ముచ్చటైన మిద్దెతోట

Thu,June 13, 2019 12:55 AM

ఇంటి పంట
శారీరక వ్యాయామం, మానసిక ఆనందం, విష రసాయనాల జాడలేని కూరగాయలు, ఆరోగ్య సమస్యలు రానివ్వని సహజ పంటలు బయట కొనాల్సిన అవసరం లేకపోవడంతో మిగులు ఆదాయం కుటుంబసభ్యులతో గడిపే విలువైన సమయం వేసవిలో ఇంట్లో కావలసినంత చల్లదనం పట్టణంలోనూ ప్రకృతితో మమేకమయ్యే అవకాశం అన్నిటికీమించి అసలు మనమేం తింటున్నామనే స్పృహ.. ఇంటిపంట అంటే ఇంతేనా.. ఇంతకు మించి చాలా ఉందంటారు యశోధర ప్రసాద్ దంపతులు.
terrace-garden
ఇ.సి.ఐ.ఎల్‌లో నివాసం ఉండే వీరి మిద్దెతోటను చూస్తే ఎంతకీ కదలబుద్ది కాదు. గోడల మీద ఏమూల చూసి నా యశోధర చేతిలోంచి జాలువారిన చిత్రాలు ముచ్చ ట గొలుపుతుంటాయి. తోట మధ్యలో నులక మంచం వేసుకుని కూర్చుంటే, మనమున్నది ఒక పక్కా పల్లెటూ రు అన్న భావన కలుగుతుంది. వీళ్లు చేస్తున్న తోట చూస్తే మనకూ నాలుగు మొక్కలు పెంచాలన్న కాంక్ష కలిగించే చేతన గృహం ఇది. యశోధర ప్రసాద్ దంపతులిద్దరూ ఎల్.ఐ.సిలో ఉద్యోగులు. భర్త ప్రసాద్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, యశోధర అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు. మొదటి నుంచీ వీరిది వ్యవసాయ నేపథ్యం కావడంతో సహజంగానే వీరికి మొక్కల పెంపకంపై ఆసక్తి,అనురక్తి. 2000 సంవత్సరంలో ఇ.సి.ఐ.ఎల్‌లో సొంత ఇళ్లు కట్టి న తొలిరోజుల్లో కొన్ని పూల మొక్కలు పెంచారు. 2007లో ఇంటిపైన పూర్తిస్థాయిలో ఇంటిపంటను ప్రారంభించారు. 2015లో యశోధర రోడ్డు ప్రమాదానికి గురైనపుడు, కొంత విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిం ది. మధ్యలో హార్టికల్చర్ షోకు వెళ్లినపుడు కలిసిన మిద్దెతోట మిత్రులు పంచుకున్న విషయాలు, ఆమెలో మరి న్ని ఆలోచనలను రేకెత్తించాయి. వారి పరిచయంతోనే యశోధర ఇంటిపంట ఫేస్‌బుక్ గ్రూప్‌లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి గార్డెన్‌లో కొత్త తరహా ప్రయోగాలకు శీకారం చుట్టారు. ఆమె సహజంగానే ఆర్టిస్ట్ కావడంతో, గోడల మీద రకరకాల బొమ్మలతో మిద్దెతోటను అందమైన వర్ణచిత్రంగా మలిచారు. టెర్రకోట బొమ్మలు మీద రంగులు వేసి, వాటిలో చిన్న చిన్న అలంకరణ మొక్కలు పెంచుతున్నారు.

ఈ తోటలో పూలు, పండ్లు, అలంకరణ మొక్కలు, ఔషధ మొక్కలు ఉన్నప్పటికీ ప్రధానంగా కూరగాయల మీద దృష్టి పెట్టారు. మూడు అంతస్థుల్లో పలురకాల ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. వీటిల్లో దొండ, వంకాయ, టమాటా, బెండకాయ, గోరుచిక్కు డు, కాకర సంవత్సరం పొడవునా కాస్తున్నాయి. వేసవిలో దోస, కాకర, వంకాయ, టమాటా, గోరుచిక్కు డు, ఆకుకూరలు విపరీతంగా వచ్చా యి. వంకాయలు ఎంతమందిని ఇచ్చినా రోజూ వస్తుంటాయి. సహజంగా రెండేళ్లు దాటగానే కాపుతగ్గే వంగ ఇక్కడ మాత్రం మూడేండ్లకు పైగా మంచి కాపు కాస్తున్నది. వంగ, దోస, గోరుచిక్కుడు, ఆకుకూర లు ఈ ఐదేళ్లలో అసలు బయట నుంచి కొనలేదంటారు యశోధర ప్రసాద్. వీరు తమ తోటలో మరింత మెరుగైన ఉత్పత్తి కోసం జీవామృతం వాడుతున్నారు. ఇందుకోసం కావలసిన పశు వ్యర్థాలను దగ్గరలోని గోశాల నుంచి తెచ్చుకుంటున్నారు. కిచెన్ వేస్ట్, తోటలో రాలిన ఎండుటాకుల మీద ఒక పొరగా మట్టివేసి, దానికి కొంచెం మైక్రోబియల్ కోకోపిట్ కలిపి కుండలో వేసి, కంపోస్ట్ చేసి ప్రతివారం మొక్కలకు వేస్తున్నారు. కొన్నిసార్లు తెగుళ్ల సమస్య వచ్చినపు డు, మొక్కల మీద బూడిదను చల్లుతున్నా రు. పేనుబంక కనిపించినపుడు (వంగ, మందార, దొండ) 10లీటర్ల నీటికి 30ఎం.ఎల్ వేపనూనె కలిపి వాడుతున్నారు. పసుపు నీళ్లు, పులిసిన మజ్జిగను నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నారు. ఇక మందారకు మిల్లీబగ్ ఎక్కువగా వస్తున్నది. దానికి ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం రాలేదంటారు. నీటి యాజమాన్యానికి సంబంధించి వర్షాకాలం, చలికాలం మొక్కల కు రోజు విడిచి రోజు,ఎండాకాలంలో రెండు రోజులకు ఒకసారి నీరు పెడుతున్నారు.

terrace-garden2
విత్తనాలను తిరిగి కొనకుండా, ప్రతి రకంలో ఒక మొక్కను విత్తనం కోసం విడిచిపెడుతున్నారు. ఇక తమ తోటలో యశోధర చేస్తున్న ప్రయోగాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 20 లీట ర్ల వాటర్ క్యాన్ కింది భాగాన్ని రెండుగా కత్తిరించి, కింద భాగాన్ని కూరగాయలు పెంచుకోవడానికి వాడుతున్నారు. పైభాగాలన్నింటిని ఒక పి.వి.సి పైపుతో కలిపి పొడవాటి స్టాండ్‌గా తయారుచేసి వాటిలో టేబుల్ రోజెస్ పెంచుతున్నారు. లీటర్ వాటర్ బాటిల్స్‌ను కింద భాగం లో కొంచెం వదలి పైన చతురస్రాకారంలో కత్తిరించి, అడుగున కొంత మట్టిపోసి వాము మొక్కలు పెంచుతున్నారు. ఒకప్పుడు మా ఆఫీసులో చెట్ల గురించి మాట్లాడుతుంటే, నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూసేవారు, ఇప్పుడు మాత్రం ఇంటి పంటలపై చాలామందిలో అవగాహన పెరిగింది. మా ఇంటికి వచ్చి చూసినవాళ్లు, మా విత్తనాలు తీసుకెళ్లి ఇంటి పంటలు పండిస్తున్నారు. మెట్రోలో ఆఫీసుకు వెళుతున్నపుడు అమీర్‌పేటవైపు చాలా రూఫ్ గార్డెన్స్ కనిపిస్తున్నాయి అంటే, ఇది జనాల్లో ఇంటిపంటపై పెరిగిన చైతన్యం అంటారు యశోధర. యశోధరకు మొక్కలంటే పిచ్చి ఉంది కాబట్టే, ఎవరింటికైనా వెళ్లినపుడు అక్కడ నచ్చిన మొక్కను తన తోటలో నాటుకుంటారు. అలా తన తోట ఇవాళ చిన్నపాటి ఉద్యానవనాన్ని తలపిస్తున్నది. అసలు ఈ పూలు, పండ్లు, ఉద యం పూట పక్షుల కువకువల మధ్య గడుపుతుంటే ప్రకృతిలో ఉన్నట్టే ఉంది అంటారు యశోధర ప్రసాద్ దంపతులు.

terrace-garden3

యశోధర ప్రసాద్ ఇంటితోటలో పెరుగుతున్న మొక్కలు

-ఆకుకూరలు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తోటకూర, సిలోన్ బచ్చలి, పాలకూర, బచ్చలికూర, గోంగూర, గంగవావిలి,

-కూరగాయలు: టమాటా, చెర్రీ టమాటా, హైబ్రిడ్ టమాటా, వంగ (తెలుపు, నలుపు, గుత్తి వంకాయ, పొడవు వంగ), బెండ, గోరుచిక్కుడు

-తీగజాతులు దొండ, బీర, నేతి బీర, సొర, కాకర, చిక్కుడు

-దుంపజాతులు: చేమ, ఆలుగడ్డ, ఉల్లిపాయ, చిలగడదుంప, పసుపు, అల్లం, మామిడి అల్లం

-పండ్ల మొక్కలు: నిమ్మ, సీతాఫలం, దానిమ్మ, అంజీర్

-పూల మొక్కలు: మల్లె (బొండు మల్లె, తీగ మల్లె, చిట్టి మల్లె, కాగడా మల్లె, స్టార్ మల్లె), కనకాంబరం (మూడు రంగులు), చామంతి, తామర, టేబుల్ రోజెస్), గులాబీ, కాగితం పూలు, శంఖుపుష్పం

-ఔషధ మొక్కలు: తులసి, మింట్ తులసి, సబ్జ, అలోవెరా, నల్లేరు

terrace-garden4
-కె.క్రాంతికుమార్‌రెడ్డి, నేచర్స్‌వాయిస్

694
Tags

More News