భరోసా ఇచ్చారు, ఆదాయం పెంచారు

Thu,May 30, 2019 01:33 AM

క్షేత్రస్థాయి అధ్యయన రిపోర్టు
రాష్ట్రంలో కొన్ని పంటల దిగుబడి తగ్గుతున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా, తాండూరు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం, అక్కడి జీవనోపాధులను రూరల్ మీడియా సంస్థ, రైతులు, గిరిజనుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఏకలవ్య ఫౌండేషన్‌తో కలిసి అధ్యయనం చేసింది. 300 మంది రైతులతో నాలుగైదు సమావేశాలు జరిపిన అనంతరం కొన్ని సమస్యలు గుర్తించాం.
eklavya-foundation
వికారాబాద్ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలలో కంది పంటను సాగు చేస్తున్నారు. కానీ క్రమేపి దిగుబడి తగ్గిపోతున్నది. ఈ పరిస్థితిని మార్చి దిగుబడి పెరిగేలా రైతులకు యాజమాన్య పద్ధతుల పై అవగాహన కలిగించే దిశగా మా బృందం అడుగులు వేసింది. కొందరు రైతులను రైతు సంఘాలుగా ఏర్పాటు చేసి, విత్తన దశ నుంచి నేల సారం పెంచడం, సేంద్రియ సాగు మొదలైన యాజమాన్య పద్ధతులు అనుసరించేలా వారిలో అవగాహన కలిగించాం. ఏకలవ్య ఫౌండేషన్ వారికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది. రైతులు సాధించిన దిగుబడికి ఆర్గానికిక్ సర్టిఫికేషన్ ద్వారా 25 శాతం ధర పెంచి ప్రీమియం ధరలో అమ్మడం ద్వారా ఇంకో 5 వేలు ఆదాయం పొందే అవకాశం కల్పించాం.

అధ్యయనంలో సాధించినవి..

1) ఎకరా కంది పంటపై కనీసం ఒక క్వింటాలు దిగుబడి పెంచ డం.
2) ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా మార్కెట్ చేయడం. దీని ద్వారా ఒక్కొక్క రైతుకు ఏడాదికి రూ. 10,000 అధిక ఆదాయం తీసుకోవచ్చు. విత్తనం నుంచి పంట కోసి, అమ్మేవరకు రైతుల అనుభవాలను తీసుకుని, వారి ద్వారానే సమస్యలకు పరిష్కరించ డం. దీనిద్వారా కనీసం 4 -5 వందల ఎకరాల్లో 1 క్వింటాలు దిగుబడి అధికంగా సాధించారు.
3) రైతులకు ఎదురైన సమస్యలను చిన్న చిన్న పరిష్కారాలతో పూర్తిగా అధిగమించాం.
4) ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ మిత్ర అనే ప్రాజెక్ట్ ద్వారా 500 మంది రైతులకు గ్రూపులుగా చేసి, భాగస్వామ్య పద్ధతిలో సేంద్రియ సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఏడాదికి కనీసం రూ. 100 కోట్లు ఆదాయాన్ని పొందవచ్చనే ఒక అవగాహన కలిగించింది. రైతుల్లో మానసిక ైస్థెర్యాన్ని పెంచి, వారికి భరోసా కల్పించేందుకు చేసిన అధ్యయనం ఇది.

తాండూరు కందికి డిమాండ్

తాండూరు కందిపప్పుకు దేశమంతా డిమాండ్ ఉన్నది. కానీ సరైన దిగుబడి లేక రైతులకు పైసలు మిగలడం లేదు. కానీ తక్కువ ఖర్చుతో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే కంది పండించే రైతుకు రోజూ విందే అని ఈ అధ్యయనంలో తేలింది. కంది రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపి నాలుగు గింజలు ఎక్కువ పండించే ప్రయత్నమిది.

వికారాబాద్ జిల్లాలో రైతులు వర్షాధారంపై కంది సాగు చేస్తున్నా రు. ఎక్కువ శాతం రైతులు లక్ష ఎకరాల్లో కందులు పండిస్తున్నా రు. వర్షాధారం మీద ఆధారపడటం వల్ల ఎకరానికి 1 నుంచి 3 క్వింటాళ్ళు మాత్రమే దిగుబడి వస్తున్నది. అంతర పంటలు మినుము, పెసర మీద 1 నుంచి ఒకటిన్నర క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తున్నది. ఖర్చులన్నీ పోనూ నికరాదాయం ఎకరానికి రూ.16 వేలు మాత్రమే మిగులుతున్నది. ఈ పరిస్థితిని అధికమించి కంది దిగుబడి పెంచగలిగితే కనీసం మరో పదివేలు ఎక్కు వ ఆదాయం వచ్చేలా సాగు విధానంలో మార్పులు తేవాలన్నదే ఈ సంకల్పం. జిల్లాలో లక్ష ఎకరాల్లో అయినా కనీసం ఎకరానికి 1క్వింటాలు దిగుబడి పెరుగడం ద్వారా రూ.5వేలు, సమిష్టి మార్కెట్ ద్వారా రూ.5వేలు, ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. ఈ సాగులో దశాబ్దాల అనుభవం ఉన్న స్థానిక రైతుల సూచనలు, విత్తనాల ఎంపిక నుంచి ఎండుతెగులు నివారణ వరకు నిపుణులు చెప్పిన పరిష్కారాలు క్రోడీకరించి ఈ అధ్యయనం జరిగింది.

కంది దిగుబడి పెంచే మార్గాలు

కొన్నిసార్లు అతివృష్టి, అనావృష్టి వల్ల కందిపంట మొక్క దశలోనే దెబ్బతింటున్నది. ఈ సమస్య నుంచి కంది పంటను కాపాడుకోవాలంటే బోదెల మీద మొక్కలు నాటడం ఉత్తమ పద్ధతి. బోదెల సేద్యం వల్ల వాన నీటి సంరక్షణ జరిగి వానలు లేనపుడు భూమిలోని తేమ పంటకు ఉపయోగపడుతుంది.

బోదెల తయారీ

వీటిని రైతుల వీలును బట్టి ఎడ్ల ద్వారా,ట్రాక్టర్ ద్వారా వేసుకోవచ్చు. ఎడ్ల ద్వారా బోదెలు వేసుకోవాలంటే మనకు అవసరం ఉన్న దూరాన్ని బట్టి అరక కాడికి అమర్చుకొని బోదెలు వేసుకోవచ్చు. బోదె నాగలితో ఈ పని చేయవచ్చు. ట్రాక్టర్ ద్వారా బోదె లు వేయాలంటే 2..3 రకాల బోదె నాగళ్లు అందుబాటులో ఉన్నా యి. తక్కువ ఖర్చులో కల్టివేటర్ చివరి కొయ్యలకు (అడుగు వెడ ల్పు,అడుగు ఎత్తు కొలతలు) గల ప్లేట్లను బిగించి బోదెలు వేసుకోవచ్చు. కంది ఏక పంటగా వేయాలనుకుంటే మధ్యలో బోదెలు వదిలి వేసుకోవాలి. అంతర పంటల ద్వారా కంది వేయాలంటే మధ్యలో బోదెల పైన అంతర పంటలు వేసుకోవచ్చు.

eklavya-foundation3

వర్షపు నీటిని ఇంకింపచేసే పద్ధతులు

గుంటల ద్వారా కాల్వలు చేస్తూ మధ్య మధ్యలో గట్లు వదిలిపెట్టా లి. గట్ల పైన విత్తనం విత్తుకోవాలి. వీలైనంత దూరంలో ఒక గట్టు పై కంది, మిగతా గట్లపై రెండు వరుసలు అపరాలు విత్తుకోవాలి. వర్షం పడిన తర్వాత పొలంలో సాళ్ల మధ్య నీరు నిలిచి భూమిలో ఇంకుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడితే గట్లను తెంపి నీటిని తీసివేయాలి. కానీ సాధారణ వర్షం పడితే తీసివేయాల్సిన అవసరం లేదు. ఇలా వాన నీటిని భూమిలో ఇంకింపచేయడం ద్వారా పూతదశలో అవసరమున్న తేమను మొక్కకు అందించి వర్షాధార కంది సాగులో దిగుబడి పెరుగుతుంది. ఎండు తెగులు తట్టుకునే రకాల విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. వేస్ట్ డికంపోజ్‌తో లేదా ట్రైకో డెర్మా విరిడితో విత్తనశుద్థి చేయాలి. అనంతరం ఇంగువ ద్రావణం, ఆవు మూత్రం, పిడకల బూడిద కలిపి నాటితే తెగులు నివారణతో పాటు అడవి పందులు, నెమళ్ల బారి నుంచి కూడా మొలక దశలోత కాపాడుకోవచ్చు. విత్తనాలు విత్తేటపుడు గింజకు, గింజకు నడుమ కనీసం అడుగు దూరం ఉండేలా చూడా లి. సాళ్ల మధ్య దూరాన్ని భూసారాన్ని బట్టి నిర్ణయించాలి. నత్రజని, భాస్వరం, పొటాష్‌లను అందించే జీవన ఎరువులను తేమ ఉన్నపుడు వేయాలి. వీటి వల్ల గింజ పరిణామం, నాణ్యత పెరిగి, దిగుబడి పెరుగుతుంది. కంది మొక్కలు ఎదుగుతున్న దశలో 45 నుంచి 55 రోజుల వరకు మొదటిసారి 70నుంచి 80 రోజుల వరకు రెండవసారి తలలు తుంచాలి.

దీనివల్ల కొమ్మలు విస్తరించి ఎక్కువ పూత వచ్చి దిగుబడి పెరుగుతుంది. పంటకు చీడ పీడలు రాక ముందే వేపగింజల కషాయం ప్రతీ అమావాస్య, పౌర్ణమికి 3 రోజుల ముందు పిచికారీ చేయాలి. దీనివల్ల గొడ్డు తెగులు రాకుండా నివారించడమే కాకుండా చీడపీడల నుంచి కూడా సమర్థవంతంగా పంటను రక్షించుకోవచ్చు. కంది మొక్కలు ఎదుగుతున్న దశలో 30 రోజులకోసారి, 90 రోజులకోసారి భూమిలో తేమ ఉన్నపుడు వేస్ట్ డికంపోజర్ లేదా ట్రైకో డెర్మా విరిడి ద్రావణం ఎకరాకు 200 లీటర్లు భూమిలో డ్రెంచింగ్ చేయడం వల్ల ఎండు తెగులు అరికట్టవచ్చు. పంట తొలి దశలో కలుపు మొక్కలు చిన్న గా ఉన్నపుడు హ్యాండ్ వీడర్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో కలుపును నివారించవచ్చు. కందితో పాటు జొన్నతో పంట మార్పిడి చేసి కలుపు ఉధృతిని తగ్గించడమే కాక ఎండు తెగులు కూడా అదుపు చేయవచ్చు. అధిక నీటి తడుల వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. కాబట్టి మొగ్గ దశలో ఒకసారి కాయ దశలో ఒకసారి మాత్రమే నీటి తడులు ఇవ్వాలి కంది సాగులో అధిక దిగుబడి సాధించడంలో ప్రధానంగా యాజమాన్య పద్ధతులే కీలకం. ఈ పద్ధతుల్లో లోపాల వల్ల దిగబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు కొందరు రైతులు నీటి వసతి ద్వారా ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి సాధించిన వారున్నారు. వీరంతా పైన వివరించిన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లనే అధిక దిగుబడులు సాధించారు.

తక్కువఖర్చుతో వేప కషాయం

20 లీటర్ల వేప ద్రావకం, కషాయం కోసం కావాల్సినవి. వేపగింజలు ఒక కిలో 20లీటర్ల నీళ్లు, డిటర్జెంట్ 200గ్రాములు.
వేప గింజలను గ్రైండర్‌లో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఇరువై లీటర్ల నీటిలో వేసి పావుగంట నానబెట్టాలి. రెండు మడతల వస్త్రంతో ఈ ద్రావకాన్ని వడగట్టాలి. వడగట్టగా వచ్చిన ద్రావకానికి 200 గ్రాముల డిటర్జెంట్(నిర్మా లేదా సర్ఫ్) కలుపాలి. ఇపుడు ఇది వాడకానికి సిద్ధం.

eklavya-foundation2

స్ప్రే చేసే పద్ధతి

పది లీటర్ల నీటికి రెండు లీటర్ల వేప గింజల ద్రావకం కలుపాలి. అప్పటికప్పుడు కలుపుకొన్న ద్రావకాన్నే స్ప్రే చేయాలి. కలిపాక నిల్వ ఉన్న ద్రావకాన్ని వాడరాదు. సాయంత్రం 3.30 తరువాత పంటకు స్ప్రే చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆర్గానిక్ నిపుణుల సూచన. ప్రతీ అమావాస్య, పౌర్ణమికి 3రోజుల ముందు స్ప్రే చేస్తే చీడ పీడలు అదుపులో ఉంటాయి.

ఎండు తెగులుకు విరుగుడు

కంది పంటలో వచ్చే ఎండు తెగులుకు తిరుగులేని అస్త్రాలు, ట్రైకో డెర్మా విరిడి, వేస్ట్ డి కంపోజర్ వాడాలి.

వేస్ట్ డి కంపోజ్ ద్రావణం తయారీ

200లీటర్ల నీటిని తీసుకొని 2కిలోల బెల్లం కలుపాలి. డబ్ల్యుడిసీ మదర్ కల్చర్ బాటిల్‌లోని బ్యాక్టీరియాను బెల్లం ద్రావణంలో కలపాలి. ఇది వేడి వాతావరణంలో 5రోజులు, చలి వాతావరణంలో 7 రోజులకు వాడటానికి తయారవుతుంది. దీన్ని ఎకరానికి 200లీటర్లు భూమిలో తేమ ఉన్నప్పుడు పంటకాలంలో రెండు సార్లు (30 నుంచి 45రోజులు, 80 నుంచి 90 రోజులు మధ్యలో) వేయాలి.

సమిష్టి అమ్మకాలతో అధిక ఆదాయం

రైతులు తాము పండించిన కందిని రైతు సంఘాలుగా ఏర్పడి భాగస్వామ్య హామీ పథకం (పీజీఎస్) ద్వారా సేంద్రియ ఉత్పత్తి ధృవీకరణ పొందవచ్చు. పీజీఎస్ అంటే ఒకే ప్రాంతంలో ఒకే రకమైన పరిస్థితుల్లో నివశిస్తున్న రైతులు ఒక గ్రూప్‌గా ఏర్పడి తమ ఉత్పత్తులను సేంద్రియ ఉత్పత్తులుగా ప్రకటించడం. దీనికి 5 నుంచి 7గురు రైతులు టీంగా ఏర్పడి వారు ఎలాంటి రసాయన మందు లు వాడలేదని, పూర్తిస్థాయి సేంద్రియ పద్ధతి ద్వారా పంట పండించామని ప్రతీ రైతును మిగతా బృందంలోని రైతు ధృవీకరిస్తాడు. ఇలాంటి పంటను మొదటి, రెండవ సంవత్సరం పీజీఎస్ గ్రీన్‌గా, మూడవ సంవత్సరం పీజీఎస్ ఆర్గానిక్‌గా ధృవీకరణ లభిస్తుంది.

దీనికి తెలంగాణ రీజినల్ కౌన్సిల్‌గా గుర్తింపు పొందిన ఏకలవ్య ఫౌండేషన్ ఆమోద ముద్రవేస్తుంది. ఇలా పండించిన సేంద్రియ పంటలకు మార్కెట్‌లో 25శాతం ఎక్కువ ధర లభించే అవకాశం ఉన్నది. ఈ తొలకరి కంది సాగుకు అనుకూలం. తెలంగాణ రైతాంగంపై పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది. దీనిపై సందేహాలు ఉంటే ఫోన్‌లో సంప్రదించండి. కేస్ స్టడీ గురించి, శ్యాంమోహన్, (9440595858) సాగు యాజమాన్య పద్ధతుల గురించి రమాకాంత్ (8374721751)లను సంప్రదించవచ్చు.
-శ్యాంమోహన్

2582
Tags

More News