డ్రమ్‌సీడర్‌తో వరిసాగు మేలు

Thu,July 11, 2019 01:58 AM

TRIPURARAM
అనాదిగా వరి పైరుని దమ్ముచేసి నాట్లువేసే పద్ధతిలోనే రైతులు వరి పైరును సాగు చేయడం జరుగుతుంది. నానాటికి పెరిగిపోతున్న కూలీల సమస్య, సరిపడా చాలీచాలని సాగునీటి సమస్య మూలంగా వరి పైరు సాగులో నూతన పద్ధతులను పాటించాల్సిన పరిస్థితి తప్పక ఏర్పడుతుంది. డ్రమ్ సీడర్‌తో వరిపైరు సాగు చేయడం వల్ల రైతులు కూలీల సంఖ్యను గణనీ యంగా తగ్గించుకోవచ్చు, తక్కువ సాగు నీటితో సరైన సమయం లో వరి పైరును సాగుచేసుకోవచ్చు. నూతనంగా కలుపు మొక్కలను సైతం నాశనం చేసే మేలు రకమైన మందులు ఎన్నో ప్రస్తు తం రైతులకు అందుబాటులోకి రావడం వలన కూడా డ్రమ్‌సీడర్‌తో వరి పైరును సాగుచేయడానికి అనుకూలమైన అంశంగా మారింది. డ్రమ్‌సీడర్ పద్ధతిలో వరిపైరును సాగు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు కల్గుతుంది.

దుక్కిని తయారు చేసుకునే విధానం

-తొలకరి చినుకులు పడి భూమి పదునెక్కిన తరువాత ఆ భూమిని గుల్లబారేలా దున్నుకోవాలి.
-వ్యవసాయ భూమిని 15 రోజుల ముందుగా దమ్ముచేసి విత్తడానికి 4 నుంచి 5 రోజుల ముందు మరొకసారి దమ్ముచేసి ఎటువంటి ఎత్తు పల్లాలు లేకుండా నేలను బాగా చదును చేసుకోవాలి.
-మురుగునీరు పోవడానికి వీలుగా 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలువలను ఏర్పాటు చేసుకోవాలి.
-ఎటువంటి నీరు లేకపోయినా నేరుగా మెట్టభూమిని గుల్లబారేలా దున్నుకొని మెట్టభూమిలో కూడా డ్రమ్‌సీడర్‌తో విత్తనాలను చల్లుకొని తరువాత నీరు పెట్టుకోవచ్చు.

విత్తన రకాల ఎంపిక

అన్నిరకాల విత్తనాలను డ్రమ్‌సీడర్ పద్ధతిలో రైతులు సాగుచేసుకోవచ్చు. కాండం దృఢంగా ఉండి పడిపోవడానికి వీలు లేకుండా ఉండే వరి విత్తనాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

విత్తుకునే సమయం

నాట్లు వేసే పద్ధతిలో నారు మడులను పెంచే సమయంలోనే డ్రమ్‌సీడర్ పద్ధతిలో వరి విత్తనాలను నేరుగా విత్తుకోవచ్చు.

విత్తన మోతాదు

డ్రమ్‌సీడర్ పద్ధతిలో వరిని సాగుచేయడానికి ఎకరాకు 12 నుండి 15 కిలోల విత్తనాలు మాత్రమే అవసరం అవుతాయి.

విత్తుకునే దూరం

డ్రమ్‌సీడర్ పద్ధతిలో వరి విత్తనాలను విత్తేటప్పుడు ఒక సాలు కు మరో సాలుకు మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకూ మధ్య 5-8 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు పడతాయి.

విత్తనశుద్ధి

దమ్ము చేసిన భూమిలో చల్లే విత్తనాలలో అయితే ముందుగా విత్తనాలకు సరిపడా నీటిని కలిపి ఆ నీటిలో 1 గ్రాము కార్బండిజమ్ కలిపి ఆ ద్రావణంలో వరి విత్తనాలను 24 గంటలు నానబెట్టాలి. ఆపై కొద్దిగా ముక్కులు పగిలేంత వరకు 36 నుంచి 48 గంటలు మండెకట్టాలి. మెట్టభూమిలో చల్లే విత్తనాలను అయితే నేరుగా విత్తుకోవచ్చు.

విత్తుకునే విధానం

దమ్ముచేసిన పొలంలో డ్రమ్‌సీడర్ 8 సాళ్ళ పరికరంతో నీరు పూర్తిగా తీసివేసి విత్తనాలను విత్తుకోవచ్చు. మెట్టభూమిలో అయితే డ్రమ్‌సీడర్ పరికరం, ట్రాక్టర్ సహయంతో నేరుగా విత్తుకోవచ్చు. విత్తిన తరువాత నారు మడులలో ఏ విధమైన నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తామో అదే విధంగా విత్తనాలను విత్తిన పొలంలో కూడా అవే పద్ధతులు పాటించాలి. నీరు ఎక్కువగా అయినట్లయితే గింజలు మురిగిపోవడం జరుగుతుంది. తక్కువ అయినట్లయితే కలుపు ఎక్కువగా రావడం, పిలకల సంఖ్య తగ్గడం జరుగుతుంది. విత్తిన 12 నుంచి 15 రోజుల మధ్య ఒత్తుగా ఉన్నచోట మొక్కలను పీకివేయాలి.

ఎరువులను చల్లుకునే విధానం

నాట్లు వేసి సాగుచేసే వరిపైరుకి వేసుకునే ఎరువులనే డ్రమ్‌సీడర్ పద్ధతిలో సాగుచేసే వరిపైరుకి వాడుకోవాలి. పూర్తి భాస్వరం, సగం పొటాష్ ఎరువులను ఆఖరి దమ్ములో వేసుకోవాలి. మిగిలిన పొటాష్‌ను అంకురం దశలో వేయాలి. నత్రజనిని 3 సమభాగాలుగా విత్తేటప్పుడు, పిలకదశలో, అంకురం ఏర్పాటు దశ లో వేసుకోవాలి. అవసరాన్ని బట్టి జింకు సల్ఫేట్‌ను పొలంలో 20 కేజీలు ఎకరాకు చల్లుకోవాలి లేదా 0.2 శాతం పిచికారీ చేసుకోవాలి.

కలుపు నివారణలో జాగ్రత్తలు

నేరుగా అలికి పండించే పొలాలలో కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరైన సమయంలో కలుపును అరికట్టాలి. విత్తిన 35 నుంచి 40 రోజుల వరకు పొలంలో కలుపు సమస్య లేకుండా చూసుకోవాలి. విత్తిన 3 నుంచి 5 రోజుల మధ్య ఆక్సాడయరిజిల్ 35 గ్రాములు లేదా 8 నుండి 10 రోజుల మధ్య ప్రిటాలాక్లోర్+సేఫనర్ 300 మిల్లీ లీటర్‌లు లేదా అనిలోఫాస్ 400 మిల్లీ లీటర్‌లు 25 కిలోల ఇసుకతో కలిపి పొలమంతా పలుచగా నీరు ఉంచి సమానంగా వెదజల్లుకోవాలి. కలుపు సమస్య ఆ తరువాత కూడా ఉన్నట్లయితే బిస్‌పైరిబ్యాక్‌సోడియం 100 మిల్లీ లీటర్ల ఎకరానికి చల్లుకోవాలి. ఊద సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే సైహలో-ఫామ్-పి- బ్యూటైల్ 400 మిల్లీ లీటర్ల వాడుకోవాలి. ఈ రెండు కలుపు మందులను విత్తిన 20 రోజులలోపు వాడుకోవాలి. వెడల్పు ఆకు కలిగిన కలుపు ఉన్నట్లయితే 2,4-డి సోడియం సాల్ట్ లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున కలిపి 20 నుండి 25 రోజుల మధ్య పిచికారీ చేసుకోవాలి. అవసరమైతే ఒకసారి కూలీలతో కలుపు తీయించుకోవాలి.

నీటి యాజమాన్య పద్ధతులు

మొక్కలకు మొదటి ఆకు పూర్తిగా పురి విచ్చుకునేంతవరకు సుమారు 7 నుంచి 10 రోజుల వరకు ఆరుతడి నీళ్లు అవసరం. పొలంలో నీటిని నిల్వ ఉంచకూడదు. సస్యరక్షణ చర్యలు నాట్లు వేసి వరిని సాగుచేసే పద్ధతిలో ఆచరించినట్లుగానే డ్రమ్ సీడర్ పద్ధతిలో కూడా అవే సస్యరక్షణ చర్యలను పాటించాలి.

డ్రమ్‌సీడర్ వాడటం వల్ల ఉపయోగాలు

డ్రమ్‌సీడర్ పద్ధతిలో వరిని సాగు చేయడం వల్ల నారుమడి పెంచ డం, నారు పీకడం, నాట్లు వేయాల్సిన అవసరం రాదు. ముదు రు నారు నాటే అవసరము ఉండదు. నీరు వచ్చిన తరువాత దమ్ము చేసుకొని నేరుగా విత్తుకోవచ్చు. నాట్లు వేసే పద్ధతి కన్నా డ్రమ్ సీడర్ పద్ధతిలో 5 నుంచి 8 రోజులకు ముందుగా పంట కోతకు వస్తుంది. నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కూలీ ల అవసరం గణనీయంగా తగ్గించుకోచ్చు. వరి మాగాణులను చదును చేసుకొని సరైన కలుపు యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నేరుగా విత్తి వరిలో మంచి దిగుబడులను, నికర ఆదాయాన్ని పొందవచ్చు.

-నగిరి హరీశ్, త్రిపురారం

359
Tags

More News