వివిధ పంటల సాగులో అవలంబించాల్సిన పద్ధతులు

Thu,April 18, 2019 01:23 AM

ప్రస్తుతం సాగులో పంటల్లో సరియైన విధానాలను అవలంబిస్తూ మంచి దిగుబడులు సాధించి సరియైన విధానంలో మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా అధిక లాభాలను సాధించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం వివిధ పంటల సాగులో చేపట్టాల్సిన విధానాల గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త టి.యాదగిరిరెడ్డి వివరించారు. వివిధ పంటల సాగు పద్ధతులపై గల అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు 9440481279 నంబర్‌ను సంప్రదించవచ్చు. పలు పంటల సాగులో అవలంబించాల్సిన పద్ధతుల గురించి ఆయన తెలిపిన వివరాలు..
sun-flower
రాష్ట్రంలో సాగు నీటి వసతి ఉన్న రైతులు మూడో పంటగా (కత్తెర) బోర్లు, బావులు కింద వరిని (మార్చి- జూలై) సాగు చేస్తున్నారు.
-మార్చి రెండో పక్షంలో నార్లు పోసిన రైతులు నారు పెరుగుదలకు విత్తిన 15 రోజులకు ఒక గుంట నారుమడికి ఒక కిలో నత్రజనిని ఇచ్చే ఎరువును వేయాలి (2.2 కిలోల యూరియా)
-ముఖ్యంగా యాసంగి, కత్తెర పంటగా సాగు చేసిన వరి పైరులో మొగి పురుగు (కాండం తొలుచు) ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పురుగు నుంచి పంటకు నష్టం జరుగకుండా విత్తిన పది రోజులకు కార్బోప్యూరాన్ 3జి గుళికలు ఒక గుంట నారుమడికి 400 గ్రాముల చొప్పున వేయాలి.
-నారు తీయడానికి వారం రోజుల ముందు మళ్లీ ఒకసారి గుళికలను అదే మోతాదులో పొలంలో/ నారుమడిలో ఒక సెంటీమీటర్ నీరు నిలిపి ఇసుక కలిపి వేయాలి.
-నారు వయస్సు 25 రోజులప్పుడు నారుపీకి నాటు పైపైన కనీసం చదరపు సెం.మీకు 44 కుదుళ్ళు ఉండేలా నాటుకోవాలి.
-భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేసిన మోతాదులోనే రసాయన ఎరువులు వేయాలి.2-3 మీటర్ల ఊడ్పికి ఒక అడుగు కాలిబాటలు వదలాలి. తద్వారా పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని కొంతవరకు అదుపులో ఉంచవచ్చు. ఎరువులు, పురుగు మందుల పిచికారీ కూడా సులువుగా ఉంటుంది.
-నాటిన 5-6 రోజుల్లోపు పొలంలో ఒక అంగుళం నీరు నిల్వ కట్టి సిఫారసు చేసిన కలుపు మందులలో ఏదో ఒకటి 40-50 కిలోల ఇసుకలో కలిపి ఎకరా పొలంలో జల్లాలి. ఉదాహరణకు ఆక్సాడయార్జిల్ ఎకరాకు 40 గ్రాములు వాడాలి. ప్రెటిలాక్లోర్ అయితే 500 మి.లీలు, ఫైరజో సల్ఫ్యూరాన్ ఎకరాకు 80-100 గ్రాములు వాడాలి.

pesara

పెసర, మినుము పంటలు

-ఎండాకాలం ఆరుతడి పంటగా ఫిబ్రవరి మాసంలో, వేసవి వరిమాగాణిలో మార్చి మాసంలో ఎక్కువగా సాగు చేస్తుంటారు.
-వరి మాగాణుల్లో సాగు చేసిన మినుము పైరుపై సన్నని తీగ (కస్క్యుట- బంగారువన్నె కలిగి ఉంటుంది) వ్యాపించి మొక్కల నుంచి రసం పీల్చుతుంది. ఈ తీగ పైరుపై కనిపించిన వెంటనే తీగ కనిపించిన మొక్కలతో పాటు పీకి కాల్చివేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నచోట పైరు 20 రోజులు ఉన్నప్పుడు ఇమిజిలాఫిర్ అనే కలుపు మందుకు ఎకరాకు 200 మి.లీ చొప్పున పిచికారీ చేసి 5-7 రోజుల లోపల పైరుపై 1.0 శాతం యూరియా (10 గ్రాములు / లీటర్) పిచికారీ చేయాలి. అశ్రద్ధ చేస్తే ఈ బంగారు తీగ పైరంతా పాకి విత్తనాల ద్వారా ప్రతి సంవత్సరం పొలంలో కనిపించి పంటకు నష్టం కలిగిస్తుంది.
-వరి మాగాణిలో సాగు చేసిన మినుము పంటకు అవసరాన్ని బట్టి ఒకటి, రెండు తేలిక తడులు విత్తిన 30 రోజులలోపు, 55 రోజుల తర్వాత వీలున్న చోట ఇస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.
-ఇవ్వలేని పరిస్థితులలో యూరియా 1.5 శాతం ద్రావణాన్ని (లీటర్ నీటికి 15 గ్రాములు) వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
-పెసర, మినుము ఆశించే పురుగులలో ముఖ్యంగా తెల్లదోమ, పంటకు అపారమైన నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది ఆకుల నుంచి రసం పీల్చడమే కాకుండా ఎల్లోమొజాయిక్ వైరస్ వ్యాపింపజేయుట వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎల్‌బీజీ 787, పీబీజీ 104 రకాలు ఈ రోగాన్ని తట్టుకుంటాయి. ఈ తెగులు నివారణకు టైజోఫాస్ 20 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాముల లేదా మోనోక్రోటాఫాస్ 0.6 మి.లీలు ఒక లీటర్‌కు చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

తామర పురుగులు

-తామర పురుగులు కూడా ఆకుముడత అనే వైరస్ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. దీని నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము లేదా పిప్రోనిల్ 1.0 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 0.6 మి.లీ ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
మారుకామచ్చ పురుగు: మొగ్గ, పూత, పిందె దశలో ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఈ పురుగు పూత, పిందెలను గూడుగా చేర్చి అందులో ఉంటూ కాయలను తింటుంది. దీని నివారణకు 0.75 మి.లీ నోవాల్యురాన్ లీటర్ నీటికి లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటిని లేదా క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ లీటర్ నీటికి చొప్పున ఏదో ఒకదానిని 1.0 డైక్లోరోవాస్‌లో లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి.

వేరుశనగ

-ఈ మధ్యకాలంలో బోర్లు, బావుల కింద వేసవి పంటగా జనవరి మాసంలో 90 నుంచి 100 రోజుల పంటకాలం కలిగిన రకాలను సాగు చేస్తున్నారు. పంటకోత దశలో ఉన్నది. ఆకులు కొమ్మలు పసుపురంగుకు మారి కాయ డొల్ల లోపలి భాగం నల్లగా లేదా గోధుమ రంగులోకి మారిన ప్పుడు పంటను పీకాలి.
-కాయలో తేమ 8-9 శాతం వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. గోనె సంచులలో నిల్వచేయాలి. విత్తనం కోసం నిల్వ చేసినైట్లెతే ప్రతి మూడు వారాలకు ఒకసారి బస్తాలపై 5 శాతం మలాథియాన్ పొడిని చల్లాలి

పొద్దు తిరుగుడు

-వేసవి పంటగా నీటి పారుదల కింద జనవరి రెండో పక్షం లేదా ఫిబ్రవరి మొదటి పక్షంలో సాగు చేస్తున్నారు. పంట విత్తిన 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో ఎకరాకు 15 కిలోల యూరియా వేసుకోవాలి.
-మొగ్గతొడుగు, పువ్వు వికసించు, గింజ కట్టు దశలో నీటితడులు ఇవ్వాలి.
-పువ్వులలో గింజలు ఎక్కువగా దృఢంగా తయారవడానికి రెండు గ్రాముల బోరాక్స్ లీటర్ నీటిని కలిపి పైరు పూత దశలో ఎకరాకు 200 లీటర్ మందు ద్రావణం పిచికారీ చేయాలి.
-మెరుపు రిబ్బనులు పైరుపైన అడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బన్‌పై పట్టేటట్లు ఉత్తర, దక్షిణ దిశలలో కట్టినైట్లెయితే పక్షులబారి నుంచి రక్షించవచ్చు.
-పంట కోత పువ్వు వెనుకభాగం నిమ్మపచ్చ రంగుకు మారిన తర్వాత పువ్వులు కోసి రెండు, మూడు రోజుల పాటు ఆరనివ్వాలి.
-కర్రలతో కొట్టిగాని, విద్యుత్‌తో వడిసే నూర్పిడి యంత్రాలతో వడిసిగానీ విత్తనంను వేరుచేసి గింజలలో తేమశాతం 10 కంటే తక్కువ వచ్చే వరకు ఎండబెట్టాలి. తర్వాత గోనె సంచులలో గానీ, గోదాంలలో గానీ నిల్వ చేసుకుని ధర పలికినప్పుడు అమ్ముకుని అధిక లాభాన్ని పొందవచ్చు.

Sesame-Farming

నువ్వులు

రాష్ట్రంలో నువ్వుల సాగు వేసవి పంటగా జనవరి రెండో పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుతారు.
-వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది.
-జనవరి రెండో పక్షంలో విత్తిన నువ్వుల పంట కోతలు జరుగుతున్నాయి. పంటకోత ఆకులు పసుపు రంగుకు మారి రాలడం ప్రారంభమైనప్పుడు కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినప్పుడు పైరు కొయ్యాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి ఎండబెట్టాలి.
-ఐదారు రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజలలో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టి గోనె సంచులలో నిల్వ చేసి ధర పలికినప్పుడు అమ్మి లాభాలు పొందవచ్చు. నీటి వసతి పైన సాగు చేసినప్పుడు ఎకరాకు 3-4 క్వింటాలు దిగుబడి పొందవచ్చు.

ఆముదం

-యాసంగి పంటగా సాగు చేసిన ఆముదం పక్వానికి వచ్చిన గెలలను కోసి 7-10 రోజలు కుప్పగా పోసి తర్వాత 2-3 రోజులు ఎండబెట్టి తర్వాత కర్రతో కొట్టిగానీ యంత్రంతో గానీ నూర్పిడి చేసి 7-8 శాతం తేమ వచ్చే వరకు ఆరబెట్టి గోనె సంచులలో నిల్వ చేయాలి. తర్వాత మార్కెట్ రేటును బట్టి అమ్ముకుంటే అధిక లాభాలు పొందవచ్చు.

సజ్జ

-వేసవి పంటగా జనవరి మాసంలో సాగు చేసిన పంట గింజలు పాలుపోసుకుని గట్టిపడి కోత దశలో ఉన్నవి పిలకల కంకుల కంటే ప్రధాన కాడపు కంకి మొదట కోతకు వస్తుంది. కాబట్టి రెండు లేదా మూడు దశలలో కంకులు కోయాల్సివస్తుంది. కోసిన కంకులను బాగా ఆరబెట్టి ఎడ్లతో తొక్కించి నూర్పిడి చేసి నిల్వ చేసుకోవచ్చు.

రాగి (తైదలు)

-ఈ పంటను వేసవి పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుతారు. పూత, గింజ పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి.

పంటకోత: గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నప్పుడు మొక్కకు దగ్గరగా ఉన్న ఆకులు పండినట్లుగా ఉన్నప్పుడు పంటను కోయాలి. ఈ పంటలలో ప్రధాన కాండపు కంకి మొదటి కోతకు వస్తుంది. రెండు, మూడు దశలలో కంకులు కోయాల్సి వస్తుంది. కాబట్టి రెండు, మూడు దశలలో కోసిన కంకులను పొలాల్లో ఆరబెట్టి కర్రలతో కొట్టిగానీ, ట్రాక్టర్‌తో తొక్కించడం ద్వారా గానీ పంటను నూర్చి గింజలను తూర్పారా బట్టి నాణ్యమైన ధాన్యాన్ని పొందవచ్చు.
-నట్టె కోటేశ్వర్‌రావు,9989944945
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా

800
Tags

More News