో నలుగురు కలిసి ఉండటమే కష్టమైన తరుణంలో ఓ పది మొక్కలు పెంచడమే కష్టం.. దీనికి సులభ, సుందర సమాధానం మిద్దెతోట.. భాగ్యనగరంలో 50 వేల ఏకరాలకు పైగా ఇంటి పైకప్పు నిరుపయోగంగా ఉన్నట్టు ఓ అంచనా.. ఈ మిద్దెల మీద ఇంటికి అవసరమైన కూరగాయలు, పండ్లు పండించగలిగితే.. కాంక్రీటు నగరం ఓ ఆకుపచ్చని అడవిలా మారుతుంది. ఆ ప్రయత్నానికి ఒక నమూనా..ఈ మిద్దెతోట.
terrace-farming
హైదరాబాద్‌లోని సైదాబాద్ సరస్వతీ నగర్‌కు చెందిన రవిచంద్ర అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమై, సహజంగా పండించిన ఆహారమే పరిష్కారమని భావించి ఇంటిపై మిద్దెతోటకు శ్రీకారం చుట్టారు. వాడి వదిలేసిన పెరుగు బకెట్లు, కెమికల్ డ్రమ్స్, పాత ట్రేలతోతమ మిద్దెతోటలోపాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలికూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పొన్నగంటి కూరతో పాటు బ్రకోలి, సెలరి, లెట్యూస్, పాక్చా య్ వంటి విదేశీ ఆకుకూరలు, టమాటా, బెండ, వంగ, దోస, కాకర, బీర, సొర, పొదచిక్కుడు, క్యాబేజి, కాలిఫ్లవర్ వంటి కూరగాయలు, క్యారెట్, బీట్రూట్, కంద, కర్ర పెండలం వంటి దుంపజాతులు, తులసి, కలబంద, సరస్వతి, గుంటగలగరాకు, నేలవాము, ఇన్సులిన్, పిప్పరమెంట్ లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా వంటి ఔషధ మొక్కలతో పాటు బంతి, కనకాంబరం, అల్లం, పసుపు, ఉల్లి, వెల్లుల్లి, నిమ్మ, పునాస, మామిడి వంటి పలురకాల మొక్కలను పండిస్తున్నారు రవిచంద్ర దంపతులు. ఈ మొత్తం మిద్దెతోటను రీసైకిల్, రీయూజ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. దీనివల్ల చాలా నీరు ఆదా అవుతున్నది. మామూలుగా ఇంతటి మిద్దెతోటకు నెలకు 9 వేల లీటర్ల నీరు అవసరం. అయితే రవిచంద్ర అనుసరిస్తున్న ఈ పద్ధతిలో నెలకు కేవలం 750-800 లీటర్ల నీరు సరిపోతున్నది.

terrace-farming3

మిద్దె మీద చేపల చెరువు

మిద్దెతోటలో రవిచంద్ర మొక్కలనే కాదు, చేపలనూ పెంచుతున్నా రు. చేపల పెంపకం కోసం రెండు 1000 లీటర్ల టాంకులను ఫిష్ టాంకులుగా వాడుతున్నారు. దీనిలో ఒక్కొక్క దానిలో 120 చేప పిల్లలను వదిలారు. వీటిలో గిఫ్ట్ తిలాపియా చేపలను వదిలారు. ఈ టాంకుకు 2 అంగుళాల స్క్రీన్ ఫిల్టర్లను అమర్చి, ప్రధాన టాంకు ద్వారా వచ్చే నీటిని డాబాపై వరుసక్రమంలో అమర్చుకున్న 10 లీటర్ల పెరుగు బకెట్లకు చేరేలా 16 ఎం.ఎం. డ్రిప్ పైప్ ద్వారా కనెక్ట్ చేశారు. ప్రధాన టాంకు నుంచి వచ్చే నీరు మరియు 10 లీటర్ల బకెట్ల నుంచి వచ్చే మురుగునీరును శుద్ధి చేయడానికి రెండు 250 లీటర్ల ఫిల్టర్ టాంకులను ఏర్పాటు చేశారు. ఇందులోని మొదటి డ్రమ్ములో కింది వైపునకు మురుగు నీరు వచ్చి చేరే ఏర్పాటు చేసుకున్నారు. మొదటి డ్రమ్ములోఫోమ్ ఫిల్టర్‌ను అమర్చారు. దాని కింద 35 కిలోల యాక్టివేటెడ్ కార్బన్‌ను వేశారు. దీనినుంచి ఫిల్టర్ అయి న నీరు రెండవ డ్రమ్ములోకి కిందికి పడేటట్లు ఏర్పాటు చేసుకున్నారు. దీనిలోని బయోమీడియం రింగ్స్ ద్వారా శుద్ధి అయిన నీరు పక్కన అమర్చుకున్న 1000 లీటర్ల స్టోరేజీ టాంకులోకి పోయే ఏర్పాటు చేశారు. ఇలా ఫిల్టరైన నీరు మళ్లీ మోటారు ద్వారా చేపల టాంకుకు చేరుతుంది.

terrace-farming2
ఈ రీసైకిల్ విధానంలో నీరు పైనుంచి కిందికు, కింది నుంచి పైకి రోజూ 25 వేల లీటర్ల నీరు రీసైకిల్ అవుతున్నది. ఈ కారణంగా నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. చేపలకు రోజూ వాటి బరువులో 5 శాతానికి సమానమైన ఫ్లోటింగ్ ఫీడ్‌ను వేస్తున్నారు. చేపలకు ఆక్సిజన్ సమస్య రాకుండా ఉండటానికి టాంకుపైన ఏరియేషన్ మోటారు ఏర్పాటు చేసుకున్నారు. దీని ఒక కనెక్షన్ చేపల టాంకుకు, మరోటి బయోమీడియా టాంకు కు అమర్చారు. దీనితో చేపలు ఎప్పుడూ స్వచ్ఛమైన నీరున్న నదిలో పెరిగినట్లు ఎదుగుతాయి. చేప పిల్లలు వేసిన నాలుగు నెలల తరువాత వాటిలో పావు కిలోచొప్పన పెరిగిన వాటిని తినడానికి వాడుకోవచ్చు. ఈ విధానంలో సంవత్సరానికి 65-75 కిలోల చేపలు పంచుకోవచ్చు. సంవత్సరం తరువాత చివరికి మిగిలే చేపలు ఒక్కొక్కటి కిలో పైనే పెరుగుతాయి.

ఈ రీసైకిల్ అండ్ రీయూజ్ విధానంలో నీటిని ఆదా చేస్తూ, ఇంటి అవసరాలకు తగినట్లుగా అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలు, కొన్నిరకాల పండ్ల చెట్లు, చేపలకు కూడా 365 రోజులూ పండించుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి రసాయనాలులేని ఆకుకూరలు, కాయకూరలు, పూలు,పళ్లు పండించుకోవచ్చు. ఫలితంగా ఆహార సమస్యను అధిగమించడమే కాక, ఆరోగ్య పరిరక్షణ కూడా సాధ్యమౌతున్నది. ఈ విధానంలో 1200 చదరపు అడుగుల టెర్రస్ పై 150 పెరుగు బకెట్లు (10 లీ), 6 హాఫ్ బారెల్ డ్రమ్స్ (వర్టికల్), 6 హారిజాంటల్ డ్రమ్స్, 4 టవర్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు.

terrace-farming4

టవర్ గార్డెనింగ్

కేవలం 2 అడుగుల స్థలంలో 60 రకాల మొక్కలు పెంచుకునే ఈ విధానం నగరవాసులకు అత్యంత ఉపయోగకరమైంది. రవిచంద్ర తన మిద్దెపైనున్న కంటెయినర్ గార్డెన్ కోసం ప్రత్యేకమైన వర్మికంపోస్ట్‌ను వాడుతున్నారు. దీనిలో కోకోపిట్ 30 శాతం, వర్మికంపోస్ట్ 30 శాతం, బాగా చిలికిన ఆవు ఎరువు 30శాతం, నీమ్ కేక్ 10 శాతం కలిపి నింపారు. బకెట్లో నింపిన ఈ మిశ్రమం పైభాగాన 2 అంగుళాల మందంగా పెరలైట్ వాడారు. దీనివల్ల మొక్కకు ఆక్సిజన్ సమస్య రాదు. ఈ కంపోస్టు వల్ల మొక్కలకు కావలసిన మైక్రో నూట్రియంట్స్, అమైనో యాసిడ్లు అంది మొక్కలకు తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులోని కొబ్బరిపొట్టు నీటిలోని పిహెచ్ స్థాయిని నియంత్రిస్తుంది. తన బరువుకు 8 రెట్ల అధికంగా నీటిని పీల్చుకుంటుంది. ఫలితంగా మొక్కలకు 48 గంటలపాటు నీరు అందించక పోయినా ఎలాంటి సమస్యా రాదు. ఆవు ఎరువు మొక్కకు కావలసిన అన్ని పోషకాలను అందిస్తుంది. నీమ్ కేక్ వేరుకు నిమటోడ్ సమస్య రాకుండా, పురుగుల సమస్య లేకుండా చూస్తుంది. పెరలైట్ మట్టి ఎరువు మిశ్రమం గడ్డ కట్టకుండా చూడడమే కాక, మొక్క వేర్లకు ఆక్సిజన్ అందేలా చేస్తుంది. అయితే ఈ టవర్ గార్డెన్‌ను రోజుకు కనీసం మూడు గంటలు ఎండ తగిలే ప్రాంతంలోనే పెట్టుకోవాలి.

ఈ టవర్ గార్డెనింగ్ విధానంలో దేశీ-విదేశీ ఆకుకూరలు, ఆరోగ్యప్రదాలైన ఔషధ మొక్కలు పెంచుతున్నారు రవిచంద్ర దంపతు లు. ఈ మిద్దెతోట వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరో గ్యం ఎంతో కుదుటపడింది అంటారు రవిచంద్ర. నన్నెంతో ఇబ్బంది పెట్టిన థైరాయిడ్, మధుమేహం పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి. 102 కిలోల బరువుతో సతమతమైన నేను 70 కేజీలకు చేరుకున్నాను. ఇదంతా కేవలం మిద్దెతోట మహిమే అంటారాయన. రవిచంద్ర గారిని 9581242255 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
-కె. క్రాంతికుమార్ రెడ్డి
నేచర్స్ వాయిస్

1645
Tags

More News