ఇంటిపైన ఇంద్రధనస్సు రంగులు

Wed,August 14, 2019 11:13 PM

house-plants
ఇంద్రధనస్సు రంగులన్నీ ఇంటిపైన విరబూసినట్టు సీతాకొకచిలుకల వర్ణాలే కొమ్మల్లో పూలై వాలినట్టు శీతాకాలపు సౌందర్యం శాశ్వతంగా ఇక్కడే నిలిచినట్టుఒక సంభ్రమం..ఒక విభ్రమం. ఈ వర్ణరంజిత దృశ్యాన్ని దర్శిస్తే మనమున్నది నగరనడిబొడ్డులోనా, పూలలోయల వాలులోనాఅని ఒక్కక్షణం తత్తరపడక తప్పదు. సమయాన్ని, సృజనను మిళితం చేసిఒక నిర్జీవ స్థలాన్ని పూలవనంలా మార్చిన వేదాంతం లీలారవి ప్రకృతి ప్రేమకు సలాం చేయాల్సిందే.

చాలామంది లాగానే లీలా రవికి కూడా మొక్కలంటే చాలా ఇష్టం. భర్త సింగరేణి కాలరీస్‌లో డి.జి.ఎం (సివిల్ డిపార్ట్‌మెంట్) గా పనిచేసేటపుడు క్వార్టర్స్‌లో కావలసినంత స్థలం ఉండటంతో క్రోటన్స్, పూల మొక్కలు, కూరగాయలు పెంచారు. తరువాత హైదరాబాద్ వచ్చాక సొంత ఇంట్లో కొద్దిస్థలం మాత్రమే ఉండటంతో కొన్ని మొక్కలు నాటారు. సొర తీగను కింద నుంచి మూడంతస్థులపైకి పాకించి పైన పందిరి వేశారు. 1996లో శ్రీనగర్ కాలనీ కమలానగర్‌లో ఇళ్లు కట్టుకున్నాక తన కలల్ని ఇంటి పైన అందమైన వనంలా అల్లుకున్నారు.

సాయంత్రం వేళల్లో సువాసనలు విరజిమ్మే గోవర్ధనం, రెండుమూడు రోజుల పాటు వాడిపోకుండా నూతనంగా ఉండే దొంతర మల్లె,సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం వరకు తాజాగా ఉండే ఫోరో క్లాక్ ఫ్లవర్ (చంద్రకాంత), తేనెటీగలను ఆకర్షించే హనీ సకెల్, స్కార్లెట్ మిల్క్‌వీడ్, రుతువులకతీతంగా రోజూపూసే నిత్యమల్లెలు, డిసెంబర్‌లోనే పూసి సీతాకొకచిలుకలను విపరీతం గా ఆకర్షించే కలోంజెస్, ఉదయం తెలుపు, మధ్యాహ్నం వైట్‌పింక్, సాయంత్రానికి మెజంతా పింక్ వర్ణంలోకి మారే పత్తిమందారం, మొగ్గలుగా ఉన్నపుడు మ్యూజికల్‌నోట్స్‌లా ఉండే తెల్లని పూల మొక్కలు, శివుడికి ప్రీతికరమైన దేవకాంచనం, గన్నేరు, శంఖుపూలు, లలితాంబకు ఇష్టమైన మందారాలు, లక్ష్మీదేవికి ఇష్మమైన కలువలు, తామరలు.. ఒకటా రెండా సుమారు 1200 చదరపు అడుగుల స్థలంలో దాదాపు 500 కుండీల్లో రకరకాల పూల మొక్క లు. నిజంగా ఒక ఇంటిపై ఇన్ని మొక్కలు కనిపించడం అరుదు. కొన్ని నర్సరీల నుంచి మరికొన్ని మొక్కలు స్నేహితుల దగ్గర నుంచి వచ్చినవి. అలా అలా విస్తరించిన ఈ తోటలో ఒక అవ్యక్త పరిమళమేదో గుబాలిస్తుంటుంది. అసలు కొన్ని మొక్కలకైతే ఆమే సొంతంగా అనువైన, సులువైన పేర్లు పెట్టుకున్నారు. లాబ్‌క్యాస్టర్‌ను ప్యారట్ ఫ్లవర్ అని, గుర్రపుడెక్క (వాటర్ హయసింత్) పుష్పానికి నెమలిపింఛం అని, అమరిల్లీస్ పుష్పాలకు గ్రావ్‌ుఫోన్ ఫ్లవర్ అని పేరు పెట్టుకున్నారు. పొద్దున లేచి తోటలోకి వచ్చాకే నారోజు మొదలవుతుంది అంటారు లీలారవి. ఆమె కవిత్వం అల్ల డం, అల్లికలు కూర్చడం చేసినట్టుగానే పూలు, కూరగాయలు,విత్తనాలు ఆమె చేతిలో అందమైన అలంకరణలుగా రూపుదిద్దుకుంటాయి. ప్రతీ పండగ సందర్భం ఆమె చేతల్లో ఓ అందమైన వర్ణచిత్రమై తళుక్కుమంటుంది.

ఆమె సృజనకు తోడుగా ఈ మిద్దెపై తేనెటీగలు ఝమ్మంటూ సంగీతాన్ని వినిపిస్తుంటాయి. పలువర్ణాల, పరిమళభరిత పుష్పాల మకరందాన్ని చుక్కాచుక్కా ఒడిసిపట్టి తేనెబొట్లుగా రంగరించి దాచుకున్న ఒక పెద్ద తేనేపట్టు దేవగన్నేరు మొక్కపై కొలువైంది. దీనికితోడు పిచ్చుకలు, పావురాలు, ఉడతలు, హమ్మింగ్‌బర్డ్ వంటి చిన్న చిన్న పక్షులు ఈ సుగంధవనం చుట్టూతా తిరుగుతుంటాయి. ఆమెకు ఎక్కువగా పూల మీద వ్యామోహం ఉన్నప్పటికీ, ఇంటికి కావలసిన కూరగాయలు కూడా పండిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, దుంపజాతులు, తీగజాతులతో పాటు మక్కజొన్న వేశారు. ఆర్నమెంటల్ చిల్లీస్, పైకి కాసే నల్ల మిరపవంటి అరుదైన మొక్కలు ఇక్కడ కనిపిస్తాయి. సొర మొదటిసారి ఫ్రూట్‌ఫ్లై సమస్య వల్ల సక్సెస్‌ఫుల్‌గా పండిచలేకపోయానంటారు. కానీ ఈసారి మొక్క ఆరోగ్యంగా పెరుగుతోంది అంది ఆనందంగా. టమాటా, మిరప, దోస నా తోటలో వాటంటరీ ప్లాంట్స్. నాటనవసరం లేకుండా వాటంతటవే పెరుగుతాయి. దానిమ్మ, జామ, నిమ్మ వేయకుండానే పడేసిన విత్తనం నుండే పుట్టాయి. నిమ్మ నూరు శాతం సక్సెస్‌ఫుల్. ఇపుడు ఇరవైదాకా నిమ్మకాయలు కాశాయి. తొక్క చాలా పలుచగా ఉండి, రసం ఎక్కువగా వస్తోంది అంటారామె.

ఐతే తన తోటలోంచి వచ్చిన విత్తనాలను, మొక్కలను ఎప్పటికపుడు పంచుతుంటారు లీలారవి. మొక్కకు మొదట వచ్చిన కాయను విత్తనానికి ఉంచి, వాటి నుంచి సేకరించిన విత్తనాలను, తన వద్ద అదనంగా ఉన్న మొక్కల లిస్ట్‌ను ఇంటిపంటల గ్రూప్‌లలో పెట్టి, స్పందించిన వాళ్లకు అందిస్తుంటారు. అలాగే తన ఇంటిలో పండిన కూరగాయలతో రకరకాల వంటలు చేసి గ్రూప్ లో పెడతారు. ఒకసారి ఇంటిపంట గ్రూప్ యానివర్సరీకి, రూఫ్ గార్డెన్ మిత్రుల ఎరువు కోసం వంద ప్యాకెట్ల చెరకు వ్యర్థాల్ని పంచారు. ఇలా ఎప్పటికపుడు ఏదో ఒక యాక్టివిటీతో తన ప్రకృతి ప్రేమికుల్ని ఉత్తేజపరుస్తుంటారు. అసలు ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆమె తను పండించిన వాడితో ఎలాంటి డిజైన్స్ చేసి ఫోటోలు పెడుతుందా అని సోషల్ మీడియా గ్రూపుల్లో ఎదురుచూస్తారంటే అర్థమవుతున్నది ఆమె ప్రత్యేకత. ఇలా బహుముఖ ప్రజ్ఞతో ఆమె ఇంట్లోనే తనదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నారు.

భర్త స్వచ్ఛంద పదవీవిరమణ చేసి, బిల్డర్‌గా స్థిరపడ్డాక శంషాబాద్‌లో శృంగేరీ పీఠానికి చెందిన శారదాంబ అమ్మవారి గుడి నిర్మించారు. అక్కడ శివునికి ఇష్టమైన మొక్కల గురించి వివరాలు సేకరించి తెలుసుకుని అందులో బిల్వ, అశ్వత్థ, పున్నాగ, పొగడ, పున్న, రుద్రాక్ష, సంపంగి, వేప, రావి, మర్రి మొక్కలు నాటారు. మొక్కల గురించి తెలుసుకోవడం,వాటిని పెంచడం, పంచడం ఆమె అణువణువునా జీర్ణించుకపోయిందంటే అతిశయోక్తి లేదు.

మరింత అందమైన మిద్దెతోటను మేనేజ్‌చేయాలంటే కుండీలనుంచి మట్టిమిశ్రమం ప్రతి దశలో చాలా జాగ్రత్తలు తీసుకోవాంటారు లీలా రవి. కావలసినంత మట్టి మిశ్రమం పట్టేలా కుండీలు ఉండాలి. ఏ ఒక్క ఎంత సైజు కుండీలో పెరుగుతుందో చూసుకోవాలి. కుండీ అడుగున ఎక్కువైన నీరు వెళ్లేందుకు రంధ్రాలు చేయాలి. అవి పూడిపోకుండా రెండు అంగుళాల మందాన గులకరాళ్లు వేయాలంటారు. మట్టిమిశ్రమం విషయానికి వస్తే, కుండీ లో సగం ఎర్రమట్టి, ఇరవై శాతం ఇసుక, కొంచెం వేపపిండి, కొంచెం కోకోపిట్ కలిపి వేస్తారు. ఈ మిశ్రమం కలిపిన తరువాత ఒక ప్లాస్టిక్ బాటిల్ అడుగు భాగాన్ని నాలుగైదు ఇంచుల ఎత్తుమేర గుండ్రంగా కత్తిరించి, అడుగు భాగంలో చిన్నచిన్న రంధ్రాలు చేసి,విత్తనం వేసాక దాని చుట్టూ పెడతారు. అపుడు ఎదిగే వరకు నీళ్లు పోసినా మొక్క కదలకుండా,పక్కకు జరగకుండా అలాగే ఉంటుంది.

ఎరువు తయారీలో భాగంగా ఒక కుండలో పండ్లు,కూరగాయలు, పూల వ్యర్థాలు వేసి అందులో మూడురోజులకొకసారి కోకోపిట్,వర్మికంపోస్ట్ వేసి పైకి కిందకు కలిపితే, నలభై రోజుల్లో తయారవుతుంది. అప్పుడపుడూ కూరగాయలు, పండ్లు, పూల వ్యర్థాలను రెండురోజులపాటు అలాగే మిక్సీ పట్టి జ్యూస్ చేసి ఎరువు కుండలో పోస్తారు. అందులో పచ్చి వేపాకులు తెచ్చి గ్రైండ్ చేసి అందులో పోస్తే ఎలాంటి పురుగులు దరిచేరవు అంటారు లీలారవి. దీనిని పదిహేనురోజులకొకసారి గుప్పెడు వేస్తారు. కుండీలలో కాఫీ పొడి కూడా వేస్తున్నారు. దీనివల్ల పూలు బాగా పూస్తాయంటారు. శంషాబాద్‌లో తమ మెయింటెనెన్స్‌లో ఉన్న గోశాలనుంచి ఆవుమూత్రం తెచ్చి పిచికారీ చేస్తారు. కొన్నిసార్లు ఘనజీవామృతం తయారుచేసుకుని వాడుకుంటున్నారు. తెగుళ్లకు బూడిద, పసుపు కలిపి చల్లుతున్నారు. మిల్లీబగ్స్ సమస్యకు పుల్లనిమజ్జిగలో పసుపు కలిపి వాడుతున్నారు. దీనివల్ల టమాటా, పచ్చిమిర్చిలో కాత కూడా బాగా వస్తుందని ఈ మధ్యే తెలిసిందంటారు. అసలు కింద నేల బాగుంటే పైన అంతా బాగుంటుందంటారామె.

తోట మనకొక బాధ్యత, మనకది భరోసా. అందులో మొక్కలను పిల్లలను చూసినట్టు చూడాలి. అపుడే అది పచ్చగా మన మనసుల్లోకి అల్లుకుని,తన ఒడిలో మనకు స్వాంతన అందిస్తుంది. నేను రోజుకు ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు తోటలో గడుపుతాను, కానీ దాని పరిమళం ప్రతి క్షణం నన్ను వెన్నాడుతూనే ఉంటుందంటారు లీలారవి తన్మయంగా. చివరకు గోరింటాకు కూడా మాఇంట్లోదే పెట్టుకుంటానని ఆనందంగా చెప్పే లీలారవి చేతినే కాదు తన జీవితాన్ని కూడా నిండుగా పండించుకుంటున్నారు. అసలామె జీవితాన్ని తరిచి చూస్తే, ఒక లైఫ్‌ను ఎంత రంగులమయంగా, మరెంత ఆనందంగా జీవించవచ్చో తెలుస్తుంది.
- కె.క్రాంతికుమార్‌రెడ్డి, 9603214455 నేచర్స్‌వాయిస్
house-plants1

లీలారవి ఇంటిని అల్లుకుంటున్న మొక్కలు

కూరగాయలు:వంగ, బెండ, గోరుచిక్కుడు, కాప్సికం,మిరప, టమాటా
తీగజాతులు: పొట్ల (2రకాలు),సొర, బీర, కాకర, చిక్కుడు, దోస
దుంపజాతులు: చామ, పసుపు, అల్లం
ఔషధ మొక్కలు: ఇన్సులిన్, వాము, కలబంద, సబ్జ (థాయ్ బాసిల్), పుదీనా, తులసి, నిమ్మగడ్డి
ఆకుకూరలు: పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, బచ్చలి, కరివేపాకు, కొత్తిమీర
పండ్ల మొక్కలు: సపోటా అరటి (కర్పూరకేళి), జామ, దానిమ్మ, నిమ్మ
పూల మొక్కలు: చామంతులు (15రకాలు), గులాబీలు(13రకాలు), మందార(5రకాలు), దేవగన్నేరు(3రకాలు), దేవకాంచనం, శంఖుపుష్పం(3రకాలు), గన్నేరు, పెంటాస్ (3రకాలు), టెక్సాసేజ్, మల్లె,చుక్కమల్లె, దొంతర మల్లె (మైసూర్ మల్లె), డబుల్ మల్లె, సింగిల్ పెటల్ మల్లె, సన్నజాజి, విరజాజి, చమేలి, గరుడవర్ధనం, కమలం, పత్తిమందారం, జర్బరా (3రకాలు), కాస్మోస్(2రకాలు), బిళ్లగన్నేరు, కలోంచి, లిమోనియా, గార్లిక్‌వైన్, ఆర్కిడ్స్, లాబ్‌క్లాస్టర్, క్లెమిటిస్ (బ్రైడల్ బొకే), రెయిన్ లిల్లీస్ (3రకాలు), గ్రాఫ్టో, సెంటుమల్లె, అల్మం డా, అల్బా, తామర, కలువ, రజనీగంధ, బ్రహ్మకమలం, ఫైర్‌క్రాకర్స్, బోగన్‌విల్లియా(5రకాలు), బెగోనియా, రైల్వేక్రీపర్, నీలిగోరింట(పింక్,వయోలెట్), కెన్నా (మెట్టతామర), రైల్వే క్రీపర్), మే ఫ్లవర్, స్కార్లెట్ మిల్క్‌వీడ్, కింగ్స్ మాంటిల్, నిత్య మల్లి (2రకాలు), నీలాంబరం (నీలి కనకాంబరం)

406
Tags

More News