ఇంటిపంటల వాకిటిలో ఉషోదయం

Thu,August 1, 2019 12:35 AM

మట్టిని తనివితీరా ముద్దాడినపుడు మొక్కను గాఢంగా హత్తుకున్నప్పుడు ఒక మేఘం చినుకవుతుంది మెల్లిగా.. ఒక స్వప్నం చిగురిస్తుంది పచ్చగా.. ఒక గానం వినిపిస్తుంది తోడుగా.. కొత్త లోకం విస్తరిస్తుంది గుండె నిండుగా.. నిజంగా..నిండుగా, పచ్చగా..వెచ్చగా.. అదే ప్రేమతో,అంతే పిచ్చితో ఆమె చేసిన శ్రమ, సృజన కలిగలిసి పట్టణానికి పల్లె పరిమళాన్ని అద్దింది మిద్దె నుదుట ఆకుపచ్చ తిలకం దిద్దింది.
terrace-garden
పేరు ఉషారాణి..
మిద్దెతోటల ప్రపంచంలో ప్రసరిస్తున్న తొలి కిరణాల హరిత ఉష స్సు. ఊరు భాగ్యనగరం. వ్యవసాయశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌గా ఉద్యోగం. ప్రస్తుతం రాజేంద్రనగర్ ఫార్మర్ ట్రైనింగ్ సెంటర్‌లో ఎ.డి.ఎగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రైతు లతో కలిసి పనిచేస్తుండటంతో వాళ్లు కూరగాయల సాగులో ఎక్కువ మోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడటం చూసి ఆందోళన చెందారు. మనం కొంటున్న, తింటున్న ఆహారం ఇంత ప్రమాదకరమా అని ఆలోచించారు.

అదే సమయంలో యూట్యూబ్‌లో తుమ్మేటి రఘోత్తమరెడ్డి వీడియోలు చూసి తన ఇంటిపై మిద్దెతోటకు అంకురార్పణ చేశారు. ఇందుకు భర్త యలమంద ప్రోత్సాహం కూడా తోడైంది. మిద్దెతోటను ప్రారంభించినపుడు మొదట హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ సబ్సిడీకి ఇచ్చే కిట్ తెచ్చుకున్నారు. తరువాత దశలో ప్లాస్టిక్ డ్రమ్ములు అడ్డంగా కత్తిరించి కంటెయినర్స్‌గా వాడారు. ఇందులో మొదట ఎర్రమట్టి, కోకోపిట్, వర్మికంపోస్ట్‌ను (1: 1: 1 నిష్పత్తి) పాట్‌మిక్సింగ్‌గా కలిపారు. వర్మికంపోస్ట్‌లో 50శాతం వర్మి,50 శాతం మాగిన పశువుల ఎరువు వాడారు. దీనికితోడు ప్రతి కుండీలో ఒక దోస నీవ్‌ుకేక్, గుప్పెడు ఎముకల పొడి కలిపారు. వీటితో పాటు ట్రైకోడెర్మావిరిడి (ఎండు తెగులు, నేల నుంచి వేరు కుళ్లు తెగులు, ఇతర తెగుళ్ల నివారణలో ఉపయోగపడుతుంది.), సూడో మొనాస్ (ఎండాకు తెగులు, పాముపొడ తెగులు, నారుకుళ్లు తెగులు నివారణకు) వంటి బయోకంట్రోల్ ఏజంట్స్,అజటోబాక్టర్, అజోస్పైరిల్లవ్‌ు,రైజోబియం వంటి బయోఫైర్టిలైజర్స్‌ను ఒక కేజీ పాటింగ్‌మిక్స్‌కు 8 గ్రాముల చొప్పున కలిపారు.

గ్రోబ్యాగ్స్ నింపేటపుడు దాని అడుగున ఒక ఇంచుపైన కోకోపిట్ వేసారు. లేని పక్షంలో కొబ్బరిపీచు కూడా వాడవచ్చని అంటారు. తమ రోజువారీ అవసరాలకు ఉపయోగపడే అన్నిరకాల కూరగాయలతోపాటు, ప్లాస్టిక్ కంటెయినర్స్‌లో (18వ నెంబర్) మూడు రకాల మామిడి, స్వీట్‌లైవ్‌ు, వాటర్‌యాపిల్, సపోటా, యాపిల్‌బేర్, దానిమ్మ, అంజీర్, పైనాపిల్, ప్యాషన్‌ఫ్రూట్ వంటి పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఉల్లి, నూనెలు తప్ప మరే అవసరాలకోసం మార్కెట్‌కు వెళ్లనవసరం లేకుండా తన మిద్దెతోటను మల్చుకున్నారు ఉషారాణి. ముఖ్యంగా దొండకు శాశ్వత నిర్మాణం చేసుకున్నారు. ఒక 200లీ. డ్రమ్మును రెండు భాగాలుగా కత్తిరించి అడుగు భాగంలోని టబ్బులో ఎరువు నింపుకుని,దాని చుట్టూ నిలువుగా జి.ఐ వైరుతో ట్రీగార్డ్ వేసుకుంటే దొండ తీగ అల్లుకుంటుంది. మరోవైపు బెస్ట్ అవుటాఫ్ ద వేస్ట్ అనే కాన్సెప్ట్‌తో వాడి పారేసిన వాటర్ బాటిల్స్‌ను ఉపయోగించి వర్టికల్ గార్డెన్ నిర్మించారు. ఇందులో పాలకూర పెంచుతున్నారు. ఇది గార్డెన్‌ను బ్యూటిఫికేషన్‌లో భాగంగా కూడా కనిపిస్తుందంటారు. రెండస్థుతుల్లో అన్నిరకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పండిస్తున్న ఉషారాణి నాలుగేళ్ల అనుభవాలు కొత్తగా మిద్దెతోట పెట్టేవారికి ఒక గైడ్‌లాగా దారి చూపిస్తాయి.

ప్రారంభదశలో ఒక సీజన్ ఆకుకూరలు పండిస్తే (8-9 వెరైటీలు) ఒక అనుభవం వస్తుంది. ఆకుకూరలు ఏ కాలంలోనైనా సులువుగా వస్తాయి. కాబట్టి ఎండాకాలంలో ఈ ప్రయత్నం చేయవచ్చు. రెండోదశలో వర్షాకాలాన టమాటా, మిరప, వంకాయ, చెట్టు చిక్కుడు, గోరుచిక్కుడు, బెండ, తీగజాతులు పెంచుకోవచ్చు. చలికాలంలో కారట్, బీట్‌రూట్, ముల్లంగి, క్యాబేజి, కాలిఫ్లవర్ వంటి వి పండించుకోవచ్చు. రెండో సంవత్సరంలో నర్సరీ నుంచి అంటు మొక్కలు తెచ్చుకుని (మామిడి, సపోటా, జామ, దానిమ్మ, బొప్పా యి, మునగ) వాటికి తగిన కుండీల్లో నాటుకోవాలి అంటారు ఉషారాణి.

విత్తన ఎంపిక: దేశీ విత్తనాలకు ఎక్కువ రోగనిరోధక శక్తి వుంటుం ది. అందరికీ దేశవాళీ విత్తనాలు అందుబాటులో ఉండటం లేదు. కాబట్టి ఓపెన్ పాలినేటెడ్, హైబ్రిడ్ ప్రారంభంలో పెట్టుకోవచ్చు. హైబ్రిడ్ విత్తనాలను ఎక్కువ న్యూట్రియంట్ అవసరం వుంటుంది. హైబ్రిడ్ విత్తనం దాదాపు నెలరోజుల్లో కోత పూర్తవుతుంది. దేశీ విత్తనాలు ఎక్కువ కాలం కాస్తాయి. ఐతే దేశీ విత్తనాలు దొరకలేదని ఆగకుండా, ఏ విత్తనం దొరికినా ప్రారంభించవచ్చు.

విత్తన శుద్ధి: విత్తడానికి ముందు విత్తనం మీద జిగురు కోసం దానిని బెల్లం పాకంలో ముంచి దానిపై ట్రైకోడెర్మా విరిడి పౌడర్‌ను పూయాలి. లేదా పసుపు బూడిద మిశ్రమం పూయవచ్చు. దీనివల్ల నారు కుళ్లు తెగులు (డాంపింగ్ ఆఫ్ డిసీజ్) రాకుండా ఉంటుంది. 25 రోజుల లోపుమొక్క బలంగా నేలలో కుదురుకుంటుంది. కాబట్టి ఎలాంటి సమస్య తలెత్తదు.

నారు పోసుకోవడం:నలుగురు ఉన్న ఇంటో ్లఏ విత్తనమైనా 20 నుంచి 30 విత్తనాలు పెట్టుకోవాలి. అందులో మొత్తం విత్తనాలు మొలకెత్తకపోయినా, ఇతరత్రా కారణాల వల్ల నష్టపోయినా(చీమలు,పక్షుల సమస్య) మిగిలినవి ఎదుగుతాయి. ప్రతి 45 రోజులకు ఒక మూడు వెరైటీ లు (టమాటా, వంగ, మిరప) నారు పోస్తూ ఉండాలి. ప్రతి రెండు నెలలకోసారి బెండ విత్తనాలు పెట్టాలి. తీవ్రమైన ప్రతికాలంలో ఒక నెల ఎండ, చలి, వర్షం ఉంటుంది. ఆ సమయంలో తప్ప మిగతా సమయాల్లో నారు పోసుకోవడం, కొత్త విత్తనాలు పెట్టుకోవచ్చు.

ఎరువుల తయారీ: మా మిద్దెతోటకు సంబంధించి అన్నిరకాల ఎరువులను మే చివర నుంచి జూన్ చివరి వరకు తయారుచేసుకుంటాం. జూన్, జూలైలో రైతుల దగ్గరు నుంచి పశువుల ఎరువు తెప్చించుకుని (అర ట్రక్కు),దీనికి గుర్రపు వ్యర్థాల ఎరువు,మేక ఎరువు, కోళ్ల ఎరువు అన్నీ రెండుబ్యాగులు కలుపుతాము. ధాన్యా లు (వడ్లు,గోధుమలు,సజ్జలు అన్ని రకాలు),ఆయిల్ సీడ్స్ (ఆవా లు, నువ్వులు వంటివి), పల్సెస్ (మినుములు, పెసలు, కందు లు), అన్నిటినీ ఈ ఎరువుల దిబ్బమీద వేసి మొలకలు వచ్చాక 15-20 రోజుల తరువాత ఎరువులో కలిసిపోయేలా కలిసేలా చేస్తాం. ఇదే ఆర్గానిక్ డి.ఎ.పి. ఇక జీవామృతంలో 5వరోజు బయోఫెర్టిలైజర్స్ కలుపుతాము. 8వరోజు జీవామృతం అఫ్లై చేయడానికి ముందు 24 గంటల ముందు ట్రైకోడెర్మా విరిడిని కలుపుతాము. ఎందుకంటే ఇది ఎక్కువ గ్రోత్ వుంటుంది. మిగతా బాక్టీరియాను డామినేట్ చేస్తుంది కాబట్టి ఇలా చేస్తాము. వీటితో పాటు అవసరాన్నిబట్టి ఆయిల్‌కేక్స్, బోన్‌మీల్ వంటివి వాడుతున్నాము.

terrace-garden2
పాలినేషన్ ప్రాబ్లవ్‌‌సు: కూరగాయల్లో పూసిన ప్రతిదీ కాతకు రాదు. ఇందుకు కారణం పాలినేషన్ జరగకపోవడం. పాలినేషన్ జరగకపోతే కాత నిలవదు, పిందెలు రాలిపోతాయి. ఫలదీకరణ కోసం ఆవ, పొద్దు తిరుగుడు,బంతి లాంటివి పెంచితే తేనెటీగలు, సీతాకొకచిలుకలు రావడం వల్ల పాలినేషన్ ఎక్కువగా జరుగుతుం ది. చేతితో కృత్రిమ పాలినేషన్ చేస్తే కొంత ఫలితం ఉంటుంది. సాయంత్రం వేళలో మగపుష్పాన్ని కత్తిరించి, పిందె కనిపించిన ఆడపువ్వు మీద సున్నితంగా అద్దాలి. దీనివల్ల పాలినేషన్ జరిగి మంచి కాత వస్తుంది. మొక్కలు పెంచేవారు మొదట తెలుసు కోవాల్సిందే మిటంటే, పూసిన ప్రతీ పువ్వూ..కాసిన ప్రతీ కాయా చేతికి రాదంటారు ఉషారాణి.

తెగుళ్ల సమస్యలు: చిక్కుడును నల్లపేనుబంక ఆశిస్తే బూడిద, పసుపు కలిపి గుడ్డలో మూటకట్టి కొమ్మలకు అద్దితే సులువుగా నియంత్రించవచ్చు.తెల్లనల్లి / పిండినల్లి ఆశించినపుడు 1 లీటర్ నీటిలో గుప్పెడు అన్నం కలిపి 3రోజుల తరువాత దానిని బాగా ఊపి ఆ ద్రావణాన్ని మిల్లీబగ్ ఉన్న దగ్గర పిచికారీ చేస్తే పిండినల్లి గట్టిపడి మరునాటికి రాలిపోతుంది. లోపలి పురుగు చచ్చిపోతుం ది. రసం పీల్చే పురుగుల నివారణకు 3జి సొల్యూషన్ (అల్లం, వెల్లు ల్లి, పచ్చిమిర్చి) వాడుతున్నారు. దీనిని తయారుచేసుకోవడానికి 50 గ్రాముల వెల్లుల్లి, అర ఇంచు అల్లం, రెండు పచ్చిమిరపకాయ లు సరిపోతాయి. వీటిని మెత్తగా దంచి కొద్ది నీటిలో మరగబె ట్టి చల్లార్చి, ఫిల్టర్ చేసి దీనిని 15 లీటర్ల నీటి బకెట్‌లో కలపాలి.

ఇది సాయంత్రం పిచికారీ చేసి,మరుసటి ఉదయం గార్డెన్‌లోకి వెళితే పురుగులన్నీ తెల్లని దుమ్ములా గాలిలోకి లేస్తాయి. ఆకుతినేపురుగులు చిన్నదశలో చనిపోయి చెట్టుకు వేళాడతాయి. మొక్కకు చిన్న దశలో నారు కుళ్లు వచ్చి మెడల దగ్గర కుళ్లిపోయి కిందకు వాలిపోయినపుడు, 1లీటర్ నీటికి 8గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి పోయాలి. లేనిపక్షంలో దాల్చినచెక్క పొడిని మట్టిపై భాగంలో చల్లా లి. నెలకోసారి వేపనూనె ముందు జాగ్రత్తగా పిచికారీ చేయాలి.

నిజానికి గార్డెనింగ్ అనేది చాలా సింపుల్ యాక్టివిటీ. య్యూట్యూబ్‌లో వీడియోలు చూసి అమ్మో ఇంత పనా అని భయపడవద్దు. ఇవన్నీ చేస్తే తప్ప గార్డెన్ అవదేమో అని కంగారు పడవద్దు. ఎర్రమట్టి, మాగిన పశువుల ఎరువు, వర్మికంపోస్ట్‌ను గుడ్డలో మూటకట్టి నీటి డ్రమ్ములో వేలాడదీస్తే, ద్రవరూప ఎరువు తయారవుతుం ది. దీనిని వారానికోసారి సులువుగా పిచికారీ చేసుకుంటే వేరే ఎరువులు కూడా అక్కరలేకుండా సరిపోను ఉత్పత్తులు పొందవ చ్చు. పైన చెప్పినదంతా కేవలం నా అనుభవం మాత్రమే, అందు లో అవసరమైనది తీసుకుంటే సరిపోతుంది అంటారు ఉషారాణి. రోజువారీ అవసరమైన మొక్కలే కాకుండా, ఔషధ మొక్కలు, అలంకరణ మొక్కలతో తన ఇంటిని పొదరింటిలా మల్చుకున్న ఉషారాణి, ప్రతి ఇల్లూ ఒక వ్యవసాయక్షేత్రం కావానేది తన కల అంటారు.
(ఇతర వివరాలకు ఉషారాణిని సంప్రదించవలసిన నెంబర్..8121796299)
-కె.క్రాంతికుమార్‌రెడ్డి,9603214455
నేచర్స్‌వాయిస్,

515
Tags

More News