టమాటాలో విత్తనోత్పత్తి

Thu,June 27, 2019 02:14 AM

రాష్ట్రంలో సాగవుతున్న కూరగాయల్లో ప్రధాన పంట టమాటా. వానకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంట సాగవుతుంది. చిన్న, సన్నకారు రైతులు కూడా ఎక్కువగా ఈ పంటను సాగుచేస్తారు. తమకు కావాల్సిన విత్తనాలను సొంతంగా ఉత్పత్తి చేసుకునే వీలున్నది. దీనికి కొన్ని కిటుకులు పాటించాలి.
tomatoes
వాతావరణం: టమాటా ఉష్ణమండల పంట. విత్తనోత్పత్తికి సుమారు నాలుగు నెలల పాటు మంచురహిత వాతావరణం అవసరం. 16 నుంచి 29 డిగ్రీల సెల్సియ స్ ఉష్ణోగ్రత విత్తనం మొలకెత్తడానికి అనుకూలం. మొక్కల అభివృద్ధికి, కాయలు ఏర్పడటానికి 20 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ, 32 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పుప్పొడి రేణువులు చనిపోతాయి. కాబట్టి కాయలు కట్టే అవకాశం తగ్గుతుంది. అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడి కాయలు ఏర్పడే శాతాన్ని తగ్గిస్తాయి. అధిక ఉష్ణోగ్రత, వేడి గాలుల వల్ల పిందె, పూత రాలుతుంది. వెచ్చని, సూర్యరశ్మితో కూడిన వాతావరణం కాయలు ఏర్పడటం, విత్తన అభివృద్ధికి అత్యంత అనుకూలం.

రాష్ట్రంలో సాధారణంగా వానకాలం, యాసంగి, ఎండాకాలాల్లో సాగు చేసే అన్ని సూటి రకాల విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. విత్తనోత్పత్తిలో టమాటా పూత, సంపర్కం చెందే లక్షణాలపై అవగాహన అవసరం. ఒక గుత్తిలో సరాసరి 4-5 పూలు ఉంటాయి. పూలు విచ్చుకోవడం, నేలలో తేమ, ఉష్ణోగ్రతను బట్టి ఉంటుం ది. పొద్దుగాల 8-10:30 మధ్య పూలు విచ్చుకుంటా యి. 9-10:30 గంటల మధ్య పుప్పొడి రేణువులు విడుదల అవుతాయి. 8:30-11:30 గంటల మధ్య సమయంలో కీలాగ్రం పుప్పొడి రేణువులు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. కీలాగ్రం చుట్టూ పుప్పొడాశయాలు ఉండ టం వల్ల టమాటా ప్రధాన స్వపరాగ సంపర్కం చెందే పంట. అయితే బంబుల్ ఈగలు పూలను తరచూ సందర్శించడం వల్ల 3.8 శాతం వరకు పరపరాగ సంపర్కం చెందే అవకాశాలున్నాయి.

వేర్పాటు దూరం: ఒక టమాటా రకం నుంచి మరో టమాటా రకం పంట పొలానికి ఫౌండేషన్ విత్తనోత్పత్తికి 50 మీటర్లు, ధృవీకరణ విత్తనోత్పత్తికి 25 మీటర్ల వేర్పాటు దూరం ఉండాలి.

నేలలు: మేలైన మురుగు నీటి పారుదల సౌకర్యం ఉన్న ఒండ్రు మట్టినేలలు, ఎర్రనేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఉదజని సూచిక 6-7 మధ్య ఉండి, తేమ నిలుపుకునే సామర్థ్యం ఉన్న నేలలు అనుకూలం.

ఎరువులు: హెక్టారుకు 25 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు, 100 కిలోల నత్రజని, 50 కిలోల చొప్పున భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను వాడాలి. మొత్తం భాస్వరం, పొటాష్‌లు, ముప్ఫై శాతం సిఫార్సు నత్రజని ఎరువును దుక్కి సమయంలో, మిగతా నత్రజనిని రెండు దఫాలుగా ప్రధాన పొలంలో నాటిన 30,50 రోజుల తర్వాత పంటకు అందించాలి. పైపాటు ఎరువులు వేసిన తర్వాత, బోదెలు సరిచేసిన తర్వాత కచ్చితంగా తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి.

విత్తన మోతాదు: హెక్టారుకు 500-600 గ్రాములు.

విత్తే సమయం: ఏడాది అంతా విత్తుకోవచ్చు. వాన కాలం విత్తిన పంటకు అయితే జూన్ 7లోగా, చలి కాలం లో అయితే అక్టోబర్‌లోపు, అదే ఎండాకాలమైతే మార్చి మొదటి వారం వరకు విత్తుకుంటే విత్తనోత్పత్తి ఎక్కువ. అయితే సాగు నీటి సౌకర్యం కచ్చితంగా ఉండాలి.

నారుమడి: ఎత్తైన నారుమడులలో మాత్రమే నారు పెంచాలి. నీటి క్యాన్లతో రోజూ నారుమడులను తడుపాలి. చలికాలం (యాసంగి)అయితే పాలిథీన్ షీట్లతో కప్పి అధిక చలి తీవ్రత నుంచి కాపాడుకోవాలి. మొక్క లు 4-5 సెం.మీ ఎత్తు పెరిగినప్పుడు, ఆరోగ్యవంతమైన వాటిని ఉంచి, తెగులు సోకిన, అంతగా ఎదగని మొక్కలను తీసివేయాలి. 12-15 సెం.మీ ఎత్తున్న 4-5 వారా ల మొక్కలను ప్రధాన పొలంలో నాటాలి. మార్చి చివరి నాటికి ప్రధాన పొలంలో నాటాలి. చలి తగ్గిన తర్వాత నాటాలి. బోదెల చివర్లో 60-70 సెం.మీ దూరంలో తయారుచేసి నాటాలి. మొక్క మొక్కకు మధ్య 45-60 సెం.మీ. దూరం ఉండాలి. నాటు వేసిన 20-25 రోజులు, 40-45 రోజులకు రెండుసార్లు కలుపు నివారణ చేపట్టాలి. హెక్టారుకు ఒక కిలో చొప్పున పెండిమిథాలిన్, 650 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు నాటిన 4,5 రోజుల లోపు పిచికారీ చేసి కూడా నివారించవచ్చు.

నీటి యాజమాన్యం: విత్తనోత్పత్తిలో నీటి యాజమా న్యం అత్యంత కీలకం. అధిక, అల్ప నీటి తడులు ప్రమా దం. 7-15 రోజుల మధ్య నీటి తడులు ఇవ్వాలి. నీటి ఎద్దడి ఏర్పడితే పూత, పిందె రాలిపోతుంది. ఆ తర్వాత ఒకేసారి ముమ్మరంగా నీటి తడులు ఇచ్చినా కాయ అభివృద్ధి తగ్గిపోతుంది. కాబట్టి తక్కువ వ్యవధిలో ఎక్కువ సార్లు నీటిని అందించాలి.

కల్తీలు: స్వచ్ఛమైన విత్తనోత్పత్తికి టమాటాలో మూడుసార్లు కల్తీలు ఏరివేయాలి. శాఖీయ దశ, పూర్తి పూత దశ, కాయలు ముదిరే దశలో భౌతిక లక్షణాల ఆధారంగా కల్తీలు గుర్తించాలి. వీటితో పాటు ఆకుమచ్చ, మెజాయిక్ తెగుళ్లు, ఎర్లీ ైబ్లెట్ సోకిన మొక్కలను ఏరివేయాలి. విత్తన పొలంలో కల్తీలు 0.5 శాతం కంటే ఎక్కువగా ఉండరాదు. అలాగే విత్తన జనన తెగుళ్లు సోకిన మొక్కలు కూడా 0.50 శాతానికి మించి ఉండకూడదు.

కోత, విత్తన సేకరణ: విత్తన సేకరణకు బాగా ఎరుపుగా పండిన పండ్లన మాత్రమే ఎంచుకోవాలి. నాణ్యత బాగుండేందుకు, చివరి దశలో వచ్చిన పండ్ల నుంచి గింజలు సేకరించరాదు.

విత్తన సేకరణ పద్ధతులు: మూడు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. 1) పులియబెట్టే పద్ధతి: ఎర్రగా పండి పండ్లను పిసికి ఇనపేతర గిన్నెలలో పులియబెట్టా లి. ఎండాకలంలో అయితే 24-48 గంటలు, యాసంగిలో అయితే 48-72 గంటలు పులియబెట్టాలి. ఈ విధానం పూర్తయ్యేసరికి గుజ్జుపై నురుగు ఏర్పడుతుంది. గింజలు మిగతా పదార్థం నుంచి వేరు అవుతాయి. ఆ తర్వాత నీటిలో ఉంచితే విత్తనం అడుగు భాగానికి చేరుతుంది. గుజ్జు, ఇతర పదార్థాలు పైన తేలుతాయి. విత్త నం వేరుగా కడిగి శుభ్రపరుచాలి. ఎక్కువ సమయం పులియకుండా చూడాలి.
ఆమ్ల శుద్ధి పద్ధతి: వాణిజ్య హైడ్రోక్లోరికామ్లం 11 కిలోల టమాటా గుజ్జుకు 100 మి.లీ. చొప్పున బాగా కలిపి, 30 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత నీటితో శుభ్రపరిచి నిల్వ చేసుకోవాలి.

tomatoes2

గుజ్జు మంత్రం (పల్పర్ వాడకం)తో విత్తన సేకరణ:

ఎక్కువ మొత్తంలో విత్తన సేకరణకు వాణిజ్యంగా టమాటా పల్పర్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్రాలు గుజ్జు మిశ్రమం నుంచి గింజలను నేరుగా వేరు చేస్తాయి. ఒక రాత్రి యంత్రంలో ఉంచిన తర్వాత కొళాయి నీటితో కడిగి శుభ్రపరుచాలి.

విత్తన దిగుబడి: హెక్టారుకు 10-15 క్వింటాళ్ల దిగుబడి.
విత్తన ప్రమాణాలు: (నిర్ణయించిన)
భౌతిక స్వచ్ఛత (గరిష్ఠం): 97 శాతం
జడపదార్థం (గరిష్ఠం): 2 శాతం
ఇతర పంటల విత్తనాలు (గరిష్ఠం): 0.10 శాతం
మొలక శాతం (కనీసం): 70 శాతం
తేమశాతం: సాధారణ సంచుల్లో 8 శాతం, తేమ చేరని సంచుల్లో 6 శాతం ఉండాలి.

dr-pidigem-saidaiah

523
Tags

More News