పెరటి మడి.. ప్రయోగాల బడి

Thu,April 18, 2019 01:24 AM

perati-mud
మనకు అందుబాటులో ఉన్న కొద్దిస్థలంలో, ఇంటి కి అవసరమైన కూరగాయలను, ఆకుకూరలు, పూలు పండ్లు పండించడం ఒక అవసరం, అనివార్యత. ఒకడుగు ముందుకువేసి, ఇంటి నుంచి వెలువడే వ్యర్థాలతో పంటలు పండించడం, పంటల వ్యర్థాలను రీయూజ్, రీసైక్లింగ్ విధానాల్లో తిరిగి ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవడం ఒక వినూత్న ఆలోచన, విలువైన ఆచరణ. హైదరాబాద్‌లోని హబ్సిగూడ, కాకతీయనగర్‌లో నివాసం ఉంటున్న మండవ వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతులు తమ ఇంటి ఆవరణలోనే సహజ సాగు పద్ధతిలో కూరగాయలు పండిస్తూ, దీనిని అనేకమైన కొత్త ఆలోచనలకు వేదికగా నిలిపారు. పట్టణంలో ఒక పల్లెను మళ్లీ సృష్టిస్తున్నారు. డి.ఆర్.డి.ఓ. (ప్రభుత్వ రక్షణ విభాగం)లో 30 ఏళ్లపాటు సైంటిస్ట్‌గా పనిచేసి, పదవీ విరమణ చేసిన వెంకటేశ్వర్లు తమ ఇంటిలోని 550 గజాల పెరటిలో టమాటా, వంగ, బెండ, చిక్కుడు, కాకర, సొర, పొట్ల, పాలకూర, చుక్కకూర, బచ్చలి, ముల్లంగి, క్యాబేజి, కాలిఫ్లవర్, లెట్యూస్, మునగ వంటి కూరగాయలు పండిస్తున్నారు. లేతచిగుళ్లతో నిండిన కరివేపాకు వాటి ఇంటిపంటకే ఆకర్షణీయంగా నిలుస్తుంది.

మరోవైపు ఎత్తయిన అరటిచెట్లు,ఏపుగా పెరిగిన కొబ్బరి,ఆరోగ్యంగా నిగనిగలాడుతున్న జామ, బత్తాయి, నిమ్మ కనిపిస్తాయి. గోడవారగా పెరిగిన సంపెంగల పరిమళం తోటంతా వ్యాపిస్తున్నది. షిరాజ్ రకం ద్రాక్ష గోడకు తీగబారి కాపుకు సిద్ధంగా ఉన్నది. ఈ తోటలో భార్యాభర్తలిద్దరూ ఆనందంగా పనితేస్తూ, తమ శ్రమఫలాలను పండించుకుంటున్నారు. తోటలో రాలిన ఆకులను, పీకిన కలుపుమొక్కలను, వంటింటి వ్యర్థాలను ఒక దగ్గర చేర్చి, ఒక గుంటలో వేస్తారు. వీటిపై పశువుల పేడ వెయ్యడం వల్ల వ్యర్థాలు కుళ్లి, సహజ ఎరువు తయారవుతుంది. ఈ ఎరువు వానపాములతో నిండి నేలను సారవంతం చేస్తుంది. ఇలా పండిన పంటలును వేరే మొక్కలతో పోలిస్తే ఎక్కువగా చీడపీడలను తట్టుకుంటాయి. వారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తున్నాయి.

tomato

వ్యర్థ జలాల పునర్వినియోగం

ఇంటిలోంచి వచ్చే వ్యర్థాలను ఎక్కడా వృథాగా పడేయకూడదనేది ఆయన విధానం,అదే నినాదం. దీనివల్ల పర్యావరణ కాలుష్యం తగ్గి జీవావరణం కాపాడబడుతుంది అంటారాయన. ఇల్లు డిజైన్ చేసేటపుడే, ఇంటి అవసరాలకు ఉపయోగపడే నీరు మొత్తాన్ని (వంటగదికి ఉపయోగించే నీరు, బట్టలుతికే నీరు, స్నానాలకు ఉపయోగించే నీరూ దాదాపు 85శాతం) ప్రత్యేక కాలువలు, పైపుల ద్వారా గార్డెన్‌కు మళ్లించాలి. ఈ నీళ్లను గార్డెన్‌కు మళ్లించడం వల్ల పండ్ల చెట్లు ఏపుగా పెరుగుతాయి. మిగిలిన నీరు భూమిలోకి ఇంకుతుంది. అంటే మన తోట పెద్ద ఇంకుడుగుంతలా మారి బోర్లు ఎప్పటికపుడు రీఛార్జ్ అవుతాయి. ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వల్ల నీటి ఆదా పెరిగి దేశానికి లాభం చేసిన వాళ్లమవుతామంటారు వెంకటేశ్వర్లు.

banana

వాననీటి సంరక్షణ

డాబా మీద పడిన నీటిని వివిధ పైపుల ద్వారా మురుగునీటి కాలువలకు అనుసంధానించి, ఆ నీటిని పెరటితోటకు అందిస్తారు. దీంతో అరటి, బొప్పాయి వంటి ఫలవృక్షాలకు మురుగునీటితో పాటు వాననీటిని కలిపి అందిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ మొక్కలకు నీరు ఎక్కువైతే వాటిని ఇంకుడు గుంతలకు మళ్లించేలా ఏర్పాటు చేశారు. వీటివల్ల బోర్‌వెల్స్ రీఛార్జ్ కావడానికి అవకాశం ఏర్పడింది. ఈ పద్ధతిలో 40 ఏళ్ల కింద ఇళ్లు కట్టినపుడు వేసిన బోర్‌ను ఎప్పటికపుడు రీఛార్జ్ చేసుకుంటున్నారు.

బయోమాస్ వాటర్ హీటర్

తోటలో విరిగిపడిన కొబ్బరి మట్టలను, ఇతర పండ్ల మొక్కల కొమ్మలను ఒకటి నుంచి ఒకటిన్నర అడుగులకు కత్తిరించి ఎండబెడతారు. కొబ్బరి పీచును కూడా భద్రపరుస్తారు. వీటన్నింటిని ప్రత్యేకంగా తయారుచేసుకున్న గీజర్‌లో నీటిని వేడిచేయడానికి ఉపయోగిస్తారు. రెండు నిమిషాల్లో నీరు వేడవుతుంది. దీంతో రోజంతా వేడినీళ్లు వస్తూనే ఉంటాయి. కాల్చగా వచ్చిన బూడిదను మొక్కలపై చల్లడం వల్ల దానిని ఎరువుగా,కీటక నివారిణిగా ఉపయోగిస్తున్నారు.

Waste-Compost

ఇడ్లీ పాత్రతో సోలార్ డ్రయ్యర్

తోటలోంచి వచ్చే అదనపు ఉత్పత్తులను సోలార్ డ్రయ్యర్ ద్వారా ఎండబెట్టుకుని, మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉన్నప్పుడు కొననవసరం లేకుండా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఒక ఇడ్లీ పాత్రకు ముందువైపు దీర్ఘచతురస్రాకారపు చెక్కడబ్బాను (42 అడుగులు) చేయించి, పైభాగంలో గాజును అమర్చారు. బొగ్గును కొబ్బరినూనెలో కలిపి గాజు కింద చెక్కడబ్బాకు నల్లరంగు వేశారు. ఈ నలుపు రంగు వేడిని గ్రహిస్తుంది, విస్ఫోటిస్తుంది. చెక్కడబ్బాకు ముందుభాగంలో గాలి లోపలికి వచ్చేలా ఇనుప జాలిని ఏర్పాటు చేశారు. ఇందులోకి వచ్చిన గాలి కింద చెక్కకు వేసిన నల్ల రంగు కారణంగా,బాగా వేడెక్కి అక్కడి నుంచి ఇడ్లీ పాత్రలోకి వెళ్లి అక్కడ ఉంచిన పదార్థాన్ని ఎండబెడుతుంది. ఈ తోటలో ఏడాదికి 300 500 కొబ్బరికాయలు కాస్తాయి. వీటినుంచి తీసిన కొబ్బరి ముక్కలను, ఇడ్లీపాత్రలో పళ్లాల మీద ఉంచుతారు. లోపల నుంచి వచ్చే వేడిగాలికి ఇవి త్వరగా ఎండుతాయి. ఎండిన కొబ్బరి ముక్కలను గానుగ ఆడించి నూనెను సొంతంగా తయారు చేసుకుంటున్నారు.

ఇవేకాక తోటలో పండించిన కూరగాయలను కొన్నింటిని (టమాటా, చిక్కుడు, గోరుచిక్కుడు లాంటివి) ముక్కలుచేసి, సోలార్ డ్రయ్యర్‌లో ఎండబెడతారు. కావలసినపుడు రెండు నిమిషాలు నీటిలో నానబెట్టి వండుకుంటారు. ఈ పద్ధతిలో సంవత్సరమంతా కూరగాయలకు కొదవలేకుండా ఉంటుంది. నిమ్మకాయలకు కొబ్బరినూనె పట్టించి ఫ్రిజ్‌లో ఉంచితే 3నెలల దాకా నిల్వ ఉంటాయంటారు లక్ష్మి. అంతేకాక కరివేపాకు, మునగాకు, తులసాకు, మలేషియానుంచి తెచ్చి నాటుకున్న చెకుర్‌మినస్ ఆకులను ఆరబెట్టి, వాటికి కొంచెం మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, మెంతులు, జిలకర, ఎండు మిరపకాయలు, వెల్లుల్లిపాయలు కలిపి గ్రీన్‌పౌడర్‌ను తయారుచేస్తున్నారు. ఇది ఇడ్లీలపై పొడిగాను, అన్నంతో ఎంతో రుచిగాను ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న రకరకాల పదార్థాలను ఇంటికి వచ్చినవారికి ఆప్యాయంగా అందిస్తుంటారు ఈ ఇంటిపంట దంపతులు.

ఒకప్పుడు శాస్త్రవేత్తగా మిస్సైల్ కంట్రోల్ సిస్టవ్‌‌సుని డిజైన్ చేసిన ఆయన, ఇపుడు తన ఇంటిని హరిత ప్రయోగశాలగా తీర్చిదిద్ది అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. ప్రకృతిశాస్ర్తాన్ని, తత్వాన్ని మేళవించి నేలను, నీటిని, గాలిని, వెలుగును వేటినీ వృథా చేయకుండా, పునర్వినియోగంలోకి తెస్తున్నారు. దైనందిన జీవిత ప్రయాణంలో ఏ అంశాన్నీ విడిగా చూడకుండా అన్ని అంశాలను సమన్వయం చేసుకుని, ఒకదానికొకటి జతచేసి సమ్యక్‌దృష్టితో సమగ్ర జీవనం దిశగా అడుగులు వేస్తున్నారు మండవ వెంకటేశ్వర్లు. మరిన్ని వివరాల కోసం వారిని 9849692330 నంబర్‌లో సంప్రదించవచ్చు.

-కె.క్రాంతికుమార్‌రెడ్డి
నేచర్స్ వాయిస్

1006
Tags

More News