పత్తి పంటలో పురుగులు, తెగుళ్ల నివారణ

Thu,August 15, 2019 01:23 AM

Rythubadi
ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలకు, మబ్బులతో కూడుకున్న చల్లని వాతావరణం వల్ల పత్తి పంటలోచాలాచోట్ల పేనుబంక, పచ్చదోమ ఉధృతి గమనించాం. అలాగే ముందుగా విత్తుకున్న పత్తి పూత దశకు వచ్చింది. కొన్నిచోట్ల ఈ పూతకు వచ్చిన పత్తి పంటలో గులాబీరంగు కాయ తొలుచు పురుగు గమనించాం. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే కింది సూచనలుపాటించి పత్తి పంటను పురుగు తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు.

అధిక వర్షాలకు చాలాచోట్ల పత్తి పంటలో వడలు తెగులు (పారావిల్ట్) గమనించాం. దీని నివారణకు వాన నీటిని కాలువల ద్వారా బయటకు పంపి, వడలుపోయిన మొక్క లు, చుట్టూ ఉన్న మొక్కల మొదళ్ళ వద్ద వేరు వ్యవస్థ బాగా తడిచేటట్లుగా లీటరు నీటికి 3 గ్రా.ల కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను కలిపిపోయాలి. వారం వ్యవధిలో అవసరాన్ని బట్టి మళ్లీ ఇదే పద్ధతిలో భూమిని తడపాలి.

వానలు ఆగిన వెంటనే మొక్కలపై లీటరు నీటికి 10 గ్రా.ల 13-0-45 (మల్టి.కె) లేదా 19:19:19 (పాలిఫీడ్) పిచికారీ చేసుకున్నట్లయితే వడలు తెగులు, పోషకాల సమస్యల నుంచి పత్తి పంటను కాపాడుకోవచ్చు. అవసరాన్ని బట్టి వారంరోజుల వ్యవధిలో మళ్లీ పిచికారీ చేయాలి. అలాగే గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడక్కడ పత్తి పంటలో సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులును గమనించాం. దీని నివారణకు లీటరు నీటికి 1 గ్రా. కార్బండిజివ్‌ు లేదా 2.5 గ్రా.ల కార్బండజివ్‌ు+మాంకోజెబ్ మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి.

ప్రస్తుతం కురిసిన అధిక వర్షాలు, మబ్బులతో కూడుకున్న వాతావరణం వల్ల పత్తి పంటను పచ్చదోమ ఆశించే అవకా శం ఎక్కువగా వున్నది. పచ్చదోమ నివారణకు కాండానికి మందుపూతను మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్పత్తిలో లేదా ఫ్లోనికామిడ్, నీరు 1:20 నిష్పత్తిలో పంట 45,60 రోజులలో పూసుకోవాలి లేదా ఫిప్రొనిల్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ లేదా డైఫెన్ థయూరాన్ 1.25 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పై మందులతో పాటు అడపాదడపా 5 శాతం వేప కషాయాన్ని లేదా 5మి.లీ వేపనూనె (1500 పీపీఎం) ను కలిపి కూడా సాయంత్రం పూట పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ప్రస్తుత వాతావరణంలో పత్తి పంటలో అక్కడక్కడ పొగాకు లద్దె పురుగు ఆశించి పత్తి ఆకులను జల్లెడ ఆకులుగా మార్చి నష్టపరుస్తుంది. దీని నివారణకు, పురుగు గుడ్లను, పెద్ద లార్వాలను, పురుగులున్న జల్లెడ ఆకులను ఎప్పటికప్పుడు ఏరివేసి నాశనం చేయాలి. అలాగే లీటరు నీటికి 2.5 మి.లీ క్లోరోపైరిఫాస్ లేదా 1.5 గ్రా. థయోడికార్బ్ లేదా 0.5 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్‌ను కలుపుకొని సాయంత్రం వేళ ల్లో పిచికారీ చేసుకోవాలి. మూడవ దశ దాటిన లేదా బాగా పెరిగిన లద్దె పురుగులను రసాయన మందులతో అదుపు చేయడం కష్టం. కాబట్టి తవుడు బెల్లం కలిపిన విషపు ఎరను వాడా లి. దీనికి గాను ఎకరానికి 10 కిలోల తవు డు, 2 కిలోల బెల్లంతో పాటు 1 లీటరు మోనోక్రోటోఫాస్ లేదా 750 మి.లీ. క్లోరోపైరిఫాస్ లేదా 300 గ్రా.ల థయోడికార్బ్ మందుకు సరిపడే నీటిని కలిపి, మిశ్రమం పులిసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో చేనులో చల్లుకోవాలి. వాన లు తగ్గుముఖం పట్టిన తర్వాత ఎకరానికి 30-35 కేజీల యూరి యా+10 కేజీల పొటాషియంను వేసుకోవాలి.
Rythubadi1
పేను బంక నివారణకు కాండానికి మందు పూతను (పైన లేత ఆకు పచ్చ భాగంలో) మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్పత్తిలో మరియు ఫ్లోనికామిడ్, నీరును 1:20 నిష్పత్తిలో 45, 60 రోజుల్లో పూయాలి. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా లేదా ఫిప్రొనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.అధిక వానలకు అక్కడక్కడ ఆకులు పసుపు రంగు లేదా ఎరుపు రంగులోకి మారడం గమనించడం జరిగింది. దీనికిగాను పై పాటుగా లీటరు నీటికి 10 గ్రా.ల యూరి యా+10 గ్రా.ల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి వారం-పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. అధిక వానలకు సమయానుకూలంగా అంతరకృషి చేయలేకపోవడం వల్ల కలుపు సమస్య అధికంగా ఉంటుంది. లేత గడ్డి జాతి కలుపు నివారణకు లీటరు నీటికి 2 మి.లీ.ల క్విజలోఫాప్ ఇథైల్ (టర్గా సూపర్) లేదా 1.25 మి.లీ ప్రొపాక్విజాఫాప్ (ఏజల్)ను పిచికారీ చేయాలి. కేవలం వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నట్లయితే లీటరు నీటికి 1.25 మి.లీ. పైరిథయోబ్యాక్ సోడియం (హిట్ వీడ్/థీవ్‌ు) కలిపి పిచికారీ చేయాలి. సన్న గడ్డి, వెడల్పాటి గడ్డి రెండూ ఉన్నట్లయితే లీటరు నీటికి 2 మి.లీ. క్విజలోఫాప్ ఇథైల్ లేదా 1.25 మి.మీ. ప్రొపాక్విజాపాప్ మరియు 1.25 మి.మీ పైరిథయోబ్యాక్ సోడియం కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
Rythubadi2
చాలాచోట్ల ముందుగా విత్తుకున్న పత్తిలో గులాబీరంగు కాయతొలుచు పురుగు గుడ్డిపూల రూపంలో ఆశించి నష్టపరుస్తున్నట్టు గమనించాం. కాబట్టి రైతులు పురుగుపై నిఘా ఉంచడానికి ఎకరానికి 4 లేదా 8 లింగాకర్షక బుట్టలను తక్షణమే పెట్టుకోవాలి. ఈ బుట్టలలో వరుసగా 3 రోజులు 5 నుంచి 8 చొప్పున మగ రెక్కల పురుగులు పడినట్లు గమనిస్తే ఉదయం 6 గంటల నుంచి 11 గంటలలో లేదా సాయంత్రం 4-6 గంటలలోపు ఈ కింది రసాయన మందులను పిచికారీ చేసుకోవాలి. 5 శాతం వేప కషాయాన్ని లేదా వేపనూనె 5 మి.లీ లీటరు నీటికి కలిపి వాడాలి.థయోడికార్బ్ 1.5 గ్రా లేదా ప్రొఫెనోఫాస్ 2. మి. లీ లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లీటరు నీటికి పిచికారీ చేసుకోవాలి. దీనిద్వారా చాలావరకు పురుగు గుడ్లను చిన్న పురుగును (లార్వాను) నివారించుకోవచ్చు. గుడ్డి పూలను ఎప్పటికప్పుడు నాశనం చేస్తే పురుగు ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
డాక్టర్ బి. రాంప్రసాద్ సీనియర్ శాస్త్రవేత్త (కీటక విభాగం) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్

ఎ. సుదర్శనవ్‌ు ప్రధాన శాస్త్రవేత్త (పత్తి)
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం, వరంగల్

555
Tags

More News