మంచినీటి చేపల పెంపకం యాజమాన్య పద్ధతులు

Thu,July 25, 2019 12:38 AM

రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. అయితే చేపల పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. తద్వారా తక్కువ ఖర్చుతో అధిక చేపల దిగుబడి, అధిక ఆదాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవచ్చు.
RAITHUBADI-FISH
రాష్ట్రంలో ప్రధానంగా మంచినీటి చెరువుల నిర్మాణం చేపట్టి చేపల పెంపకం చేస్తున్న మత్స్య రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు, నాణ్యతలేని మేతలు వాడుతున్నారు. దీనివల్ల చేపలపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా వ్యాధులు సంక్రమించడం, చేపలు చనిపోవడం, తక్కువ దిగుబడులు పొంది ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి చేపల చెరువులలో నిపుణులు సూచించిన పద్ధతులను పాటించాలి. అప్పుడే మంచి ఫలితాలను పొందవచ్చునని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త బూర్గు లవకుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన అదనపు సమాచారం కోసం 9849063796 నెంబర్‌ను సంప్రదించవచ్చు. మంచినీటి చేపల పెంపకంలో పాటించాల్సిన విధానాల గురించి ఆయన తెలిపిన వివరాలు..
RAITHUBADI-FISH1
-చెరువు నిర్మించుకోదలిచిన వారు వరి ఇతర పంటలకు అనుకూలంగాలేని లోతట్టు భూములలో చేపల చెరువుల నిర్మాణం చేసుకోవాలి.
-చెరువు నిర్మాణం చేసేనప్పుడు చెరువు చుట్టూ తప్పక ఊట బోది ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే చుట్టుపక్కల పంట భూములలో ఊట చేరి పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
- చెరువు వాలు బయటకు నీరు వెళ్ళే తూము వైపు కు ఉండేలా నిర్మాణం చేయాలి. దీనివల్ల చెరువు అడుగు భాగంలో పెరుకపోయిన వ్యర్థ పదార్థాల ను వేగంగా, ఒత్తిడితో బయటకు పంపించవచ్చు.
-చెరువుల విస్తీర్ణం లోతును బట్టి తూములు నిర్మా ణం చేపట్టాలి. సరైన పరిమాణంలో లేని తూముల నిర్మాణం వల్ల మురుగునీటి పారుదల సక్రమంగా లేక చెరువు అడుగు భాగంలో వ్యర్థ పదార్థాలు, విష వాయువులు పేరుకుని చేపలపై ఒత్తిడి పెరుగుతుంది.
-చెరువులోనికి నీరు పంపే ముందు తప్పక 60-80 సైజు గార్పి గుడ్డతో వడగట్టి వదలాలి. వడకట్టకుండా నీటిని వదిలితే లాభసాటి. కానీ ఇతర రకాల చేపలు, మాంస భక్షక చేపలు చెరువులోకి ప్రవేశించి పెంపకపు చేపలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
-ముందుగా ఒక మీటర్ లోతు మాత్రమే నీరుపెట్టి సరపడ మోతాదులో సేంద్రియ, రసాయనిక ఎరువులు వాడి ప్లవకాలు (ప్లాంక్టాన్) అభివృద్ధి చేసుకోవాలి. తక్కువ పరిమాణం, తక్కువ లోతు గల నీటిలో ప్లాంక్టాన్ అభివృద్ధి చాలా ఎక్కువ వేగంగా, తేలికగా జరుగుతుంది.
-చేపల చెరువులలో ఎరువులు వాడేటప్పుడు మాగిన సేంద్రియ ఎరువులు నిర్దిష్ట పరిమాణంలో వాడాలి. మాగపెట్టకుండా సేంద్రియ ఎరువులు, పేడ, కోళ్ళ పెంటలను చెరువులోకి ప్రత్యక్షంగా వదలడం వల్ల ప్రమాదకర విష వాయువులు విడుదలై చేపలు తీవ్ర ఒత్తిడికి గురై కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పూర్తిగా చేపలు చనిపోతాయి.
-చేప పిల్లలు వదిలేటప్పుడు వాటి ఆరోగ్యాన్ని గమనించి ఒకే సైజలు ఉండే చేప పిల్లలను ఎంపిక చేసుకోవాలి. లేకపోతే వేసే మేతను పెద్ద సైజు చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చిన్న సైజు చేపలకు మేత అందక మరుగుజ్జుగా ఉండిపోతాయి.
-నర్సరీలోనే అన్నిరకాల వ్యాధుల, పరాన్నజీవుల రక్షణ చర్యలు తీసుకోవాలి. దీనివల్ల తక్కువ ఖర్చుతో వ్యాధులను, పరాన్నజీవులను సమర్థవంతంగా నివారించవచ్చు.
-చేపలకిచ్చే మేతలకు ఎల్లప్పుడు సంచుల పద్ధతి ద్వారా మాత్రమే ఇవ్వాలి. దీనివల్ల మేత వినియోగం నియంత్రించి ఖర్చును, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
-మేత సంచులను తీగకు తగిలించి ఎండబెట్టడం వల్ల చేపల పేను (ఆర్గులస్) వ్యాప్తిని నిరోధించవచ్చు.
-తుపాన్ ప్రభావం వల్ల వాతావరణంలో వచ్చే మార్పుల సమయంలో అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు మేతలు పూర్తిగా ఆపివేయాలి.
- చేపలకు సోకే పరాన్నజీవులు నివారణకు వీలైనంత వరకు పురుగు మందులు, రసాయనాలు వాడకపోవడం మంచిది. కానీ తప్పనిసరి పరిస్థితిలో వాడేటప్పుడు వాటిని సాయంత్రం వేళలో మాత్రమే వాడాలి. పరాన్నజీవుల నివారణ కోసం పురుగు మందుల కన్నా మేతల ద్వారా నియంత్రించే ఐవర్మెక్టిన్ కాంపౌండ్ వాడటం శ్రేయస్కరం. తరుచుగా పురుగు మందులు వాడటం వల్ల చెరువులో ప్లాంక్టాన్ చనిపోయే అవకాశం ఉన్నది.
- చేపల ఆరోగ్య పరిరక్షణ పొద్దుగాల 5 నుంచి 7 గంటల మధ్యన పరిశీలించాలి. దీనివల్ల రైతులకు చెరువులో చేపల పెరుగుదల, ఆరోగ్య లక్షణాలపై మంచి ఆవగాహన కలుగుతుంది.
- ప్రతి నెలకు ఒకసారి కానీ, చెరువులో నీరు కలుషితం అయినప్పుడు కానీ, చెరువు అడుగు తూము ల ద్వారా 1/3 వంతు నీటిని తీసివేసి కొత్త నీరు పెట్టడం వల్ల చేపల పెరుగుదల బాగా ఉంటుంది.
-చెరువులో నీటి లోతు ఎండా కాలంలో ఎక్కువగాను, చలి కాలంలో తక్కువగానూ ఉండేలా చూసుకోవాలి.
-చేపల చనిపోయినప్పుడు కారణాలు వాటికి గల కారణాలను తెలుసుకోవాలి. అంతేగాని విచక్షణరహితంగా పురుగు మందులు, యాంటీ బయోటిక్స్ వాడకూడదు. శాస్త్రవేత్తలు, నిపుణులు పర్యవేక్షణలో కారణాలు విశ్లేషించాలి. తదనుగుణంగానే మందులు వాడాలి.
-నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా

430
Tags

More News