మెట్ట పద్ధతి మేలు

Wed,July 31, 2019 10:37 PM

రైతులు వరిని సాధారణ పద్ధతిలో సాగు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇందుకు భిన్నంగా ఖమ్మం జిల్లా రైతులు ఆలోచన చేశారు. ప్రతికూల పరిస్థితులలోనూ వరిసాగు చేయవచ్చని గత ఏడాది వానకాలం, యాసంగిలో నిరూపించారు. ఇది తేలిక పద్ధతి. ఖర్చు కూడా తగ్గుతుంది. దీంతో కొందరు రైతులు మెట్ట పద్ధతిలో వరి సాగుకు శ్రీకారం చుట్టారు. రైతుల నుంచి వస్తున్న ఆదరణతో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు ఈసాగుపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
meete-land
మెట్ట, మాగాణి వరిసాగు విషయానికి వస్తే తొలకరి వర్షాలకు కల్టివేటర్ సహాయంతో 2-3సార్లు దుక్కి దున్నుకోవాలి. ఈ పద్ధతి ద్వారా సాగు చేస్తే ఎకరానికి 14-16 కిలోల విత్తనాలు అవసరం ఉంటాయి. విత్తనాలను 30 సెంటీమీటర్ల దూరంలో నాగటి సాలు వెనుక గాని, గొర్రుతో గాని సీడ్ డ్రిల్‌తో గాని లేదా నేరుగా వెదజల్లడంగానీ ఏదైనా పద్ధతిలో వేయవచ్చు. విత్తనాన్ని చల్లిన తరువాత పొలమంతా రోటోవేటర్ తో చేయాలి. ఈ పద్ధతిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తనం వెంటనే నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ 1 లీ. మందును ఎకరానికి భూమిపైన పిచికారీ చేయాలి. వరిని విత్తిన ఆగస్టులో పడే వర్షాలకు వరి పెరుగుతుంది. ఈ వర్షాలకు నీటి వనరులు పెరుగుతాయి. ఈ సమయంలో మెట్ట వరిని మాగాణిగా మార్చుకోవచ్చు.

meete-land2

యాజమాన్యం

సాధారణ పద్ధతిలో వరి పంటకు సిఫార్సు చేసిన నత్రజని దమ్ములో మూడవ వంతు వేస్తారు. కానీ ఈ పద్ధ తి ద్వారా నత్రజని ఎరువులు విత్తిన 20రోజుల తరువాత కలుపు నివారణ చేపట్టిన తరువాత వేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 24 కిలోల భాస్పరం, 8 కిలోల పొటాష్ ఎరువులను వేసి కలియదున్నాలి. నత్రజని ఎరువును మూడు దఫాలుగా విత్తిన 15 రోజులకు పిలక దశలో ఒకసారి అంకురం దశలో మరోసారి వేసుకోవాలి. సాధారణ వరి కంటే సుమారుగా 25 శాతం అధికంగా వేయాలి. మిగిలిన సగభాగం పొటాష్ ఎరువులను (8 కిలోలు) నత్రజని ఎరువుతో పాటు అంకురం ఏర్పడే దశలో వేసుకోవా లి. ఈ సాగు పద్ధతిలో ఇనుపధాతు లోపం అధికంగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి 3-5 గ్రా. అన్నభేదిని 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పిచికారీ చేయాలి. సాధారణ నాటు వేసే పద్ధతితో పోలిస్తే నారు పెంపకం, నారు పీకడం, నాటు ఉండవు. కాబట్టి పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. కూలీల కొరత ఉండదు. నాటు వేసే పద్ధతితో సమానంగా దిగుబడులు సాధించవచ్చు.
- మద్దెల లక్ష్మణ్, 9010723131, ఖమ్మం వ్యవసాయం

రైతుల నుంచి మంచి ఆదరణ

మెట్ట పద్ధతిలో వరి సాగు చేసేందుకు రైతుల నుంచి మంచి ఆదరణ వస్తున్నది. గత కొన్నేండ్లుగా జిల్లాలో పలువురు రైతులు సాగు చేస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి ఇంకా కొంతమంది రైతులు కూడా ఇదే విధానంలో సాగు చేస్తున్నారు.
-అత్తోట ఝాన్సీలక్ష్మీకుమారి, ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి

తక్కువ నీటి వనరులతో సాగు

తక్కువ నీటి వనరులతో మెట్ట పద్ధతిలో వరి సాగు చేసుకోవచ్చు. అడపా దడపా వచ్చే చిరుజల్లుల సహాయంతో సాగు చేసుకోవచ్చు. రైతులు ఏ మాత్రం పంట కాలాన్ని కోల్పోరు. సాధారణ పద్ధతితో పోలిస్తే 20-30 శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. కూలీల కొరతనూ అధిగమించవచ్చు.
-పి. రంజిత,శాస్త్రవేత్త, కృషీ విజ్ఞాన కేంద్రం, 9989617700

మెట్ట పద్ధతిలో సాగు చేస్తున్నాం

మెట్ట పద్ధతిలో వరిసాగు చేయటం వల్ల మొదట కురిసే చిరుజల్లులు వరి విత్తనాలు మొలకెత్తుతాయి. తర్వాత కురిసే వర్షాలకు (ఆగస్టులో) చెరువులలో నీరు పంట పొలాలకు విడుదలవుతాయి. దీనివల్ల మాగాణి వరిగా మారుస్తాయి. దీంతో రెండు నెలల పంట కాలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాం.
-రాంమోహన్‌రెడ్డి, రైతు, మర్లపాడు-వేంసూర్ మండలం, 9963677458

484
Tags

More News