ఏడాదంతా చిక్కుడు సాగు

Wed,August 7, 2019 11:53 PM

పోషకాలను అందిస్తూ, ఏడాది అంతా దిగుబడినిస్తూ భూమికి నత్రజనిని అందించే పంట చిక్కుడు. ఈ పంట ఉష్ణ, శీతల, ఉప-ఉష్ణ ప్రాంతాలలో కూడా వస్తుంది. హెక్టారుకు 5-10 టన్నుల పచ్చి ఆకులను ఇస్తుంది. దీన్ని మేతగా వాడుకోవచ్చు. భూసారాన్ని పెంచుతుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. పశువుల మేతగా, నిల్వ ఉంచే సైలేజిగా కూడా దీన్ని వాడుకోవచ్చు.
Bean
కూరకు వాడే చిక్కుడులో ప్రతి 100 గ్రాములకు 6.7 గ్రాముల కార్బొహైడ్రేట్, 3-8 గ్రాముల ప్రోటీన్, 1.8 గ్రాముల ఫైబర్, 210 మి.గ్రా కాల్షియం, 68 గ్రాముల ఫాస్ఫరస్, 1.7 గ్రాముల ఇనుము ఉంటుంది. రాష్ట్రం లో రైతులు వాణిజ్యంగా సాగు చేసేందుకు, మిద్దె తోటలలో, పెరట్లలో ఆరోగ్యంగా పెరిగి తక్కువ ఖర్చు తో ఏడాది అంతా దిగుబడిని ఇస్తుంది.

చిక్కుడు అతి చలిని, అతి ఎండను తట్టుకోలేదు. చిక్కుడులో ప్రధానంగా రెండు రకాలు. పందిరి చిక్కుడు, పొద చిక్కుడు. పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్నది. కాపు కోసం కూడా 4-5 నెలలు వేచి ఉండాలి. ఒక కాలంలోనే సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. పొద చిక్కుడులో మంచి రకాలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి పందిరి చిక్కుడు సాగు కనిపించడం లేదు. పొద చిక్కుడు మూడునెలల వ్యవధిలోనే పంట చేతికి వస్తుంది. సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. అయితే ఈ సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడితో పాటు లాభాలు పొందవచ్చు. పొద చిక్కుడు మూడు కాలా ల్లో సాగు చేసకోవచ్చు. వానకాలంలో పండించే పంట లో మంచి నాణ్యత గల కాయను పొందవచ్చు. దిగుబడులు కూడా బాగా ఉంటాయి.

వాతావరణం: చిక్కుడు ఉష్ణమండల పంట. అధిక చలిని, అధిక వేడిని ఏమాత్రం తట్టుకోలేదు. తొలిదశలో ప్రత్యేకించి మొలకెత్తే సమయంలో పంటకు 20-25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కావాలి. గాలిలో అధిక తేమతో తెగుళ్లు, ఇతర రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

నేల: ఉదజని సూచిక -7.7.5 మధ్య ఉండి, మధ్యస్థ తేలికపాటి నుంచి నేలల్లో ఈ పంట బాగా పెరుగుతుం ది. నీటి నిల్వ ఉండే భూములు, నల్లరేగడి భూములు ఈ పంటకు అతిగా అనుకూలం కాదు. అధికంగా గాలిలో తేమ ఉండే నేలల్లో ఈ పంట వేయవద్దు.

నేల తయారీ: నేలలో నీరు ఇంకే విధంగా తయారుచేసుకోవాలి. ముందుగా ఎండాకాలంలో లోతు దుక్కి చేసి, తర్వాత నాలుగైదుసార్లు దుక్కిదున్నాలి. విత్తడానికి 15 రోజుల ముందు హెక్టారుకు 2.5 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వేయడం మంచిది. పప్పుధాన్యపు పంట కాబట్టి భూమిలో నత్రజనిని స్థాపించి భూసారాన్ని కాపాడుతుంది.

Bean2
విత్తనశుద్ధి: విత్తే ముందు కిలో విత్తనానికి 1 గ్రా కార్బడింజం కలిపి విత్తనశుద్ధి చేయాలి లేదా కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 3 గ్రాముల కాప్టాన్ లేదా థైరమ్‌తో విత్తనద్ధి చేయాలి. తర్వాత రసం పీల్చే పురుగుల మందుతో శుద్ధి చేసుకోవాలి. సిఫార్సు చేసిన రైజోబియం జీవన ఎరువును కిలో విత్తనాలకు 40 గ్రాముల చొప్పున పట్టించాలి. 200 గ్రాముల రైజోబియం కల్చర్‌ను 250 గ్రాముల బెల్లం ద్రావకంలో కలిపి లీటరు నీటిలో ఉంచి ద్రావ ణం తయారు చేసుకోవాలి. ఆ రైజోబియం మిశ్రమ ద్రావణాన్ని విత్తనాలపై పొరగా ఏకరీతిగా పట్టించాలి. తర్వాత నీడలో అరగంట పాటు ఎండబెట్టాలి. 24 గంటల లోపు ఎండిన విత్తనాలను నేలలో విత్తాలి.

విత్తన మోతాదు: ఎకరాకు తీగ రకాలకు 0.8-1.2 కిలోలు, పొద రకాలకు 12-16 కిలోల విత్తనం కావాలి.

విత్తే సమయం: తీగ(పందిరి) రకాలను ఆగస్టు రెండవ వారం వర కు, పొద రకాలను వర్షాకాలంలో (ఆగస్టు రెండవ వారం వరకు) యాసంగి (సెప్టెంబర్-అక్టోబర్) ఎండాకాలం (జనవరి-ఫిబ్రవరి) కాలాల్లో విత్తుకోవచ్చు.

విత్తటం: పందిళ్లపై పెంచే పంటకు 2-2.5 మీటర్ల దూరంలో కాలువ లు చేసిన 1.5-2.0 మీటర్ల దూరం లో పాదులు చేసి ఒక్కొ పాదులో 3-4 విత్తనాలు పెట్టాలి. 30X30X30 గుంటల్లో విత్తుకోవాలి.పాదరకాలలో విత్తనాలను బోధలు , చాళ్ల పద్ధతుల్లో విత్తుకోవాలి. వరుసల మధ్య రెండు అడుగులు, మొక్కల మధ్య ఒకటిన్నర అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తిన వెంటనే నీళ్లు పెట్టాలి. 5-7 రోజుల తర్వాత బలమైన రెండు మొక్కలు ఉంచి మిగతావి తీసివేయాలి. నాగలితో లేదా సీడ్‌డ్రిల్‌తో విత్తనం వేసుకోవాలి.

ఎరువులు: ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరు వు, 24 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్‌తో పాటుగా మొదటి దఫా 15 కిలోల నత్రజని వేసి కలియదున్నాలి. రెండవ దఫాగా 15 కిలోల నత్రజనిని, 15 కిలోల పొటాష్ విత్తిన 30 రోజులకు వేయాలి. ఎరువులు వేసిన వెంటనే నీళ్లు కట్టాలి. దీనితో చిక్కుడులో పూత కాపునకు వస్తుంది.

నీటి యాజమాన్యం: పాదుల్లో 2-3 సెం.మీ లోతు గా నేల పొడిబారినప్పుడు నీళ్లు కట్టాలి. పాదుల్లో నీళ్లు నిలువకుండా చూడాలి. వర్షాలు లేనప్పుడు 10-15 రోజుల వ్యవధిలో నీటిని కట్టుకోవాలి.

అంతకృషి: పూత, కాత సమయంలో అంతరకృషి చేయకూడదు. ఒకవేళ చేస్తే పూత రాలిపోతుంది. పాదుల్లో మట్టిని గుల్లగా చేయాలి. తీగ సాగే దశలో పురికొసతో కట్టి తీగలను పందిరిపైకి పాకించాలి. ఒకవేళ పూతదశలో వర్షాలు ఎక్కువగా పడితే పూత రాలుతుంటే ఒక శాతం యూరియా, ద్రావణం లేదా ప్లానో ఫిక్స్ ఒక మి.లీ 4.5 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కలుపు యాజమాన్యం: చిక్కుడు సాగులో గడ్డిజాతికి చెందిన మొక్కలు కలుపుగా ఎక్కువ సమస్య వస్తుం ది. కాబట్టి కలపు నివారణకు పెండిమిథాలిన్ మందు ను ఎకరాకు 1.25 లీ లేదా అలాక్లోర్ 1.0 లీ (తేలిక నేలలు) 1.25 లీ (బరువు నేలలు) చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నాటిని 48 గంటలలోపు పిచికారీ చేయాలి.

సస్యరక్షణ

పెంకు పురుగు: మొదటి దశ మొక్కల్లో ఆకులను కొరికి, తిని పంటకు తీరని నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు కార్బరిల్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పేను బంక, తామర పురుగులు: ఈ పురుగులు ఆకులను, పూత దశలో పూలపై ఆశించి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల మొక్కలు పండుబారి పసుపు రంగులోకి మారి రాలిపోతాయి.
నివారణ: ఈ పురుగు నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫిప్రొనిల్ మందును 2 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో చెట్టుకు పిచికారీ చేయాలి.
కాయతొలుచు పురుగు: పూత దశలో, కాయ దశ ల్లో ఈ పురుగు కాయల్లోని మంచి పదార్థాలను తినేసి కాయ నాణ్యత తగ్గేలా చేస్తుంది. కాయంత డొల్లగా మారిపోతుంది.
నివారణ: ఈ పురుగు నివారణకు మలాథియాన్ 2 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత దశ నుంచి మొదలుపెట్టి 10 రోజుల వ్యవధిలో మళ్లీ పిచికారీ చేయాలి. 5 శాతం వేప కషాయం లేదా 5 మి.లీ వేపనూనే లీటరు నీటికి కలిపి ఆ ద్రావణాన్ని తయారుచేసుకుని క్రమపద్ధతిలో పురుగుల నివారణకు వాడుకోవాలి.

దిగుబడి, కోత కోయడం

విత్తిన 120-130 రోజులకు మొదటి కోత వస్తుంది. కాయలు లేతగా ఉన్నప్పుడే కాయలను కోసుకోవాలి. లేకపోతే కాయలు ముదురుగా మారిపోతాయి. ముదిరిన కాయ వల్ల ఎక్కువ లాభాలు ఆశించలేం. తీగ రకాలైతే ఎకరాకు 3-5 టన్నుల, పొద రకాలైతే 1.5-2.5 టన్నుల దిగుబడిని ఇస్తాయి. పొద చిక్కులు 55-60 రోజుల్లో కోతకు వస్తుంది.రకాన్ని బట్టి 90-100 రోజుల పంట కాలం ఉంటుంది.
Bean3

837
Tags

More News