కత్తెర పురుగు ఉధృతికి అడ్డుకట్ట ఇలా

Thu,August 8, 2019 12:59 AM

కత్తెర పురుగు దక్షిణ అమెరికా దేశాల్లో మొదలైంది. ఇది అక్కడి మక్కజొన్న పంటలకు పెను ప్రమాదకరంగా మారింది. అక్కడి నుంచి పశ్చిమ దేశాల మీదుగా ఇది ఇండియాకు వచ్చింది. రెండేళ్లుగా వివిధ రాష్ర్టాల్లో మక్కజొన్న పంటను ఆశించి పెను ప్రమాదంగా మారింది. ఈ నేపథ్యంలో మక్కజొన్న లో సమగ్ర సస్యరక్షణ, ఆధునిక పద్ధతులు, సామూహిక చర్యల ద్వారానే దీన్ని ఉధృతికి అడ్డుకట్టవేయగలం.
maize-inspect
మక్కజొన్నపై కత్తెరపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నది. దీనిపై అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖను ఆదేశించింది. దీంతో జిల్లాల వారీగా రైతులకు అవగాహన కార్యక్రమాలు, రక్షణ చర్యలను వ్యవసాయశాఖ మొదలుపెట్టింది. ఈ పురుగు ఉధృతిని నియంత్రించేందుకు ఎటువంటి యాజమాన్య పద్ధతులను పాటించాలన్న దానిపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచనలు చేసింది.

కత్తెర పురుగు పంటను ఆశిస్తే ఆ పంటనంతా నాశనం చేస్తుంది. దీన్ని ఫాల్ ఆర్మీ వార్మ్ అని పిలుస్తారు. 90 రోజుల జీవితకాలంలో రెండు దశల్లో గుడ్లు పెడుతుంది. గుడ్లు పగిలి వచ్చే పిల్ల ల లార్వాలు. ఇవే కత్తెర పురుగులు. ఇవి గుంపులుగా తిరుగుతూ ఆకులను తినేస్తాయి. రెండో దశలో ఈ పురుగులు మొక్కకాండం మొవ్వులో చేరి కాండాన్ని తింటాయి. మొవ్వును పూర్తిగా తినడంతో పూత పోయి కంకి తయారవ్వదు. కంకి తయారయ్యే సమయంలోనూ ఈ పురుగులు కంకులలో దూరి లేత గింజలను తినేస్తా యి. ఈ పురుగు మొదట మక్కజొన్న పంటపైనే దాడి చేస్తుంది. అది అందుబాటులో లేకుండా వరి, గోధు, జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పత్తి, చెరకు, కూరగాయల వంటి 86 రకాల పంటలపై ప్రభావం చూపుతున్నది.

సేంద్రియ పద్ధతులే మేలు..

కత్తెర పురుగును క్రిమిసంహారక మందులతో అరికట్టడం అంత తేలికకాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మక్కజొన్న సుడులలో మట్టి, బొగ్గుపొడి, రాతిపొడి, బూడిద వేయడం, కొన్నింటి లో వేపగింజల కషాయం, అగ్రి అస్త్రం, ఉప్పు, పచ్చిమిర్చి ద్రావణం, సుడులలో పిచికారీ చేయ డం వంటి పద్ధతులతో అరికట్టే అవకాశాలు ఉన్నాయి.

అంతరపంటలతో అడ్డుకట్ట..

పొలమంతా మక్కజొన్న పంటను మాత్రమే సాగు చేసే ప్రాంతాల్లో కత్తెర పురుగు బెడద ఎక్కువగా ఉంటుంది. మక్కజొన్నలో అంతరపంటగా, చుట్టూ కంచెగా నాపియర్ గడ్డి వేస్తే కత్తెరపురుగు ఉధృతి తగ్గుతుంది. మక్కజొన్నతో పాటు పప్పుధాన్యాలు , నూనెగింజలు, చిరుధాన్యాలు అంతర పంటలుగా కలిపి సాగుచేస్తే ఇది వ్యాప్తి చెందదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

జూలై చివరి వారంలో, ఆగస్టు మొదటి వారం లో మక్కజొన్నను కత్తెర పురుగు ఆశిస్తుంది. మక్కజొన్న చేలలో రైతులకు అనుకూలంగా ఉండే మిత్ర పురుగులైన సాలెపురుగులు, గండు చీమలు, అక్షింతల పురుగులు, తూనీగలు, కందిరీగలు, ఆసాసిన్ బగ్స్, పెంటలూమిడ్ బగ్స్, ఇయర్ విగ్స్, ట్రైకోగ్రమ వంటి ఉండేవి. ఇప్పు డు క్రిమిసంహారక మందుల వల్ల అవి చనిపోతున్నాయి. నేడు మార్కెట్‌లో లభ్యమయ్యే పర్యావరణ అనుకూలమైన ఫిరమోన్ టెక్నాలజీతో లింగాకర్షక ట్రాప్‌ల ద్వారా దీన్ని కొంతవరకు అరికట్టవచ్చు. ఈ పురుగు నివారణకు ఎకో ఫ్రెండ్లీ ప్రయోగాలు ఫలిస్తున్నాయని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పురుషోత్తం దేవాంగ్ తెలిపారు.

కత్తెర పురుగు నివారణకు తొలి నెలలోగా పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు

-మక్కజొన్న మొలిచినప్పటి నుంచి కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉన్నందున రైతు లు పంటపై నిఘా ఉంచి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి.
-ప్రతి 25 రోజులకు బుట్టలలోని ఎరలను మార్చుకోవాలి. ప్రతి బుట్టకు రోజుకు ఒక తల్లి పురుగును గమనించినా లేదా లేత ఆకులపైన గుడ్ల సముదాయాలను లేదా తెల్లటి పొరను గమనించినా 1500 పీపీఎం సాంద్రత కలిగిన అజాడిరక్టిన్‌ను 5 మి.మి. చొప్పున లీటరు నీటిని కలిపి విధంగా పిచికారీ చేయాలి.
-కత్తెర పురుగు 2 లేదా 3వ లద్దెపురుగు దశ లో ఉన్నప్పుడు 5-10 శాతం పురుగు ఆశించిన మొక్కలను గుర్తించినప్పుడు ఇమామెక్టి న్ బెంజోయేట్ 200 లీటర్ల నీటిని 80 గ్రాముల చొప్పున కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాలి.
-సేంద్రియ పద్దతిలో సాగుచేసే రైతులు పొలంలో గుడ్ల సముదాయాన్ని గమనించిన వెంటనే టెలినోమస్ దీమస్ లేదా ట్రైకోగ్రా మా ప్రెటియోజమ్ అనే గుడ్డు పరాన్న జీవులను ఎకరానికి 50వేల చొప్పున వారం వ్యవధితో 2 నుంచి 3 సార్లు విడుదల చేయా లి. వీటితోపాటు తొలిదశ లద్దె పురుగుల నివారణకు మెటారైజియమ్ లేదా నోమూరియా అనే శిలీంధ్ర మిశ్రమాలను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి ఆకుసుడిలో పడే విధంగా పిచికారీ చేయాలి.
-ప్రస్తుతం వాడుతున్న లింగాకర్షక బుట్టలతో పోలిస్తే త్రీడీ నానో టెక్నాలజీతో కూడిన ల్యూర్‌లు బాగా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రైతులకు సబ్సిడీపై వీటిని అందిస్తున్నది.

-మజ్జిగపు శ్రీనివాస్ రెడ్డి
8096677036

359
Tags

More News