స్వల్పకాలిక పంట ధనియాల సాగు

Thu,July 25, 2019 12:41 AM

ప్రస్తుత నీటి ఎద్దడి పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలిక పంటల వైపుమొగ్గు చూపాలి. ఇందుకు ధనియాల సాగు ఉత్తమం. ఈ పంటను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మార్కెట్‌లో విక్రయించి ఆదాయం పొందవచ్చు.
ఏడాది అంతా ఆదాయ మార్గంగా ఉంటుంది.

coriandro
ధనియాల పంట ఆకులను, గింజలను సుగంధ ద్రవ్యంగా వాడుతారు. స్వల్పకాలిక పంట కావడం, విత్తనాలతో సాగు చేసే సౌలభ్యం ఉండటంతో పాటు, మండలాలు, పట్టణాల్లో కొత్తిమీరకు ఎప్పడూ గిరాకీ ఉంటుంది. దీంతో ఈ పంట సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నీటితో వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు. చీడపీడల సమస్య తక్కువ. సాగు నీటి ఆధారంగా దిగుబడులు పెరుగుతాయి. ధనియాల పంటకైతే రకాన్ని బట్టి సాగు కాలం మారుతుంది. కొత్తమీర కోసం ఒక నెలలోనే దిగుబడి చేతికి వస్తుంది.

నేలలు, వాతావరణం:

మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్న ఇసుక, ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. వర్షాధార పంటకు ఒండ్రు నేలలు అయితే మేలు. ఉదజని సూచిక 6-8 మధ్య ఉండాలి. 20-25 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. మంచురహిత, చల్లని, పొడి వాతావరణంలో ఆకుల అభివృద్ధి బాగుంటుంది.

విత్తనశుద్ధి:

హెక్టారుకు 1.5 కిలోల చొప్పున అజోస్పైరిల్లం జీవన ఎరువు ను వాడి విత్తనశుద్ధి చేస్తే మొక్కల సాంద్రత పెరుగుతుంది. అదే జీవన ఎరువుతో విత్తనశుద్ధి కూడా చేయాలి. వర్షాధార పంట లో నీటి ఎద్దడిని తట్టు కునేలా చేసుకునేందుకు లీటరు నీటిలో 10 గ్రాముల పొటాషియం డై హైడ్రోజన్ పాస్ఫేట్‌ను కలిపి తయారుచేసిన ద్రావణంతో 16 గంటల పాటు శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి నాలుగు గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడి తో విత్తనశుద్ధి చేస్తే వడల తెగులు నుంచి కాపాడుకోవచ్చు.

సస్యరక్షణ:

పేనుబంక: లీటరుకు రెండు మి.లీ. మిథైల్‌డెమటాన్ లేదా డైమిథోయేట్ పిచికారీ చేయాలి.
బూజు తెగులు: కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున సూడో మోనాస్ ఫ్లోరిసెన్స్‌తో విత్తనశుద్ధి లేదా లీటరుకు రెండు గ్రాము ల చొప్పున పైపాటుగా పిచికారీ చేయాలి. హెక్టారుకు ఒక కిలో చొప్పున తడి గంధకం లేదా హెక్టారుకు 250 మి.లీ. చొప్పున డినోక్యాప్‌ను మొదట తెగులు లక్షణాలు కన్పించిన వెంటనే ఒకసారి, 10 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. 5 శాతం వేప గింజల కషాయం సైతం మూడు పిచికారీ చేసి తెగులును నిర్మూలించవచ్చు.
వడలు తెగులు: హెక్టారుకు ఐదు కిలోల సూడోమోనాస్ ఫ్లోరి సెన్స్‌ను నేలలో వేసి నియంత్రించవచ్చు.
గింజ బూజు: గింజ కట్టిన 20 రోజుల తర్వాత హెక్టారుకు 500 గ్రాముల చొప్పున కార్బండిజం పిచికారీ చేసి నివారించవచ్చు.
coriandro1

విత్తన మోతాదు:

సాగు నీటి ఆధారంగా అయితే హెక్టారుకు 10-15 కిలోల విత్తనాలు వాడాలి. అదే వర్షాధారంగా అయితే 20-25 కిలోల విత్తనం అవసరం. తాజాగా సేకరించిన విత్తనాల కంటే 15-30 రోజుల పాటు నిల్వ ఉంచితే విత్తనాలు బాగా మొలకెత్తు తాయి. 12-24 గంటల పాటు నీటిలో నానబెట్టినా మొలక శాతం ఎక్కువ. విత్తనాన్ని చేతితో రెండుగా విడదీసి నాటాలి. వరుసల మధ్య 30-40 సెం.మీ, మొక్కల మధ్య 15 సెం.మీ దూరంతో విత్తనాలు నాటాలి. మూడు సెం.మీ లోతులోనే నాటాలి. 10-15 రోజుల్లో విత్తనం మొలకెత్తుతుంది.

ఎరువులు:

చివరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశు వుల ఎరువు వేయాలి. వర్షాధారం గా లేదా సాగు నీటి ఆధారంగా సాగు చేసే అనే అంశంపైనే వాడాల్సిన ఎరువుల మోతాదు మారుతుంది. సాగు నీటి వసతి ఆధారంగా అయితే హెక్టారుకు 30 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరు వులను వాడాలి. అదే వర్షాధారంగా అయితే 20 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌లనిచ్చే ఎరువు లు వాడాలి. నీటి వసతి ఉంటే నాటిన 30 రోజుల తర్వాత 15 రోజుల వ్యవధిలో నేలలో తేమ ను బట్టి నీటి తడులివ్వాలి.

అంతర కృషి:

30 రోజులలోపు కలుపు తీయాలి. కుదురుకు రెండు మొక్కలు మాత్రమే ఉంచి, మిగతా వాటిని తీసివేసి పలుచన చేయాలి.

కోత:

పంట రకం, కాలాన్ని బట్టి 90-110 రోజుల్లో కోతకొస్తుంది. ధనియాలు ఆకుపచ్చ రంగు నుంచి గోధుమ రంగులోకి మారే సమయం లో కోయాలి. ఆలస్యమైతే కోత సమయంలో గింజలు రాలడం, ఆ తర్వాత శుద్ధి సమయంలో ధనియాలు పగిలిపోతాయి. కాబట్టి సకాలం లో కోయాలి. మొక్కలను కోయటం లేదా పీకి చిన్న కుప్పలుగా వేసి, కట్టెలతో కొట్టి లేదా చేతులతో గింజలు సేకరించాలి. పాక్షిక ఎండలో ఆరబెట్టి, కాగితాలతో చుట్టిన నార సంచులలో నిల్వ చేసుకోవాలి.

దిగుబడి:

వర్షాధార పంటలో హెక్టారుకు 400-500 కిలోల ధనియాల దిగుబడి. సాగు నీటి వసతి ఆధారంగా అయితే హెక్టారుకు 600-1200 కిలోలు. కొత్తిమీర కోసం అయితే 30-40 రోజుల తర్వాత మొత్తం మొక్కను పీకి, మార్కెట్‌కు తరలించా లి. కొత్తమీర దిగుబడి: హెక్టారుకు 6-7 టన్నులు. కొత్తమీర కోసం: ఒకేసారి పొలమంతా విత్తనం వేయకుండా దఫాలుగా వేస్తే మార్కెట్‌కు అవసరం మేరకే తరలించాలి.

రకాలు

coriandro2
స్వాతి: 80-85 రోజుల పంట కాలం. స్వల్ప కాలిక పంట. బూజు తెగులు తట్టుకుంటుంది. దిగుబడి హెక్టారుకు 900 కిలోలు.
సింధు: మధ్య కాలిక పంట. 95-100 రోజుల పంట కాలం. గింజ మధ్యస్థంగా ఉంటుంది. దిగుబడి హెక్టారుకు 1050 కిలోలు.
సాధన: మధ్య కాలిక పంట. 70 సెం.మీ వరకు పెరుగుతుంది. గింజలు, ఆకుల కోసం సాగు చేయవచ్చు. పేను బంకను తట్టుకుంటుంది. నల్లరేగడి నేలల్లో దిగుబడి ఎక్కువ. దిగుబడి హెక్టారుకు 1000-1100 కిలోలు.
సుధ: 80-98 రోజుల పంట. గింజలు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. దిగుబడి హెక్టారుకు 850-1200 కిలోలు.
సుగుణ: 90-95 రోజుల పంట. దిగుబడి: 750-1350 హెక్టారుకు కిలోలు దిగుబడి వస్తుంది
సురుచి: విత్తిన 35-55 రోజుల్లో కోతకొస్తుంది. హెక్టారుకు 2.50-4.5 టన్నుల కొత్తిమీర దిగుబడినిస్తుంది.
సుస్థిర: 85-90 రోజుల పంటకాలం. వర్షాధారంగా సాగు చేస్తే హెక్టారుకు 12-14 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది

డాక్టర్ . పిడిగెం సైదయ్య
శాస్త్రవేత్త, రాష్ట్ర ఉద్యాన , విశ్వవిద్యాలయం
7780509322

423
Tags

More News