నారుమడుల్లో జాగ్రత్తలు

Thu,June 27, 2019 02:08 AM

ప్రస్తుతం వానలు పడుతున్నాయి. రైతులు సాగు చేయడానికి సిద్ధం అవుతున్నారు. కూరగాయలు సాగు చేసే రైతులు కూడా సాగుకు సన్నద్ధం అవుతున్నారు. అయితే ప్రధాన పంటలో మేలైన దిగుబడులు సాధించాలంటే నారుమడుల దశ నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
flowers
కూరగాయలలో: ఈ పంటలు నారుమడులలో ఉన్నప్పుడు ప్రధానంగా రసంపీల్చే పురుగులు ఆశించి నష్టపరుస్తాయి. దీని నివారణకు 5 మి.లీ. వేపనూనె లీటరు నీటికి లేదా థయోమిథాక్సామ్ 4 గ్రాముల 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. భూమి ద్వారా వ్యాప్తి చెందే నారు కుళ్లు, కాండం కుళ్లు, ఎండు కుళ్లు, వడలు తెగుళ్లు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి మొదళ్ల వద్ద బాగా తడుపాలి. నులి పురుగుల నివారణకు ఎకరానికి 8 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను దుక్కిలో వేయాలి.

ఉల్లిలో: ఉల్లిలో నారుకుళ్లు ఆశించే అవకాశం ఉన్నప్పుడు దాని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి. నారుమడి తయారైతే ప్రధాన పొలాన్ని 2-3 సార్లు దుక్కి దున్ని పశువుల ఎరువుతో కలియదున్నాలి. ఉల్లి నాటే ముందు ఫ్లుక్లోరాలిన్ అనే కలుపు మందును 45 శాతం ఎకరాకు ఒక లీటరు చొప్పున పిచికారీ చేయాలి. ఆ తర్వాత కలుపును భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30 శాతం ఎకరాకు 1.3 నుంచి 1.5 లీ లేదా ఆక్సీఫ్లోరోఫిన్ 23.5 శాతం 200 మి.లీ. చొప్పున ఏదో ఒక దానిని నాటే ముందు పిచికారీ చేయాలి. ప్రధాన పొలం తయారీ అయ్యాక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతోపాటు 30-40 కిలోల నత్రజని, 24-32 కిలోల భాస్వరం 12 కిలోల నత్రజని, 24-32 కిలో ల భాస్వరం, 12 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. ఇందులో 12 కిలోల మొత్తం భాస్వరం, పొటాషియం ఎరువులు దుక్కి తయారీలోనే వేయాలి.

పూల తోటల్లో ..

బంతి: బంతి తోట నాటుకునే ముందు ఎకరాకు 30 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్‌ను ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. 27రోజుల వయస్సు ఉన్న నారు ను 60X45 సెం.మీ. దూరంలో నాటుకోవాలి.

కనకాంబరం: 45 రోజుల వయసున్న కనకాంబరం నారును ప్రధాన పొలంలో 60X45 సెం. మీ. ఎడంలో నాటుకోవాలి. ఆఖరి దుక్కి లో 20 టన్నుల పశువుల ఎరువును 15 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం 25 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి.

చామంతి : పిలకలు లేదా కొమ్మ కత్తిరింపులు సేకరించి ప్రధాన పొలంలో 30X30 సెం.మీ దూరంలో ఎకరానికి 40 వేల మొక్కలు సాంద్రత ఉండే విధంగా చూసుకోవాలి. ఆఖరి దుక్కి లో ఎకరాకు 8-10 టన్నుల పవుశుల ఎరువు, 50 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి.

నేల సంపంగి: నేల సంపంగిలో సుమారు 2.5 సెం.మీ వ్యాసం ఉన్న దుంపలను ఎంపిక చేసి 30X20 సెం.మీ దూరంలో నాటుకోవాలి. ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు, పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి.

-మద్దెల లక్ష్మయ్య, 9010723131, ఖమ్మం వ్యవసాయం

386
Tags

More News