పత్రహరితమే ప్రాణదీపం

Thu,June 20, 2019 12:10 AM

venkatakrishna
ఎవరి శ్రద్ధ కలుగుతుందో వారికే జ్ఞానం లభిస్తుంది.గీతలో చెప్పినా, రాతలో రాసినాదేని మీద మనకు ప్రేమ, ఆపేక్ష ఉంటుందోఅదే మన మనుగడ మర్మాన్ని విప్పుతుంది.ఒక మొక్క నీడలో పెరిగితేమన జీవిత రహస్యం విడివడుతుంది.వేలయేళ్లుగా నడిచి వచ్చిన దారులప్రాకృతిక జాడేదో బోధపడుతుంది.మట్టే తన అస్తిత్వమని తెలిసినవాడికిప్రతి అణువూ పత్రహరితంలా కనిపిస్తుంది.తానే ఒక నడిచే వృక్షమై కాలరేఖపై వికసిస్తాడు.

హైదరాబాద్‌లోని మెహదీపట్నానికి చెందిన ఈమని వెంకటకృష్ణ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్. కానీ, మొక్కల పెంపకంపై ఆసక్తి చిన్ననాటి నుంచే ఉన్నది. ఆయన కుటుంబం నగరంలో ఎప్పటి నుంచో ఇంటి పెరట్లో అన్నిరకాల కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచేవాళ్లు. అప్పట్లో నేల మీద ఎండ పడేది కాబట్టి మొక్కలు పచ్చగా కళకళలాడేవి. 1985 తరువాత పెరటి స్థలం తగ్గడం, చుట్టూ బిల్డింగ్స్ రావడంలో ఎండ తగ్గి, పూల మొక్కలను మొదటిసారిగా మిద్దె మీదకు తీసుకువచ్చారు. అవి బాగా పూశాయి. ఎంత బాగా అంటే పక్కవాళ్లు ఏమిటీ నర్సరీ పెట్టారా? అని అడిగేంతగా. తరువాత 10 ఏళ్ల కింద అదే స్థలంలో కొత్త ఇళ్లు కట్టాక మిద్దె మీద అన్నిరకాల కూరగాయల సాగు మొదలుపెట్టారు. మొదట్లో చిన్న చిన్న ప్లాస్టిక్ కంటెయినర్సుల్లో పెంచుతుంటే కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. చిన్న చిన్న క్యాబేజి, కాలిఫ్లవర్ వచ్చా యి. అప్పటికి పెద్ద సైజు కంటెయినర్లు వాడాలనే అవగాహన లేదు. కొంత అవగాహన వచ్చాక గత మూడు సంవత్సరాల క్రితం గార్డెన్‌ను రీడిజైన్ చేశా రు. గో మోర్ క్వాంటిటీ ఆఫ్ ది సేవ్‌ు వెరైటీ (ఒకే వంగడంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడం) అనే కాన్సెప్ట్‌తో తన గార్డెన్‌ను మలుచుకుంటున్నారు.

డాబా మీద మొదటి అంతస్తులో కూరగాయలు, రెండవ అంతస్తులో పండ్లమొక్కలు, మూడవ అంతస్తులో పూలమొక్కలు పెంచుతున్నారు. మొదటి అంతస్తులో మిద్దె మీద 10 అడుగుల దూరం, 10 అడుగుల పొడవున రాడ్స్ వేసి, మధ్యలో అడ్డంగా జిఐ వైర్లు, నిలువుగా కొబ్బరి తాళ్లను ఈ వర్టికల్ గార్డెన్‌కు ఆదరువుగా వాడారు. ఈ రాడ్స్ పారాపిట్ వాల్ నుంచి 4 అడుగుల పొడవు పైకి ఉండాలా చూసుకున్నారు. పైన మాత్రం సన్న రాడ్ల తో ఇనుప పందిరిని వేసుకున్నారు.

మిద్దెతోటలో నాణ్యమైన దిగుబడులకు పెద్ద కంటెయినర్లు అవసరమనే విషయాన్ని అర్థం చేసుకుని,200లీటర్ల డ్రమ్మును రెండు ముక్కలుగా కత్తిరించారు. వాటిలో 70 శాతం సేంద్రియ పదార్థం, 20 శాతం ఎర్రమట్టి, 10 శాతం కంపోస్టుతో పాటింగా మిక్స్‌ను కలుపుకున్నారు. సేంద్రియ పదార్థం అంటే కొబ్బరిపీచు, చెరకుగడల పిప్పి, తోటలోని వ్యర్థాలు.. కుండీల్లో మొక్కలు నాటడంలో మూడంచెల విధానాన్ని అవలంబిస్తూ, ఒకే కంటెయినర్‌లో తీగజాతి (సొర, బీర, చిక్కుడు),దుంపజాతి (కంద, చేమ), ఆకుకూర (మొదటి దశలో)లను పండిస్తున్నారు. ఆకుకూరలు తీసివేసిన తరువాత వంగ, చెట్టుచిక్కుడు మధ్యస్థంగా కాసేవాటిని అక్కడ నాటుకుంటారు.

తీగజాతి పైకి పెరుగుతుంది. దుంపజాతి భూమి లో పెరుగుతుంది. మిగతావి రెంటికి మధ్య మధ్యస్థంగా పెరుగుతాయి. దుంపలు, మధ్యస్థంగా కాసేవి లైవ్ మల్చింగ్‌గా కూడా ఉపయోగపడుతున్నాయి. అలాగే గన్నేరు, టమాటా. వంగను ఒకే టబ్‌లో పెంచారు. మునగ నాటిన టబ్‌లోనే పసుపు నాటారు. దీనివల్ల తెగుళ్ల నియంత్రణే కాకుండా, స్పేస్ యుటిలైజేషన్ అవుతుందంటారు వెంకటకృష్ణ. మరో అడుగు ముందుకువేసి, ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్‌ను తీసుకుని, అడుగు భాగం కత్తిరించి, పైభాగంలో మూత తీసివేసి, అక్కడ కొబ్బరిపీచు లేదా ఎండుగడ్డి కొంత పెట్టి, దాన్ని పెద్ద కుండీల్లో నాలుగు వైపులా బోర్లించి నాటి, దానిలో ఎరువు నింపి కారట్, రాడిష్ వేస్తే దుంపలు చాలా పెద్ద సైజులో వచ్చాయి. ఇలాంటి ఎన్నో ప్రయోగాలు ఈయన తోటలో కనిపిస్తాయి.

ఎరువుల విషయానికొస్తే, 200 లీ. డ్రమ్ము చుట్టూ అక్కడక్కడ రంధ్రాలు చేసి, కిచెన్ వేస్ట్, గార్డెన్ వేస్ట్‌ను (ఎండుటాకులు, తీగ లు) దానిలో ఒక్కొక్క పొరగా వేస్తారు. డ్రమ్ములోంచి కారే ద్రవరూప ఎరువును కింద ఒక ప్లేటులో సేకరించి, దానికి పదిరెట్ల్ల నీటిని కలిపి, మొక్కలకు పిచికారీ చేస్తారు. దీనివల్ల నాణ్యమైన ఉత్పత్తులు వస్తున్నాయంటారు వెంకటకృష్ణ.

అసలు టెర్రస్ గార్డెన్ అంటేనే ప్లానింగ్. అది సరిగా ఉంటే మిగతాదంతా చాలా సులువంటారు వెంకటకృష్ణ. అసలు మనం టెర్రస్ గార్డెన్ ఎందుకు చేస్తున్నాం అనే విషయం మొదట క్లారిటీ ఉండాలి. దాని చుట్టూనే గార్డెన్‌ను నిర్మించుకోవాలంటారు. మిద్దెతోటలో కూరగాయలు ప్రధానం అనుకుంటే,దానికి కాలాన్ని అనుసరించి నార్లు పోయటం,మొక్కలు నాటుకోవడం చేయాలంటారు. తీగజాతులు, గోరుచిక్కుడు, ఆకుకూరలు, బెండ, దుంపజాతులు, వంకాయ వంటివి వర్షాకాలంలో బాగా వస్తాయి. కంద, అల్లం, మామిడి అల్లం, పసుపు, చేమదుంప, పెండలం వంటి దుంపజాతులు అన్నింటిని జూన్‌లో నాటుకోవాలి. 9 నెలల పాటు దుంప నేలలో బాగా ఊరుతుంది. ఆగాకరను మేజూన్ నెలలలో నాటుకోవాలి. మొలక శాతం బాగుంటుంది. జూన్‌లో చెట్టుచిక్కు డు వస్తుంది. శీతాకాలం అంత బాగా రాదు. తీగచిక్కుడును సెప్టెంబరు తరువాత వేసుకోవాలి. 3 నెలల పాటు (చలికాలంలో) దస రా సంక్రాంతి మధ్యకాలంలో బాగా కాస్తుంది. గోబి, కాలిఫ్లవర్, కారెట్, కాబెజీలు శీతాకాలపు పంటలు. వీటిని దసరా (సెప్టెంబరు) సమయంలో వేసుకోవాలి. కొత్తిమీర చలికాలంలో బాగా వస్తుంది. మిగతా కాలాల్లో వేస్తే సరిగ్గా రాదు. ఏ కాలంలో పంట చేతికి వస్తుందో, దానికి మూడు నెలల ముందు విత్తనం నాటుకోవడం అనేది ఇందులో ప్రధానమైనది. రెండు, మూడు సీజన్స్‌లో మనకు అనుభవం వస్తుంది, దాంతో మిద్దెతోటను చేసుకోవడం సులువవుతుంది. సుదీర్ఘకాలంగా మిద్దెతోట చేస్తున్న అనుభవంలోంచి, కొత్తగా ఇంటిపంటలు చేస్తున్న వారికోసం అనేక మెళకువలు చెబుతున్నారు వెంకటకృష్ణ.

- ఒకే కంటెయినర్లో ఒకే రకం మొక్క పెట్టకూడదు. రెండు మూడు రకాలు పెట్టుకోవాలి. దీనివల్ల తెగుళ్ల నియంత్రణ సాధ్యం.
- ప్రతి ఆకుకూర కంటెయినర్లో నాలుగువైపులా వెల్లుల్లి రెబ్బలు నాటుకోవాలి. దీని వాసన వల్ల తెగుళ్లు రావు.
- వంగా టమాటాల మాదిరి కాంబినేషన్ కూరలు ఎలా చేసుకుంటామో, అలా కాంబినేషన్ ఆధారంగానే, మనం పంటలు కూడా నాటుకోవచ్చు.
- నత్రజని కోసం ద్విదళజాతికి చెందిన చిక్కుడు, గోరుచిక్కుడు, శనగ వంటి వాటిని ప్రతి కంటెయినర్లో నాటుకోవాలి.
- మంచి సారవంతమైన మట్టి ఎరువు వాడటం వల్ల మొక్క బలంగా ఎదుగుతుంది. దానివల్ల మొక్క తెగుళ్లను తట్టుకుంటుంది. నా తోటలో 70 శాతం ఎరువు మట్టి ఎరువే.
- ఆకులకు చిల్లులు పడినప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి పిచికారీ చేయాలి.
- చలికాలంలో చిక్కుడుకు పేనుబంక వస్తుంది. నాణ్యమైన విత్తనం వల్ల ఈ సమస్య రాదు.
- వానకాలంలో అన్ని తీగజాతులకు బూడిద తెగులు వస్తుంది. . దీని నియంత్రణకు మొక్కలకు పొద్దునపూటే నీళ్లు పెట్టాలి. ఆకుల మీద నీళ్లు నిల్వ ఉండకూడదు. ఒకవేళ సమస్య వస్త పుల్లటి మజ్జిగ వాడాలి.
- దానిమ్మకు తక్కువ నీళ్లు పోస్తేనే పూత రాలదు. కాయ పెరిగేటప్పుడు మాత్రమే నీళ్లు ఎక్కువ పెట్టాలి. అరటికి మాత్రం ఎప్పు డూ నీళ్లు పెడుతూనే ఉండాలి.
- మిద్దెతోటలో అంటుకట్టిన మొక్కలను మాత్రమే వాడాలి. దీనివల్ల చెట్టు పెద్దగా పెరగకుండా,తొందరగా కాపుకు వస్తుంది.

- మిద్దెతోటలో పాలినేషన్ కోసం పసులుపచ్చ రంగు పూలు అంటే బంతి, పట్నం బంతి (కాస్మోస్), పొద్దుతిరుగుడు, పోకబంతి, ఆవాలు వేయాలి.
- లీఫ్ మైనర్ (పాము పొడ తెగులు)ను రుద్రాక్ష మొక్క నియంత్రిస్తుంది. కాబట్టి టమాటా వేసిన కంటెయినర్లో రుద్రాక్ష వేయాలి.
- కాబేజీ, కాలిఫ్లవర్ విత్తనాలను తయారుచేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. తాలు గింజలు వచ్చాయి. ఇలాంటి విత్తనాలను మార్కెట్లో కొనాల్సిందే.
- ఎవరి విత్తనం వాళ్లే తయారుచేసుకోవాలి. లేదా తెలిసిన రైతుల నుండి సేకరించుకోవాలి. హైబ్రీడ్ విత్తనం అవసరం లేదు.
- మొక్కలకు ఎక్కువ నీరు పెట్టకూడదు. ఎక్కువ నీరు పెడితే ఎక్కు వ రోగాలు వస్తాయి. మొక్కలు వడబడినప్పుడే నీరు పెట్టుకోవాలి.
- మిద్దెతోటలో ఘన జీవామృతం మంచిది. వానపాములు విపరీతంగా వృద్ధి చెందుతాయి.
- మిద్దెతోట కోసం ఇల్లు కడుతున్నప్పుడే ముఖ్యంగా వర్షపు నీరు ఎప్పటికప్పుడు బయటికి వెళ్లేవిధంగా ఒకవైపుకు వాలును నిర్మించుకోవాలి. దీనివల్ల మిద్దె మీద సీపేజ్ సమస్య రాదు.
- బరువైన టబ్‌లను బీవ్‌ు మీద మాత్రమే పెట్టుకోవాలి. వాటి మధ్యలో చిన్న చిన్న టబ్‌లను పెట్టుకోవచ్చు.
venkatakrishna1

వెంకటకృష్ణ ఇంటిమీద పెరుగుతున్న మొక్కలు

తీగజాతులు

పెన్సిల్ దొండ, దొండ, ఆగాకర, పర్వల్, సొర (రెండు రకాలు), దోస, బీర, నేతిబీర, పొట్ల (పిచ్చుకపొట్ల, పొడుగు పొట్ల), యార్డ్ బీన్స్, చెమ్మ, తీగచిక్కుడు

కూరగాయలు

టమాటా, బెండ, గోరుచిక్కుడు, క్యాబేజి, వంకాయ (6-7 రకాలు), కాలిఫ్లవర్, పచ్చిమిరప, మునగ

ఆకుకూరలు

పాలకూర, పెరుగు తోటకూర, చుక్కకూర, కరివేపాకు, పొన్నగంటి, గంగావిలి, పుదీనా, గాలిజేరు, కొత్తిమీర, కొండపిండాకు, చెన్నంగి, బచ్చలి (ఎరుపు, పచ్చ), దుబ్బు బచ్చలి, సిలోన్ బచ్చలి

దుంపజాతి

పసుపు, చిలగడదుంప, కూర పెండలం, కంద, చేమదుంప, బీట్రూట్,కారట్, ముల్లంగి, టర్నిప్

పండ్ల మొక్కలు

దానిమ్మ, సీతాఫలం, రామాఫలం, వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్, సపోటా, వెలగ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, నిమ్మ, దబ్బనిమ్మ

పూల మొక్కలు

కనకాకంబరం, మల్లె, జాజి, విరజాజి, చంబేలీ, గన్నేరు, బంచి (4 రకాలు), చామంతి (12 రకాలకు పైగా), డిసెంబర్ పూలు (3ా4 రకాలు), లిల్లీ, మందార, గులాబి, దేవకాంచనం. వీటితో పాటు మరువం, లెమన్ గ్రాస్, మొక్కజొన్న, నల్లేరు, తులసి, ఉసిరి, సబ్జ మొక్కలు ఇక్కడ పెరుగుతున్నాయి.

ఇతర వివరాలకు..వెంకటకృష్ణను సంప్రదించాల్సిన నెంబర్ 9000103046

- కె.క్రాంతికుమార్‌రెడ్డి, 9603214455 నేచర్స్‌వాయిస్

520
Tags

More News