మూడు మొక్కలతో సమాజాన్నే మార్చవచ్చు

Wed,May 8, 2019 11:30 PM

పుట్టినరోజులు, పెళ్లిరోజులు.. ఇలా జీవితంలో ఎన్నో సెలబ్రేషన్స్. వాటిని విందులతో నింపేస్తాం.. వినోదాలతో గడిపేస్తాం నూర్జహాన్ మాత్రం తమ జీవితంలో ప్రతీ ప్రత్యేకమైన రోజును పచ్చదనంతో పులుముతారు. అది సెలబ్రేషన్ ఆఫ్ అకేషన్ కాదు సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్.. ఒక మొక్కను నాటడం అంటే మనిషిలోని ప్రకృతిని మేల్కొల్పడం, రేపటి తరాన్ని పచ్చని పందిరి కింద పదిలంగా కాపాడుకోవడం..
vegetables
హైదరాబాద్‌లో ఆసిఫ్‌నగర్‌కు చెందిన నూర్జహాన్, రహమతుల్లా దంపతుల ఇంటిమీద ఎటు చూసినా చెట్లమీద వాటిని ఏ రోజు నాటారో రాసిన తేదీలు కనిసిస్తాయి. ఎటు చూసినా గోడల మీద స్ఫూర్తిదాయక వాక్యాలు దర్శనమిస్తాయి. అంతేకాదు నగరంలో ఎప్పుడో కనిపించడం మానేసిన పిచ్చుకలు, రంగురంగుల పిట్టలు ఇక్కడ గుంపులు గుంపులుగా కనువిందు చేస్తాయి. మొత్తంగా ఇక్కడ మిద్దెతోటకు మించిన మరేదో అనుభూతి..

ప్రకాశం జిల్లా చీర్వన ఉప్పలపాడులో నూర్జహాన్ నాయనమ్మ ఉమ్మడి కుటుంబాన్ని, సేద్యాన్ని ఒంటిచేత్తో నిర్వహించింది. ఒంగోలులో అమ్మమ్మగారి ఊరు మోటుమాలకు వెళ్లినప్పుడల్లా ఆమె రకరకాల కూరగాయలు పండించడం కూడా నూర్జహాన్‌కు స్మృతిపథంలో ముద్రించుకు పోయింది. వాళ్ల స్ఫూర్తితోనే మొక్కలపైన ఇంత ప్రేమ కలిగింది అంటారు నూర్జహాన్. అందుకే ముప్ఫై ఏండ్ల కింద ఒంగోలు నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు తన పిల్లలతో పాటు, మొక్కల ను కూడా వెంట తెచ్చుకున్నారు. అద్దె ఇంటిలో కుండీల్లో కొన్ని మొక్కలు పెంచినా, సొంత ఇంటికి వచ్చాక మిద్దె పైన ఒక తోటనే పెంచి, తన రైతు వారసత్వాన్ని నిలుపుకున్నారు.

vegetables3
తన ఇంటి మిద్దెతోటలో పండ్ల తోటలు పెంచుకోవడానికి ఒక కొత్త ఆలోచన చేశారు నూర్జహాన్. మిద్దె మీద గ్రోబ్యా గ్స్‌లో ఆకుకూరలు వేసి, మధ్యలో అడుగుభాగం కత్తిరించిన ఒక ప్లాస్టిక్ బకెట్‌ను ఉంచి, దానిలో ఎరువు మట్టి వేసి, పండ్ల మొక్కలను నాటారు. అప్పడు బకెట్ అడుగు నుంచి వేర్లు గ్రో బ్యాగ్స్‌లోకి విస్తరించి, చెట్టు దృఢంగా నిలబడుతుంది. దీనివల్ల గాలిలోని నిలువు ఖాళీ స్థలాన్ని కూడా ఉపయోగంలోకి వస్తుంది.

నగరంలోని స్థలా భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటి మీద తక్కువ ఖర్చుతో సులభ పద్ధతిలో పందిళ్లను నిర్మించారు. పందిళ్ల నిర్మాణానికి గాను ఏడు అడుగుల ఇనుపరాడ్డుకు కిందవైపున చుట్టుతా నాలుగు ఇటుకలు పెట్టి, ఇసుక, సిమెంటు తో ఆరు అంగుళాలు పరిచి, దిమ్మలాగా తయారు చేసుకోవాలి. ఇలాంటివి నాలుగువైపులా పెట్టుకుని పైన కర్రలు, తాళ్లతో సులువుగా పందిరి నిర్మాణం చేసుకోవచ్చు. దీనివల్ల మరిన్ని మొక్కలకు స్థానం లభించింది. ఇది మిద్దెతోట రైతులకు ఉపయోగకరమైన పద్ధతి.

ఒకసారి కొన్న మొక్కను మళ్లీ మళ్లీ కొనాల్సిన అవసరం లేకుండా నూర్జహాన్ తమ మిద్దెతోటపై పలు ప్రయోగాలు చేస్తున్నారు. అందులో గ్రాఫ్టింగ్ పద్ధతి ముఖ్యమైంది. పండ్ల మొక్కలలో ఒక ముదురు కొమ్మను ఎంచుకుని, నాలుగు అంగుళాల పొడవునా దాని చుట్టూ పైపొరను (బెరడును) తీసివేయాలి. దానిపై తడిమట్టి వేసి, దానిని ప్లాస్టిక్ కవర్ కాని, డబ్బా కాని తొడగాలి. ఆ ప్రాంతంలో ఒక నెల రోజుల్లో వేళ్లు వస్తాయి. వీటిని కత్తిరించి, వేరే ప్రాంతంలో నాటుకుంటే కొత్త మొక్క చిగురిస్తుంది. దీని వల్ల ప్రతిసారి కొత్త మొక్కలను కొనవలసిన అవసరం ఉండదు. నూర్జహాన్ ఈ పద్ధతిలో సపోటా, నిమ్మ, జామ, మామిడి, మునగ మొక్కలను గ్రాఫ్టింగ్ చేస్తున్నారు.

ఐదు, ఆరు కాపుల తరువాత బొప్పాయిని పైనుంచి ఒక మూర వదిలి, చెట్టుకు ఒకవైపు లోపలికి క్రాస్‌గా కత్తిరించాలి. దానిపైన మట్టి పెట్టి కవర్‌తో చుట్టాలి. ఒక నెల తరువాత అక్కడ వేర్లు వస్తాయి. దానిని 45 అంగుళాల కింద కత్తిరించి, వేరే ప్రాంతంలో నాటుకోవచ్చు. అప్పుడు చెట్టు 5 అడుగులు పెరిగాక, గుత్తులు గుత్తులుగా కాపు కాస్తుం ది. ఈ పద్ధతిలో చెట్టు ఎత్తు పెరుగకుండా, కుండీలో ఒదిగిపోతుంది.

మట్టి కోసం, ఎరువుల కోసం నూర్జహాన్ ఎలాంటి వ్యయం లేకుండా రెండు పద్ధతుల్ని పాటిస్తున్నారు. వాటి లో మొదటి పద్ధతిలో పశువుల పేడ, శనగపిండి (1 కిలో), చిరుధాన్యాల పిండి (1 కిలో), బెల్లం (అరకిలో), మట్టి (గుప్పెడు) కలిపి, ముద్దలుగా తయారుచేస్తారు. ఈ ముద్దలను మొక్కల పోషకాల కోసం నెలకు ఒకసారి కుండీల్లో వేస్తారు. ఇక రెండవ పద్ధతిలో మడిలో ఒక గుంట తీసి, అందులో 20 రోజుల కిచెన్ వ్యర్థాలను వేసి, దానిపైన మట్టిపొరను వేస్తే నెల రోజుల్లో మంచి ఎరువు తయారవుతుంది. దీన్ని మొక్కలకు వాడుకోవచ్చు. లేదా దానిపైనే మొక్కలను నాటుకోవచ్చు. ఇది ఎలాంటి ఖర్చు లేకుండా, ప్రత్యేకంగా మట్టిని వాడనవసరం లేకుండా మొక్కలను పెంచుకోవచ్చు.

vegetables4
నూర్జహాన్ తన మిద్దెతోటపై పండిన ఉత్పత్తులతో పండ్లపొడి, టీపొడి, షుగర్ టాబ్లెట్స్ తయారుచేస్తున్నారు. వేపాకు, పూదీన, తులసి, జామ ఆకులను నీడలో ఆరబెట్టి, పొడి చేసి, దీనికి కల్లుప్పు, పసుపు కలిపి పండ్లపొడి తయారుచేస్తున్నారు. దీనివల్ల దంత సమస్యలు లేకుం డా, పళ్లు నిగనిగలాడతాయి. గులాబీ రేకులు, పుదీనా, తులసి, చామంతి రేకులను బాగా కడిగి, నీడలో ఆరబెట్టి, పొడి చేయాలి. ఈ పొడికి లవంగాలు, యాలకులు, దాల్చి న చెక్క, మిరియాలు పొడి కలిపి, టీ డికాక్షన్ చేసుకుని వాడుతున్నారు. వేపాకు, పుదీనా, తులసి, కరివేపాలకు నీడలో ఆరబెట్టి, వాటికి వెల్లుల్లి కలపి, మిక్సీలో తిప్పి, ఆ ముద్దను చిన్న చిన్న బిళ్లలుగా చేసుకుని, నీడలో ఆరబెట్టి నిల్వ చేసుకుంటారు. ఉదయాన్నే పరగడుపున, రాత్రి భోజనానికి గంట ముందు రెండు చొప్పున ఈ బిళ్లలు వేసుకుంటున్నారు. దీనివల్ల ఎలాంటి మందులు వాడకుండా, నా డయాబెటిస్ నియంత్రణలో ఉంటున్నది అంటున్నారు నూర్జహాన్.

అమ్మమ్మలు, నాయనమ్మలు, అయినవాళ్ల వరసలు, గురుతులు, పల్లెలు, పచ్చదనాలు మన స్మృతి నుంచి దూరమౌతున్న వేళ మళ్లీ మన పిల్లలు వాటిని హృదయంలోకి ఆవాహన చేసుకుని, గతాన్ని భవిష్యత్తులో మొలకెత్తించాల్సిన అవసరం ఉండదంటారు నూర్జహాన్. అందు కే మిద్దె మీద అమ్మమ్మ ఊరి నుంచి తెచ్చిన మోటుమాల వంకాయలను చిన్ననాటి జ్ఞాపకాలుగా పదిలపర్చుకుంటున్నారు.

ప్రతి ఇంట్లో మూడేళ్లు దాటిన పిల్లలతో కనీసం మూడు మొక్కలను నాటించి, వాటి బాధ్యత వారికే అప్పగిస్తే, వారి ఆలోచనల్లో ప్రకృతితత్వం పరిమళించి, వచ్చే తరం ప్రశాంతంగా, సంతోషంగా, మరింత మానవీయంగా మనగలుగుతుందనేది ఆమె భావన. నూర్ జహాన్ అంటే ప్రపంచానికి దీపం. తన పేరుకు తగ్గట్టే ఆమె తన ఆలోచనలతో, ఆచరణతో ప్రతి ఇంటి మీదా, గుండెలోనా పచ్చని దీపం వెలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
- కె. క్రాంతికుమార్ రెడ్డి
నేచర్స్ వాయిస్


నూర్జహాన్ పండిస్తున్న పంటలు

పండ్ల మొక్కలు
జామ (తైవాన్, థాయ్, నాటుజామ, ఎర్రజామ, రెండురకాల హైబ్రీడ్ రకాలు), అరటి (చక్కరకెళీ, కూరఅరటి, చిన్న అరటి), సీతాఫలం, రామాఫలం, లక్ష్మణాఫలం, సపోటా, బొప్పాయి (నాలుగు రకాలు), మామిడి (బంగినపల్లి, రసాలు), ద్రాక్ష (బ్లాక్ అండ్ వైట్ సీడ్ లెస్, సీడ్ రకాలు), యాపిల్, యాపిల్ బేర్, వాటర్ యాపిల్, నిమ్మ (నాలుగు రకాలు), బత్తాయి (రెండు రకాలు), అంజీరు, స్టార్ ఫ్రూట్, నేరేడు, మల్బరీ, ఉసిరి (రెండు రకాలు)

పూల మొక్కలు

మల్లె (బొండుమల్లె, కాగడమల్లెతో కలిపి నాలు గు రకాలు), సంపెంగి, కనకాంబరం, చామంతి (పది రకాలు), మందార (నాలుగు రకాలు), కాగితం పూలు (బోగన్ విలియా), గులాబీ (పలురకాలు), మే ఫ్లవర్, డిసెంబరాలు (నాలుగు రకాలు)

తీగజాతి కూరలు

బీర, కాకర, గుమ్మడి, సొర (రెండు రకాలు), నేతిబీర (నాలుగు రకాలు), పొట్ల (రెండు రకాలు), దోస, దొండ, ఆకాకర, తర్బూజా

కూరగాయలు

వంగ (నాలుగు రకాలు), టమాటా (నాలుగు రకాలు), మిర్చి, బెండ, మునగ

ఆకుకూరలు

పాలకూర, చుక్కకూర, గోంగూర, గంగవాయిలి కూర, తోటకూర, కొత్తమీర, పుదీనా, కోయ తోటకూర, బచ్చలి, కరివేపాకు..
వీటితో పాటు తులసి, మరువం, కలబంద, నేల ఉసిరి, వాము, వేప, గోరింట, తమలపాకు, మొక్కజొన్న, పలు అలంకరణ మొక్కలను కూడా పెంచుతున్నారు.

-మరిన్ని వివరాలకు నూర్జహాన్‌ను
సంప్రదించాల్సిన నంబరు 9885224081

4692
Tags

More News

Featured Articles