వరిలో చేపట్టాల్సిన చర్యలు

Thu,August 22, 2019 01:22 AM

rice
రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో వరి పైర్లు పిలకల దశ నుంచి చిరుపొట్ట దశలో ఉన్నాయి. ఈ వానకాలంలో సన్నగింజ రకాలైన తెలంగాణ సోన, బీపీటీ 5204, జైశ్రీరామ్‌, హెచ్‌ఎంటీ సోన తదితర రకాలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కొంత ఆలస్యం అయ్యాయి. దీనివల్ల రైతులు వరి నాట్లను జూలై, ఆగస్టు మాసం చివరివరకు కొనసాగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. బోరుబావులు, నీటి వసతి ఉన్న కొన్ని ప్రాంతాలలో జూన్‌, జూలై మాసంలోనే వరి నాట్లు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి
పైర్లు వివిధ దశల్లో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో వరి సాగు చేసే రైతులు కింది సూచనలను పాటించాలి.


- రాష్ట్రంలో సెప్టెంబర్‌ మాసంలో వరి నార్లు ఎట్టి పరిస్థితులలో పోయడానికి అనుకూలం కాదు. ముఖ్యంగా సెప్టెంబర్‌ మాసంలో నార్లు పోసి నాటుకొన్నట్లయితే పంట పూత సమయంలో చలి వాతావరణం ఎక్కువగా ఉండి, గింజ పాలు పట్టక తాలు గింజలు ఏర్పడి దిగుబడి రాదు.
- ముఖ్యంగా కృష్ణా ఆయకట్టు ప్రాంతాలైన ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలలో, ప్రస్తుతం నీటి విడుదల అవ్వడం వలన రైతులు వరి పంటను ఆలస్యంగా వేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకవేళ ఇలాంటి ప్రత్యామ్నాయ పరిస్థితులలో వరి సాగు చేయాలంటే స్వల్పకాలిక రకాల నార్లు అందుబాటులో ఉంటే సెప్టెంబర్‌ మొదటివారంలో వరి నాట్లు పూర్తి చేయాలి. ప్రస్తుత పరిస్థితులలో వరి నారు పోసి నాట్లు వేయడం సాధ్యం కాదు. కాబట్టి వెదజల్లే పద్ధతి లేదా డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో విత్తుకోవాలి.
- రైతులు ముదురు నారును నాటాల్సి వస్తే మొక్కల మధ్య దూరం తగ్గించి దగ్గర దగ్గరగా (కుదురుకు 4-5 మొక్కలతో) నాట్లు వేసుకుంటే దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ముదురు నారుకు సిఫారసు చేసిన యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.
- పిలకల దశలో ఉన్న వరి పైర్లకు ఎకరానికి 30-35 కిలోల యూరియాను బురద పదునులో చల్లుకోవాలి. అంకురం దశలో ఉన్న పొలాలకు ఎకరానికి 30-35 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువును వేసుకోవాలి. ఈ దశలో ఎలాంటి కాంప్లెక్స్‌ ఎరువులను వేయరాదు.

- వరి నాట్లు ఆలస్యంగా వేసిన ప్రాంతాలలో ఉల్లికోడు ఉధృతి ఈ ఏడాది అధికంగా ఉండే అవకాశం ఉన్నది. దీని నివారణకు నాటిన 15-20 రోజుల దశలో ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలను పొలంలో పలుచగా నీరుంచి చల్లుకోవాలి.
- నారుమడి, ప్రధాన పొలంలో హిస్పా (తాటాకు తెగులు) ఆశిస్తే ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి.
- ముందుగా దీర్ఘకాలిక రకాలు నాట్లు వేసిన జిల్లాలలో, అంటే వరి పైరు చిరుపొట్ట దశలో ఉన్న ప్రాంతాలలో సుడిదోమ ఆశించే అవకాశం ఉన్నది. పొలంలో దోమ ఉధృతి ఎప్పటికప్పుడు గమనించాలి. పొలంలో నీరు తగ్గించి పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. నత్రజని వినియోగం తగ్గించాలి. దోమ ఉధృతికి దోహదపడే క్లోరోపైరిఫాస్‌, ప్రొఫెనోఫాస్‌, సింథటిక్‌ పైరిథ్రాయిడ్‌ను లేదా సిఫారసు చేయని బయో మందులను వాడరాదు. దోమ ఉధృతిని బట్టి లీటరు నీటికి 1.5 గ్రా. ఎసిఫేట్‌ లేదా 1.6 మి.లీ. బుప్రోఫెజిన్‌ లేదా 0.4 గ్రా. డైనోటెప్యురాన్‌ లేదా 0.6 గ్రా. పైమెట్రోజైన్‌ వంటి మందులను మొక్కల మొదళ్ళు తడిచేలా పిచికారీ చేయాలి.
- వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ముఖ్యంగా సన్నగింజ రకాల్లో ఆగస్టు-సెప్టెంబర్‌ మాసంలో ఆశించే అవకాశం ఉన్నది. ఈ తెగులు ఆశించడానికి అధిక వేగంతో కూడిన గాలులు, ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడటం (2-4 రోజుల సగటు ఉష్ణోగ్రతలు (22-26 డిగ్రీల సెల్సియస్‌), అధిక మోతాదులో నత్రజని వాడటం లాంటి పరిస్థితులు అనుకూలం. ఈ తెగులు లక్షణాలు గమనించినట్లయితే నత్రజని ఎరువును తాత్కాలికంగా నిలిపివేయాలి. తొలిదశలో వ్యాప్తిని నివారించడానికి ప్లాంటామైసిన్‌ లేదా అగ్రిమైసిన్‌ 80 గ్రా/ ఎకరానికి లేదా స్ట్రేప్టోమైసిన్‌ సల్ఫేట్‌ 40 గ్రా. ఎకరానికి పిచికారీ చేయాలి.
- సల్ఫైడ్‌ విష ప్రభావం వలన మొక్కల వేర్లు నల్లబడటం వలన వేసిన వారు తొలిదశలోనే చనిపోవడం గమనించిన చోట్ల పొలంలో మురుగు నీరు తీసి వెంట్రుక వాసి పగుళ్ళు వచ్చే వరకు ఆరగట్టాలి. తర్వాత నీరు పెట్టి 25 కిలోల యూరియాకు 50-80 గ్రా. కార్బండిజిమ్‌ 25శాతం+ మాంకోజెబ్‌ 50 శాతం గల మిశ్రమ మందును కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. పొలాన్ని చేతితో కలియబెట్టాలి.

డాక్టర్‌ యం. వెంకటరమణ 7337399470
ప్రధాన శాస్త్రవేత్త (వరి), హెడ్‌

213
Tags

More News