సాగుకు సన్నద్ధమవుదాం ఇట్లా..

Thu,June 6, 2019 12:47 AM

farming
రైతుల ఆలోచన ఎప్పుడూ సాగు చేసిన పంటల్లో మంచి దిగుబడులు సాధించడమే. దీనికోసం రైతు విత్తనాలు నాటేందుకు దుక్కిదున్నే నాటి నుంచి పంట చేతి అందే సమయం వరకు నిరంతరంగా కష్టపడుతూనే ఉంటాడు. అయితే అలా కష్టపడటమే కాకుండా ఏ పంటను సాగు చేసినా దానిలో ప్రారంభం నుంచే అనువైన పద్ధతులను అవలంబించడం వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తొలకరి వానలు కురిసిన తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభంలో రైతులు ఆచరించాల్సిన విధానాలను గురించి వారు తెలిపిన వివరాలు..

భూసార పరీక్షలు: పంటల సాగులో మంచి ఫలితాలను సాధించాలంటే తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించాలి. దీనిద్వారా రైతులు తమ భూమిలోని పోషక పదార్థాల స్థాయిని తెలసుకుని తద్వారా పంటలకు వాడాల్సిన మందుల మోతాదులను నిర్ణయించుకోవచ్చు. దీంతో రసాయన ఎరువులకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. భూసార పరీక్షలు పోషకాల సమతుల్యతను పాటించడానికి రసాయన ఎరువుల సక్రమ వినియోగానికి ఎంతో దోహదం చేస్తాయి.

భూసార కేంద్రం నుంచి లభించే సలహాలు:

-భూసారాన్ని నిర్ధారించి రైతు వేయాల్సిన పంటలకు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల మోతాదును నిర్ణయించడం.
-సాగుకు అనుకూలంగాలేని ఆమ్ల భూములు, చౌడు భూముల్లో చాలా తక్కువ దిగుబడి వస్తుంది. కాబ ట్టి వాటిని గుర్తించి బాగు చేసుకునే విధానాలు, ఇతర యాజమాన్య పద్ధతులు పాటించడం.
-ఎంపిక చేసిన మట్టి నమూనాల్లో సూక్ష్మపోషకాల విశ్లేషణ చేసి సలహాలు ఇస్తారు.

మట్టి నమూనా సేకరించే విధానం

-పొలమంతా ఒకే రకంగా ఉన్నప్పుడు ఐదు ఎకరాల విస్తీర్ణానికి ఒక నమూనా చొప్పున తీస్తే సరిపోతుం ది. ఒక మట్టి నమూనా తీయదల్చిన పొలంలో 10-12 చోట్ల మట్టిని సేకరించాలి.
-మట్టి నమూనా తీసేచోట నేలపై ఉన్న చెత్త, గడ్డి, కలుపు మొక్కలు తీసివేయాలి.
-పార ఉపయోగించి v ఆకారంలో 6-8 అంగుళాలు(15 సెంటీ మీటర్లు) పై నుంచి దిగువ వరకు ఒకే మందంలో పలుచటి పొర వచ్చే విధంగా మట్టి ని తీయాలి. ఇలా అన్నిచోట్ల తీసిన మట్టిని గోనె పట్టా లేదా పాలిథీన్ షీట్ లేదా గుడ్డ మీద వేసి మట్టి గడ్డలను చిదిపి బాగా కలిపి చతురస్ర్తాకారంగా పరిచి నాలుగు సమభాగాలుగా విభజించాలి. ఎదురెదురు గా ఉన్న భాగాలను తీసుకుని మిగిలిన మట్టిని తీసివేయాలి. ఈ విధంగా అరకిలో మట్టి మిగిలే వరకు చేయాలి.
-నమూనాను శుభ్రమైన గుడ్డ సంచిలో లేదా ప్లాస్టిక్ సంచిలో నింపాలి. సంచి లోపల రైతు పేరు, తండ్రిపేరు, గ్రామం, సర్వే నెంబర్, వేయదలచిన పంట వివరాలతో కూడిన సమాచారాన్ని తెలియజేస్తూ మట్టి నమూనాను భూసార కేంద్రానికి పంపాలి.

వేసవి దుక్కులు లాభాలు:

-భూమి గుళ్ళబారి నీటిని బాగా పీల్చుకుంటుంది.
-నేలపై ఉన్న సారవంతమైన పొర వర్షపు నీటికి కొట్టుకపోదు
-కలుపు మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. క్రిమికీటకాల బెడద తక్కువగా ఉంటుంది.
-భూమిలో తేమ తొందరగా ఆరిపోదు.
-నిండు పదునులో సిద్ధంచేసిన దుక్కిలో పైర్లు విత్త డం వల్ల మొక్కల సాంద్రత కావాల్సినంత ఉంటుం ది. మొక్కలు బాగా పెరుగుతాయి.

farming2

సేంద్రియ ఎరువులతో భూసారవృద్ధి

-భూమిలో సేంద్రియ ఎరువులు వేయడం వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. మొదట సూక్ష్మజీవుల ఉత్పత్తి పెరుగుతుంది. వీటి వలన మొక్కలకు ఉపయోగపడే మార్పులు జరుగుతాయి.
-భూసారం పెరుగుతుంది. భూ భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమి గుళ్ళ బారుతుంది. భూమిలో నీటిని, పోషక పదార్థాలను నిలువ ఉంచుకునే శక్తి పెరుగుతుంది.
-సూక్ష్మజీవుల ఉత్పత్తిచేసే హార్మోన్ వల్ల మొక్కల పెరుగుదల వృద్ధి చెందుతుంది. సూక్ష్మపోషక పదార్థాల లోపాలు సవరించబడుతుంది. చౌడు సమస్యను నివారించుకోవచ్చు.
-పంట నాణ్యత పెరుగుతుంది.చీడపీడలకు తట్టుకునే శక్తి పెరుగుతుంది. సూక్ష్మజీవులు వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందజేస్తాయి. పోషక పదార్థాలను మొక్కలకు అందజేస్తాయి.

సేంద్రియ ఎరువులు

1. పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, పట్టణ, వ్యర్థాలను కంపోస్ట్, వర్మికంపోస్ట్, పంట అవశేషాలను భూమిలో కలియ దున్నడం మొదలైనవి.

పచ్చిరొట్ట ఎరువులు

పచ్చిరొట్ట పైర్లు: జనుము, జీలుగ, పిల్లి పెసర మొదలైనవి పెంచి భూమిలో కలియదున్నడం.
పచ్చి ఆకు ఎరువులు: ైగ్లెసీడియా కొమ్మలు, ఆకులు, కానుగ, జిల్లేడు, నేల తంగేడు, వెంపలి మొదలైనవి భూమిలో తొక్కి భూసారాన్ని పెంచుకోవచ్చు.

జీవన ఎరువులు:

భూ సాంద్రతను మెరుగుపరిచి పంటల ఉత్పాదకతను పెంపొందించుకోవడానికి వివిధ పోషక పదార్థాలు లభ్యమయ్యే రసాయన, సేంద్రియ, జీవన ఎరువులను సమతుల్యంగా వాడటం చాలా అవసరం.
నత్రజని జీవన ఎరువులు: రైజోబియం, అజటోబాక్టర్, అజోస్పైరిల్లమ్, నీలి ఆకుపచ్చ శైవలాలు, అజోల్లా మొదలైనవి.
భాస్వరపు జీవన ఎరువులు: పాస్పో బాక్టీరియా, మైకోరైజా మొదలైనవి.

జీవన ఎరువుల కలిగే వల్ల లాభాలు

-రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులను వాడటం వల్ల రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకోవచ్చు.
-వాతావరణంలోని నత్రజనిని భూమిలో స్థిరీకరించి మొక్కలకు అందజేస్తాయి.భూమిలో స్థిరీకరించిన భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి.
-కొన్ని సూక్ష్మజీవుల హార్మోన్లు, విటమిన్లు, ఆక్సిన్‌ల విడుదలకు, మొక్కల పెరుగుదలకు తోడ్పడుతాయి.
-సగటున 10-12శాతం దిగుబడులు పెరుగుతాయి. నేల భౌతిక స్వభావాన్ని మెరుగుపరిచి భూసారాన్ని కాపాడుతాయి. తక్కువ ఖర్చుతో వాతావరణ కాలు ష్యం కాకుండా జీవన ఎరువులను ఉపయోగించుకోవచ్చు.
-నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా,


yadagiri-reddy

భూసార పరీక్షలకు అనుగుణంగా..

వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందే రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షల ఆధారంగా వేసే పంటకు మందులను తగు మోతాదులో వాడాలి. దీంతో రసాయన మందుల ఖర్చు తగ్గుతుంది. భూసార పరీక్షలు చేయించుకునేటప్పడు రైతులు సరైన విధానాలను అనుసరించాలి. దీంతో మంచి ఫలితాలను పొందవచ్చు.
- టి.యాదగిరిరెడ్డి, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి.9440481279

5169
Tags

More News