హైడ్రోఫోనిక్స్ విధానంతో పంటల సాగు

Thu,June 6, 2019 12:50 AM

hydroponics-farming
మట్టితో అవసరం లేకుండా నీళ్లతోనే మొక్కల్ని పెంచడాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు. మామూలుగా వ్యవసాయం చేయడానికి నేల, నీళ్లు కావాలి. వాతావరణం పంటలకు అనుకూలంగా ఉండాలి. కానీ హైడ్రోఫోనిక్స్ ద్వారా నేల అవసరం లేకుండా వాతావరణంపై పూర్తిగా ఆధారపడకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా పంటలు పండించవచ్చు.

హైడ్రోఫోనిక్స్‌లో మొక్కలు పెంచే విధానం

ప్రకృతి మీద ఆధారపడకుండా ఉన్న స్థలంలో మొక్కలకు కావాల్సిన పోషకాలు నీళ్ల ద్వారా అందించడానికి నిలువుగా, అడ్డంగా నీటి గొట్టాల్ని ఒక వరుసపైన మరొకటి అమరుస్తారు. వాటికి రంధ్రాలు చేసి పేపర్ టీ కప్పుల్లాంటి జాలి కప్పులను పెడుతారు. అందులో మొక్కలను నాటే ముందు మొక్కలు స్థిరంగా ఉండటానికి బంకమట్టితో చేసిన చిన్న గుండ్రని బాల్స్‌ను వేస్తారు. మొక్క వేళ్లు జాలిలో నుంచి పైపులోకి పోతా యి. ఆ పైపులో మొక్కకు అవసరమైన పోషకాలు కలిపిన నీరు నిరంతరంగా నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఈ నీరు మొత్తం పైపు అంతా ప్రవహించి తిరిగి ట్యాంకులోకి చేరుతుంది. మళ్లీ అవే నీళ్లు పైపుల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేస్తారు.

ఇలా చేయడం ద్వారా నీరు వృథా కాదు. ఈవిధానంలో మొక్కలను పెంచడం వల్ల భూమిలోకి చొచ్చుకొని పోయి నీటిని, పోషకాలను వెతుక్కోవాల్సిన పని ఉండదు. కాబట్టి మట్టిలో పెరిగినట్టు ఈ మొక్కల వేర్లు పెద్దగా పెరుగవు. కాబట్టి పోషకాలు పూర్తిగా మొక్క పైభాగం పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పంట కాలాన్ని బట్టి, వాతవరణాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైతే ఎండ ఎక్కువ పడకుండా నీడను ఏర్పాటు చేస్తారు. ఎండ పడని ప్రదేశమైతే వెలుతురు కోసం ఎల్‌ఈడీ లైట్లను అమరుస్తారు.

మొక్కలను పెంచడానికి కావాల్సిన ముఖ్య పరికరాలు: ఈసీ మోటర్, పీహెచ్ మీటర్, లిట్మస్ పేపర్

hydroponics-farming2

పోషక ద్రావణం తయారీ

సరైన పోషక ద్రావణాన్ని వాడాలి. అంటే తగిన మోతాదులో స్థూల, సూక్ష్మ పోషకాలను కలిగి ఉండా లి. సాధారణంగా పోషక ద్రావణం గాఢత 1000 నుంచి 2500 పీపీఎం వరకు ఉండే విధంగా చూసుకోవాలి. పోషక పదార్థాల ద్రావణాన్ని పంటకు అనుగుణంగా తయారుచేసుకుని వాడుకోవాలి.

ఈ విధానంలో వాతావరణ పరిస్థితుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుఉష్ణోగ్రత: కొన్ని రకాల పంటలకు చలికాలంలో ఉష్ణం, ఎండాకాలంలో చల్లని వాతావరణాన్ని కల్పించాలి. దీనివల్ల మంచి దిగుబడులు సాధించవచ్చు. అయినప్పటికీ సుమారుగా 65-75 డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. దీనివల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగుదల బాగుంటుంది.

ఆర్ద్రత: ఈ విధానంలో ఆర్ద్రత 40-80 శాతం ఉండేలా చూసుకోవాలి. గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండటం వల్ల చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. హైడ్రోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించి ఆర్ద్రతను సమతుల్యం చేయవచ్చు.

గాలి ప్రసరణ: మొక్కల నుంచి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్‌ను ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనే పరికరాన్ని వాడుకొని వేడి గాలిని బైటికి పంపి చల్లగాలిని లోపలికి పంపించాలి. దీనివల్ల మొక్కలకు కావాల్సిన ఆక్సిజన్ అందించవచ్చు.

వెలుతురు: పండించే స్థలంలో చీకటి స్థలం ఉన్నట్లయితే మార్కెట్‌లో దొరికే అధిక సాంద్రత లైట్ వాడుకొని వెలుతురును సమతుల్యం చేయాలి.

ఈ విధానంలో ఎదురయ్యే నష్టాలు

-సంప్రదాయ సాగు విధానం కంటే ఈ పద్ధతిలో తగినంత అనుభవం, శాస్త్రీయ పరిజ్ఞానం కావాలి.
-దీనిలో ఫలితాలు వెంటనే రాకపోవచ్చు. కాబట్టి ఓపికతో చేయాలి.
-ఈ విధానంలో సాగు చేసిన కూరగాయలు, పండ్లు సేంద్రియమా? కాదా? అనే ప్రశ్న ఇంకా ప్రజల్లో కొనసాగుతున్నది.
-ఈ విధానంలో ఎలక్ట్రిసిటీ అవసరం ఎక్కువ. కాబట్టి మధ్యలో కరెంట్‌లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి.
-ఇది పూర్తిగా సాంకేతిక పద్ధతి. కాబట్టి దీన్ని అమర్చుకోవడానికి ముందుగా అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువ.
-దీనిలో చీడపీడల బెడద తక్కువ. అయినప్పటికీ ఒకసారి ఏదైనా ఆశిస్తే వాటి వ్యాప్తి తొందరగా ఉంటుంది.
-కొన్నిసార్లు రైతు పెట్టిన ఖర్చుతో పోలిస్తే వచ్చే నికర ఆదాయం తక్కువగా ఉండవచ్చు. అయితే నష్టాలతో పోలిస్తే లాభాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సరైన అనుభవంతో సాగు చేయాలి. తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు.

hydroponics-farming3

ఈ విధానంలో ఏ పంటలు పండించవచ్చు

స్ట్రాబెర్రీ: ఈ విధానంలో ఇప్పటికే చాలామం ది రైతులు స్ట్రాబెర్రీ పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. నేల, సీజన్‌తో సంబంధం లేకుం డా ఏడాది పొడవునా ఈ పంటను సాగుచేసుకోవచ్చు.

కాలే (kale) పంట: ఇది ఒక ఆకుకూర లాంటిది. దీని పెరుగుదలకు సూర్యరశ్మి ఎక్కువగా అవసరం లేదు. ఈ విధానంలో ఈ పంట సాగు చేయడం వల్ల అధిక పోషక విలువలు కలిగిన మంచి దిగుబడి వస్తుంది. అలాగే మార్కెట్ ధరను పొందవచ్చు.

పాలకూర: ఈ విధానంలో ఈ పంట సాగు చేయడం వల్ల అనుకూల పరిస్థితుల్లో సుమారు 12 వారాల వరకు వరుసగా ఆకులను కోసి మార్కెట్‌లోకి పంపించవచ్చు. ఈ పంటను ఈ విధానంలో ఇంటిపైన ఖాళీ స్థలంలోనూ పండించుకోవచ్చు.

టమాటా: ఈ విధానంలో కృత్రిమ ఉష్ణోగ్ర త, వెలుతురు ఉన్న పరికరాలను వాడుకొని అధిక దిగుబడి సాధించవచ్చు.

దోసజాతి : తీగజాతి కూరగాయలు కూడా హరితగృహాల్లో కావల్సిన వాతావరణం కల్పించి ఈ విధానంలో పండించవచ్చు. ఇవే కాకుండా టమాటా, మిరప వంటి ఇతర కూరగాయలను కూడా పండించవచ్చు.

ఈ విధానం వల్ల కలిగే లాభాలు

-మొదటగా పంటకు కావాల్సిన నేలతో దీని కి సంబంధం ఉండదు.
-తక్కువ స్థలంలో, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.
-హరితగృహంలో లాగా హైడ్రోఫోనిక్స్ విధానంలోనూ వాతావరణ పరిస్థితులను కావల్సిన విధంగా మార్చుకోవచ్చు.
-మనం సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసుకునే నీటిలో పది శాతం నీటిని వాడుకొని నీటి వృథాను అరికట్టవచ్చు.
-మొక్కలకు కావాల్సిన ఎరువులను, పోషకాలను ద్రావణం రూపంలో అందించడం వల్ల వాటి పోషక విలువ పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి.
-సాధారణంగా నేలలో పెరిగే మొక్కలతో పోలిస్తే ఈ విధానంలో పెరిగే మొక్క పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాతావరణ సమతుల్యత ఉంటుంది కాబట్టి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.
-కలుపు మొక్కలు, చీడపీడలు, తెగుళ్ల బెడ ద చాలా తక్కువగా ఉంటుంది.
-తక్కువ మోతాదులో పురుగు మందులు వాడటంతో కలుషితం లేని సాగు చేయవచ్చు.
-ఉదజని సూచిక స్థాయి నేల సాగులో కంటే నీటి సాగులో మనకు కావాల్సినంత నిర్వహించుకోవచ్చు. దీనితోపాటు కూలీల అవసరం కూడా తక్కువ.
-సూరం సింధూజ, అసిస్టెంట్ ప్రొఫెసర్
-ఎ. నిర్మల, అసిస్టెంట్ ప్రొఫెసర్
ఉద్యాన కళాశాల, రాజేంద్రనగర్


hydroponics-farming4

5030
Tags

More News