పచ్చదనానికి ప్రేమతో..

Thu,May 30, 2019 01:34 AM

మనం ఎంత ఎత్తు ఎదిగినా మన మూలాలు మట్టిలోనే.. ఎంత దూరం పరిగెత్తినా అలసట తీరేది పచ్చదనం ఒడిలోనే.. ప్రకృతి మనిషి ఉనికి. పచ్చదనం మనిషి ఊపిరి.. కృత్రిమత్వపు కత్తి అంచు మీద నడుస్తూ కల్తీ కోరల మధ్య చిక్కి విలవిలలాడుతూ నిండు జీవితం ఎండమావిలా మారిన వేళ మనిషి తిరిగి తన తల్లి ఒడికి చేరుతున్నాడు పచ్చటాకుల మధ్య తిరిగి కొత్తగా ప్రాణం పోసుకుంటున్నాడు. కాంక్రీట్ నిర్మాణాలతో కునారిల్లిపోతున్న నగర దేహంపై నాలుగు మొక్కలు నాటి,చిగురుటాకుల చెలిమెలో సేద తీరుతున్నాడు.
Plants
హైదరాబాదు నగరంలో ఈసీఐఎల్ సమీపంలోని సాకే త్ నగర్ నివాసి ఉషారాణి మొదట్లో కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు అపార్ట్‌మెంట్స్ బాల్కనీలో కుండీలు పెట్టారు. సొంత ఇల్లు కట్టుకున్నాక, ఉషారాణి తానే సొంతంగా క్రమపద్ధతిలో తోటను నిర్మించుకున్నారు. మొదట ఇంటి చుట్టూ నేలలో మామిడి, జామ, కరివేపాకు, మునగ, సపోటా, బొప్పాయి మొక్కలు నాటారు. కింద ఎక్కువ స్థలం లేకపోవడంతో డాబాపైన సిమెంటు కుండీల్లో మొదట టమాటా, మిర్చి, వంట వేశారు. సిమెంటు కుండీల్లో వేసిన చామంతులు, గులాబీలు కూడా గుత్తులుగుత్తులుగా పూశాయి. ఒక 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను కత్తిరించి, దానిలో చిక్కుడు నాటి పైన రాడ్స్, వైర్‌తో వేసిన పందిరికి పాకించారు. ఒకదశలో మిద్దెపంటలో వంకాయలు, టమాటాలు, దొండ, చిక్కుడుకాయలు విపరీతంగా కాశాయి. తరువాత చిక్కుడుకు పేనుబంక విపరీతంగా రావడంతో ఏకంగా చెట్టునే తీయాల్సి వచ్చిందంటారామె.

మొక్కలు పెరిగినా కొద్దీ డాబాపై బరువు ఎక్కువ కాకూడదనే ఉద్దేశంతో ప్లాస్టిక్ బకెట్స్ సేకరించి, వాటిల్లో అన్నిరకాల మొక్కలు నాటారు. వృథాగా పడివున్న వాటిని రీయూజ్ చేయాలనే ఆలోచనతో పాల డబ్బాలు, కారు టైర్లు, ప్లాస్టిక్ డ్రమ్ములు, సిమెంటు కుండీలు, ప్రోపలీన్ గ్రో బ్యాగ్స్, వాటర్ క్యాన్స్ వంటి పలురకాల కంటెయినర్స్ మిద్దెతోటలో వాడుతున్నారు. అంతేకాదు కారు టైర్లు, రిమ్ముల్లో మట్టి, ఎరువు మిశ్రమం నింపి, వాటిలో ఆకుకూరలు పండిస్తున్నారు. కింద, పైన రెండు అంతస్తుల్లోనూ సందు లేకుండా మొక్కలు నాటుకున్నారు.

తరువాత దశలో రెండు వందల లీటర్ల డ్రమ్మును మధ్య కు కత్తిరించి, దానిలో రెండడుగుల మేర ఎరువు నింపి నిమ్మ, దానిమ్మ, గజనిమ్మ, తైవాన్ జామ, మారేడు, వాటర్ యాపిల్ వంటి పండ్ల మొక్కలను పెంచుతున్నా రు. చెట్లు మరీ ఎత్తుగా పెరుగకుండాఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తుంటారు. దీనివల్ల చెట్టు నిటారుగా పైకి కాకుండా, గుబురుగా పెరుగుతుంది.

ఉషారాణి ఆరు నెలల కిందట తమ మిద్దెతోటలో మొద టి అంతస్థులో బీవ్‌ుల మీద 4 అడుగుల వెడల్పు, 9 అడుగుల పొడవుతో నాలుగు మడులు, 4 అడుగుల వెడ ల్పు,7 అడుగుల పొడవుతో మరొక మడి నిర్మించారు. ఈ ఐదు మడులు 9 ఇంచుల తోతు ఉన్నాయి. వీటిల్లో కాలిఫ్లవర్, కారట్, దోస, వంగ నాటుకున్నారు. మట్టిలో వచ్చి మొలిచిన దోస విత్తనం ఒక మడి అంతా అల్లుకుపోయి విపరీతంగా కాపు కాస్తున్నది. ఊరి నుంచి తెచ్చిన రెండు నాటు టమాటాలు తెచ్చి విత్తనాలను నారు పోశా రు. మరుసటి సంవత్సరం చెట్టు మీద కాయలు పండినపుడు వాటిని ఎండబెట్టకుండా పచ్చిగా ఉన్నప్పుడే పిసికి కుండీల్లో నారు పోశారు. బయట నుంచి కొన్న విత్తనాల కంటే ఇలా పోసిన నారే మరింత ఆరోగ్యంగా వచ్చిందంటారు ఉష.

Plants2
మొక్కల ఎదుగుదల కోసం కోకోపిట్, మట్టి, పశువుల ఎరువు, వేపపిండి, లీఫ్ కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్ మిశ్ర మం వాడుతున్నారు. ఎలాంటి తెగుళ్లు ఆశించకుండా ఉండటానికి పుల్లని మజ్జిగ, వేపనూనె, పిచికారీ చేస్తున్నారు. మొక్కలకు ఆమె ఎండిన ఆకుల ఎరువులను చెట్టు మొదళ్లలో వేస్తున్నారు. ఇది మల్చింగ్‌గా ఉపయోగపడుతూ, క్రమం గా మట్టిలో కలిసిపోయి ఎరువుగా మారుతుంది. పంటల పోషణ కోసం జీవామృతాన్ని వాడుతున్నారు. ఆవు ఎరువును మిద్దె మీద మాగబెట్టి అప్పుడపుడూ మొక్కల మొదళ్లలో వేస్తుంటారు.

నీటి నిర్వహణ విషయానికొస్తే, మిద్దెతోటల్లో సరైన సమయంలో మొక్కలకు నీటిని అందించడం ముఖ్యం. ఎండాకాలంలో మిద్దెమీద రోజూ ఒకసారి, కింద గార్డెన్‌కు రెండు రోజులకు ఒకసారి నీళ్లు పెడుతుంటారు ఉషారాణి. చలికాలం, వర్షాకాలంలో మాత్రం రెండు రోజులకు ఒకసారి నీళ్లు పెడుతుంటారు. ఎండాకాలంలో తోటకూర, గంగవాయిలి బాగా వస్తాయి. చలికాలంలో మెంతికూర, పుదీనా, కొత్తిమీర, పాలకూరలు, వర్షాకాలంలో టమా టా, వంగ, బీర బాగా వస్తున్నాయని తన అనుభవంలోంచి ఆమె చెప్పారు.

బయటకొన్న కూరగాయల్లో రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లోనే పండించుకోవడం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుందనే ఆలోచనతో కూరగాయల మొక్కలు ఎక్కువగా పెంచుకున్నారు. ఇంటి కింద ఫెన్సింగ్‌కు దొండ తీగను పాకించారు. ఈ మొక్కను ప్రతిసారీ కాపు పూర్తయ్యాక కత్తిరించడం వల్ల మళ్లీ అది చిగురించి ఎప్పటికపుడు మూడేళ్లుగా కాపు కాస్తున్నది. ఇది సీజన్‌లో వారానికి సుమారు 3కేజీలు కాయలు కాస్తుంది. నలుగురు ఉండే ఈ ఇంట్లో చాలా అరుదుగా బయట నుంచి కూరగాయలు కొంటారు. ఆకుకూరలు మాత్రం అసలు కొనాల్సి అవసరమే రాలేదంటారు ఉషారాణి. కూరగాయలు ఎక్కువగా వచ్చినపుడు మాత్రం చుట్టుపక్కల వాళ్లకు పంచుతుంటారు.

ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఇక మొక్కలు కొనవద్దు అని ప్రతిసారీ అనుకుంటాను. కానీ నర్సరీ దగ్గరికెళ్లాక మనసొప్పక ఒక మొక్కైనా వెంటబెట్టుకొస్తానని చెబుతున్నపుడు, ఆమె మాటల్లో మొక్కల మీదున్న మమకారం కనిపిస్తుంది. ఐదేండ్ల కిందట మొదలుపెట్టిన ఈ తోటలో ఇవాళ కొన్ని వందల మొక్కలు కనిపించి కనువిందు చేస్తున్నాయి.

ఆమెకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ వంటి కళలు వంట బట్టడంతో తన తోటను ఒక అందమైన వర్ణచిత్రంలా తీర్చిదిద్దారు ఉషారాణి. తమ మిద్దెతోట గోడలపై వర్లి బొమ్మలను చిత్రించి, మనోహరంగా మార్చారు. ఎం.ఏ తెలుగు చదివి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పిల్లలకు పాఠాలు చెబుతున్న ఉషారాణి పనిలో అలిసిపోయి ఇంటికొచ్చినపుడు సేదతీర్చేది ఈ మొక్కలే అంటారు. ఈ మిద్దెతోటలో స్వయంగా వివిధ పద్ధతుల్ని అవలంబించి అనుభవం సంపాదించడమే కాదు, యూట్యూబ్‌లో అనుభవజ్ఞులు పెట్టిన పలు వీడియోలు చూసి ఎప్పటికపుడు కొత్త విధానాలను అలవరుచుకుంటున్నారు. తమ గార్డెన్లో అమలుపరుస్తున్నారు. హస్తవాసి అంటాం కదా..అలా ఆమె చేత్తో అలా విత్తనం వేస్తే, ఇలా మొలక వచ్చేస్తుంది. ఉష తమ ఇంటిపై వేసిన ప్రతీ మొక్కా పచ్చగా చిగురిస్తున్నది.
-కె.క్రాంతికుమార్‌రెడ్డి, నేచర్స్ వాయిస్

Plants4

జీవామృతం తయారీ

ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న సుభాష్ పాలేకర్ పద్ధతిలోని జీవామృతాన్ని తమ తోటలో తరచుగా వాడుతుంటారు ఉషారాణి. దగ్గరలోని గోశాల నుంచి ఆవు పేడ,మూత్రం సేకరిస్తున్నారు. 100 లీటర్ల డ్రమ్ములో నీరు నింపి, అందులో 10కేజీల ఆవు పేడ,5 లీటర్ల ఆవుమూత్రం,అర కేజీ శనగపిండి, 1 కేజీ బెల్లం, పిడికెడు పుట ్టమన్ను కలపాలి. ఈ ద్రావణాన్ని వారం రోజులపాటు ఉదయం, సాయంత్రం కర్రతో సవ్యదిశలో తిప్పుతారు. వారం తరువాత మొక్కలకు కొద్దికొద్దిగా వాడుతున్నారు. ఇది మొక్కలకు శక్తినిచ్చే టానిక్‌లా పనిచేస్తుంది.

Plants3

ఉషారాణి ఇంటి మీద కొలువుదీరిన


కూరగాయల మొక్కలు

టమాటా, వంగ, మిర్చి, కాలిఫ్లవర్, ములగ, చెర్రీ టమాటా
దుంపజాతి మొక్కలు
కారట్, అల్లం, పసుపు, మామిడి అల్లం, కంద
తీగజాతి మొక్కలు
దోస, దొండ, చిక్కుడు, బీర, కాకర

ఆకుకూరలు

తోటకూర, బచ్చలికూర, పాలకూర, మెంతికూర, కరివేపాకు, గోంగూర, గంగవావిలి, కొత్తిమీర, పుదీనా, గలిజేరు (పునర్నవ),కేరళ బచ్చలి

పండ్ల మొక్కలు

జామ, నిమ్మ, సపోటా, దానిమ్మ, వాటర్ యాపిల్, గ్రీన్ యాపిల్, నారింజ, పంపర పనస, అంజీర్, మామిడి, అరటి, యాపిల్ బేర్, ఉసిరి, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, స్వీట్ లెమన్, నేరేడు, గజనిమ్మ

పూల మొక్కలు

గోరింట, బంతి, గులాబీ, మల్లె, జాజి, నంది వర్ధనం, వైట్ లిల్లీ, తామర, చామంతి, కౌరవ పాండవ పుష్పం, విష్ణు క్రాంత పుష్పం,రాధా మనోహరాలు, నూరవరహాలు, పారిజాతం, శంఖుపుష్పం, మందార, బ్రహ్మకమలం, పీస్‌లిల్లీ

ఔషధ మొక్కలు

-తులసి, కలబంద, వాము, వామాకు, నల్లేరు, అశ్వగంధ, లవంగ, ఉమ్మెత్త, కుప్పింటాకు, సదాపాకు, ఇన్సులిన్ మొక్క, ఉత్తరేణి,నిమ్మగడ్డి,అడవి తులసి, కృష్ణ తులసి,లక్ష్మీ తులసి..
-వీటితోపాటు ఆల్‌స్పైస్, మారేడు, మరువం, గోరింటాకు, శ్రీగంధం, జేడ్, పలురకాల పూలు, ఇండోర్ ప్లాంట్స్, గాలిని శుద్ధిచేసే ఎరికా పావ్‌ు వంటి పలురకాల మొక్కలు ఇక్కడ కనిపిస్తాయి.

4555
Tags

More News